
రిగ్గింగ్ జరిగిందని చెప్పుంటే.. ఎందుకు వీడియో రిలీజ్ చేయడం లేదు?’’ అంటూ కాసు మహేష్‌రెడ్డి ప్రశ్నించారు.
సాక్షి, నరసరావుపేట: మాచర్లలో చాలా చోట్ల టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పిన్నెల్లి గెలుపును ఎవరూ ఆపలేరని.. దీనిపై ఎంతవరకైనా పోరాటం చేస్తామన్నారు. పిన్నెల్లి తప్పు చేశారని టీడీపీ ప్రచారం చేస్తోంది. మొత్తం వీడియో బయటపెడితే అసలు వాస్తవాలు బయటకు వస్తాయి. ఒక్కటే వీడియో ఎందుకు రిలీజ్ చేశారు. రిగ్గింగ్ జరిగిందని చెప్తుంటే.. ఎందుకు వీడియో రిలీజ్ చేయడం లేదు?’’ అంటూ కాసు మహేష్‌రెడ్డి ప్రశ్నించారు.

‘‘మాచర్లలో ఎవరు దాడి చేశారో ప్రజలందరికి తెలియాలి. మాచర్లలో అల్లర్లకు కారణం ఎవరు? టీడీపీ కాదా?. బీసీలు, ఎస్టీలు వైఎస్సార్‌సీపీకి ఓటేశారనే కారణంతో దాడులు చేశారు. అందరికీ చట్టపరమైన శిక్ష పడేవరకు పోరాడతాం. రిగ్గింగ్ జరిగిందని మేము చెబుతున్నాం.. మీరు ఎందుకు వీడియో బయటపెట్టడం లేదు?. ఎన్నికల అధికారులు ఆరోజు ఏమైందనేది మొత్తం వీడియో బయటపెట్టాలి. ఈవీఎం ధ్వంసం ఘటనకు ముందు 2, 3 గంటల వీడియో బయటపెట్టాలి. మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారు’’ అని కాసు మహేష్ చెప్పారు.
‘‘దాడులకు సంబంధించి ఈసీ పూర్తి వీడియోలు బయటపెట్టాలి. ఏడు చోట్ల ఈవీఎంల ధ్వంసం జరిగిందని ఈసీనే చెబుతోంది. మాచర్ల వీడియోను మాత్రమే బయటపెట్టారు. మిగిలిన వీడియోలను ఎందుకు బయటపెట్టడం లేదు. ఈసీ విశ్వసనీయత కోల్పోతుంది. అవసరమైతే న్యాయ పోరాటం చేస్తాం’’ అని కాసు మహేష్‌రెడ్డి పేర్కొన్నారు.