vice mpp
-
మంచు తెరలు తొలగక ముందే.. మట్టుబెట్టారు!
వారం రోజులు రెక్కీ చేశారు. చీకట్లు తొలగక ముందే మాటు వేశారు. మంచు తెరలు తొలగక ముందే.. ఏం జరుగుతోందో తెలుసుకునేలోపే దాడి చేసి, మట్టుబెట్టి మాయమయ్యారు. గార మండల పరిషత్ ఉపాధ్యక్షుడు, వైఎస్సార్సీపీ నాయకుడు బరాటం రామశేషు దారుణ హత్యకు గురైన తీరిది. ముగ్గురు అగంతకులు కత్తి వేట్లకు తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడే కుప్పకూలిపోయారు. సరిగ్గా ఐదేళ్ల క్రితం కూడా రామశేషుపై ఇలాగే.. ఇదే ప్రాంతంలోనే హత్యాయత్నం జరిగింది. అప్పుడూ ఇప్పుడూ కూడా దాడికి పాల్పడిన వారు ముగ్గురే కావడం పలు అనుమానాలకు తావిస్తోంది శ్రీకాకుళం రూరల్/గార: గార వైస్ ఎంపీపీ, శ్రీకూర్మం గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నేత బరాటం రామశేషు(45) మంగళవారం దారుణ హత్యకు గురయ్యారు. ఆయన ఉదయం తన గ్యాస్ గోడౌన్ వద్దకు గ్యాస్ బండలు లోడ్ చేయడానికి వెళ్లగా.. అప్పటికే మాటు వేసి ఉన్న దుండగులు సమయం చూసి పదునైన కత్తితో ఆయనపై దాడికి తెగబడ్డారు. కుటుంబ సభ్యులు, స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాటు వేసి.. రామశేషు ఉదయం 6.30 గంటల ప్రాంతంలో శ్రీకూర్మంలోని తన ఇంటి నుంచి తన భారత్ గ్యాస్ గోడౌన్ వద్దకు వెళ్లారు. రెండు వాహనాలకు బండలు లోడ్ చేయించి పంపించారు. మరో వాహనం కోసం ఎదురు చూస్తూ.. గోడౌన్ ముందు దువ్వుపేటకు వెళ్లే రోడ్డుపైకి వచ్చి నిలుచున్నారు. అదే సమయంలో అక్కడే మాటు వేసి ఉన్న దుండగులు పదునైన కత్తితో ఆయనపై దాడి చేశారు. ముఖం, మెడపై బలంగా దాడి చేయడంతో ఆయన అక్కడే కుప్పకూలిపోయారు. రక్తపు మడు గులో పడి ఉన్న మృతదేహాన్ని చూసి స్థానికులు గ్రామంలోని వారికి విషయం చెప్పారు. రామశేషుకు భార్య జయలక్ష్మి (శ్రీకూర్మం పంచాయతీ ఉప సర్పంచ్), కుమారుడు, కుమార్తె ఉన్నారు. తండ్రి బరాటం నాగేశ్వరరావు సీనియర్ వైఎస్సార్ సీపీ నాయకుడు కాగా శ్రీకాకుళం మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. తండ్రి నాగేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ ఎం.మధుసూదనరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నాలుగు బృందాలతో దర్యాప్తు.. హత్యపై సమాచారం అందుకున్న డీఎస్పీ మహేంద్ర, శ్రీకాకుళం ఒకటో పట్టణ సీఐ సన్యాసినాయుడు, క్లూస్, డాగ్‌స్క్వాడ్ టీమ్‌లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. నాలుగు బృందాలుగా విడిపోయి పలు కోణా ల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకూర్మంతో పాటు చింతువలస, శ్రీకూ ర్మం జంక్షన్, అంపోలు జంక్షన్, జైలు రోడ్డులోని సీసీ ఫుటేజీలను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. అదేవిధంగా గ్యాస్ గోడౌన్లో పనిచేస్తున్న వ్యక్తులను విచారించి పలు విషయాలు రాబట్టారు. మృతదేహాన్ని పరిశీలించిన డాగ్ బృందం సమీప సునామీ కాలనీ అరటి తోటల వద్దకు వెళ్లి ఆగింది. గతంలోనూ.. టీడీపీ ప్రభుత్వ హయాంలో శ్రీకూర్మం సర్పంచ్‌గా ఉన్న బరాటం రామశేషు చింతువలస సమీపంలో డిసెంబర్ 21వ తేదీన 2017 వేకువన నాలుగున్నర గంటల ప్రాంతంలో దాడికి గురయ్యారు. ముగ్గురు వ్యక్తులు వెనక నుంచి వచ్చి మెడపై పదునైన కత్తితో దాడిచేయగా మెడ వద్ద బలమైన గాయమైంది. వాకింగ్ సమయంలో పెద్దగా అరుపులు వేయడం, చంపేశాం అన్న నిర్ధారణలో ఆగంతకులు పారిపోవడం, వాకింగ్ చేస్తున్న వ్యక్తులు వెనువెంటనే ఆస్ప త్రిలో చేర్చడంతో మృత్యువు నుంచి బయటపడ్డారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు ఆయనను ఏకంగా హత్య చేయడం స్థానికంగా కలకలం రేపుతోంది. రామశేషు మృతిపై సమాచారం అందిన వెంటనే వైఎస్సార్ సీపీ యువనేత ధర్మాన రామ్మనోహర్ నాయుడు, ఎంపీపీ గొండు రఘురామ్, పార్టీ కనీ్వనర్ పీస శ్రీహరిరావు, రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ ముంజేటి కృష్ణమూర్తి, మార్పు పృధ్వీరాజ్ తదితరులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ధర్మాన రామ్‌మనోహర్‌నాయుడు పోలీసులతో హత్యపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. రామశేషు తండ్రి నాగేశ్వరరావుతో మాట్లాడారు. రామశేషు అంత్యక్రియలు నేడు గార: వైస్ ఎంపీపీ బరాటం రామశేషు అంత్యక్రియలు బుధవారం ఉదయం 7.30 గంటలకు శ్రీకూర్మంలో నిర్వహిస్తామని కుటుంబ సభ్యు లు తెలిపారు. మృతదేహానికి మంగళవారం రిమ్స్‌లో పోస్టు మార్టం నిర్వహించి, సాయంత్రం స్వగృహానికి తీసుకువచ్చారు. -
ఎంపీపీ పీఠంపై వలంటీర్.. వైస్ ఎంపీపీగా విద్యార్థిని
పశ్చిమగోదావరి: వలంటీర్లు కొందరు సర్పంచ్‌లయ్యారు.. మరికొందరు ఎంపీటీసీ సభ్యులయ్యారు. కానీ వలంటీర్‌గా సేవలందిస్తున్న ఓ గిరిజన మహిళ అతి చిన్న వయసులోనే ఎంపీపీగా ఎన్నికైంది. పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం తెల్లంవారిగూడేనికి చెందిన 24 ఏళ్ల కారం శాంతి ఇంటర్ వరకూ చదువుకున్నారు. గృహిణిగా ఉన్న శాంతి ఆ తర్వాత వలంటీర్‌గా పనిచేశారు. ఈ నేపథ్యంలో స్థానికులు ఆమెను దొరమామిడి–2 ఎంపీటీసీ అభ్యరి్థగా నిలబటెట్టి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బుట్టాయగూడెం మండలంలో మొత్తం 15 ఎంపీటీసీ స్థానాల్లో 2 ఏకగ్రీవం కాగా, రెండింటిలో ఇది ఒకటి. మిగిలిన 13 స్థానాలకు ఎన్నికలు జరగ్గా 11 స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలుపొందారు. శుక్రవారం జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు కారం శాంతిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. – బుట్టాయగూడెం అతి చిన్న వయసులో ఓ యువతి మండల పరిషత్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైంది. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరులో శుక్రవారం నిర్వహించిన మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో.. ఇంకా విద్యార్థినిగా ఉండగానే ఆమె ఎన్నికవడం విశేషం. మండలంలోని బొమ్మిడి గ్రామం నుంచి ఎంపీటీసీగా ఎన్నికైన మేడవరపు విద్యాలక్ష్మి వయసు 22 ఏళ్లు. విజయవాడ సిద్ధార్థ ఫార్మసీ సైన్సెస్ కళాశాలలో ఫార్మా–డి కోర్సు ఐదో సంవత్సరం చదువుతోంది. ఆమె తల్లి మేడవరపు సుష్మ బొమ్మిడి మాజీ సర్పంచ్. తండ్రి కిరణ్ వైఎస్సార్సీపీ నేత. – ఉంగుటూరు చదవండి: ఆ సామాజికవర్గంలో ఆమె మొట్టమొదటి ఎంపీపీ -
మంత్రి పితానికి చుక్కెదురు
వైఎస్సార్ సీపీనే వరించిన పోడూరు వైస్ ఎంపీపీ సువర్ణరాజు ఎన్నిక ఏకగ్రీవం బెడిసికొట్టిన టీడీపీ కుట్ర ఫుడ్‌పార్క్ సమస్య పరిష్కారంలోనూ మంత్రి విఫలం భీమవరం: రాష్ట్రవ్యాప్తంగా అధికార టీడీపీ, ప్రతిపక్ష పార్టీ నాయకులను బెదిరించో, పదవులు ఆశచూపో తమ వైపు తిప్పుకుంటున్న ప్రస్తుత తరుణంలో పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలంలో కార్మిక, పరిశ్రమల శాఖ మంత్రి పితాని సత్యనారాయణకు చుక్కెదురైంది. పోడూరు మండల ఉపాధ్యక్ష పదవిని వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీకి ఎగరేసుకుపోవాలని చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఆచంట నియోజకవర్గం పోడూరు మండల ఉపాధ్యక్ష పదవికి శుక్రవారం జరిగిన ఎన్నికల్లో టీడీపీని వైఎస్సార్సీపీ నాయకులు ఖంగుతినిపించారు. మంత్రి పితాని అండతో బలం లేకున్నా పదవిని దక్కించుకోవాలని చేసిన ప్రయత్నం విఫలమైంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పదేళ్లపాటు మంత్రిగా పనిచేసిన పితాని 2014 ఎన్నికల్లో టీడీపీలో చేరి ఆచంట ఎమ్మెల్యేగా పోటీచేసి విజయం సాధించారు. నాటి నుంచి అనేక పర్యాయాలు జిల్లా కలెక్టర్, ప్రభుత్వంపై అనేక విమర్శలు గుప్పించారు. 2016లో మంత్రి పదవిని చేజిక్కించుకున్నారు. గతంలో పెనుగొండ మండలంలోని సహకార సంఘం ఎన్నికల్లో అధికార బలంతో తన ప్రతాపాన్ని చూపిన పితాని పోడూరు మండల ఉపా«ధ్యక్ష పదవి విషయంలో కూడా తన పాచీకలు పారుతాయని ఆశించి భంగపడ్డారు. పోడూరు మండలంలోని 16 గ్రామ పంచాయతీల్లో 8 ఆచంట, మరో 8 పంచాయతీలు పాలకొల్లు నియోజవకవర్గాల్లో ఉన్నాయి. మండల కేంద్రం పోడూరు ఆంచట నియోజకవర్గంలో ఉంది. మండలంలోని 19 ఎంపీటీసీ స్థానాల్లో 11 వైఎస్సార్ సీపీ, 8 టీడీపీ గెల్చుకుంది. అప్పట్లో మండల అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు గుంటూరు వాణి, పెద్దిబోయిన బాబూరావు ఎన్నికయ్యారు. మండల పరిషత్ వైఎస్సార్సీపీ ఖాతాలో చేరడంతో టీడీపీ నేతలు తీవ్ర మనోవ్యధకు గురయ్యారు. ఈ ఏడాది మండల పరిషత్ ఉపా«ధ్యక్షుడు బాబూరావు వ్యక్తిగత కారణాల వల్ల తన పదవికి రాజీనామా చేశారు. దీనితో వైఎస్సార్ సీపీ ఎంపీటీసీలను తమ వైపునకు తిప్పుకుని పదవిని దక్కించుకోవాలని తద్వారా ఎంపీపీ పదవికి ఎసరు పెట్టాలని టీడీపీ నాయకులు వ్యూహం రచించారు. వైఎస్సార్ సీపీ ఎంపీటీసీలను నయానా, భయానా లొంగదీసుకునేందుకు ప్రయత్నించారు. దీనికి మంత్రి పితాని తెరవెనుక ఉండి పావులు కదిపారనే ఆరోపణలు ఉన్నాయి. సువర్ణరాజు ఎన్నిక ఏకగ్రీవం శుక్రవారం జరిగిన ఎన్నికను వాయిదా వేయించడానికి టీడీపీ నేతలు తీవ్రంగా ప్రయత్నించారు. అయినా వైఎస్సార్ సీపీ ఎంపీటీసీలు 11 మందికి 10 మంది ఎన్నిక సమావేశానికి హాజరయ్యారు. టీడీపీకి చెందిన 8 మంది ఎంపీటీపీల్లో ఆరుగురు మండల పరిషత్ కార్యాలయానికి వచ్చినా ఎన్నికలో పాల్గొనలేదు. మిగిలినవారిని వైఎస్సార్ సీపీ నాయకులు కిడ్నాప్ చేశారంటూ నాటకమాడినా ఫలితం దక్కలేదు. ఎన్నిక సమావేశానికి కోరం ఉండడంతో ఎన్నికల అధికారి యథావిధిగా ఎన్నిక నిర్వహించారు. వైఎస్సార్ సీపీకి చెందిన పోడూరు2 ఎంపీటీసీ శెట్టిబత్తుల సువర్ణరాజు ఉపాధ్యక్ష పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికను ఎంపీపీ వాణి భర్త, వైఎస్సార్ సీపీ నేత గుంటూరి పెద్దిరాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పార్టీని ముందుకు నడిపించారు. అధికార పార్టీలోనే మంత్రిపై గుసగుసలు తుందుర్రులో ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా నిర్మిస్తున్న గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌పార్క్ సమస్యను పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమ్మెల్యే పితానికి అప్పగించారు. అప్పట్లో పితాని వల్ల కాకపోవడంతో మంత్రి పదవి వచ్చిన తరువాత సమస్యను పరిష్కరించి ఫుడ్‌పార్క్‌ను సముద్ర తీరప్రాంతానికి తరలిస్తారని ఆందోళనకారులు భావించారు. మంత్రి పితాని పోరాట కమిటీ నాయకులను రెండు పర్యాయాలు సీఎం చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లినా ప్రయోజనం శూన్యం. పితానికి సీఎం విలువ ఇవ్వలేదని అందుకే పోరాట కమిటీ నాయకులు ఎంత చెప్పినా ముఖ్యమంత్రి ప్యాక్టరీ నిర్మాణం ఆపేదిలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. పితాని మంత్రికి పదవి వచ్చిన తరువాత ఆచంట, భీమవరం నియోజకవర్గాల్లో చుక్కెదురైందని అధికార పార్టీ నాయకలే గుసగుసలాడుతున్నారు. -
వెల్దుర్తి వైస్ ఎంపీపీ రాజీనామా
కర్నూలు(అర్బన్): జిల్లాలోని వెల్దుర్తి మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు బి.కవిత తన పదవికి రాజీనామా చేశారు. వెల్దుర్తి నాలుగవ ప్రాదేశిక నియోజకవర్గం నుంచి ఎంపీటీసీ సభ్యురాలిగా ఎన్నికైన కవిత వ్యక్తిగత కారణాల వల్ల మంగళవారం జిల్లా పరిషత్‌కు వచ్చి జెడ్పీ సీఈఓ బీఆర్ ఈశ్వర్‌కు తన రాజీనామా పత్రాన్ని అందించారు. ఈ నేపథ్యంలో సీఈఓ మాట్లాడుతూ వైస్ ఎంపీపీ రాజీనామాను ఆమోదిస్తున్నామని, ఖాళీ అయిన వైస్ ఎంపీపీ స్థానాన్ని భర్తీ చేసేందుకు విషయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలియజేస్తామన్నారు. తిరిగి ఎప్పుడు ఎన్నిక నిర్వహించే అంశాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటిస్తుందన్నారు.