
ముస్లిం నేతలపై పెరుగుతున్న ఒత్తిడి
చంద్రబాబు అసలు రంగు బయటపడింది.. వక్ఫ్ బిల్లుకు మద్దతుతో లౌకిక వాదానికి చెల్లుచీటి
ముస్లిం నేతలంతా టీడీపీకి రాజీనామా చేయాలని డిమాండ్
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు ఇచ్చిన టీడీపీపై రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలలో తీవ్ర ఆగ్రహం వ్యకమవుతోంది. ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చిన ఇఫ్తార్ విందులను బహిష్కరించిన ముస్లిం సంఘాలు తాజా పరిణామాలతో టీడీపీని బాయ్‌కట్ చేయాలని నిర్ణయించాయి. ఇందుకు సంబంధించి బుధ, గురువారాల్లో జాతీయ, రాష్ట్ర స్థాయి కీలక ముస్లిం సంఘాలు దీనిపై ఒక నిర్ణయానికి వచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
లౌకిక పార్టీగా చెప్పుకొనే టీడీపీ.. వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు పలికి లౌకికవాదానికి చెల్లుచీటి రాసిందని ముస్లింలు మండిపడుతున్నారు. టీడీపీలోని ముస్లిం నేతలు ఆ పార్టీకి రాజీనామా చేయాలని, ముస్లిం సమాజం టీడీపీని బాయ్‌కట్ చేయాలనే డిమాండ్ బలం పుంజుకుంది.
ఉమీద్ పే ‘ఉమ్మీద్’ నహీ హై
వక్ఫ్ యాక్ట్–1995ను సవరించిన కేంద్ర ప్రభుత్వం ‘యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్‌మెంట్ ఎంపవర్ ఏఫీషియన్సీ అండ్ డెవలప్మెంట్ – ఉమీద్(యుఎంఈఈడి)గా మార్చింది. ఉమీద్‌పై ముస్లిం సమాజానికి ఉమ్మీద్ నహీ హై (నమ్మకం లేదు). ఇది మత స్వేచ్ఛపై దాడి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 25, 26లను ఉల్లంఘిస్తోంది.
దేశంలో ఏ ఇతర మతాలకు వర్తించని నిబంధనలు ముస్లింలకు మాత్రం పెట్టడం దారుణం. దీనిపై రాజ్యాంగ పరిధిలో పోరాటం చేస్తాం. పూర్వీకులు ఇచ్చిన వక్ఫ్ (అల్లాహ్ పేరుతో దానమిచ్చిన) భూములు, ఆస్తులను కాపాడుకోవడం ప్రతి ముస్లిం బాధ్యత. – షేక్ మునీర్ అహ్మద్, రాష్ట్ర కన్వీనర్, ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ
ముస్లిం నేతల్లారా.. టీడీపీని వీడండి
చంద్రబాబు పచ్చి అవకాశవాది అని మరోసారి రుజువైంది. సవరణ బిల్లుకు మద్దతు పలికి చేయాల్సిన నష్టం అంతా చేసిన టీడీపీ, జనసేన ఇంకా ముస్లిం సమాజాన్ని మభ్యపెట్టే ప్రయత్నాలు చేయడం దుర్మార్గం. సవరణ బిల్లుకు ఆమోదం పలికిన టీడీపీ.. అందుకు విరుద్ధంగా వక్ఫ్ కమిటీల్లో ముస్లింలకే ప్రాధాన్యత కల్పిస్తామని, కలెక్టర్లకు తుది నిర్ణయం ఉండకుండా ఉన్నత స్థాయి అధికారులను నియమిస్తామని చెప్పడంలో మతలబు ఏమిటి? ముస్లిం సమాజానికి ద్రోహం చేసిన చంద్రబాబును మైనార్టీ నేతలెవరైనా ఇంకా సమర్థిస్తున్నారంటే వారికి సిగ్గు లేనట్లే.
1997లో బీజీపీతో చంద్రబాబు జత కట్టడాన్ని నిరసిస్తూ మాజీ మంత్రి బషీరుదీ్దన్ బాబూఖాన్ టీడీపీకి, పదవులకు రాజీనామా చేశారు. వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు పలికిన చంద్రబాబు తీరును నిరసిస్తూ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్, ప్రభుత్వ సలహాదారు ఎంఏ షరీఫ్, ఎమ్మెల్యేలు, నామినేటెడ్ చైర్మన్‌లు టీడీపీకి, పదవులకు తక్షణం రాజీనామా చేయకపోతే ముస్లిం సమాజం క్షమించదు. – షేక్ గౌస్ లాజమ్, ఏపీ హజ్ కమిటీ మాజీ చైర్మన్
వైఎస్ జగన్‌కు రుణపడి ఉంటాం
రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాపాడేందుకు, ఇచ్చిన మాటకు కట్టుబడి వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిలబడిన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ముస్లిం సమాజం రుణపడి ఉంటుంది. వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చరిత్రహీనులుగా మిగిలితే.. వైఎస్ జగన్ హీరోగా నిలిచారు.
దేశంలోని 14.6 శాతం ముస్లింల అభ్యంతరాలను లెక్కచేయకుండా ఏకపక్షంగా సవరణ బిల్లును ఆమోదించడం రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాలరాయడమే. ఆ బిల్లుకు కూటమి ఎంపీలు మద్దతు ఇవ్వటం చరిత్రలో చీకటి రోజుగా నిలుస్తుంది. ఈ బిల్లుతో వక్ఫ్ భూములతోపాటు మసీదులు, దర్గాలు, ఖబరస్తాన్‌లకు రక్షణ ఉండదు. – సదర్ ఉద్దీన్ ఖురేషి, ముస్లిం సంక్షేమ సంఘం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అధికార ప్రతినిధి