కడప చైర్మన్‌కు చుక్కెదురు | Internal Clashes In TDP | Sakshi
Sakshi News home page

కడప చైర్మన్‌కు చుక్కెదురు

Published Sat, Dec 1 2018 2:28 PM | Last Updated on Sat, Dec 1 2018 2:28 PM

Internal Clashes In TDP - Sakshi

మున్సిపల్‌ చైర్మన్‌కు సొంత పార్టీ కౌన్సిలర్ల నుంచే రెండో సారి చుక్కెదురైంది. కౌన్సిల్‌ సమావేశానికి హాజరు కాకపోవడం, అటు వైఎస్సార్‌సీపీ కౌన్సిర్లు గైర్హాజరు కావడంతో కోరం లేక సమావేశం వాయిదా వేశారు. సమావేశానికి హాజరైన వరదవర్గ కౌన్సిలర్లు, అధికారులు సమావేశం నుంచి వెళ్లి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికార పార్టీలో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి.

ప్రొద్దుటూరు టౌన్‌ : ప్రొద్దుటూరు మున్సిపల్‌ కౌన్సిల్‌లో శుక్రవారం ఉదయం 11 గంటలకు మున్సిపల్‌ చైర్మన్‌ ఆసం రఘురామిరెడ్డి అధ్యక్షతన సమావేశం ప్రారంభమైంది. మున్సిపల్‌ కమిషనర్‌ చంద్రమౌళీశ్వర్‌రెడ్డితోపాటు అధికారులందరూ సమావేశానికి హాజరయ్యారు. అయితే ఎంపీ రమేశ్‌ వర్గానికి చెందిన కౌన్సిలర్లు వీఎస్‌ ముక్తియార్, వైస్‌ చైర్మన్‌ జబీవుల్లా, ఉండేల గురివిరెడ్డి, సీతారామిరెడ్డిలతో పాటు 16 మంది గైర్హాజరయ్యారు. అలాగే ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి, వైఎస్సార్‌సీపీ మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ వంగనూరు మురళీధర్‌రెడ్డితోపాటు 9 మంది కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు.
 
క్యాంటీన్‌ నిర్మాణంపై రగడ 
పాత బస్టాండ్‌లో అన్న క్యాంటీన్‌ నిర్మాణ విషయంపై గత కొంత కాలంగా కౌన్సిల్‌లో రగడ జరుగతోంది. 50 ఏళ్ల కిందట నిర్మించిన పాత బస్టాండ్‌ను తొలగించడంతోపాటు రెండు మున్సిపల్‌ గదులు, 40 మందికి పైగా చిరు వ్యాపారులు అన్న క్యాంటీన్‌ నిర్మిస్తే తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ విషయంపై ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి తొలి నుంచి ఆందోళన చేస్తున్నారు. త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పక్కన నిర్మించాలని ఎమ్మెల్యే చెప్పారు. పేదలకు అన్నం పెడతామంటూ పేదల కడుపుకొట్టడాన్ని వైఎస్సార్‌సీపీ వ్యతిరేకిస్తోందన్నారు.
 
21 మంది టీడీపీ కౌన్సిలర్లు మద్దతు 
ఎంపీ రమేశ్‌ వర్గ కౌన్సిలర్లు కూడా అక్కడి చిరువ్యాపారులకు మద్దతు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే మల్లేల లింగారెడ్డితోపాటు 21 మంది కౌన్సిలర్లు త్రీటౌన్‌పోలీస్‌స్టేషన్‌ పక్కన ఉన్న మున్సిపల్‌ స్థలంలోనే అన్నక్యాంటీన్‌ నిర్మించాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రత్యేక రిక్విజియేషన్‌ సమావేశం ఏర్పాటు చేసి తీర్మానం చేశారు. ఈ సమావేశానికి వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు, ఎమ్మెల్యే మద్దతు తెలపడంతో 31 మంది తీర్మానం చేశారు. అయితే మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి కొద్ది రోజుల కిందట రెండు జేసీబీలను తీసుకొచ్చి దగ్గరుండి పాత బస్టాండ్‌ను కూల్చి వేశారు. వ్యాపారుల బంకులను రోడ్డుపైకి నెట్టివేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అప్పటి నుంచి వ్యాపారులను ఖాళీ చేయాలంటూ బెదిరిస్తూనే ఉన్నారు.
 
అజెండాలో 78వ అంశంగా...
శుక్రవారం మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశపు అంజెండాలో పాత బస్టాండ్‌లో అన్నక్యాంటీన్‌ నిర్మించాలని 78వ అంశంగా చేర్చారు. రిక్విజియేషన్‌ సమావేశం తీర్మానం ఉండగా ఎలా ఈ అంశాన్ని అజెండాలోకి తెచ్చారని ఎమ్మెల్యేతోపాటు ఎంపీ రమేశ్‌ వర్గ కౌన్సిలర్లు ప్రశ్నించారు. దీనికి నిరసనగా కౌన్సిల్‌ సమావేశానికి గైర్హాజరయ్యారు. అయితే వరద వర్గానికి చెందిన 11 మంది కౌన్సిలర్లు సమావేశానికి హాజరైనా కోరం లేకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు మున్సిపల్‌ చైర్మన్‌ ప్రకటించారు. చైర్మన్‌ మాట్లాడుతూ సొంత టీడీపీ కౌన్సిలర్లు సమావేశానికి రాకపోవడం చాలా దారుణమని అన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement