బెదిరించారు.. బరితెగించారు | Tuni Municipal Vice Chairman Elections Postponed | Sakshi
Sakshi News home page

బెదిరించారు.. బరితెగించారు

Published Tue, Feb 18 2025 4:29 AM | Last Updated on Tue, Feb 18 2025 4:30 AM

Tuni Municipal Vice Chairman Elections Postponed

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కూటమి ప్రభుత్వం

ఒక్క కౌన్సిలర్‌ లేకపోయినా పిడుగురాళ్ల వైస్‌ చైర్మన్‌ ఎన్నికకు రంగంలోకి దిగిన టీడీపీ 

చైర్మన్‌ సహా 17 మంది కౌన్సిలర్లకు బెదిరింపులు, ప్రలోభాలు.. యరపతినేని కనుసైగ మేరకు పోలీసులు, రెవెన్యూ వ్యవస్థలతో ఒత్తిడి 

వైస్‌ చైర్మన్‌ పదవి టీడీపీకి ఏకగ్రీవమైనట్లు ప్రకటన 

రెడ్‌ బుక్‌ రాజ్యాంగ అరాచకానికి నిలువెత్తు సాక్ష్యం 

తుని, పాలకొండల్లోనూ ఇదే బలప్రయోగం.. ఎన్నికలు వాయిదా 

మాజీ మంత్రి దాడిశెట్టి రాజాపై దాడికి యత్నం

అసలు బలమే లేని మున్సిపాలిటీల్లో పాగా వేసేందుకు చంద్రబాబు సర్కారు సాగిస్తున్న కుట్రలు, కుతంత్రాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాయి.  పల్నాడు జిల్లా పిడుగురాళ్ల, కాకినాడ జిల్లా తుని, పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ పదవుల కోసం టీడీపీ అధికార బలంతో బరితెగించింది. సంఖ్యా బలం లేకపోయినా వాటిని బలవంతంగా తమ ఖాతాలో వేసుకునేందుకు కుయుక్తులు పన్నింది.

పిడుగురాళ్ల మున్సి పాల్టీ లో టీడీపీ తరఫున ఒక్క కౌన్సిలర్‌ కూడా గెలవకపోయినా సోమవారం జరిగిన ఎన్నికలో వైస్‌ ఛైర్మన్‌ పదవిని సొంతం చేసుకుందంటే ఏ స్థాయిలో అధికార దుర్వినియోగం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కనుసైగ మేరకు పోలీసులు, రెవిన్యూ అధికారులు వేధించి, భయపెట్టి వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లకు బలవంతంగా పచ్చ కండువా కప్పి.. మాదే మెజార్టీ అని నిస్సిగ్గుగా ప్రకటించడం విస్తుగొలుపుతోంది. తుని, పాలకొండ మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ పదవులను కూడా అదే రీతిలో సొంతం చేసుకునేందుకు ప్రయత్నిం చినా వైఎస్సార్‌సీపీ అడ్డుకోవడంతో అక్కడ ఎన్నికలు వాయిదా పడ్డాయి.

సాక్షి, నరసరావుపేట/తుని/పాలకొండ: పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్‌ ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేశారు. మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఎన్నికల్లో తెలుగుదేశానికి ఒక్క కౌన్సిలర్‌ లేకపోయినా వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను భయపెట్టి అరాచకం çసృష్టించారు. పోలీసులు కూడా తమ కర్తవ్యాన్ని మరచి ఎమ్మెల్యే ఆదేశాలతో కౌన్సిలర్లను భయాందోళనకు గురిచేసి టీడీపీ గూటికి వెళ్లేలా తమవంతు సాయం చేశారు. వైస్‌ చైర్మన్‌ ఎన్నికకు పోటీ చేయడానికి టీడీపీ తరఫున కనీసం ఒక్క కౌన్సిలర్‌ సైతం లేకపోయినా పోటీలో నిలిచి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు.

కౌన్సిలర్లను భయపెట్టి, బెదిరించి, ప్రలోభాలకు గురిచేసి పచ్చ కండువా కప్పి తెలుగుదేశంలో చేర్చుకున్నట్లు ప్రకటించి.. యరపతినేని ప్రజాస్వామ్యానికి కొత్త భాష్యం చెప్పారు. చంద్రబాబు, లోకేశ్‌ రెడ్‌ బుక్‌ రాజ్యాంగం అంటే ఇదేనా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గతంలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో పిడుగురాళ్ల మున్సిపాలిటీలో ఉన్న మొత్తం 33 స్థానాలకు 33 స్థానాలు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలుపొందారు. వైస్‌ చైర్మన్‌గా ముక్కంటి అనే వ్యక్తిని ఎన్నుకోగా ఆయన అనారోగ్యంతో మృతి చెందడంతో ఆ స్థానం ఖాళీ అయింది. దీంతో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ని ఎంపిక చేసుకోవడానికి ఎలక్షన్‌ కమిషన్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

ఈ నెల 3వ తేదీన ఎన్నిక జరగాల్సి ఉండగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని నామినేషన్‌ వేయకుండా టీడీపీ నేతలు అడ్డుపడటంతో మరుసటి రోజు.. అంటే ఈ నెల 4వ తేదీకి ఎన్నికను వాయిదా పడింది. అయితే రాత్రికి రాత్రే యరపతినేని ఆదేశాలతో పోలీసులు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను పాత కేసులు పేరిట వేధించి ఎన్నికకు రానివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో ఎన్నికల కమిషన్‌ ఈ నెల 17న సోమవారం మరోసారి వైస్‌ చైర్మన్‌ ఎన్నికలకు అవకాశం కల్పించింది. నాలుగో తేదీ నుంచి 17 వ తేదీ వరకు సుమారు రెండు వారాలు సమయం ఉండటంతో టీడీపీ నేతలు.. పోలీసు, రెవెన్యూ అధికారులను ఉపయోగించి వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను వేధించడం మొదలుపెట్టారు. 

తునిలోనూ టీడీపీ బల ప్రయోగం 
కాకినాడ జిల్లా తుని మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఎన్నికను మూడోసారి టీడీపీ అడ్డుకోవడంతో వాయిదా పడింది. టీడీపీ లొంగదీసుకున్న కౌన్సిలర్లను మున్సిపల్‌ కార్యాలయంలోకి అనుమతించి, వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను టీడీపీ గూండాలు అడ్డుకున్నారు. మున్సిపాలిటీలో 30 వార్డులకుగాను 30 మందీ వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు ఉన్నారు. వీరిలో ఒకరు మృతి చెందగా మరొకరు ఉద్యోగం రావడంతో రాజీనామా చేశారు. మిగిలిన 28 మంది వైఎస్సార్‌సీపీకి చెందినవారే. ఈ క్రమంలో ఈ నెల 3వ తేదీన వైస్‌ చైర్మన్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌ ఇచ్చారు. టీడీపీ ముందస్తు వ్యూహంలో భాగంగా కౌన్సిల్‌ హాల్‌లోకి చొరబడి ఎన్నికను అడ్డుకుంది.

మరుసటి రోజూ ఇదే సీన్‌ రిపీట్‌ అయ్యింది. దీంతో వైఎస్సార్‌ సీపీకి చెందిన కౌన్సిలర్‌ కాసే సుమతి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు సోమవారం ఎన్నిక జరగాల్సి ఉన్నా, టీడీపీ దౌర్జన్యం వల్ల మళ్లీ వాయిదా పడింది. మంగళవారం ఉదయం 11 గంటలకు వైస్‌ చైర్మన్‌ ఎన్నిక జరుగుతుందని ఆర్వో రవికుమార్‌ తెలిపారు. కాగా, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఎన్నిక కోసం చైర్‌పర్సన్‌ సుధారాణి నివాసం వద్ద నుంచి వైఎస్సార్‌ సీపీ కౌన్సిలర్లను బలవంతంగా తీసుకువెళ్లేందుకు టీడీపీ నాయకులు యత్నిం చారు. ఇదే సమయంలో అక్కడే ఉన్న మాజీ మంత్రి, కాకినాడ జిల్లా వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా అడ్డుకున్నారు.

దీంతో టీడీపీ నాయకులు మోతుకూరి వెంకటేష్, పోలిశెట్టి రామలింగేశ్వరరావులు రాజాపై దాడికి దిగారు. వైఎస్సార్‌సీపీ, టీడీపీ నాయకుల మధ్య తోపులాట జరిగింది. టీడీపీ శ్రేణులను పోలీసులు అక్కడ నుంచి బయటకు పంపించి వేశారు. వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లతో పోలీసులు సంప్రదింపులు జరిపారు. టీడీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలను పంపించేస్తే ఓటింగ్‌కు వస్తామని కౌన్సిలర్లు చెప్పారు. ఈ క్రమంలో మధ్యాహ్నం 12 గంటల వరకు మున్సిపల్‌ కార్యాలయానికి వెళ్లక పోవడంతో కోరం లేక ఎన్నిక వాయిదా పడింది.

ఈ సందర్భంగా దాడిశెట్టి రాజా మాట్లాడుతూ.. టీడీపీకి సొంతంగా ఒక్క సీటు లేకపోయినా అధికార మదంతో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను లొంగదీసుకోవాలని చూస్తోందని, సంతలో పశువుల్లా కొనాలనుకుంటోందని మండిపడ్డారు. అయినా మెజార్టీ లేకపోవడంతో పోలీసులను వినియోగించారన్నారు. వైఎస్సార్‌ సీపీకి చెందిన మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఏలూరి సుధారాణి భర్త, కో ఆప్షన్‌ సభ్యుడు ఏలూరి బాలును హౌస్‌ అరెస్ట్‌ చేశారని, మరికొందరి నాయకులను పోలీసులు అరెస్ట్‌ చేసి భయాందోళనలు సృష్టించారన్నారు.

