Municipal chairperson
-
టీడీపీ దిగజారుడు రాజకీయం బాలకృష్ణ డైరెక్షన్ లో కౌన్సిలర్లకు ఎర
-
నీచ రాజకీయాలకు తెరతీసిన ఎమ్మెల్యే బాలకృష్ణ
శ్రీ సత్యసాయి జిల్లా: మున్సిపల్ ఛైర్మన్ పదవి కోసం హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ అడ్డదార్లు తొక్కుతున్నారు. నోరు తెరిస్తే బ్లడ్డు...బ్రీడు అంటూ తన గురించి తాను గొప్పగా చెప్పుకునే బాలకృష్ణ నీచ రాజకీయానికి తెరతీశారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను కొనుగోలు చేసి బెంగళూరులో క్యాంపు రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం బాలకృష్ణ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రెండున్నర నెలలుగా ఖాళీగా ఉన్న హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ స్థానానికి ఎన్నిక నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో మున్సిపల్ ఛైర్మన్ పదవిని దక్కించుకునేందుకు టీడీపీ ఎప్పటిలా తన కుటిల రాజకీయాలకు తెరతీసింది. ఇందుకోసం ఎమ్మెల్యే బాలకష్ణనే రంగంలో దిగారు. తనకు అనుకూలమైన వారిని చైర్మన్ పీఠంపై కూర్చోబెట్టేందుకు నానా తంటాలు పడుతున్నారు.ఇందులో భాగంగా ఖర్చుకు ఏమాత్రం వెనుకాడని ఎమ్మెల్యే బాలకృష్ణ వైఎస్సార్సీపీ ఒక్కో కౌన్సిలర్‌కు రూ.10 లక్షలు చొప్పున కొనుగోలు చేశారు. అలా మొత్తంగా 12మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్‌ను కొనుగోలు చేసింది. అనంతరం వారిని బస్సుల్లో బెంగళూరులో టీడీపీ ఏర్పాటు చేసిన క్యాంప్‌కు తరలించింది. మరింత మందిని ప్రలోభాలకు గురి చేసేందుకు ఎమ్మెల్యే బాలకృష్ణ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.ఇప్పటికే బెదిరింపులతో టీడీపీలో చేరిన వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు.. తిరిగి సొంతగూటికి చేరారు. అయితే ఎమ్మెల్యే బాలకృష్ణ చేస్తున్న పెడుతున్న ప్రలోభాలు, బెదిరింపులకు భయపడి టీడీపీలో చేరితో భవిష్యత్తు నాశనం అవుతుందని భావిస్తున్న కౌన్సిలర్లు వైఎస్సార్సీపీలోనే కొనసాగేలా తీర్మానించారు. కాగా, హిందూపురం మున్సిపాలిటీలో 38 మంది కౌన్సిలర్లు ఉండగా.. గత ఎన్నికల్లో 30 వార్డుల్లో వైఎస్సార్సీపీ జయకేతనం ఎగురవేసింది. టీడీపీ కేవలం ఆరు వార్డులకే పరిమితమైంది. కానీ టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురి చేయడం గమనార్హం. -
తిట్టుకుని.. కొట్టుకుని
ఇల్లెందు: ఒకరు మున్సిపల్ చైర్మన్, మరొకరు వైస్ చైర్మన్.. సాక్షాత్తు కౌన్సిల్ సమావేశంలో బాహాబాహీకి దిగారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం దూషణలు, పరస్పర దాడులకు దారితీసింది. మూడు నెలల విరామం తర్వాత శనివారం కౌన్సిల్ సమావేశం నిర్వహించగా.. పట్టణంలో రోడ్లపై వెలసిన దుకా ణాలు, తోపుడు బండ్లను తొలగించేందుకు రూ.2 లక్షలు ఖర్చవుతుందంటూ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే ఆక్రమణలు తొలగిస్తున్నా ఎవరూ అడ్డు చెప్పడం లేదు కదా.. దీనికి కొత్తగా ఫీజు రూపంలో రూ.2లక్షలు ఎందుకంటూ వైస్ చైర్మన్ జానీపాషాతో పాటు పలువురు కౌన్సిలర్లు అభ్యంతరం తెలిపారు. ఆ తర్వాత కూడా ఇరు వర్గాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఈ క్రమంలో చైర్మన్, వైస్ చైర్మన్ పరస్పరం అసభ్య పదజాలంతో వ్యక్తిగత దూషణలకు దిగారు. దీంతో కోపోద్రిక్తుడైన చైర్మన్ వెంకటేశ్వరరావు.. వైస్ చైర్మన్ జానీపాషాపైకి దూసుకొచ్చినట్టు కౌన్సిలర్లు, అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత మరోసారి ఘర్షణ జరగడంతో వైస్ చైర్మన్‌పై చైర్మన్ చేయి చేసుకున్నారు. ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఎదురుగానే ఈ ఘర్షణ జరగడం గమనార్హం. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పట్టణ వాసులకు సేవలందించాల్సిన పాలకవర్గ సభ్యులు ఇలా ఘర్షణ పడడం తగదని హితవు పలికారు. ఈ విషయంలో ఇద్దరిదీ తప్పేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైస్ చైర్మన్ జానీ పాషా మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై సమావేశంలో నిలదీస్తే ఇలా దాడులు చేయడమేంటని ఆవేదన వ్యక్తం చేశారు. తాను అధికారులను ప్రశ్నిస్తుండగా చైర్మన్ జోక్యం చేసుకుని దాడికి దిగారని ఆరోపించారు. దీనిపై చైర్మన్ వెంకటేశ్వరరావు వివరణ కోరగా.. తనను పలుమార్లు వ్యక్తిగతంగా దూషించినా సహించానని స్పష్టం చేశారు. -
నల్లగొండ మున్సిపల్ చైర్మన్‌పై నెగ్గిన అవిశ్వాసం
నల్లగొండ టూటౌన్: నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డిపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన చైర్మన్ సైదిరెడ్డిపై అవిశ్వాసం పెట్టాలని గత నెల 8వ తేదీన కాంగ్రెస్ కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేయగా.. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో ఇన్చార్జి కలెక్టర్ అధ్యక్షతన మున్సిపల్ సమావేశం నిర్వహించారు. ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి 50 మంది సభ్యులున్న కౌన్సిల్లో అవిశ్వాస సమావేశానికి 47 మంది హాజరయ్యారు. ఇద్దరు ఎక్స్ అఫీషియో సభ్యులు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అల్గుబెల్లి నర్సిరెడ్డితో పాటు బీజేపీ కౌన్సిలర్ బండారు ప్రసాద్ సమావేశానికి రాలేదు. 41 మంది కౌన్సిలర్లు అవిశ్వాసానికి అనుకూలంగా చేతులు పైకి ఎత్తారు. వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఐదుగురు కౌన్సిలర్లు చేతులు ఎత్తారు. కాగా, బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి సస్పెన్షన్‌కు గురైన పిల్లి రామరాజుయాదవ్ తటస్థంగా ఉన్నారు. కాంగ్రెస్ కౌన్సిలర్లు 35 మందితో పాటు బీజేపీ కౌన్సిలర్లు నలుగురు, గత ఎన్నికలకు ముందు బీజేపీ, ఎంఐఎం నుంచి బీఆర్ఎస్లో చేరిన ఇద్దరు కౌన్సిలర్లు కూడా అవిశ్వాసానికి అనుకూలంగా చేతులు ఎత్తడంతో 41 మంది మద్దతు లభించింది. ప్రభుత్వానికి నివేదిక నల్లగొండ మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డిపై అవిశ్వాసం నెగ్గిన నేపథ్యంలో దీనికి సంబంధించిన వివరాలతో జిల్లా ఇన్చార్జి కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ప్రభుత్వానికి నివేదిక పంపించారు. ఎన్నికల సంఘం నుంచి తదుపరి ఆదేశాలు రాగానే చైర్మన్ ఎన్నిక కోసం 50 మంది సభ్యులకు నోటీసులు అందించనున్నారు. ఆ తరువాత సమావేశం నిర్వహించి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. -
అసహనంతో అరాచకం.. పేట్రేగిపోతున్న జేసీ సోదరులు
రాజకీయాల్లో వివాదాలకు కేంద్రబిందువైన జేసీ బ్రదర్స్ (మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి – మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి) టీడీపీ అధికారం లేకపోయే సరికి సహనం కోల్పోతున్నారు. ప్రతిపక్షంలో హుందాతనం కనబరచాల్సిన వీరు తద్భిన్నంగా వ్యవహరిస్తున్నారు. దిగజారుడు రాజకీయాలతో విమర్శలు మూటగట్టుకుంటున్నారు. తాడిపత్రి నియోజకవర్గంలో అరాచకాలకు పాల్పడుతూ ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, అనంతపురం: తాడిపత్రిలో 30 ఏళ్లకు పైగా అధికారంలో ఉండి దొరతనాన్ని వెలగబెట్టిన జేసీ సోదరులు ప్రతిపక్షంలోకి వచ్చాక ఉనికి కోసం పడరానిపాట్లు పడుతున్నారు. వీరు నిత్యం ఏదో ఒక వివాదంతో నియోజకవర్గంలో హైటెన్షన్ వాతావరణం సృష్టిస్తున్నట్టు విమర్శలొస్తున్నాయి. గత కొన్ని రోజులుగా జేసీ ప్రభాకర్‌రెడ్డి చేష్టలకు సామాన్యులకే కాదు పోలీసులకు సైతం కంటిమీద కునుకులేకుండా ఉంది. ఇప్పటికే పలు అవినీతి కేసుల్లో ఉన్న ప్రభాకర్‌రెడ్డి ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మరింతగా పేట్రేగిపోతున్నట్టు సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. అభివృద్ధి పనులను అడ్డుకుంటూ.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక తాడిపత్రి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. వీటినెలాగైనా అడ్డుకోవాలనేది జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆలోచన. ఇందులో భాగంగా ఆస్పత్రి నిర్మాణాలను అడ్డుకోవాలని కాంట్రాక్టర్‌ను బెదిరించారు. దీంతో ఈ నెల 23వ తేదీ వివాదం రాజుకుంది. జేసీ బెదిరింపులకు భయపడి కాంట్రాక్టర్ పనులు ఆపేసి వెళ్లినట్టు తెలిసింది. దీంతో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు ర్యాలీగా వెళ్లడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఇది తొలిసారి కాదు... జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రభుత్వాస్పత్రి పనులను అడ్డుకోవడం మొదటి సారేమీ కాదు. మొన్నటికి మొన్న డ్రెయినేజీ పనులను అడ్డుకున్నారు. ఏకంగా మురికి కాలువలో కుర్చీ వేసుకుని కూర్చుని వివాదం రేపారు. అంతకుముందు ‘నాడు–నేడు’ పనుల కింద జూనియర్ కాలేజీకి ప్రహరీ నిర్మిస్తుంటే అడ్డుకున్నారు. అనుచరులతో కలిసి గొడవకు దిగారు. చివరకు పోలీసుల రక్షణలో ప్రహరీ పనులు చేపట్టాల్సి వచ్చింది. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేసినా అడ్డుకుని రాద్ధాంతం చేశారు. చావుతప్పి కన్ను లొట్ట పోయిన చందంగా మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికై... వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు మున్సిపాలిటీలో అన్ని పనులకూ అడ్డు తగులుతున్నారు. అనుచరులను ఉసిగొలుపుతూ... గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవలేకపోయేసరికి జేసీ ప్రభాకర్‌రెడ్డి తీవ్ర అక్కసుతో ఉన్నారు. తన అనుచరులతో కలిసి ఏదో ఒక వివాదాన్ని సృష్టించడం, ధర్నాలు, నిరసనలు చేపట్టడం, సామాన్యులను భయభ్రాంతులకు గురి చేయడం.. ఇదీ తాడిపత్రిలో రోజువారీ తీరు. గత నాలుగేళ్లుగా ప్రశాంతంగా ఉన్న తాడిపత్రిలో మళ్లీ పల్లెలకు వెళ్లి వివాదాలకు ఆజ్యం పోస్తున్నారు. ఇదిలా ఉండగా జేసీ ప్రభాకర్ చేష్టలతో విసిగిపోయిన తెలుగుదేశం పార్టీ నేతలు ఎవ్వరూ ఈయనకు అండగా నిలవని పరిస్థితి. జేసీ సోదరులు టీడీపీకి గుదిబండగా మారారని అనంతపురానికి చెందిన ఆ పార్టీ నాయకుడొకరు చెప్పారు. వీరిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే తప్ప తాడిపత్రిలో టీడీపీకి మనుగడ లేదంటున్నారు. జేసీ తీరుపై పోలీసుల మౌనం జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచరురాలు కమలమ్మ ఫిర్యాదుపై స్పందించి కేసు నమోదు చేసిన పోలీసులు.. జేసీ అనుచరుల ఆగడాలపై మాత్రం కనీస స్పందన లేదు. ఇన్ని వివాదాలు సృష్టిస్తున్నా సుమోటోగా కేసు నమోదు చేయలేదు. జేసీ బెదిరింపులను, వివాదాలను కనీసం పరిగణనలోకి తీసుకోవడం లేదన్న విమర్శలున్నాయి. పోలీసులు ఎందుకు భయపడుతున్నారని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. కేసు నమోదుకు ఆదేశం కాంట్రాక్టర్లను బెదిరించిన తీరుపై బాధితులనుంచి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేయాలని తాడిపత్రి పోలీసులను ఆదేశించాం. ఎవరినైనా బెదిరించినా, ప్రభుత్వ కార్యకలాపాలకు అడ్డు తగిలినా తీవ్రంగా పరిగణిస్తాం. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటివారినైనా వదిలే ప్రసక్తే లేదు. – అన్బురాజన్, ఎస్పీ -
ఏమ్మా.. మీ ఎమ్మెల్యేను ఈ సారి గెలిపిస్తారా?
తాండూరు: ఏమ్మా.. మీ ఎమ్మెల్యేను ఈ సారి గెలిపిస్తారా? అని సీఎం కేసీఆర్ తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్నపరిమళ్‌ను ప్రశ్నించారు. బుధవారం తాండూరులో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు వెళ్లిన ముఖ్యమంత్రికి చైర్పర్సన్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. ఈ సారి ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిని గెలిపిస్తారా అని చైర్‌పర్సన్‌ను అడగగా.. ఖచ్చితంగా గెలిపిస్తాం సార్ అని ఆమె సమాధానం ఇచ్చారు. కాగా గడిచిన మూడేళ్ల కాలంలో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి, చైర్పర్సన్ స్వప్నకు మధ్య గొడవ తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. వాటన్నింటిని పక్కనపెట్టి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పనిచేయాలని గతంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చైర్‌పర్సన్‌ను సముదాయించారు. దీంతో ఎమ్మెల్యే గెలుపే లక్ష్యంగా ఆమె ఎన్నికల ప్రచారం సైతం చేస్తున్నారు. -
బీఆర్ఎస్కు బిగ్ షాక్
వికారాబాద్ అర్బన్: కొంత కాలంగా వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్న మున్సిపల్ చైర్పర్సన్ దంపతులు మంజుల రమేష్ ఆదివారం బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. వారి రాజీనామాతో పట్టణంలో పార్టీకి గట్టి దెబ్బే అని చెప్పవచ్చు. మున్సిపల్ పరిధిలోని అన్ని వర్గాల్లో రమేష్ కుమార్‌కు మంచి పట్టు ఉంది. మాస్ నాయకుడిగా గుర్తింపు పొందారు. అనేక సార్లు స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. నాలుగు సార్లు ఇండిపెండింట్‌గా పోటీ చేసి కౌన్సిలర్‌గా విజయం సాధించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత 2015లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ తరఫున మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేసిన రమేష్‌కుమార్ అందరి ఊహలను తలకిందులు చేస్తూ ఏడుగురు కౌన్సిలర్లను గెలిపించుకున్నారు. దీంతో ఆయనకు పట్టణంలో మరింత పట్టు పెరిగింది. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ ఏ చంద్రశేఖర్‌కు మద్దతు ఇచ్చారు. చంద్రశేఖర్ సాధించిన 20వేల ఓట్లలో సుమారు మూడు వేల ఓట్లు పట్టణంలో పోలయ్యాయి. ఇందులో రమేష్ కుమార్ ప్రధాన భూమిక పోషించారనే ప్రచారం ఉంది. 2020లో బీఆర్ఎస్లోకి.. 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల సమయంలో రమేష్ కుమార్ చైర్మన్ పదవి ఆశించి బీఆర్ఎస్కు దగ్గరయ్యారు. అయితే చైర్మన్ పదవి జనరల్ మహిళకు రిజర్వు రావడంతో అనూహ్యంగా తన సతీమణి మంజులను బీఆర్ఎస్ తరఫున 24వ వార్డు కౌన్సిరల్గా పోటీ చేయించారు. ఆమె ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో చైర్పర్సన్ పదవి దక్కింది. ఆ తరువాత చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు చైర్పర్సన్ దంపతులకు, ఎమ్మెల్యే ఆనంద్‌కు తీవ్రంగా గ్యాప్ పెంచింది. అప్పటి నుంచి ఎమ్మెల్యే ఆనంద్ అధికార పార్టీ కౌన్సిలర్లతో అనేక సార్లు కౌన్సిల్ సమావేశాల్లో చైర్‌పర్సన్‌కు వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు చేయించారని చైర్పర్సన్ దంపతులే నేరుగా ఆరోపించారు. అధికార పార్టీ కౌన్సిలర్లు ఎవరూ కౌన్సిల్ సమావేశానికి హాజరు కాకుండా చేశారని మీడియా ముందు వాపోయారు. అంతటితో ఆగకుండా సొంత పార్టీ చైర్‌పర్సన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టించిన ఘనత ఎమ్మెల్యేకు దక్కుతుందని కూడా ఆరోపించారు. కౌన్సిల్ సమావేశంలో తోటి మహిళా కౌన్సిలర్ చేతిలో నుంచి మైక్ తీసుకున్నందుకు తనపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టించారని, పార్టీ పెద్దలు జోక్యం చేసుకోవడంతో కేసు వాపసు తీసుకున్నారని చైర్పర్సన్ అప్పట్లో ఆరోపించారు. అనేక అభివృద్ధి పనులకు ఆమోదం తెలపకుండా ఎమ్మెల్యే అడ్డుకున్నారని బహిరంగంగానే విమర్శించారు. ఎంత అవమానించినా భరిస్తూ పార్టీలో కొనసాగినట్లు తెలిపారు. తమకు సముచిత స్థానం లేని చోట ఉండటం ఇష్టం లేకనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆమె తెలిపారు. మంజుల రమేష్‌కుమార్ దంపతుల బాటలోనే బీఆర్ఎస్ పార్టీకి చెందిన 6వ వార్డు కౌన్సిలర్ చందర్ నాయక్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జే అరుణ్ కుమార్, విశ్రాంత ఇంజనీర్, జే ప్రదీప్ కుమార్, బీఆర్ఎస్ పట్టణ యువ నాయకుడు సాయికృష్ణ పార్టీకి రాజీనామా చేశారు. ఏది ఏమైనా ఎన్నికలు సమీపిస్తున్న వేళ మంజుల రమేష్‌కుమార్ దంపతులు బీఆర్ఎస్ను వీడడం గట్టి దెబ్బే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. -
TS Election 2023: జగిత్యాల అభ్యర్థిగా భోగ శ్రావణి
సాక్షిప్రతినిధి, కరీంనగర్: బీజేపీ అసెంబ్లీ స్థానం నుంచి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ భోగ శ్రావణి పోటీ చేయనున్నారు. కొన్ని నెలల క్రితం అధికార పార్టీలో విభేదాల కారణంగా పదవికి, పార్టీకి రాజీనామా చేసిన ఆమె బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. వైద్యురాలు, విద్యావంతురాలు, బీసీ సామాజికవర్గానికి చెందిన మహిళ కావడం, జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్‌గా చేసిన అనుభవం ఉండటంతో పార్టీ ఆమెకు టికెట్ ఇచ్చే యోచనలో ఉందని కమలనాథులు చెబుతున్నారు. వాస్తవానికి శ్రావణి చేరిక సమయంలోనే ఆమెకు పార్టీ నుంచి టికెట్ హామీ దక్కిందని ప్రచారం జరిగింది. అధిష్టానం ఆమె పేరును దాదాపుగా ఖరారు చేసిందని సమాచారం. -
సమస్యలపై దద్దరిల్లిన కౌన్సిల్
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ఆయా వార్డుల్లో నెలకొన్న సమస్యలపై అధికారులను కౌన్సిలర్లు నిలదీయడంతో కౌన్సిల్ దద్దరిల్లింది. సోమవారం మధ్యాహ్నం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో అత్యవసర సమావేశం జరిగింది. చాలా వార్డుల్లో మిషన్ భగీరథ పథకం తాగునీరు సరిపోవడం లేదని, వీధిలైట్లు 24 గంటల పాటు వెలుగుతున్నాయని కౌన్సిలర్లు ఏకరువు పెట్టారు. వర్షాకాలం ఆరంభమైనందున పారిశుద్ధంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఎజెండాలోని వివిధ అంశాలపై వాడివేడీగా చర్చ సాగింది. ముందుగా 32వ వార్డు కౌన్సిలర్ సాదతుల్లా మాట్లాడుతూ చాలా గల్లీలలో వీధి దీపాలు, ముఖ్య కూడళ్లలో హైమాస్ట్ లైట్లు సరిగా పనిచేయడం లేదన్నారు. దోమల బెడద ఎక్కువగా ఉందని రసాయన మందులు పిచికారీ చేయించాలన్నారు. ఇవే విషయాలను 19వ వార్డు కౌన్సిలర్ షబ్బీర్ అహ్మద్ ప్రస్తావించారు. అంబేడ్కర్ చౌరస్తా సమీపంలోని ఎక్స్పో–ప్లాజా తొలగించినందున అక్కడి సామగ్రిని మున్సిపాలిటీ స్వాధీనం చేసుకోవాలన్నారు. 24వ వార్డు కౌన్సిలర్ అబ్దుల్ రషీద్ మాట్లాడుతూ లోతట్టు ప్రాంతం రామయ్యబౌలిలో వర్షపు నీరు నిల్వకుండా చూడాలన్నారు. బీజేపీ ఫ్లోర్ లీడర్ అంజయ్య మాట్లాడుతూ కాంట్రాక్టు పనులు అన్ని మహిళా సంఘాల గ్రూపులకు ఇవ్వాలన్నారు. తెలంగాణ ఏర్పడి పదేళ్లు పూర్తికాకుండానే దశాబ్ది ఉత్సవాలు నిర్వహించడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు అందరినీ ఆహ్వానించాలన్నారు. అప్పన్నపల్లిలో రెండో ఆర్ఓబీ ప్రారంభమైనందున కింది భాగంలో అటు, ఇటువైపు వీధి దీపాలు ఏర్పాటు చేయాలన్నారు. వీధుల్లో కుక్కల బెడద ఎక్కువగా ఉందని, అంతర్గత రోడ్లు దెబ్బ తిన్నాయని 21, 37వ వార్డు కౌన్సిలర్లు అనంతరెడ్డి, స్వప్న సమావేశం దృష్టికి తెచ్చారు. కొందరు ఇంటి యజమానులు రోడ్డును ఆనుకొని ర్యాంపులు నిర్మించడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, వాటిని తొలగించాలని 13, 21వ వార్డు కౌన్సిలర్లు లక్ష్మీదేవి, అనంతరెడ్డి డిమాండ్ చేశారు. పెద్దనాలాలలో మురుగును ఎప్పటికప్పుడు తొలగించాలని 33, 34వ వార్డు కౌన్సిలర్లు మునీరుద్దీన్, నర్సింహులు కోరారు. కొందరు వ్యక్తులు వాహనాల్లో కోయిల్‌కొండ ఎక్స్‌రోడ్డు సమీపంలో అర్ధరాత్రి చికెన్ వ్యర్థ పదార్థాలను పడేసిపోతున్నారని సభ దృష్టికి తెచ్చారు. వీరితో పాటు కౌన్సిలర్లు సంధ్య, శ్రీనివాసులు, ముస్కాన్ సుల్తానా, రామాంజనేయులు తమ వార్డుల్లోని సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. వీలైనంత త్వరగా పరిష్కరిస్తాం.. – చైర్మన్, కమిషనర్ సభ్యులు ప్రస్తావించిన ఈ సమస్యలను వీలైనంతవరకు పరిష్కరిస్తామని మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, కమిషనర్ డి.ప్రదీప్‌కుమార్ బదులిచ్చారు. పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని, అందుకు అందరూ సహకరించాలన్నారు. ఇదిలా ఉండగా ఎజెండాలోని కొన్ని పద్దుల్లో తప్పులు దొర్లడంతో అధికారులపై చైర్మన్ మండిపడ్డారు. ఇక ముందు ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు. సమావేశంలో వైస్‌చైర్మన్ తాటి గణేష్‌కుమార్, టీపీఓ లక్ష్మీపతి, డిప్యూటీ ఈఈ బెంజిమన్, శానిటరీ ఇన్స్పెక్టర్లు రవీందర్‌రెడ్డి, గురులింగం, ఏఓ ఉమాకాంత్, ఆర్ఓ నర్సింహ తదితరులు పాల్గొన్నారు. -
వైరా మున్సిపల్ చైర్మన్‌పై అవిశ్వాసం
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం జిల్లా వైరా మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్‌పై బీఆర్ఎస్ కౌన్సిలర్లు సోమవారం కలెక్టర్ వీపీ గౌతమ్‌కు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చారు. ఇటీవల జైపాల్‌తోపాటు మరో ముగ్గురు కౌన్సిలర్లు మాజీ ఎంపీ పొంగులేటికి మద్దతు తెలిపారు. దీంతో బీఆర్ఎస్ నుంచి ఇప్పటికే ఆయనను సస్పెండ్ చేయగా, మరో ముగ్గురు కౌన్సిలర్లు పార్టీకి రాజీ నామా ప్రకటించారు. ఈ క్రమంలో సోమవారం 14 మంది బీఆర్ఎస్, ఇద్దరు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లతో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ మంతనాలు జరి పారు. అనంతరం వీరంతా ఎమ్మెల్యే నేతృత్వంలో అవిశ్వాస తీర్మానం నోటీసును కలెక్టర్‌కు అందజేశారు. పొంగులేటి వర్గం కావడంతో.. వైరా మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 20 వార్డులకుగాను బీఆర్ఎస్ 15, కాంగ్రెస్ రెండు, స్వతంత్రులు రెండు, సీపీఎం ఒక స్థానం గెలుచుకున్నాయి. ఆ తర్వాత ఇద్దరు స్వ తంత్ర అభ్యర్థులు, సీపీఎం కౌన్సిలర్ బీఆర్ఎస్లో చేరా రు. బీఆర్ఎస్పై అసంతృప్తిగా ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నిర్వహించిన కార్యక్రమాలకు జైపాల్ హాజరయ్యారు. దీంతో ఆయనపై బీఆర్ఎస్ వేటువేసింది. ఆ తర్వాత మరో ముగ్గురు కౌన్సిలర్లు ఆ పార్టీకి రాజీనా మా చేసి పొంగులేటి నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో చైర్మన్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఎజెండా కాపీలను కౌన్సిల్ సమావేశాలకు ముందు అందజేయడంలేదని, అభివృద్ధిని పట్టించుకోవడంలేదని ఆయనపై మిగిలిన కౌన్సిర్లు అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇవ్వడం గమనార్హం. -
ఇల్లందులో వేడెక్కిన రాజకీయం
-
జనగామ మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్‌పై అవిశ్వాస నోటీసులు
జనగామ: జనగామ మున్సిపల్ చైర్పర్స పోకల జమున, వైస్ చైర్మన్ మేకల రాంప్రసాద్పై అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యులు శుక్రవారం అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్‌కి అవిశ్వాస నోటీసులు అందజేశారు. తొమ్మిది రోజులపాటు క్యాంపు రాజకీయం నడిపించిన అధికార పక్షం ఆ ఇద్దరిని తొలగించాలని కోరుతూ 11 మంది బీఆర్ఎస్, 8 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు వేర్వేరుగా అవిశ్వాస నోటీసులు ఇచ్చారు. ఫ్లోర్‌లీడర్ మారబోయిన పాండును తొలగించాలని అధిష్టానాన్ని కోరినట్లు బీఆర్ఎస్ కౌన్సిలర్లు తెలిపారు. కాంట్రాక్టర్లు, ఇళ్లనిర్మాణ అనుమతులకు కమీషన్లు వసూలు చేస్తూ పార్టీని అప్రతిష్టపాలు చేస్తుండటంతో అవిశ్వాసం నోటీసులు ఇచ్చినట్లు చైర్పర్సన్ రేసులో ఉన్న 19వ వార్డు సభ్యురాలు బండ పద్మ తెలిపారు. కాగా, నలుగురు బీజేపీ సభ్యులు కూడా తమతో టచ్‌లో ఉన్నారని ఆమె చెప్పారు. -
హుజూరాబాద్‌లో హీటెక్కిన పాలిటిక్స్.. చేతులు కలిపిన బీజేపీ, బీఆర్ఎస్ నేతలు!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ రాజీనామా వ్యవహారం చల్లబడిందో లేదో మళ్లీ హుజూరాబాద్ మున్సిపల్ పాలకవర్గం పంచాయితీ తెరపైకి వచ్చింది. హుజూరాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధికపై బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లు గురువారం ఏకంగా కలెక్టరేట్ ఏవో నారాయణకు ఫిర్యాదు ప్రతులను అందజేశారు. హుజూరాబాద్ నుంచి నేరుగా బీఆర్ఎస్కు చెందిన 22 మంది, బీజేపీకి చెందిన ముగ్గురు కౌన్సిలర్లు కొత్తకొండ వీరభద్రస్వామి దేవస్థానం వద్దకు చేరుకొని చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం విషయంలో ఏకతాటిపై ఉండాలని ప్రతిజ్ఞ చేసిన అనంతరం కరీంనగర్‌కు చేరుకొని ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో హుజూరాబాద్ అవిశ్వాస వ్యవహారం అధికార బీఆర్ఎస్ పార్టీలో చర్చనీయాంశమైంది. ఇదే బాటలో జమ్మికుంట పాలకవర్గంలో కూడా అవిశ్వాస ముసలం పుట్టినట్లు సమాచారం. గతనెల 31వ తేదీన జమ్మికుంటలో భారీ బహిరంగ సభలో బీఆర్ఎస్ అగ్రనేతలంతా బీజేపీ విధానాలపై దుమ్మెత్తిపోసిన రెండురోజులకే అదే పార్టీ నేతలతో కలిసి అవిశ్వాసానికి వెళ్లడం గమనార్హం. ఏకపక్ష నిర్ణయాల వల్లే... హుజూరాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక భర్త గందె శ్రీనివాస్ వ్యవహార శైలి వల్లే అవిశ్వాసం వరకు అసమ్మతి రగడ రాజుకుందనే ప్రచారం మెండుగా ఉంది. గతంలో శ్రీనివాస్ వ్యవహారంపై అప్పటి మంత్రి ఈటల రాజేందర్, ప్రస్తుత మంత్రి గంగుల కమలాకర్‌కు, మరికొంత మంది పార్టీ ముఖ్యనేతలకు ఫిర్యాదు చేశారు. అయినా ఆయన వ్యవహార శైలిలో మార్పులేకపోవడం వల్లే అసమ్మతి గళాన్ని వినిపిస్తున్నట్లు సమాచారం. అభివృద్ధి పనుల విషయంలో తోటి కౌన్సిలర్లకు సమాచారం ఇవ్వకుండా, బినావీులతో కాంట్రాక్టు పనులు చేయిస్తూ మెజార్టీ కౌన్సిలర్ల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా, అధికారులను భయబ్రాంతులకు గురి చేయడం వల్లే ఈ నిర్ణయానికి మెజార్టీ సభ్యులు తోడైనట్లు తెలిసింది. పాలకవర్గంలో 30 మంది సభ్యులుండగా ఒకరు మృతి చెందారు. 25 మంది కౌన్సిలర్లు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. చైర్‌పర్సన్‌కు ముగ్గురు కౌన్సిలర్లు మాత్రమే మద్దతుగా మిగిలారు. ఎమ్మెల్సీ వద్దకు పంచాయితీ.. 25 మంది కౌన్సిలర్లు గురువారం సాయంత్రం హుజూరాబాద్‌లో ఉన్న ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డిని కలిసి విషయాన్ని వివరించినట్లు సమాచారం. పార్టీ అధిష్టానం నిర్ణయించిన మేరకు నడుచుకోవాలని, సమస్యను పార్టీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని, ఎలాంటి తొందరపాటు నిర్ణయాలకు తావివ్వద్దని ఎమ్మెల్సీ వారికి సూచించినట్లు సమాచారం. అయినప్పటికీ మెజార్టీ కౌన్సిలర్లు పార్టీ నిర్ణయమే శిరోధార్యమని, తమ ఫిర్యాదును పరిగణలోకి తీసుకోవాలని, పార్టీకి చెడ్డ పేరు వచ్చే విధంగా తాము వ్యవహరించమని, మెజార్టీ సభ్యుల మనోభావాలను గుర్తించి నిర్ణయం తీసుకోవాల్సిందేనని మొరపెట్టుకున్నట్లు వినికిడి. దీంతో ఈ విషయాన్ని ఆయన ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లారని తెలిసింది. హుజూరాబాద్ తరహాలోనే జమ్మికుంట మున్సిపల్ పాలకవర్గంలో కూడా ముసలం పుట్టినట్లు సమాచారం. వరుస పరిణామాలతో అధికార పార్టీలో గందరగోళం నెలకొంది. - గత పాలకవర్గంలోనూ ఇదే తరహాలో అర్ధంతరంగా అవిశ్వాసం ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈటల రాజేందర్ మంత్రిగా ఉన్న సమయంలో 2018 ఆగస్టులో అప్పుడు చైర్మన్‌గా ఉన్న విజయ్‌కుమార్‌తో రాజీనామా చేయించారు. అనంతరం ఆ స్థానంలో మందా ఉమాదేవి చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టగా.. ఆమె 10 నెలలపాటు పదవిలో కొనసాగారు. ఆ తరువాత ప్రత్యేకాధికారుల పాలన సాగింది. అనంతరం 2020 జనవరిలో మున్సిపల్ ఎన్నికలు జరగ్గా.. జనవరి 27న గందె రాధిక నేతృత్వంలో నూతన పాలకవర్గం కొలువుదీరింది. మూడేళ్లు పూర్తి చేసుకున్న క్రమంలో రాష్ట్రాల అవిశ్వాసాలకు తెరలేవగా.. ఆ మంటలు ఇక్కడ కూడా అంటుకున్నాయి. చైర్పర్సన్ రేసులో ముగ్గురు..! బీఆర్ఎస్–బీజేపీ కౌన్సెలర్లు అవిశ్వాస తీర్మానం ఇవ్వగా.. అన్నీ అనుకూలిస్తే అవిశ్వాసం విజయవంతమైతే చైర్పర్సన్ స్థానానికి ముగ్గురు పోటీలో ఉన్నారు. మందా ఉమాదేవి, దండ శోభ, వైస్ చైర్పర్సన్ కొల్లిపాక నిర్మల రేసులో ఉన్నట్లు తెలిసింది. ఈ విషయంలో అధిష్టానం నిర్ణయమే ఫైనల్ కానుంది. -
బీఆర్ఎస్లో తిరుగుబావుటా.. మంత్రి మల్లారెడ్డి ఆదేశాలు బేఖాతరు!
అధికార పార్టీ బీఆర్ఎస్లో తిరుగుబాటు జెండా ఎగురుతోంది. నగర పాలక సంస్థ, మున్సిపాలిటీల్లో సొంత పార్టీ మేయర్లు, చైర్మన్ల పైనే అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నోటీసులు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌కు అందజేయడం ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. సాక్షి, మేడ్చల్ జిల్లా: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో 13 పురపాలక సంఘాలు ఉండగా, మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు ఆయన ఆదేశాలను బేఖాతరు చేస్తూ.. కలెక్టర్‌కు అవిశ్వాసం నోటీసులు సమర్పించడంపై బీఆర్ఎస్ కేడర్‌ను తీవ్ర అయోమయానికి గురిచేస్తోంది. సొంత బంధువులు ప్రాతినిధ్యం వహిస్తున్న పురపాలక సంఘాల్లో కూడా కౌన్సిలర్లు మంత్రి మల్లారెడ్డి గీత దాటడంతో పాటు విపక్షాలతో చేతులు కలపడం వంటి విషయాలు రాజకీయ వర్గాలను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రాష్ట్రంలోనే అత్యధిక పురపాలక సంఘాలు కలిగిన శాసన సభా నియోజకవర్గంగా మేడ్చల్‌కు పేరుంది. ఇక్కడనే స్థానిక ఎమ్మెల్యే, మంత్రి మల్లారెడ్డి ఆదేశాలను బీఆర్ఎస్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు పాటించక పోవడంతో పట్టును కోల్పోతున్నారన్న చర్చ పార్టీ వర్గాల్లో వ్యక్త మవుతోంది. అలాగే మేడ్చల్ నియోజకవర్గంలోని పలు పురపాలక సంఘాలకు చెందిన డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కూడా అదే పార్టీకి చెందిన మేయర్లు, చైర్మన్లపై అవిశ్వాసం నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన మంత్రి మల్లారెడ్డి వివిధ మార్గాల ద్వారా అసమ్మతి వాదులను బుజ్జగించే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం. బుధవారం ‘మన ఊరు–మన బడి’ కింద మరమ్మతులు పూర్తయిన ప్రభుత్వ పాఠశాలల భవనాల ప్రారం¿ోత్సవానికి హాజరైన మంత్రి మల్లారెడ్డి పోచారం, పీర్జాదిగూడ, బోడుప్పల్ పురపాలక సంఘాల్లోని అసమ్మతి వాదులతో సమావేశమై.. బుజ్జగింపుల పర్వానికి తెర లేపినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా... మంత్రి మల్లారెడ్డిపై దాదాపు నెల రోజుల కిందట మల్కాజిగిరి ఎమ్మెల్యే, సీనియర్ బీఆర్ఎస్ నేత మైనంపల్లి హన్మంతరావు ఇంట్లో సమావేశమైన జిల్లాకు చెందిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు పలు ఆరోపణలతో తిరుగుబావుటా ఎగురవేసిన విషయం తెల్సిందే. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలను ఖాతరు చేయకుండా నామినేటెడ్ పదవులను మంత్రి మల్లారెడ్డి సొంత నియోజకవర్గం వారికి కట్టబెట్టారని ఎమ్మెల్యేలు ఆరోపించారు. అలాగే తమ నియోజక వర్గాల్లో అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపు విషయంలో కలెక్టర్‌ను మంత్రి పక్కదారి పట్టిస్తున్నారని ఎమ్మెల్యేలు విమర్శిస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి వ్యవహార శైలిపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యేలు అప్పట్లోనే మీడియా సమావేశంలో ప్రకటించారు. జవహర్‌నగర్ బాటలో మరికొన్ని.. మేడ్చల్ నియోజకవర్గంలోని జవహర్‌నగర్ కార్పొరేషన్ మేయర్ మేకల కావ్యపై 20 మంది కార్పొరేటర్లు ఇటీవల కలెక్టర్‌కు అవిశ్వాస నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. మేడ్చల్ మున్సిపల్ చైర్మన్ మర్రి దీపికపై 15 మంది కౌన్సిలర్లు అవిశ్వాసం తీర్మానానికి సంబంధించిన నోటీసు కలెక్టర్ కార్యాలయంలో అందజేశారు. తెలంగాణ మున్సిపాలిటీ యాక్ట్ 2019 సె క్షన్ 37 అనుసరించి నో కాన్ఫిడెన్స్ మోషన్ పిటిషన్ చైర్మన్‌కు వ్యతిరేకంగా సమర్పిస్తున్నట్లు వారు నోటీసులో పేర్కొన్నారు. మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మరో 4 పురపాలక సంఘాలకు చెందిన అధికార బీఆర్ఎస్కు చెందిన అ మ్మతి కార్పొరేటర్లు, కౌన్సిలర్లు అవిశ్వాసం నోటీసులు కలెక్టర్ కు అందజేసేందుకు సిద్ధమవుతున్నారు. -
జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ రాజీనామా ఆమోదం
జగిత్యాల: జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ బోగ శ్రావణి రాజీనామాను జిల్లా కలెక్టర్ రవి ఆమోదించారు. ఈ నెల 25న శ్రావణి మున్సిపల్ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రవి సోమవారం ఆమెను కలెక్టరేట్‌కు పిలిపించారు. రాజీనామా నిర్ణయాన్ని ఎవరి ఒత్తిడితోనైనా తీసుకున్నారా ? లేక సొంతంగా నిర్ణయం తీసుకున్నారా? అని కారణాలు అడిగి తెలుసుకున్నారు. తన ఇష్టపూర్వకంగానే రాజీనామా చేశానని స్పష్టం చేసిన శ్రావణి.. మరోసారి లేఖ రాసివ్వడంతో కలెక్టర్ ఆమె రాజీనామా లేఖకు ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీచేశారు. అనంతరం వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్‌కు ఇన్చార్జి చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించారు. కాగా, ఎన్నికల కమిషన్ నుంచి ఆదేశాలు రాగానే నూతన చైర్మన్‌ను ఎన్నుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. జగిత్యాల మున్సిపాలిటీలో కొందరు కౌన్సిలర్లు ఆమెపై అవిశ్వాసానికి ప్రయత్నించడంతో శ్రావణి తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. -
శ్రావణి రాజీనామాపై స్పందించిన ఎమ్మెల్యే సంజయ్.. ఏమన్నారంటే?
సాక్షి, జగిత్యాల: స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, తమ పనులకు అడ్డుపడుతున్నారని అవి భరించలేకనే పదవికి రాజీనామా చేస్తున్నట్టు జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ భోగ శ్రావణి ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాజీనామా చేసి మీడియా ఎదుటే శ్రావణి కన్నీరుపెట్టుకున్నారు. కాగా, ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్పందించారు. శ్రావణి రాజీనామాపై ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. ‘మున్సిపల్ చైర్పర్సన్ రాజీనామా తన వ్యక్తిగతం. చైర్పర్సన్ వ్యాఖ్యలు చాలా బాధించాయి. నేను ఎలాంటి వేధింపులకు గురిచేయలేదు. శ్రావణి వెనుక ఎవరో వ్యక్తులు ఉన్నారు. రాజకీయ కారణాలతో రాజీనామా చేశారు. కౌన్సిలర్లను ఎలాంటి క్యాంపులకు పంపలేదు. అధిష్టానం అన్ని విషయాలు చూసుకుంటుంది. తన కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారని ఆమె కామెంట్స్ చేయడం సరికాదు. దీన్ని ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నాను. సమన్వయ లోపం ఉందని అవిశ్వాసం పెడతామని కౌన్సిలర్లు చెప్పినా వద్దని చెప్పాము. సమన్వయ సమావేశం ఏర్పాటు చేయాలనీ నిర్ణయించి చైర్‌పర్సన్‌కు కాల్ చేశాము. ఈలోపే ఆమె ప్రెస్ మీట్ పెట్టి వ్యాఖ్యలు చేయడం బాధించింది. కలిసి పనిచేస్తానంటే కౌన్సిలర్లను సముదాయించేందుకు ప్రయత్నం చేస్తాను. 50% బీసీ మహిళలకు పదవులు ఇచ్చామ’ని వ్యాఖ్యలు చేశారు. -
దొరగారూ.. మీకో దండం!
సాక్షి, కరీంనగర్: ‘దొరగారూ మీకో దండం. మూడేళ్లుగా అడుగడుగునా అవమానాలు, వేధింపులు భరించా. ఇక నా వల్ల కాదు, మీ గడీ సంకెళ్లు తెంపుకుని బయటికి వస్తున్నా..నా కుటుంబాన్ని, పిల్లల్ని కాపాడుకునేందుకే రాజీనామా చేస్తున్నా. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత ఆశీస్సులతో మూడేళ్ల పాటు పదవిలో కొనసాగాను. ఇక ఈ నరకం నా వల్ల కాదు. దొరా మీరే గెలిచారు..’ అంటూ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్‌ను ఉద్దేశించి మున్సిపల్ చైర్పర్సన్ భోగ శ్రావణి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కన్నీటి పర్యంతమవుతూ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బు ధవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె ఉద్వేగంగా మాట్లాడారు. ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి.. ‘ఒక మహిళా బీసీ నేతగా జగిత్యాల ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మూడు నెలల పసిగుడ్డును వదిలి రాజకీయాల్లోకి వచ్చాను. కేటీఆర్, కవిత ఆశీస్సులతో బలహీనవర్గాలకు చెందిన నేను మున్సిపల్ చైర్పర్సన్ పదవి పొందగలిగా. కానీ ప్రమాణ స్వీకారం చేసిన రెండోరోజు నుంచే విషం చిమ్మే కోరలు ఉన్న మనుషుల మధ్య పనిచేయాల్సి వచ్చింది. ‘మున్సిపల్ చైర్పర్సన్ పదవి అంటే ముళ్లకిరీటం’ అని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ చెబితే తన తండ్రిలాంటి వాడు, తన బాగు కోసం సలహాలు ఇస్తున్నాడని భావించానే తప్ప.. ఆయన రాక్షసత్వానికే బలవుతానని అనుకోలేదు..’ అని శ్రావణి అన్నారు. పేరుకే మున్సిపల్ చైర్‌పర్సన్‌ని.. ‘కరీంనగర్ రోడ్లో ఏర్పాటు చేసిన డివైడర్లు ఎందుకు చిన్నగా ఉన్నాయని ప్రశ్నిస్తే.. కాంట్రాక్టర్, కౌన్సిలర్ల ముందే అవమానించారు. పార్కులు అభివృద్ధి చేయాలని కోరితే అమరవీరుల స్తూపం సాక్షిగా తీవ్రంగా అవమానించారు. మున్సిపాలిటీ లో ఎలాంటి పర్యటనలు చేయకూడదు. కనీసం రూ.10 వేల విలువ గల పనికి కూడా కొబ్బరికాయ కొట్టలేని దయనీయస్థితి. పేరుకే మున్సిపల్ చైర్‌పర్సన్‌ని. పెత్తనం ఎమ్మెల్యేదే..’ అని చెప్పారు. చైర్పర్సన్ పదవిని అమ్ముకోవడానికి బేరం ‘నాలుగేళ్లలోపు అవిశ్వాసాలు పెట్టరాదని తెలిసినా ఎమ్మెల్యే కౌన్సిలర్లను బెదిరించి అవిశ్వాస తీర్మానం డ్రామా ఆడారు. చైర్పర్సన్ పదవిని అమ్ముకోవడా నికి ఓ మహిళా కౌన్సిలర్ భర్తతో బేరం కుదుర్చుకు న్నారు. కర్కశత్వం, మూర్ఖత్వం, క్రూరత్వం కలిపితే ఎమ్మెల్యే సంజయ్. ఆయనతో మాకు ఆపద పొంచి ఉంది. మా కుటుంబానికి ఏమైనా జరిగితే ఎమ్మె ల్యేనే కారణం. మాకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఎస్పీగారిదే’ అని శ్రావణి తెలిపారు. శ్రావణికి బీఫామ్ ఇచ్చిందే నేను చైర్పర్సన్ భోగ శ్రావణి ఆరోపణలు సమంజసం కాదు. ఆమెకు బీఫామ్ ఇచ్చిందే నేను. అలాంటిది నేను ఎందుకు ఆమెకు వ్యతిరేకంగా వ్యవహరిస్తాను. అవిశ్వాసం విషయంలో నా ప్రమేయం లేదు. ఈ విషయంలో ఇంతకుమించి స్పందించలేను. – ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ -
కామారెడ్డి ‘మాస్టర్‌ప్లాన్’ వెనక్కి!
సాక్షి, కామారెడ్డి/కామారెడ్డి టౌన్: ‘భూమిని మింగే మాస్టర్ ప్లాన్ మాకొద్దు’అంటూ నెలన్నర కాలంగా రైతు ఐక్యకార్యాచరణ కమిటీ చేస్తున్న పోరాటం ఫలించింది. కామారెడ్డి మున్సిపల్ పాలకవర్గం మాస్టర్‌ప్లాన్ రద్దుకు ముందుకు వచ్చింది. ఈ నెల 20న మున్సిపల్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ముసాయిదా రద్దు కోరుతూ తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపనున్నట్టు మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవి గురువారం విలేకరుల సమావేశంలో ప్రకటించారు. దీంతో గడచిన నెలన్నర రోజులుగా జరుగుతున్న ఆందోళనలకు ఫుల్స్టాప్ పడనుందని రైతులు భావిస్తున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి రైతు ఐక్యకార్యాచరణ కమిటీ అనేక రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు, బంద్‌లు నిర్వహించింది. విలీన గ్రామాల కౌన్సిలర్లు తొమ్మిది మంది రాజీనామా చేయాలని గురువారం సాయంత్రం వరకు డెడ్‌లైన్ విధించింది. ఈ క్రమంలో బీజేపీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు తమ రాజీనామా లేఖలను మున్సిపల్ కమషనర్‌కు అందించారు. దీంతో అధికార పార్టీ కౌన్సిలర్లపై ఒత్తిడి పెరిగింది. ముందు నుయ్యి, వెనక గొయ్యిలా వారి పరిస్థితి తయారైంది. శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఇంటిని ముట్టడించాలని పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు చర్చించి ఈ నెల 20న మున్సిపల్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ముసాయిదా రద్దు కోరుతూ తీర్మానించాలని నిర్ణయించారు. ఎట్టకేలకు రైతుల పోరాటాల ఫలితంగా బల్దియా పాలకవర్గం మాస్టర్‌ప్లాన్ ముసాయిదా రద్దుకు సిద్ధమైంది. -
గుజరాత్ కేబుల్ బ్రిడ్జ్ ఘటన...మున్సిపల్ ఆఫీసర్‌పై వేటు
అక్టోబర్ 30న మచ్చు నదిపై మోర్బీ తీగల వంతెన కూలి 135 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఆ ఘటనకు సంబంధించి మున్సిపాలిటీ చీఫ్ ఆఫీసర్ సందీప్ సిన్హ్ జలాలను గుజరాత్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ ఘటనపై ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఈ ఘటన జరిగినప్పుడూ సందీప్ జాలా ఛీఫ్ ఆఫీసర్‌గా ఉండటంతో వేటు విధించామని కమిటీ స్పష్టం చేసింది. దర్యాప్తుని నిష్పక్షపాతంగా జరిపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఐతే ఆయనపై ఇంకా ఎలాంటి నిర్ధిష్ట అభియోగాన్ని మోపలేదని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు కమిటీ దర్యాప్తులో....మున్సిపాలిటీ బోర్డు అనుమతి పొందకుండానే సుమారు 15 ఏళ్ల పాటు ఒరెవా గ్రూపుతో ఒప్పందంపై మున్సిపాలిటీ సంతకం చేసిందని అధికారులు తెలిపారు. అదీగాక 139 ఏళ్ల నాటి బ్రిడ్జిని ప్రైవేట్ కంపెనీ అనుమతి లేకుండానే మళ్లీ తెరిచినప్పుడూ మున్సిపాలిటీ చేతులు దులుపుకుందనే విమర్శలు తలెత్తుతున్నాయి. బ్రిడ్జిని తిరిగి తెరిచేటప్పుడూ కూడా కంపెనీ ఫిట్నెస్ సర్టిఫికేట్ జారీ చేసిందా లేదా అనేది తెలియదని మున్సిపాలిటీ చీఫ్ సందీప్ జాలా అన్నారు. ఈ బ్రిడ్జిని ఒరెవా కంపెనీ మార్చి7 నుంచి మరమత్తుల నిర్వహణ విషయమై ఏడు నెలలపాటు మూసేసింది. న్యూయర్ వేడుకల నేపథ్యంలోనే అక్టోబర్ 26న వంతెనను తిరిగి ప్రారంభించింది. అయితే ఒరేవా మేనేజింగ్ డ్రైరెక్టర్ జయసుఖ్ పటేల్ మోర్బి జిల్లా కలెక్టర్ మధ్య 2008 ఒప్పందం ప్రకారం సుమారు 10 సవంత్సరాల పాటు వంతెనను నిర్వహించడానకి కాంట్రాక్టు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ఐతే ఒరెవా కాంట్రాక్టుకు ఎలాంటి టెండర్లు నిర్వహించలేదని గుజరాత్ ప్రభుత్వ న్యాయవాది హెచ్ఎస్ పాంచల్ బుధవారం స్థానిక కోర్టుకు తెలిపారు. అంతేగాదు కేవలం బ్రిడ్జి ప్లాట్‌ఫాంని మాత్రమే ఒరెవా గ్రూప్ మార్చిందని, తెగిపడిన కేబుల్ విభాగం బలహీనంగా తుప్పుపట్టి ఉందని పాంచల్ ఆరోపణలు చేశారు. అయితే మరో ప్రభుత్వ అధికారి 2018లోనే ఒప్పందం ముగిసిన ఒరెవాతో అనబంధ సాగించిందని, రాజ్‌కోట్ కలెక్టర్ కార్యాలయం కొత్త ఒప్పందం కుదుర్చుకునే వరకు వంతెనను నిర్వహించడానికి ఒరేవా మేనేజింగ్ డైరెక్టర్ పటేల్‌కు అనుమతి ఉన్నట్లు తెలిపారు. అలాగే ఆగస్టులో టికెట్ పీజు పెంచాలన్న కంపెనీ ప్రతిపాదనను సైతం మున్సిపల్ బోర్డు తిరస్కరించిందని అధికారి తెలిపారు. ఈ ఏడాది ఒప్పందం ప్రకారం పెద్దలకు రూ.15, 12 సంవత్సారాల కంటే తక్కువ వయసు ఉన్నవారికి రూ. 10గా నిర్ణయించారు. ఈ మేరకు ఒరెవా గ్రూపుకు చెందని నలుగురు అధికారులను, మరమత్తులు కేటాయించిన కాంట్రాక్టర్లు ప్రకాశ్ పర్మార్, దేవాంగ్ పర్మార్‌లతో సహా తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ ఈ ఘటనపై దర్యాప్తు చేసి నివేదికను సిద్ధం చేసి త్వరతగతిన ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంది. -
టీఆర్ఎస్లో అసమ్మతి సెగలు.. ‘పట్నం’ మున్సిపాలిటీలో ముదిరిన వైరం
సాక్షి, ఇబ్రహీంపట్నం(రంగారెడ్డి): ‘పట్నం’ పురపాలక సంఘం పాలక వర్గం వ్యవహారశైలి రోజుకో మలుపు తిరుగుతోంది. అధికార పార్టీ చైర్పర్సన్ కప్పరి స్రవంతితో అమీతుమీ తేల్చుకునేందుకు అదే పార్టీకి చెందిన కౌన్సిలర్లు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో మూకు మ్మడిగా మంత్రి సబితారెడ్డికి ఫిర్యాదు చేయడం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మున్సిపాలిటీలో 24 మంది కౌన్సిలర్లకు ఆరుగురు కాంగ్రెస్, ఇద్దరు బీజేపీ కౌన్సిలర్లు ఉండగా మిగతా వారంతా అధికార టీఆర్ఎస్కు చెందిన వారే. చైర్ పర్సన్, అధికార పార్టీ కౌన్సిలర్ల మధ్య ఆరు నెలలుగా వైరం కొనసాగుతోంది. అదికాస్తా తీవ్రరూపం దాల్చింది. అక్రమ వసూళ్లతోపాటు మున్సిపాలిటీలో రూ.2 కోట్లకు పైగా తప్పుడు బిల్లులు, రికార్డులు సృష్టించి చైర్పర్సన్ అవినీతి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ మేరకు అదనపు కలెక్టర్ ప్రతీక్‌జైన్‌కు ఫిర్యాదు చేయగా మే 26న మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన ఆయన రికార్డులను సీజ్ చేసి వెంట తీసుకెళ్లారు. అవినీతి ఆరోపణలపై వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని చైర్ పర్సన్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఏమైందో తెలియదుగానీ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. అనంతరం చైర్‌పర్సన్‌పై చర్యలు తీసుకోవాలంటూ అధికార పార్టీ కౌన్సిలర్లు కలెక్టర్ అమయ్‌కుమార్, మున్సిపల్ మంత్రి కేటీఆర్, సీడీఎంఏ అధికారుల కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొట్టినా ఫలితం కనిపించలేదు. దీంతో అధికార చైర్ పర్సన్ అధ్యక్షతన జరిగే కౌన్సిల్ సమావేశాలకు డుమ్మా కొట్టారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట చైర్పర్సన్ అవినీతిపై నిరసన వ్యక్తం చేశారు. అభివృద్ధి పనుల శంకుస్థానలు, ప్రారంభోత్సవాలకు ఎవరివారే అన్నట్లు వ్యవహరించారు. అధికార పార్టీ వైస్ చైర్మన్ ఆకుల యాదగిరితో కౌన్సిలర్లు జతకట్టారు. ఒకే పనిని చైర్పర్సన్, వైస్ చైర్మన్ వేర్వేరుగా చేపట్టడం ప్రారంభించారు. ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. అధికార పార్టీ కౌన్సిలర్ల మద్దతు లేకున్న చైర్ పర్సన్ ఒంటరిగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటుండంతో కౌన్సిలర్లకు మింగుడు పడటం లేదు. రూటు మార్చిన కౌన్సిలర్లు చైర్‌పర్సన్‌పై ఎన్ని ఫిర్యాదులు చేసినా అధికారికంగా చర్యలు లేకపోవడంతో కౌన్సిలర్లు రూటు మార్చారు. కొత్త ఎత్తుగడలతో ముందుకు సాగుతున్నారు. చైర్‌పర్సన్‌పై చర్యలు తీసుకోకుంటే టీఆర్ఎస్ పార్టీకి, కౌన్సిలర్ల పదవులకు రాజీనామాలు చేస్తామని ఏకంగా మంత్రి సబితారెడ్డికి ఎమ్మెల్యే సమక్షంలోనే తెగేసి చెప్పారు. చైర్ పర్సన్ అవినీతి, అక్రమాలతో పార్టీకి, తమకు చెడ్డపేరు వస్తోందని మంత్రి దృష్టికి తెచ్చారు. ఒక్కసారిగా 15 మంది కౌన్సిలర్లు పార్టీకి, పదవులకు రాజీనామా చేస్తే ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుందనే కోణంలో అధికార పార్టీ నేతలు ఆలోచనల్లో పడ్డట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి కనుసన్నల్లోనే..! ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి కనుసన్నల్లోనే ఈ వ్యవహారం సాగుతోందని పలువురు చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్యే మాట కాదని చైర్‌పర్సన్‌పై ఫిర్యాదు చేసేంత సాహసానికి కౌన్సిలర్లు ఒడిగట్టరనే వాదన వినిపిస్తోంది. చైర్ పర్సన్ అవినీతి చిట్టా ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చిన తర్వాతే ఫిర్యాదుల పర్వానికి కౌన్సిలర్లు తెరలేపారని.. ఆమె వ్యవహారశైలి కూడా ఎమ్మెల్యేకు నచ్చడం లేదనే చర్చ కొనసాగుతోంది. ఇటీవల కాలంలో చైర్పర్సన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్లడం లేదని తెలుస్తోంది. రోజురోజుకూ ముదిరిపాకాన పడి తారాస్థాయికి చేరిన మున్సిపాలిటీ వ్యవహారం ఎంత వరకు వెళ్తుందో వేచి చూడాలి. -
ఎమ్మెల్యే రాలేదని జెండా ఆవిష్కరణలో గందరగోళం
కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీలో అధికార పార్టీలో నెలకొన్న విభేదాలు బట్టబయలయ్యాయి. కోదాడ మున్సిపాలిటీలో ఉదయం 8:30కు జెండా ఆవిష్కరణ ఉంటుందని మున్సిపాలిటీ అధికారులు, చైర్పర్సన్ పట్టణంలో ప్రముఖులకు ఆహ్వానాలు పంపారు. ఆ సమయానికే పలువురు మున్సిపాలిటీ కార్యాలయానికి చేరుకోగా ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మాత్రం 9గంటలై నా రాలేదు. దీంతో 9:10 నిమిషాలకు మున్సిపల్ చైర్పర్సన్ వనపర్తి శిరీష కార్యక్రమాన్ని ప్రారంభించగా..ఎమ్మెల్యే వచ్చే వరకు జెండా ఎగుర వేయవద్దని మున్సిపల్ కమిషనర్ అడ్డుతగిలారు. వాగ్వాదాల మధ్యే జెండాను ఆవి ష్కరించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మున్సిపాలిటీకి రాకుండానే పక్కనే ఉన్న గాంధీ పార్కుకు వెళ్లి జాతీయ జెండాను ఆవిష్క రించారు. ఇదే ఆవరణలో ఉన్న కోదాడ గ్రంథాలయం వద్ద జెండా ఆవిష్కరణకు ఎమ్మెల్యే వెళ్లగా అక్కడికి మున్సిపల్ చైర్ పర్సన్ శీరిష కూడా వెళ్లారు. అక్కడ ఆమెను కోదాడ ఎంపీపీ చింతా కవిత, మార్కెట్ చైర్పర్సన్ సుధారాణి నెట్టి వేశారు. దీంతో తనను వేధిస్తు న్నారంటూ మున్సిపల్ చైర్పర్సన్ గాంధీ విగ్రహం ముందు మౌన దీక్షకు దిగారు. -
చిచ్చుపెట్టిన బైక్‌ర్యాలీ!
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం/కొత్తగూడెం అర్బన్: కొత్తగూడెం గులాబీ పార్టీలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. మున్సిపాలిటీలోని రెండు వర్గాలు ఇప్పటివరకు మాటల తూటాలు, విమర్శలకే పరిమితమయ్యాయి. ద్విచక్రవాహన ర్యాలీలో చోటుచేసుకున్న ఘటనతో మరింత వివాదాస్పదంగా మారాయి. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర వైఖరికి నిరసనగా జిల్లావ్యాప్తంగా టీఆర్ఎస్నేతలు శుక్రవారంనాడు ఇళ్లపై నల్లజెండాలు ఎగురవేయడంతో పాటు బైక్ ర్యాలీలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించగా, మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మితో పాటు పాలకవర్గం, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ర్యాలీలో తన తనయుడితో కలిసి కాపు సీతాలక్ష్మి వెళ్తున్న బైక్‌ను, మాజీ కౌన్సిలర్ యూసుఫ్ వాహనం వెనుకనుంచి ఢీకొట్టడంతో సీతాలక్ష్మి కిందపడిపోయారు. యూసుఫ్ కావాలనే తన వాహనాన్ని ఢీకొట్టారంటూ సీతాలక్ష్మి రోడ్డుపై బైఠాయించారు. పార్టీ నాయకులు కొందరు యూసుఫ్‌తో వాగ్వాదానికి దిగగా.. ప్రమాదవశాత్తూ జరిగిందంటూ కొందరు యూసుఫ్‌కు మద్దతుగా నిలిచారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. టూటౌన్ సీఐ రాజు ఇరువర్గాలను సమదాయించి పంపించేశారు. కాగా, చైర్‌పర్సన్‌ను ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పరామర్శించారు. ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ ఆమెకు సంఘీభావం తెలిపారు. నేను మహిళను, దండం పెడతా అన్నా.. ‘నేను ప్రయాణిస్తున్న బైక్‌ను యూసుఫ్ అప్పటికే రెండుసార్లు ఢీకొట్టారు. ‘ఆగన్నా నేను మహిళను.. మీకు దండం పెడతా...’ అని చెప్పినా వినిపించుకోలేదు. అలాగే ముందుకొచ్చాడు. నా కుమారుడికి చెప్పి బండి పక్కకు ఆపి ఇంటికొచ్చేశా. మహిళనని చూడకుండా అగౌరవపరిచారు. చైర్‌పర్సన్‌కే రక్షణ లేకుంటే సాధారణ మహిళలు బయటికి ఎలా వస్తారు? యూసుఫ్‌పై చర్యలు తీసుకోవాలని పార్టీ అధిష్టానంతో పాటు ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లాను’ అంటూ కాపు సీతాలక్ష్మి శుక్రవారం సాయంత్రం ఓ వీడియో విడుదల చేశారు. అనంతరం కొత్తగూడెం టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేశారు. కాగా, ‘చైర్పర్సన్ డ్రైవర్ నాగరాజు బండి తొలుత నా వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పి నా బండి చైర్పర్సన్ వాహనాన్ని ఢీకొంది. అంతే తప్ప దురుద్దేశంతో చేయలేదు’అంటూ యూసుఫ్ మరో వీడియోలో స్పందించారు. -
ఏపీలో కొలువుదీరిన పాలకవర్గాలు.. నెల్లూరు మేయర్‌గా పొట్లూరి స్రవంతి
సాక్షి, అమరావతి: ఇటీవల ఎన్నికలు జరి గిన నెల్లూరు నగరపాలక సంస్థ, 11 ముని సిపాలిటీలు, నగర పంచాయ తీల్లో పాలక వర్గాలు సోమవారం కొలువు దీరాయి. దర్శి మునిసిపాలిటీ మినహా మిగిలిన అన్నిచోట్ల వైఎస్సార్ సీపీ ఆయా పదవుల్ని గెల్చుకుంది. కొండపల్లి పురపాలకసంఘ సమావేశం వాయిదాపడింది. -
కుప్పం మున్సిపల్ చైర్మన్‌గా డాక్టర్ సుధీర్ ప్రమాణం
కృష్ణా జిల్లా ►జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికైన రంగాపురం రాఘవేంద్ర ►జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్‌గా 32 ఏళ్ల రాఘవేంద్ర. ►వైస్ చైర్మన్లుగా తుమ్మల ప్రభాకర్, షేక్ హఫీజ్ ఉన్నిస ►చైర్మన్, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లను అభినందించిన ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను. పశ్చిమగోదావరి జిల్లా ►కొలువుదీరిన ఆకివీడు నగర పాలక సంస్థ తొలి పాలక వర్గం ►తొలి నగర పంచాయతీ చైర్ పర్సన్‌గా జామి హైమావతి ఎన్నిక ►వైస్ చైర్మన్లుగా పుప్పాల సత్యనారాయణ, వంగా జ్యోత్స్నాదేవిలను ఎన్నుకున్న కౌన్సిల్ సభ్యులు ►ఎన్నికకు ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించిన జేసీ హిమాన్షు శుక్లా తూర్పు గోదావరి జిల్లా ఇవాళ ఏజెన్సీ ఎటపాక ఎంపీపీ ఎన్నిక ►టాస్ పద్ధతిలో ఎంపిక నిర్వహించనున్న అధికారులు ►మొత్తం 12 ఎంపీటీసీ స్థానాలకు గాను 6 స్థానాలు గెలుచుకున్న వైఎస్సార్సీపీ, టీడీపీ 4, సీపీఎం 1, సీపీఐ ఒకస్థానం గెలుచుకున్నారు. ►వైఎస్సార్సీపీ, టీడీపీ కూటమికి సమాన స్థానాలు రావడంతో మధ్యాహ్నం మూడు గంటలకు టాస్ పద్ధతిలో ఎంపీపీ ఎంపిక కృష్ణాజిల్లా ►కొండపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నిక రేపటికి వాయిదా ►కేశినేని నాని కోర్డును మభ్యపెట్టి తనకు అనుకూలంగా తీర్పు తెచ్చుకున్నారు ►కోర్టుకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంది ►డివిజన్ బెంచ్ తీర్పు మాకు అనుకూలంగా వస్తుందని ఆశిస్తున్నాం ►చైర్ పర్సన్ ఎన్నిక వాయిదా వేయాలని అధికారులను కోరాం ►మా విజ్ఞప్తి మేరకు అధికారులు ఎన్నికను వాయిదా వేశారు -ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ చిత్తూరు ►కుప్పం మున్సిపల్ చైర్మన్‌గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన డాక్టర్ సుధీర్ ప్రమాణ స్వీకారం ►వైస్ చైర్మన్‌గా అఫీస్, మునిస్వామిలు ప్రమాణం సాక్షి, అమరావతి: ఇటీవల ఎన్నికలు జరిగిన నెల్లూరు నగరపాలకసంస్థ, 12 మునిసిపాలిటీలు/నగర పంచాయతీల్లో మేయర్, చైర్మన్ల ఎన్నిక సోమవారం జరగనుంది. నెల్లూరు కార్పొరేషన్లో 54 డివిజన్లకు ఎన్నికైన కార్పొరేటర్లు ఉదయం 11 గంటలకు సమావేశమై మేయరు, ఇద్దరు డిప్యూటీ మేయర్లను ఎన్నుకున్నారు. అకివీడు (పశ్చిమ గోదావరి జిల్లా), జగ్గయ్యపేట, కొండపల్లి (కృష్ణా), దాచేపల్లి, గురజాల (గుంటూరు), దర్శి (ప్రకాశం), బుచ్చిరెడ్డిపాలెం (నెల్లూరు), బేతంచెర్ల (కర్నూలు), కమలాపురం, రాజంపేట (వైఎస్సార్), పెనుకొండ (అనంతపురం), కుప్పం (చిత్తూరు జిల్లా) మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికైన సభ్యులు ఎక్కడికక్కడ ఉదయం 11 గంటలకు సమావేశమై చైర్మన్, ఇద్దరు వంతున వైస్ చైర్మన్లను ఎన్నుకున్నారు. -
18న మేయర్ల ఎన్నిక
సాక్షి, అమరావతి: నగర పాలక సంస్థల్లో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులతో పాటు మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో చైర్ పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవులకు ఈనెల 18న ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఆ రోజు ఉ.11గంటలకు ఎక్కడికక్కడ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ నిర్ణయించారు. ఏలూరు మినహా 11 నగర పాలక సంస్థలు, 75 మున్సిపాలిటీల్లో పరోక్ష పద్ధతిలో ఈ ఎన్నికలు జరుగుతాయి. 14న జరిగే మున్సి‘పోల్స్’ ఓట్ల లెక్కింపు సందర్భంగా నగర పాలక సంస్థల్లో కార్పొరేటర్లుగా ఎన్నికైన వారు మేయర్, డిప్యూటీ మేయర్లను ఎన్నుకుంటారు. అలాగే, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వార్డు సభ్యులుగా ఎన్నికైన వారు చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లను ఎన్నుకుంటారు. ఈ ఎన్నికలను పురస్కరించుకుని ఎన్నికల కమిషన్ ప్రిసైడింగ్ అధికారులను నియమించింది. వీరు ముందుగా విజేతలతో ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ల ఎన్నికలను చేపడతారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఓటు హక్కు ఈ ఎన్నికల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఎక్స్ అఫిషియో హోదాలో ఓటు హక్కు ఉంటుంది. వీరు ముందుగా తమ పేర్లు నమోదు చేసుకోవాలి. ► లోక్‌సభ సభ్యుడు లేదా ఎమ్మెల్యే తాము గెలిచిన నియోజకవర్గ పరిధిలో ఒకటి కంటే ఎక్కువ పట్టణాలు ఉంటే ఏదో ఒకచోట మాత్రమే ఎక్స్ అఫిషియో సభ్యునిగా తమ పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వారి నియోజకవర్గ పరిధిలో ఒకటే పట్టణం ఉంటే అందులోనే అతను ఎక్స్ అఫిషియో సభ్యునిగా పరిగణిస్తారు. ► రాజ్యసభ సభ్యునికి మున్సిపాలిటీ ప్రాంతాల్లో ఎక్కడ ఓటు హక్కు కలిగి ఉంటుందో ఆ నగర పాలక సంస్థ లేదంటే మున్సిపాలిటీలో అతనిని ఎక్స్ అఫిషియో సభ్యునిగా గుర్తిస్తారు. ఇక ఎమ్మెల్సీలు కూడా తాము ఎన్నికయ్యే సమయంలో ఏ మున్సిపాలిటీ లేదా నగర పాలక సంస్థలో ఓటు హక్కు కలిగి ఉంటారో అక్కడే అతనిని ఎక్స్ అఫిషియో సభ్యునిగా గుర్తిస్తారు. కోరం ఉంటేనే ఎన్నిక నగర పాలక సంస్థలు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలోని ఓటు హక్కు ఉన్న మొత్తం సభ్యులలో కనీసం సగం మంది 18న జరిగే ప్రత్యేక సమావేశానికి హాజరైతేనే ఆయాచోట్ల మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ల ఎన్నికను నిర్వహిస్తారు. గంట వ్యవధిలో కనీసం సగం మంది సభ్యులు హాజరుకాని పక్షంలో కోరం లేని కారణంగా ఎన్నికను ప్రిసైడింగ్ అధికారి వాయిదా వేస్తారని ఎన్నికల కమిషన్ అధికారులు వెల్లడించారు. విప్ జారీచేసే అధికారం లేని జనసేన ఇదిలా ఉంటే.. ఈ ఎన్నికల్లో గెలుపొందిన తమ అభ్యర్థులకు విప్ జారీచేసే అధికారం ఆయా పార్టీలు కలిగి ఉంటాయి. అధికార వైఎస్సార్సీపీ, తెలుగుదేశంతో సహా జాతీయ స్థాయిలో, వివిధ రాష్ట్రాలలో గుర్తింపు పొందిన మొత్తం 18 రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలో విప్ జారీ చెయ్యొచ్చు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆయా రాజకీయ పక్షాలకు లేఖలు రాసింది. కానీ, విప్ జారీచేసే అధికారం ఉన్న పార్టీల జాబితాలో జనసేన లేదు. కేంద్ర ఎన్నికల సంఘం వద్ద గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీగా నమోదై ఉండి.. ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద కూడా నమోదు చేసుకుని ఉంటే అలాంటి పార్టీలకు మాత్రమే ఈ ఎన్నికల్లో విప్ జారీచేసే అధికారం ఉంటుందని ఎన్నికల కమిషన్ వర్గాలు తెలిపాయి. కానీ, రాష్ట్రంలో జనసేన గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీ కాదని.. కేవలం రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద ప్రత్యేక గుర్తు రిజర్వుడు చేయబడిన రిజిస్టర్డ్ పార్టీ మాత్రమే అయినందున ఆ పార్టీని విప్ జారీచేసే అధికారం ఉన్న పార్టీల జాబితాలో చేర్చలేదని ఆ వర్గాలు వివరించాయి.