సీఎం చంద్రబాబును నిలదీస్తున్న ముస్లిం పెద్దలు
వక్ఫ్ చట్ట సవరణకు మద్దతిచ్చిన టీడీపీకి మైనార్టీ నేతలు రాజీనామా చేయాలని పిలుపు
సాక్షి, అమరావతి: వక్ఫ్ చట్టాన్ని పటిష్టం చేసి ఆక్రమణదారుల చెర నుంచి భూములను పరిరక్షించాల్సిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా సవరణ బిల్లు తేవటాన్ని ముస్లిం సమాజం, మత పెద్దలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాజ్యాంగ విరుద్ధమైన ఈ బిల్లు ముస్లిం సమా జానికి గొడ్డలిపెట్టు లాంటిదని స్పష్టం చేస్తు న్నారు. సవరణ బిల్లుకు టీడీపీ మద్దతిచ్చిన నేప థ్యంలో ఆ పార్టీలోని ముస్లిం మైనార్టీ నేతలు పదవులకు రాజీనామా చేయాలని సూచిస్తున్నారు. పార్లమెంట్‌లో వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు మద్దతు తెలపడం ద్వారా సీఎం చంద్ర బాబు మరోసారి ముస్లింలపై తన వ్యతిరేకతను బయట పెట్టారని పేర్కొంటున్నారు.
ముస్లిం మైనార్టీల హక్కుల పరిరక్షణకు చంద్రబాబు అనుకూలమో కాదో సూటిగా చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఎన్డీఏ ప్రకటనలు చేసినప్పుడు కూడా చంద్రబాబు కనీసం నోరు విప్పలేదని ప్రస్తావిస్తున్నారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు పార్లమెంట్‌లో టీడీపీ, జనసేన మద్దతు పలకగా వైఎస్సార్ సీపీ గట్టిగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే.
దీంతో దీన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) పరిశీలనకు పంపుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు 21 మందితో నియమించిన జేపీసీలో తెలంగాణ ఎంపీలు అసదుద్దీన్ ఒవైసీతోపాటు డీకే అరుణకు ప్రాతినిధ్యం కల్పించారు. మరోవైపు బిల్లును వ్యతిరేకించిన వైఎస్సార్ సీపీ సభ్యులకు అందులో స్థానం కల్పించకుండా టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులకు చోటు కల్పించడం గమనార్హం.
వక్ఫ్ చట్టంలో పలు సవరణలు..
దేశవ్యాప్తంగా ముస్లిం ధార్మిక సంస్థల ఆస్తుల పరిరక్షణకు ఆంగ్లేయుల హయాంలోనే 1937లో వక్ఫ్ చట్టం తెచ్చారు. స్వాతంత్య్రం అనంతరం 1955, 1995లో సవరణలు చేశారు. వక్ఫ్ భూములను ముస్లింలకు మాత్రమే లీజుకు ఇవ్వాలనే నిబంధనను సవరించి ఎవరికైనా ఇవ్వొచ్చని చేర్చారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సవరణ బిల్లులో ముస్లిం అనే పదం లేకుండా బోర్డులో సభ్యులను తీసుకోవచ్చని పేర్కొన్నారు.
సాధారణంగా ఒక మతానికి చెందిన బోర్డు, సంస్థల్లో అన్య మతస్థులను అనుమతించరు. అందుకు విరుద్ధంగా వక్ఫ్ బోర్డు చైర్మన్‌గా ముస్లిమేతరులను నియమించుకునేలా సవరణ బిల్లు అవకాశం కల్పిస్తోంది. వక్ఫ్ ఆస్తుల ఆజమాయిషీ అధికారాలను పూర్తిగా కలెక్టర్లకు అప్పగించేలా సవరణ ప్రతిపాదించారు.
తక్షణమే ఉపసంహరించుకోవాలి: ఎస్.బి.అంజాద్ బాషా, మాజీ డిప్యూటీ సీఎం
వక్ఫ్ చట్టంలో ఇష్టారాజ్యంగా సవరణలు చేయడాన్ని వైఎస్సార్ సీపీ తీవ్రంగా ఖండిస్తోంది. రాజ్యాంగాన్ని కల్పించిన ప్రాథమిక హక్కులు, మౌలిక స్వరూపాన్ని ఉల్లంఘిస్తూ సవరణలు తేవడం దారుణం. మైనార్టీల హక్కులు, మతస్వేచ్ఛను కాలరాసే యత్నాన్ని అడ్డుకుంటాం. ఒక్కసారి వక్ఫ్‌కు దానం చేస్తే అది ఎప్పటికీ వక్ఫ్‌దే.
ఎన్డీఏ ప్రభుత్వం మైనార్టీలను శత్రువులుగా చూస్తోంది. దేశంలో 9 లక్షల ఎకరాల ఆస్తులు వక్ఫ్ కింద ఉన్నాయి. ఈ సవరణల ద్వారా కాజేసే యత్నాలు జరుగుతున్నాయి. వక్ఫ్ నిర్వచనాన్ని మార్చే చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలి. వక్ఫ్ ట్రిబ్యునల్‌ను కూడా కాలరాసే యత్నం చేస్తున్నారు. తక్షణమే కేంద్రం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి.
రాజ్యాంగ విరుద్ధం: హఫీజ్ ఖాన్, వైఎస్సార్ సీపీ మాజీ ఎమ్మెల్యే
వక్ఫ్ సవరణ బిల్లును వైఎస్సార్ సీపీ వ్యతిరేకిస్తోంది. వక్ఫ్ ఆస్తి అంటే అది అల్లాకు సంబంధించినది. ఓ ముస్లిం సమాజ సంక్షేమం, మేలు చేయడానికి ఇచ్చిన ఆస్తి. అది ఒక్కసారి ఇచ్చిన తరువాత ఎవరు కొనుగోలు, అమ్మకాలు చేయరాదు. దీని నుంచి వచ్చే ఆదాయాన్ని సమాజం మేలు కోసం ఉపయోగించాలి. సవరణ బిల్లు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది. కలెక్టర్‌కు పూర్తి అధికారాలు ఇవ్వడంతోపాటు వక్ఫ్ బోర్డును పూర్తిగా నిర్వీర్యం చేసేలా బిల్లులో అంశాలున్నాయి.
ఇతర మతస్థులను నామినేట్ చేసేలా బిల్లులో ప్రతిపాదించటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీన్ని పార్లమెంటులో మా పార్టీ ఫ్లోర్ లీడర్ మిథున్‌రెడ్డి గట్టిగా వ్యతిరేకించారు. ముస్లిం సోదరులకు సంబంధించిన సున్నితమైన విషయాలపై పునరాలోచన చేయాలి. ఎన్నికల ముందు ముస్లిం సమాజానికి ఇచ్చిన వాగ్ధానాలకు టీడీపీ కట్టుబడి ఉండాలి. ఈ బిల్లును వ్యతిరేకించాల్సింది పోయి టీడీసీ మద్దతు ఇవ్వడం దారుణం. బిల్లును వ్యతిరేకించిన మాజీ సీఎం వైఎస్ జగన్‌కి ముస్లిం సోదరుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
టీడీపీ తీరు మారకుంటే తీవ్ర పరిణామాలు –షేక్ నాగుల్ మీరా. ఏపీ ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు
ముస్లిం ప్రయోజనాలను దెబ్బతీసే యత్నాలకు టీడీపీ, జనసేన వంత పాడటం దుర్మార్గం. ముస్లింల పట్ల టీడీపీ తీరు మారకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు. రాష్ట్రంలో వక్ఫ్ భూములకు సంబంధించిన వివాదాలు రెవెన్యూ, వక్ఫ్‌బోర్డు మధ్య ఉన్నాయి. కలెక్టర్లకు వక్ఫ్ భూములపై పూర్తి అధికారాలు అప్పగించడమంటే ముస్లిం సమాజానికి తీవ్ర అన్యాయం చేయడమే. ముస్లిం మత విశ్వాసాల్లో అన్య మతస్తుల జోక్యంతో మత సామరస్యానికి విఘాతం కలుగుతుంది.
వక్ఫ్ భూములు కట్టబెట్టే కుట్ర –షేక్ మునీర్ అహ్మద్, ఏపీ ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్
అత్యధిక వక్ఫ్ భూములున్న యూపీ, మధ్యప్రదేశ్‌లో ఆక్రమణకు గురైన విలువైన వక్ఫ్ భూములను చట్టబద్ధం చేసేందుకే సవరణ బిల్లు తెచ్చారు. దీనికి మద్దతు ప్రకటించిన టీడీపీ, జనసేనకు ముస్లిం సమాజం స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పడం ఖాయం. రెండు రోజుల్లో ఏపీతోపాటు అన్ని రాష్ట్రాల్లో సమావేశాలు నిర్వహించి ముస్లిం సమాజానికి ముంచుకొచ్చిన ప్రమాదాన్ని వివరిస్తాం.
హక్కులను కాలరాయడమే –ఆలమూరు రఫీ, రాష్ట్ర అధికార ప్రతినిధి, వైఎస్సార్‌సీపీ మైనార్టీ సెల్.
వక్ఫ్ చట్ట సవరణ బిల్లు భిన్నత్వంలో ఏకత్వానికి వ్యతిరేకంగా ఉంది. వక్ఫ్ అనే పదానికి అర్ధమే మార్చేలా ఉంది. మతపరమైన అంశాల్లో బీజేపీ, టీడీపీ, జనసేన జోక్యం చేసుకోవడం తగదు.
దగా చేయడమే
ముస్లింల ఓట్లతో అధికారంలోకి వచ్చిన టీడీపీ ఏరుదాటాక తెప్ప తగలేసిన చందంగా వ్యవహరిస్తోంది. వక్ఫ్ చట్ట సవరణకు టీడీపీ మద్దతు తెలిపి ముస్లింలను దగా చేసింది. దీనిపై పోరాటానికి ముస్లిం సమాజం సిద్ధం కావాలి.
- అబ్దుల్ బషీరుద్దీన్, రాష్ట్ర వక్ఫ్‌బోర్డు, మాజీ డైరెక్టర్, కాకినాడ
వైఎస్సార్ సీపీ నిర్ణయం అభినందనీయం
వక్ఫ్ చట్ట సవరణ బిల్లును పార్లమెంటులో వ్యతిరేకించిన వైఎస్సార్ సీపీకి ధన్యవాదాలు తెలియచేస్తున్నాం. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని ముస్లింలందరూ స్వాగతిస్తున్నారు. ముస్లిం హక్కుల పరిరక్షణ విషయంలో వైఎస్సార్ సీపీ ముందుండి నడిపిస్తోంది. – డాక్టర్ మీర్జా షంషేర్ అలీబేగ్, ఏపీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్
టీడీపీ మైనార్టీల ద్రోహి
టీడీపీ తొలి నుంచి ముస్లిం మైనార్టీలకు వ్యతిరేకమే. వక్ఫ్ ఆస్తుల విషయంలో తీసుకున్న అనాలోచిత నిర్ణయానికి టీడీపీ మద్దతు తెలపడం సిగ్గుచేటు. దీనిపై ఎంతటి పోరాటానికైనా వెనుకాడేది లేదు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మైనార్టీలకు అండగా నిలబడ్డారు. మొదటి నుంచి వైఎస్సార్ కుటుంబం మైనార్టీలకు అండగా నిలుస్తోంది. – షేక్ నూరిఫాతిమా, వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, తూర్పు నియోజకవర్గం, గుంటూరు
చట్ట సవరణ సరికాదు
వక్ఫ్ చట్ట సవరణ సరికాదు. దీన్ని వ్యతిరేకించాల్సింది పోయి టీడీపీ, జనసేన మద్దతు తెలపడం ముస్లింలను అగౌరవపరచడమే. వైఎస్సార్‌సీపీ ముస్లింలకు అండగా నిలవడం అభినందనీయం. – ఫయాజ్ అహ్మాద్, పురపాలక కౌన్సిలర్, ఆదోని, కర్నూలు జిల్లా
రాజ్యాంగ ఉల్లంఘనే...
వక్ఫ్ బోర్డు నిబంధనల్లో సవరణ చేయటం ముస్లిం మైనారిటీల మనోభావాలను దెబ్బతీయడమే. వైఎస్సార్‌సీపీ ఎంపీలు వక్ఫ్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకించటం హర్షణీయం. – ఎంఏ భేగ్, వైఎస్సార్‌సీపీ మైనారిటీ సెల్ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు
రాజ్యాంగ మౌలిక స్వరూపంపై దాడి
వక్ఫ్ చట్టంలో ఇష్టారాజ్యంగా నవరణలు చేయడం రాజ్యాంగ మౌలిక నిర్మాణంపై దాడి చేయడమే. ఈ బిల్లుతో మసీదులు, దర్గాల ఆస్తులకు రక్షణ లేకుండా పోతుంది. ముస్లిం సంస్థల ఆస్తులను దోచుకుంటామంటే ప్రతిఘటన తప్పదు. వక్ఫ్ సవరణ బిల్లును కేంద్రం ఉపసంహరించుకోవాలి. ––ఎస్.అబ్దుల్‌కలీమ్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ మాజీ డైరెక్టర్
Comments
Please login to add a commentAdd a comment