
నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసులో నిందితుడు శ్రీనివాసరావుతో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ భేటీ
ముమ్మిడివరంలో అతడి ఇంటికెళ్లి ప్రత్యేక మంతనాలు
జగన్ మీద హత్యాయత్నం సమయంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీనే
అప్పట్లో విచారణ కూడా చేయకముందే నిందితుడు జగన్ అభిమాని అని ప్రకటించిన డీజీపీ, ఏబీ, టీడీపీ నేతలు
మళ్లీ ఇప్పుడు శ్రీనివాసరావును వెతుక్కుంటూ మరీ వెళ్లి కలిసిన ఏబీ
మరోసారి మీడియాతో మాట్లాడుతూ జగన్‌పై తీవ్ర విమర్శలు
తద్వారా నాటి హత్యాయత్నం వెనుక అసలు కుట్రదారులెవరో సుస్పష్టమంటున్న పరిశీలకులు
సాక్షి, అమరావతి/అమలాపురం టౌన్: 2019 ఎన్నికల ముందు 2018 అక్టోబర్ 25న విశాఖ విమానాశ్రయంలో నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్‌ను పదునైన కత్తితో హత్య చేయడానికి ప్రయత్నించిన నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావుతో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు ఆదివారం భేటీ కావడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అది కూడా అతడిని వెతుక్కుంటూ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో శ్రీనివాసరావు ఇంటికెళ్లి ఏబీ కలిశారు.
స్వయంగా నిందితుడి ఇంటికెళ్లి కలవడం ద్వారా నాడు వైఎస్ జగన్‌పై హత్యాయత్నానికి అసలు కుట్రదారులెవరనే విషయాన్ని ఏబీ చెప్పకనే చెప్పారని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. నాటి తరహాలోనే మళ్లీ వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ లక్ష్యంగా కొత్త కుట్రలు పన్నుతున్నారని చర్చ జరుగుతోంది. నిందితుడు శ్రీనివాసరావును కలిసిన తర్వాత ఏబీ వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్‌పై తీవ్ర విమర్శలు చేయడం, నిందితుడిని కొనియాడటం ఇందుకు నిదర్శనమని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.
నాడు కూడా ముందస్తు కుట్రలో భాగంగానే..
వైఎస్ జగన్‌పై విశాఖ విమానాశ్రయంలో 2018 అక్టోబర్ 25న హత్యాహత్నం జరిగిన విషయం టీవీల్లో వచ్చిన వెంటనే.. స్థానిక టీడీపీ నేతలు వారికి ముందుగానే తెలిసినట్లు నిందితుడు శ్రీనివాసరావు ఇంటి వద్ద వాలిపోయారు. మీడియా కంటే ముందుగానే అతడి ఇంటికి చేరుకున్న టీడీపీ నేతలు నడింపల్లి శ్రీనివాసరాజు, కొప్పిశెట్టి వెంకటేశ్వరావు, ఇసుకపట్ల వెంకటేశ్వరరావు, ఇసుకపట్ల ఈశ్వర్‌కుమార్‌లు.. వారికి ముందే ఎవరో ‘బ్రీఫింగ్’ ఇచ్చినట్టు.. ‘నిందితుడు జగన్ అభిమాని’ అంటూ ఒకేపాట పాడారు.
తాజాగా ఇప్పుడు నిందితుడు శ్రీనివాసరావు ఇంటికెళ్లిన ఏబీ వెంకటేశ్వరరావు కూడా అదే పాట పాడటం గమనార్హం. అప్పుడు కుట్ర అమల్లో భాగంగా టీడీపీ నేతలతో అలా మాట్లాడించిన అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు.. ఇప్పుడు చంద్రబాబు తనను నామినేటెడ్ పదవిలో నియమించడంతో ఆయన రుణం తీర్చుకోవడానికి అన్నట్టు అవే పలుకులు పలకడం ద్వారా హత్యాయత్నం కుట్రలో భాగస్వాములు ఎవరో స్పష్టం చేశారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
అప్పట్లో డీజీపీ ఠాకూర్ కూడా అదే పాట
నాడు వైఎస్ జగన్‌పైన హత్యాయత్నం జరిగిన అరగంట లోపే (అప్పటికి నిందితుడు కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్‌ఎఫ్) కస్టడీలో ఉన్నాడు. సీఐఎస్‌ఎఫ్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు కూడా చేయలేదు. ఎఫ్‌ఐఆర్ సైతం నమోదు కాలేదు. నిందితుడిని విచారించనూ లేదు) మధ్యాహ్నం 1.30 గంటలకు డీజీపీ ఆర్పీ ఠాకూర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నిందితుడి పేరు, ఊరును ప్రకటించడంతోపాటు అతడు వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడు అని, వైఎస్ జగన్ అభిమాని అని ప్రకటించేశారు.
పబ్లిసిటీ కోసమే జగన్‌పై హత్యాయత్నం చేశాడని వెల్లడించారు. సీఐఎస్‌ఎఫ్ నుంచి నిందితుడిని పోలీసులు తమ కస్టడీలోకి తీసుకోకముందే అంతా ముందుగానే తెలిసినట్టు.. పక్కా ప్రణాళిక ఉన్నట్టు నిందితుడి వివరాలను ఆర్పీ ఠాకూర్ ఎలా వెల్లడించగలిగారు? అసలు విచారణ నామమాత్రపు విచారణ కూడా లేకుండానే హత్యాయత్నం వెనక ఉద్దేశాన్ని ఎలా పసిగట్టగలిగారు? అనే ప్రశ్నలకు అప్పుడు ఠాకూర్ సమాధానం చెప్పలేదు. నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు మార్గదర్శకత్వంలోనే కుట్రను రచించి అమలు చేయడంలో డీజీపీగా ఆర్పీ ఠాకూర్ కీలక భాగస్వామి కాబట్టే ఆయనకు అన్ని విషయాలూ ముందుగానే తెలిశాయన్నది సుస్పష్టం.
ఇక నాటి డీజీపీ ఠాకూర్, ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు కనుసన్నల్లో టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు సైతం అదే విషయాన్ని వల్లె వేశారు.అంత ఆర్గనైజ్డ్‌గా అందరూ ఒకే విషయాన్ని ఎలా చెప్పారనే విషయం తేల్చే సమయంలో, కేసు కీలక దశకు చేరిన సందర్భంలో ఏబీ వెంకటేశ్వరరావు ఆదివారం నిందితుడి ఇంటికి వెళ్లి రహస్యంగా మంతనాలు జరపడం.. అప్పటి కుట్ర ఎవరి మార్గదర్శకత్వంలో జరిగిందో తేటతెల్లం చేస్తోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
పదవీ విరమణ నాటి నుంచి కుట్రలే..
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పదవీ విరమణ చేసిన నాటి నుంచి ఏబీ వెంకటేశ్వరరావు.. గంగ.. చంద్రముఖిగా మారినట్టు పచ్చ చొక్కా వేసుకున్న టీడీపీ కార్యకర్తగా మారిపోయారు. తన కుల సంఘాల సమావేశాల్లోనూ వైఎస్ జగన్‌పై విషం చిమ్మారు. తానొక మాజీ ఐపీఎస్ అధికారిననే విషయం మరిచిపోయి ఒక సాధారణ టీడీపీ కార్యకర్తకంటే దిగువ స్థాయికి జారిపోయి సోషల్ మీడియాలోనూ అనేక తప్పుడు పోస్టులు పెట్టారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు.. ఏబీ వెంకటేశ్వరరావుకు నామినేటెడ్ పోస్టు కట్టబెట్టారు.
అంతేకాకుండా ఏబీపై ఉన్న నిఘా పరికరాల కొనుగోలు కేసును కూడా పక్కనపెట్టారు. దీంతో చంద్రబాబు రుణం తీర్చుకోవడమే లక్ష్యంగా ఏబీ వ్యవహరిస్తున్నారనేది స్పష్టమవుతోందని అంటున్నారు. ఇందులో భాగంగానే నాడు వైఎస్ జగన్‌పై హత్యాయత్నానికి తెగబడిన నిందితుడు శ్రీనివాసరావును అతడి ఇంటికెళ్లి మరీ ఏబీ కలిశారని.. కొత్త కుట్రలకు తెరలేపుతున్నారనే చర్చ జరుగుతోంది. లేకపోతే జగన్ మీద హత్యాయత్నం కేసులో నిందితుడు ఇంటికి వెళ్లి రహస్యంగా మంతనాలు జరపాల్సిన అవసరం ఏమిటనే ప్రశ్న ఉదయిస్తోంది.
హత్యాయత్నం కేసులో నిందితుడు శ్రీనివాసరావు ఇంటికి వెళ్లిన తర్వాత.. అమలాపురంలో ఏబీ మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్‌పై ధ్వజమెత్తారు. జగన్ కోసం బలైన మొదటి వ్యక్తి శ్రీనివాసరావు అని నిందితుడిని వెనకేసుకొచ్చారు. జగన్ అతడి జీవితాన్ని చిదిమేశారన్నారు. జగన్ రాష్ట్రానికి, ఆంధ్రులకు పొంచి ఉన్న అతిపెద్ద ప్రమాదకారి అని ఏబీ వ్యాఖ్యానించారు.
జగన్ బాధితులు ఎందరో ఉన్నారన్నారు. తిరిగి జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రాకూడదన్నారు. జగన్ అక్రమాలు చేశారని.. ఆయన వల్ల బాధ పడుతున్న బాధితులకు తాను అండగా ఉంటానని ఏబీ అన్నారు. జగన్ రాష్ట్రాన్ని విధ్వంసం చేసి కోలుకోలేని దెబ్బ కొట్టారని వ్యాఖ్యానించారు.