మహిళా కౌన్సిలర్లలో గర్భిణులు ఉన్నారని, వారికి రక్షణ కల్పించాల్సిన పోలీసులు టీడీపీ గూండాలు, రౌడీ షీటర్లకు సహకరించారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో మంగళవారం చలో తుని కార్యక్రమానికి జిల్లాకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని రాజా పిలుపునిచ్చారు. మున్సిపల్‌ కౌన్సిలర్ల రక్షణ బాధ్యతను తాను తీసుకుంటానని ప్రకటించారు.

బెదిరింపుల పర్వం... 
వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ల ఇళ్లకు పోలీసులను పంపించి స్టేషన్‌కు రావాలని పిలిపించి టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని బెదిరింపులకు దిగారు. మరికొంతమందికి కాంట్రాక్టులు, బిల్లుల పేరుతో తాయిలాలు ఆశచూపే ప్రయత్నం చేశారు. మరోవైపు తెలుగుదేశం నాయకులు రోజూ వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లకు ఫోన్‌ చేసి కచ్చితంగా మీరు పార్టీ మారాల్సిందేనని ఒత్తిడి చేశారు. యరపతినేని శ్రీనివాసరావు నిర్ణయించిన వైస్‌ చైర్మన్‌ అభ్యర్థికే మీరు ఓటు వేయాలంటూ బెదిరించారు. తెలుగుదేశం రౌడీల బెదిరింపులతో కౌన్సిలర్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

దీంతో పోలీసుల సహకారంతో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ల బంధువులను బెదిరించి భయపెట్టి వాళ్ల శిబిరంలోకి బలవంతంగా తీసుకువెళ్లారు. ఇలా సుమారు 17 మందిని టీడీపీ వైపు లాగేశారు. వారితో వైస్‌ చైర్మన్‌ పదవిని దౌర్జన్యంగా లాగేసుకున్నారు. 30వ వార్డు కౌన్సిలర్‌ ఉన్నం భారతిని వైస్‌ చైర్మన్‌గా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ కొత్త వెంకట సుబ్బారావు వ్యాపారాలను అడ్డుకుంటామని బెదిరించి పార్టీ మారేలా చేశారని పట్టణంలోని ఆర్య వైశ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పిడుగురాళ్ల 29వ వార్డు కౌన్సిలర్‌ మునీరా దంపతులు తెలుగుదేశం నాయకుల బెదిరింపులకు లొంగక పోవడంతో నిర్మాణంలో ఉన్న వాళ్ల ఇళ్లను పొక్లెయినర్‌తో నేలమట్టం చేశారు. ఇలా బెదిరించి బరితెగించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు.

పాలకొండలోనూ అదే తీరు  
పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నగర పంచాయతీ చైర్మన్‌ కుర్చీ కోసం కూటమి నాయకులు వేస్తున్న ఎత్తులు పారడం లేదు. ముచ్చటగా మూడోసారి సోమవారం నిర్వహించిన చైర్మన్‌ ఎన్నికలో పదవి దక్కించుకోవాలని కూటమి నాయకులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఎన్నికల అధికారి, సబ్‌ కలెక్టర్‌ యశ్వంత్‌కుమార్‌ రెడ్డితో పాటు జేసీ శోభిక ఉదయం 11 గంటలకు ఎన్నిక ప్రక్రియ ప్రారంభించారు. కూటమికి చెందిన ముగ్గురు సభ్యులు, బలవంతంగా తీసుకెళ్లిన ఇద్దరు వైఎస్సార్‌సీపీ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. దీంతో కోరంలేక ఎన్నికను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు.

కాగా, పాలకొండ నగర పంచాయతీలో మొత్తం 20 వార్డుల్లో 17 మంది వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు ఉన్నారు. వీరిలో 19వ వార్డు కౌన్సిలర్‌ ఉద్యోగ రీత్యా తన పదవికి రాజీనామా చేశారు. మరో ఇద్దరు కౌన్సిలర్లను టీడీపీ నేతలు బలవంతంగా వారి వైపు తిప్పుకున్నారు. ఈ లెక్కన టీడీపీ బలం ఐదుకు చేరిందనుకున్నా, వైఎస్సార్‌సీపీ బలం 14గా ఉంది. ఎలాగైనా సరే గెలవాలని మంత్రి సంధ్యారాణి ఎన్ని రకాలుగా ఒత్తిడి తెచి్చనప్పటికీ ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement