సాక్షి, పల్నాడు: సిట్ బృందాన్ని మంత్రి అంబటి రాంబాబు కలిశారు. సిట్ బృందానికి కొన్ని విషయాలు నివేదించారు. సత్తెనపల్లి నుంచి తాను మూడుసార్లు ఎన్నికల్లో పోటీ చేశానని.. ఎన్నికల్లో ఇప్పుడు జరిగినంత హింస ఎప్పుడు జరగలేదని మంత్రి అంబటి అన్నారు. పోలీసులు టీడీపీ నాయకులతో కుమ్మక్కయ్యారని.. దాడులు అదుపు చేయడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని పేర్కొన్నారు.
ఎన్నికల రోజు టీడీపీ నాయకులు చేసిన అరాచకాన్ని సిట్ బృందానికి మంత్రి అంబటి రాంబాబు వివరించారు. ఇప్పటికీ తొండపి గ్రామంలో చాలా మంది భయంతో ఊరు వదిలి పెట్టి వెళ్లిపోయారని.. వారికి భరోసా కల్పించి ఊరిలోకి తీసుకురావాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని అంబటి అన్నారు. తాజాగా పోలీసులు నమోదు చేస్తున్న అక్రమ కేసులపైన కూడా సిట్ బృందానికి మంత్రి వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
‘‘పల్నాడు, తాడిపత్రిలో హింస చెలరేగింది. అధికారులను మార్చినచోటే హింస చెలరేగింది. ఈవీఎంలను పగలగొట్టాలనే ఉద్దేశంతో దాడులు చేశారు. ఎక్కడైతే పురేందేశ్వరి ఫిర్యాదుతో అధికారులను మార్చారో అక్కడే హింస జరిగింది. చంద్రబాబు, పవన్, పురేందేశ్వరి కుట్రలు చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల కమిషన్ నియమించిన అధికారులను సస్పెండ్ చేశారు. అధికారం రాదనుకున్నప్పుడే చంద్రబాబు హింసను ప్రేరేపిస్తాడు’’ అంటూ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు.
‘‘పల్నాడు, తాడిపత్రిలో దాడులకు కారణం బాబు, పురందేశ్వరియే. కన్నా లక్ష్మీ నారాయణ దగ్గర కొందరు అధికారులు డబ్బులు తీసుకున్నారు. సిట్ అధికారులు అన్ని విషయాలు తెలుసుకుంటారని భావిస్తున్నాను. సిట్ అధికారులకు నాకు తెలిసిన సమాచారం ఇచ్చా’’ అని అంబటి రాంబాబు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment