
సాక్షి తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనలపై కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. వైఎస్ జగన్ క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు వెళ్లకుండా ఆటంకాలు సృష్టిస్తోంది. ఇందులో భాగంగానే వైఎస్ జగన్‌కు హెలికాప్టర్లు ఇవ్వనీయకుండా చేసేందుకు ప్రభుత్వ పెద్దలు కుట్రలకు దిగారు.
వివరాల ప్రకారం.. ఇటీవల వైఎస్ జగన్ రాప్తాడు నియోజకవర్గం పర్యటనలో ప్రభుత్వ వైఫల్యం బహిర్గతమైన విషయం తెలిసిందే. వైఎస్ జగన్ రాప్తాడులో హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న వెంటనే.. ప్రజలందరూ హెలికాప్టర్‌ను చుట్టుముట్టారు. తమ అభిమాన నేతలను కలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో హెలికాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతిన్నది. దీంతో, వైఎస్ జగన్‌ను వదిలేసి హెలికాప్టర్ వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వైఫల్యంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో కూటమి సర్కార్ కొత్త కుట్రలకు తెరలేపింది. ఈ ఘటనపై విచారణ పేరుతో పైలట్‌లకు నోటీసులు జారీ చేసింది. దీంతో, వైఎస్ జగన్‌కి హెలికాఫ్టర్లను ఇవ్వనీయకుండా చేసేందుకే ప్రభుత్వ పెద్దల కుట్రలు చేస్తోందని వైఎస్సార్‌సీపీ ఆరోపించింది.
మరోవైపు.. హెలికాప్టర్ ఘటనపై మరుసటి రోజే హోంమంత్రి అనిత డ్రామా అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇందుకు కొనసాగింపుగా హెలికాఫ్టర్ సంస్థలకు ప్రభుత్వం వేధింపులకు గురిచేసింది. ఈ ఘటనపై ఇప్పటికే సంస్థలు డీజీసీఏకు నివేదిక అందించారు. అయితే, నివేదిక ఇచ్చినా పోలీసుల విచారణ పేరుతో పైలట్, కో-పైలట్‌ను ప్రభుత్వం వేధింపులకు గురిచేయడం గమనార్హం.

నేడు విచారణకు హాజరుకానున్న పైలెట్, కో పైలెట్
వైఎస్ జగన్ ప్రయాణించిన హెలికాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతిన్న ఘటనలో విచారణకు హాజరుకావాలని హెలికాప్టర్ నిర్వహణ సంస్థ, పైలెట్, కో–పైలెట్‌లకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీంతో వారు బుధవారం విచారణకు హాజరుకానున్నారు. చెన్నేకొత్తపల్లిలోని రామగిరి పోలీసు సర్కిల్ కార్యాలయంలో ఈ విచారణ జరగనుంది. అక్కడ ముందస్తుగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.