మంత్రి పితానికి చుక్కెదురు
మంత్రి పితానికి చుక్కెదురు
Published Sun, Jul 16 2017 12:15 AM | Last Updated on Tue, May 29 2018 4:40 PM
వైఎస్సార్ సీపీనే వరించిన పోడూరు వైస్ ఎంపీపీ
సువర్ణరాజు ఎన్నిక ఏకగ్రీవం
బెడిసికొట్టిన టీడీపీ కుట్ర
ఫుడ్‌పార్క్ సమస్య పరిష్కారంలోనూ మంత్రి విఫలం
భీమవరం:
రాష్ట్రవ్యాప్తంగా అధికార టీడీపీ, ప్రతిపక్ష పార్టీ నాయకులను బెదిరించో, పదవులు ఆశచూపో తమ వైపు తిప్పుకుంటున్న ప్రస్తుత తరుణంలో పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలంలో కార్మిక, పరిశ్రమల శాఖ మంత్రి పితాని సత్యనారాయణకు చుక్కెదురైంది. పోడూరు మండల ఉపాధ్యక్ష పదవిని వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీకి ఎగరేసుకుపోవాలని చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఆచంట నియోజకవర్గం పోడూరు మండల ఉపాధ్యక్ష పదవికి శుక్రవారం జరిగిన ఎన్నికల్లో టీడీపీని వైఎస్సార్‌సీపీ నాయకులు ఖంగుతినిపించారు. మంత్రి పితాని అండతో బలం లేకున్నా పదవిని దక్కించుకోవాలని చేసిన ప్రయత్నం విఫలమైంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పదేళ్లపాటు మంత్రిగా పనిచేసిన పితాని 2014 ఎన్నికల్లో టీడీపీలో చేరి ఆచంట ఎమ్మెల్యేగా పోటీచేసి విజయం సాధించారు. నాటి నుంచి అనేక పర్యాయాలు జిల్లా కలెక్టర్, ప్రభుత్వంపై అనేక విమర్శలు గుప్పించారు. 2016లో మంత్రి పదవిని చేజిక్కించుకున్నారు. గతంలో పెనుగొండ మండలంలోని సహకార సంఘం ఎన్నికల్లో అధికార బలంతో తన ప్రతాపాన్ని చూపిన పితాని పోడూరు మండల ఉపా«ధ్యక్ష పదవి విషయంలో కూడా తన పాచీకలు పారుతాయని ఆశించి భంగపడ్డారు. పోడూరు మండలంలోని 16 గ్రామ పంచాయతీల్లో 8 ఆచంట, మరో 8 పంచాయతీలు పాలకొల్లు నియోజవకవర్గాల్లో ఉన్నాయి. మండల కేంద్రం పోడూరు ఆంచట నియోజకవర్గంలో ఉంది. మండలంలోని 19 ఎంపీటీసీ స్థానాల్లో 11 వైఎస్సార్ సీపీ, 8 టీడీపీ గెల్చుకుంది. అప్పట్లో మండల అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు గుంటూరు వాణి, పెద్దిబోయిన బాబూరావు ఎన్నికయ్యారు. మండల పరిషత్ వైఎస్సార్‌సీపీ ఖాతాలో చేరడంతో టీడీపీ నేతలు తీవ్ర మనోవ్యధకు గురయ్యారు. ఈ ఏడాది మండల పరిషత్ ఉపా«ధ్యక్షుడు బాబూరావు వ్యక్తిగత కారణాల వల్ల తన పదవికి రాజీనామా చేశారు. దీనితో వైఎస్సార్ సీపీ ఎంపీటీసీలను తమ వైపునకు తిప్పుకుని పదవిని దక్కించుకోవాలని తద్వారా ఎంపీపీ పదవికి ఎసరు పెట్టాలని టీడీపీ నాయకులు వ్యూహం రచించారు. వైఎస్సార్ సీపీ ఎంపీటీసీలను నయానా, భయానా లొంగదీసుకునేందుకు ప్రయత్నించారు. దీనికి మంత్రి పితాని తెరవెనుక ఉండి పావులు కదిపారనే ఆరోపణలు ఉన్నాయి.
సువర్ణరాజు ఎన్నిక ఏకగ్రీవం
శుక్రవారం జరిగిన ఎన్నికను వాయిదా వేయించడానికి టీడీపీ నేతలు తీవ్రంగా ప్రయత్నించారు. అయినా వైఎస్సార్ సీపీ ఎంపీటీసీలు 11 మందికి 10 మంది ఎన్నిక సమావేశానికి హాజరయ్యారు. టీడీపీకి చెందిన 8 మంది ఎంపీటీపీల్లో ఆరుగురు మండల పరిషత్ కార్యాలయానికి వచ్చినా ఎన్నికలో పాల్గొనలేదు. మిగిలినవారిని వైఎస్సార్ సీపీ నాయకులు కిడ్నాప్ చేశారంటూ నాటకమాడినా ఫలితం దక్కలేదు. ఎన్నిక సమావేశానికి కోరం ఉండడంతో ఎన్నికల అధికారి యథావిధిగా ఎన్నిక నిర్వహించారు. వైఎస్సార్ సీపీకి చెందిన పోడూరు2 ఎంపీటీసీ శెట్టిబత్తుల సువర్ణరాజు ఉపాధ్యక్ష పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికను ఎంపీపీ వాణి భర్త, వైఎస్సార్ సీపీ నేత గుంటూరి పెద్దిరాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పార్టీని ముందుకు నడిపించారు.
అధికార పార్టీలోనే మంత్రిపై గుసగుసలు
తుందుర్రులో ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా నిర్మిస్తున్న గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌పార్క్ సమస్యను పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమ్మెల్యే పితానికి అప్పగించారు. అప్పట్లో పితాని వల్ల కాకపోవడంతో మంత్రి పదవి వచ్చిన తరువాత సమస్యను పరిష్కరించి ఫుడ్‌పార్క్‌ను సముద్ర తీరప్రాంతానికి తరలిస్తారని ఆందోళనకారులు భావించారు. మంత్రి పితాని పోరాట కమిటీ నాయకులను రెండు పర్యాయాలు సీఎం చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లినా ప్రయోజనం శూన్యం. పితానికి సీఎం విలువ ఇవ్వలేదని అందుకే పోరాట కమిటీ నాయకులు ఎంత చెప్పినా ముఖ్యమంత్రి ప్యాక్టరీ నిర్మాణం ఆపేదిలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. పితాని మంత్రికి పదవి వచ్చిన తరువాత ఆచంట, భీమవరం నియోజకవర్గాల్లో చుక్కెదురైందని అధికార పార్టీ నాయకలే గుసగుసలాడుతున్నారు.
Advertisement
Advertisement