
సాక్షి, పల్నాడు జిల్లా: ఈపూరు మండల వైఎస్సార్‌సీపీ వైస్ ఎంపీపీ కొండవర్జి నాగేశ్వరరావు యాదవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువత పోరు కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం గురించి ప్రజాగళంలో మాట్లాడినందుకు నాగేశ్వరావును పోలీసులు అక్రమంగా నిర్బంధించారు. మిర్చి పొలానికి రాత్రి కాపలాకు నాగేశ్వరావు యాదవ్ దంపతులు వెళ్లగా.. తెల్లవారుజామున పొలానికి వెళ్లిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల అక్రమ నిర్బంధంపై వైఎస్సార్‌సీపీ లీగల్ టీం హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. పొన్నవోలు సుధాకర్‌రెడ్డిని ఈపూరు పోలీస్ స్టేషన్‌కు వైఎస్సార్‌సీపీ అధిష్టానం పంపించింది. దీంతో నాగేశ్వరరావు యాదవ్‌పై ఒక తప్పుడు కేసు పెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి.. ఈపూరు ఎస్ఐ వదిలేశారు.
పొన్నవోలు సుధాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, వినుకొండను కూటమి ప్రభుత్వం అరాచకాల అక్రమాలతో అనకొండగా మార్చిందని మండిపడ్డారు. ‘‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రషీద్‌ను టీడీపీ గుండాలు అత్యంత దారుణంగా హత్య చేశారు. పది నెలల క్రితం ఏనుగుపాలెంలో ఒక మహిళను అత్యంత దారుణంగా హత్య చేశారు. మీడియాతో మాట్లాడినందుకు నాగేశ్వరావు యాదవ్‌ను తీవ్రవాదిని తీసుకువెళ్లినట్టు పొలం నుంచి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి అక్రమంగా నిర్బంధించారు. వైఎస్ జగన్ ఆదేశాలతో నేను వినుకొండ వచ్చాను. కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది’’ అని పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు.
వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మ నాయుడు మాట్లాడుతూ.. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా వినుకొండలో దారుణాలు, అక్రమాలు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నాయి. తప్పుడు కేసులు పెట్టి కార్యకర్తలను నాయకుల్ని పోలీసులు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. భయపెడితే భయపడే రకం ఇక్కడ ఎవరూ లేరు. అన్నిటికి సిద్ధమయ్యే ఉన్నాం. ప్రభుత్వం ప్రజల హక్కులను కాల రాస్తోంది. ఇక చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు’’ అని బ్రహ్మనాయుడు హెచ్చరించారు.

Comments
Please login to add a commentAdd a comment