![Attacks At The Instigation Of Chandrababu YSRCP Leaders Complain To The Governor](/styles/webp/s3/article_images/2024/05/17/Chandrababu-Naidu.jpg.webp?itok=Gdf1bqoX)
గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీ ప్రతినిధులు
సాక్షి, అమరావతి: ఏపీలో పోలింగ్ రోజు, అనంతరం వైఎస్సార్‌సీపీ శ్రేణులపై టీడీపీ దాడులకు చంద్రబాబే కారణమని, ఆయన ప్రోద్బలంతోనే హింసాకాండ కొనసాగిందని మంత్రి బొత్స ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ ప్రతినిధి బృందం గురువారం రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు ఫిర్యాదు చేసింది. పల్నాడు, అనంతపురం తదితర జిల్లాల్లో పోలీసు అధికారుల వైఫల్యాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లింది. ఈసీ పలుచోట్ల పోలీసు అధికారులను మార్పులు చేసిన తర్వాత రాష్ట్రంలో హింసాత్మక çఘటనలు పెరిగాయని వివరించింది.
పోలీసు అధికారులు తీసుకున్న చర్యల్లోని లోపాలనూ ఫిర్యాదులో ప్రస్తావించింది. నిష్పక్షపాతంగా ఎన్నికల ప్రక్రియ జరిగేలా పర్యవేక్షించేందుకు ఎన్నికల సంఘం నియమించిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, పోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రా పక్షపాతంతో వ్యవహరించారని తెలిపింది. మిశ్రా టీడీపీతో కుమ్మక్కయ్యారని, ఎన్నికల ప్రక్రియను దెబ్బ తీస్తూ తనకు అప్పగించిన బాధ్యతకు తూట్లు పొడిచారని చెప్పారు.
హింస ఆందోళన కలిగిస్తోంది..
చంద్రబాబుతో పాటు హింసకు కారణమైన వారందరిపై చర్యలు తీసుకోవాలని మంత్రి బొత్స డిమాండ్ చేశారు. గవర్నర్‌ను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలింగ్ తర్వాత జరుగుతున్న హింస ఆందోళన కలిగిస్తోందన్నారు. టీడీపీ ఫిర్యాదులపై విచారణ లేకుండా ఎన్నికల అబ్జర్వర్ దీపక్ మిశ్రా చర్యలు తీసుకోవడం ఆయన పక్షపాతంగా వ్యవహరించారనడానికి నిదర్శనమని, ఆయనపై న్యాయ విచారణ చేపట్టాలన్నారు. ఎన్నికల సంఘం నుంచి రిపోర్ట్ తెప్పించుకుని దీపక్ మిశ్రాను మార్చాలని గవర్నర్‌ను కోరినట్టు వివరించారు.
రాష్ట్రంలో ఎన్నికలు జరగక ముందు, ఆ తర్వాత పరిణామాలను గవర్నర్‌కు వివరించామని మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. శంఖబ్రతబాగ్చీ, త్రిపాఠి, బిందు మాధవ్‌పై చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. మిశ్రాతో పాటు, వీరందరూ కౌంటింగ్‌పైనా ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. రాజ్యసభ సభ్యుడు మోపిదేవి మాట్లాడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా దీపక్ మిశ్రా వ్యవహరిస్తున్నారన్నారు.
మాజీ మంత్రి పేర్నినాని మాట్లాడుతూ.. ఉద్దేశ పూర్వకంగా మిశ్రాను ఏపీలో ఎన్నికల కోసం బీజేపీ, టీడీపీలు తెచ్చాయని చెప్పారు. అతని కారణంగానే విధ్వంసం జరుగుతోందన్నారు. మిశ్రా విజయవాడకు వచ్చినప్పటి నుంచి టీడీపీ సానుభూతి పరులైన రిటైర్డు అధికారులను కలిశారన్నారు. గవర్నర్‌ను కలిసిన వారిలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి మనోహర్ నాయుడు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment