![Kasu Mahesh Reddy Says Tdp Resorting To Undemocratic Tactics In Bypolls](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/14/Mahesh1.jpg.webp?itok=RW-FTtBb)
సాక్షి, పల్నాడు జిల్లా: పిడుగురాళ్ల మున్సిపాలిటీకి వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ పోలీసుల దన్నుతో అరాచకాలకు పాల్పడుతోందని వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మండిపడ్డారు. నరసరావుపేట శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను కిడ్నాప్ చేయడం, బెదిరించడం ద్వారా ఈనెల 17న జరగబోయే ఉప ఎన్నికను అపహాస్యం చేసేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాలను కాపాడాల్సిన పోలీసులే ఈ దౌర్జన్యకాండకు అండగా నిలుస్తున్నారని అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...
పిడుగురాళ్ళ మున్సిపాలిటీకి నాలుగేళ్ళ కిందట జరిగిన ఎన్నికల్లో ఉన్న మొత్తం 33 వార్డులను వైఎస్సార్‌సీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. వైఎస్ జగన్ చేసిన అభివృద్ది, సంక్షేమాన్ని చూసి ప్రజలు ఏకగ్రీవంగా గెలుపును అందించారు. మున్సిపల్ చైర్మన్ గా వైశ్య సామాజికవర్గానికి చెందిన సుబ్బారావు, వైస్ చైర్మన్‌గా దళిత సామాజిక వర్గానికి చెందిన ముక్కంటి, మైనార్టీల నుంచి జిలానీకి వైస్ చైర్మన్ పదవులను ఇచ్చాం.
గత ఏడాది జనరల్ ఎలక్షన్స్ తరువాత వైస్ చైర్మన్ ముక్కంటి చనిపోవడంతో దానికి గానూ ఇప్పుడు ఉప ఎన్నిక జరగబోతోంది. మొత్తం 33 మున్సిపల్ కౌన్సిలర్ స్థానాలకు గానూ అన్నింటినీ వైఎస్సార్‌సీపీ గెలుచుకోగా, తాజాగా ఒకరు మాత్రం పార్టీని వీడి తెలుగుదేశంలో చేరారు. ప్రస్తుతం 32 మంది కౌన్సిలర్లు వైఎస్సార్‌సీపీకి ఉన్నారు. సంఖ్యబలం చాలా స్పష్టంగా ఉండటంతో ఏకపక్షంగా ఉప ఎన్నికను తెలుగుదేశం కుట్రపూరితంగా అడ్డుకుంటోంది.
గతంలో వైస్ చైర్మన్ ఎన్నికను అధికారులను బెదిరించి వాయిదా వేయించారు. బీఫారం సకాలంలో ఇవ్వకపోవడం వల్ల వాయిదా వేస్తున్నామంటూ అధికారులు కుంటిసాకులు చెప్పారు. మరుసటి రోజు వాయిదా వేయడంతో వైస్ చైర్మన్ ఎన్నిక కోసం వెడుతున్న వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను పోలీసుల సహకారంతోనే కిడ్నాప్ చేసేందుకు తెగబడ్డారు. అన్యాయాలను అడ్డుకోవాల్సిన పోలీసులే అన్యాయంగా వ్యవహరించే పరిస్థితి కనిపించింది. ఆరోజు జరిగిన దారుణాన్ని అన్ని ఆధారాలతో బయటపెట్టడంతో మళ్లీ వాయిదా వేశారు.
ఉప ఎన్నిక కోసం ఇంతగా దిగజారుతారా?
ఉప ఎన్నిక కోసం తెలుగుదేశం పార్టీ పోలీస్ యంత్రాంగంను ఉపయోగించుకుని చేస్తున్న దౌర్జన్యాలతో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు భయాందోళనకు గురవుతున్నారు. సాక్షాత్తు పోలీసులే మమ్మల్ని బెదిరిస్తున్నారు, కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు, ఇక మాకు రక్షణ ఎక్కడ ఉందని ఆందోళన చెందుతున్నారు. దీనిని భరించలేక కొందరు ఊరు వదిలి వెళ్లిపోయారు. ఈలోగానే మళ్లీ తెలుగుదేశం నేతలు, పోలీసులు కలిసి వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లపై దాడులకు, కిడ్నాప్‌లకు తెగబడ్డారు.
తాజాగా తెలుగుదేశం నేతల బెదిరింపులకు భయపడి పక్కనే ఉన్న మాచవరం గ్రామంలో తన తల్లి ఇంట్లో తలదాచుకున్న కౌన్సిలర్ ను టీడీపీ నాయకులు, పోలీసులు కిడ్నాప్ చేశారని ఒక కౌన్సిలర్ భార్య సోషల్ మీడియాలో వీడియో ద్వారా బయటపెట్టారు. తన భర్తకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు. అలాగే మరో కౌన్సిలర్ ఈ బాధ పడలేక హైదరాబాద్ లో తలదాచుకుంటే, అయన సోదరులను పోలీస్ స్టేషన్ లో కూర్చోబోట్టి మర్యాదగా పిడుగురాళ్ళకు వచ్చి, తాము చెప్పినట్లు నడుచుకోవాలంటూ బెదిరించారు.
ప్రజాస్వామ్య విధానంలో ఎన్నికలు జరపాల్సిన ప్రభుత్వం చిన్న ఎన్నికలో కూడా ఇలా దౌర్జన్యాలతో బెదిరింపులకు గురి చేయడం దారుణం. గతంలో దర్శి, తాడిపత్రి మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ వచ్చింది. ఆరోజు అధికారం ఉందని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కూడా దౌర్జన్యాలకు పాల్పడితే ఆ రెండింటిలో కూడా వైఎస్సార్‌సీపీకే అధికారం దక్కేది కాదా? కానీ సీఎంగా ఉన్న వైఎస్ జగన్ అటువంటి విధానాలకు మనం వ్యతిరేకం, ప్రజాతీర్పుకు గౌరవం ఇవ్వాలని స్పష్టంగా తన విధానాన్ని ప్రకటించారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి దానిని స్వయంగా అంగీకరించారు. వైఎస్ జగన్ తలుచుకుంటే తాను మున్సిపల్ చైర్మన్ అయి ఉండేవాడిని కాదు అని ఒప్పుకున్నారు.
పార్టీ మారకపోతే అంతుచూస్తామని బెదిరిస్తున్నారు
పిడుగురాళ్ళ మున్సిపల్ చైర్మన్ సుబ్బారావుకు చెందిన ఫ్యాక్టరీకి తెలుగుదేశం నేతలు తాళాలు వేశారు. నీ వ్యాపారాలు అడ్డుకుంటాం, పార్టీ మారాలంటూ బెదిరిస్తున్నారు. లేకపోతే అంతు చూస్తామని హెచ్చరిస్తున్నారు. ఇటీవల పిడుగురాళ్ళ మున్సిపల్ కౌన్సిలర్‌ను టీడీపీ నేతలు కిడ్నాప్ చేసిన నేపథ్యంలో కోర్టులో హెబియస్ కార్ఫస్ పిటీషన్ దాఖలు చేశాం. వెంటనే సదరు కౌన్సిలర్‌ను వదిలిపెట్టారు. ఈ సందర్భంగా తానను ఎవరూ కిడ్నాప్ చేయలేదని చెప్పాలని లేకుండా తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా బెదిరించారు.
దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిపైనా టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దౌర్జన్యంకు పాల్పడ్డారు. తిరిగి అబ్బయ్య చౌదరిపైనే ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టడం చూస్తే ఇంత దుర్మార్గమైన పాలన మరెవరూ చేయలేరని అనిపిస్తోంది. తెలుగుదేశం చేస్తున్న ఈ దుర్మార్గాలను ప్రజలు గమనిస్తున్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు
Comments
Please login to add a commentAdd a comment