సాక్షి, విజయవాడ: ఏపీలో చంద్రబాబు విధ్వంసం సృష్టించాడని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలపై టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడ్డాయని ధ్వజమెత్తారు. టీడీపీ అరాచకాలపై ఈసీకి వైఎస్సార్‌సీపీ నేతలు కాసు మహేష్ రెడ్డి, మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు.
అనంతరం కాసు మహేష్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అరాచకాలపై ఈసీకి ఫిర్యాదు చేస్తూనే ఉన్నామన్నారు. ‘‘సుమారు 60, 70 బూత్‌ల్లో రిగ్గింగ్ చేశారు. వెబ్ కెమెరాల ఫుటేజ్ పరిశీలించి రీపోలింగ్ జరపాలని కోరాం. ఈసీ స్పందించకపోతే న్యాయ పోరాటం చేస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీల ఇళ్లను సైతం టీడీపీ శ్రేణులు ధ్వంసం చేశాయి. మహిళలు భయాందోళనలకు గురై గుడిలో తలదాచుకున్నారు. దాడులకు పాల్పడ్డ టీడీపీ నేతలపై చర్యలేవి?. మాచర్ల ఘటనలో నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి’’ అని కాసు మహేష్‌రెడ్డి డిమాండ్ చేశారు.
‘‘ఓటు వేసిన వారిని టీడీపీ వాళ్లు కొట్టి, చంపాలని చూస్తే పోలీసులు స్పందించలేదు. ఎన్నికలకు వారం రోజుల ముందు పోలీసులను మార్చారు. దాని వల్లనే హింస చెలరేగింది. ఈ హింసకి బీజేపీ, టీడీపీ, ఈసీ ఎవరు బాధ్యత వహిస్తారు?. ఎన్ని చోట్ల టీడీపీ రిగ్గింగ్ చేసినా ప్రజలు మాత్రం జగన్‌ని గెలిపించాలని నిర్ణయించారు. మాచర్లలో తుమ్రకోట, వెల్దుర్తి వంటి చోట్ల టీడీపీ రిగ్గింగ్ చేసింది. టీడీపీ రిగ్గింగ్ చేసినా ఈసీ చర్యలు తీసుకోవడం లేదు’’ అని కాసు మహేష్‌రెడ్డి పేర్కొన్నారు.
‘‘సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ముందే ఈసీ దృష్టికి తీసుకుని వెళ్లామని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ముందస్తు భద్రత కల్పించమని అడిగామని.. అయినా భద్రత చర్యలు తీసుకోలేదన్నారు. పురందేశ్వరి అధికారులను మార్చమని ఒత్తిడి తెచ్చారు. ఆమె చేసిన ఒత్తిడి నిర్ణయంతో హింస జరిగింది’’ అని మల్లాది విష్ణు మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment