సాక్షి, అన్నమయ్య జిల్లా: ముఖ్యమంత్రిగా చంద్రబాబు పాలనలో ప్రతిసారీ రాయలసీమకు అన్యాయమే జరుగుతోందని మాజీ చీఫ్ విప్, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. రాయచోటి ఆ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్ట్ ల నుంచి విద్యాసంస్థల ఏర్పాటు వరకు చంద్రబాబు ఏనాడు ఈ ప్రాంత అభివృద్దిపైన చిత్తశుద్దితో వ్యవహరించలేదని ధ్వజమెత్తారు. తాజాగా రాయచోటి పర్యటన సందర్భంగా సీఎం హోదాలో కొత్త విద్యాసంస్థలు, రాయచోటి నీటికష్టాలకు పరిష్కారంను ప్రకటిస్తారని ఆశించిన ప్రజలకు చంద్రబాబు తీవ్ర నిరాశను మిగిల్చారని అన్నారు.
శ్రీకాంత్‌రెడ్డి ఇంకా ఏమన్నారంటే..:
చంద్రబాబు నిస్సిగ్గు అబద్ధాలు:
చంద్రబాబు అంటేనే చేయాల్సింది చేయడు.. ఇతరులు చేసిందంతా తానే చేసినట్లు ప్రచారం చేసుకోవడం అని అందరికీ తెలుసు. ఈ దేశంలో ఐటీకి తానే మూల పురుషుడుగా, హైదరాబాద్‌కు ఐటీని పరిచయం చేసిన విజనరీగా తనను తాను సిగ్గు లేకుండా పరిచయం చేసుకోవడం ఒక్క చంద్రబాబుకే చెల్లుతుంది. వాస్తవానికి వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయిన తరువాత హైదరాబాద్‌లో ఐటీ రంగం అభివృద్ది చెందింది. గణనీయమైన ఆదాయాన్ని సాధించింది. కానీ చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టేలా తానే ఐటీని కనిపెట్టినట్లు చెప్పుకుంటున్నాడు. చివరికి హైదరాబాద్‌ను సైతం తానే అభివృద్ధి చేసినట్లు చెప్పాడు. నిన్న (శనివారం) ఐటీ ఉద్యోగులను పక్కన పెట్టుకుని రాయచోటిలో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు స్ఫూర్తిదాయకంగా మాట్లాడతారని అందరూ ఆశించారు.
కానీ చంద్రబాబు చెంత ఉన్న ఐటీ ఉద్యోగులు ‘‘మేం తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడ్డాం, మేం సంపాదించినది పార్టీ కోసం ఖర్చు చేశాం, ఎన్నికల్లో పార్టీ ఏజెంట్లుగా కూర్చున్నాం. గ్రామాల్లో మేమే పార్టీ బాధ్యత తీసుకున్నాం’’ చెప్పడం ఆశ్చర్యం కలిగించింది. ఈ ప్రాంతానికి సీఎం వచ్చినప్పుడు ఆయన సమక్షంలో ఒక ఐటీ ఉద్యోగి మాట్లాడే అవకాశం లభించినప్పుడు యువతకు స్పూర్తిదాయకమైన మాటలు చెబుతారని అందరూ భావించారు. కానీ దానిని కూడా పార్టీ ప్రచారానికి వాడుకోవడం విడ్డూరంగా ఉంది. దానికి తగినట్లుగా చంద్రబాబు మండల స్థాయిలోనే ఐటీ టవర్స్ నిర్మిస్తాను, వర్క్ ఫ్రం హోంను కూడా తానే కనిపెట్టినట్లు చంద్రబాబు చెప్పే మాటలు వింటే మరింత ఆశ్చర్యం కలిగించింది.
స్థానిక సమస్యలపైన ఎందుకు మాట్లాడలేదు?:
వైఎస్ జగన్ హయాంలో రాయచోటి ప్రజలకు నీటి కష్టాలు తప్పించేందుకు శ్రీశైలం రిజర్వాయర్ లో నీరు తగ్గిపోయినా కూడా ప్రత్యామ్నాయంగా గండికోటలో నిల్వ చేసిన నీటిని వాడుకునేందుకు ప్రణాళిక సిద్దం చేశాం. కాలేటివాగును ఒక టీఎంసీకి అభివధ్ధి చేసి, అక్కడి నుంచి వెలిగల్లుకు నీటిని పంపించేందుకు వీలుగా పనులకు శ్రీకారం చుట్టాం. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే డెబ్బై శాతం పనులు కూడా పూర్తి చేశాం. దాని మిగిలిన పనులను పూర్తి చేస్తామని చంద్రబాబు తన పర్యటనలో ఒక్క మాట కూడా చెప్పలేదు.
రాయచోటి ప్రాంతానికి వచ్చిన సందర్భంగా ఒక్క విద్యాసంస్థను కూడా ప్రకటించలేదు. మహిళా జూనియర్ కాలేజీ, మహిళా డిగ్రీ కాలేజీ, రెండో ఇంజనీరింగ్ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీలను వైఎస్సార్, వైఎస్ జగన్ హయాంలో సాధించుకున్నాం. రాయచోటిలో కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీ కోసం ఇప్పటికే 80 ఎకరాలు భూమిని కూడా సేకరించి సిద్దంగా ఉంచాం. ఈ కాలేజీని ప్రైవేటీకరించ వద్దంటూ విద్యార్ధులు ప్రశ్నిస్తే, వారిని సంఘ విద్రోహశక్తులు అంటూ నిందిస్తారా? యూనివర్సిటీకి నిధులు, కొత్త కలెక్టరేట్ భవనాలు, గండికోట నుంచి నీటని అందించే ప్రాజెక్ట్ వంటి వాటిపై చంద్రబాబు మాట్లాడతారని అందరూ అనుకున్నారు.
కానీ ఎప్పటిలాగానే చంద్రబాబు తన నిజస్వరూపాన్ని చాటుకున్నారు. ఈ ప్రాంత ప్రజలను మోసగించారు. మభ్యపెట్టే మాటలతో ప్రజలను వంచించారు. కర్నూలులో శాశ్వత హైకోర్ట్ కావాలంటే, దానికి బదులుగా బెంచ్ తో సరిపెట్టారు. కొప్పర్తి పారిశ్రామికవాడను ఆనాడు వైయస్‌ఆర్, ఆ తరువాత వైఎస్ జగన్ ప్రత్యేక సెచ్‌గా అభివద్ధి చేశారు. దీనిని మరింత ముందుకు తీసుకువెళ్ళేందుకు చంద్రబాబు చొరవ చూపాలి. చేసింది చెప్పాలే కానీ.. జరిగిందంతా తానే చేసినట్లు చెప్పుకోవడం సరికాదు.
గ్రామాల్లోనూ నాడు ఐటీకి ప్రాధాన్యం:
సీఎంగా వైఎస్ జగన్ గ్రామీణ ప్రాంతాల్లో ఉంటూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు పనులు చేసుకోవాలనే ఆలోచనతో గ్రామ స్థాయిలో డిజిటల్ లైబ్రరీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. దానిని కొనసాగించకుండా చంద్రబాబు ఆ నిర్మాణాలను అర్థాంతరంగా నిలిపివేశారు. ఇప్పుడు మండల స్థాయిలో ఐటీ టవర్స్ నిర్మిస్తానని చెప్పడం చంద్రబాబు రెండు నాలుకల ధోరణికి, ద్వంద వైఖరికి నిదర్శనం.
సంపద సృష్టించడం గురించి ప్రజలకు చెప్పడం కాదు, వారు సంపద సృష్టించుకునేలా ప్రభుత్వం పని చేయాలి. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం ఆదుకోవాలి. కరోనా సమయంలో ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారిని ముఖ్యమంత్రిగా ఆదుకున్నది వైఎస్ జగన్. ఈ రోజు అన్ని అవకాశాలు ఉన్నా, కేంద్రంలో భాగస్వామిగా ఉండి కూడా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయడం లేదు. 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామన్నారు. ఈ ఎనిమిది నెలల్లో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కోటిన్నర మందికి పైగా అర్హులైన మహిళలు చంద్రబాబు ఇచ్చిన హామీని ఎప్పుడు నెరవేరుస్తారని ప్రశ్నిస్తున్నారు. యాబై ఏళ్ళు దాటిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెన్షన్ ఇస్తామన్నారు. నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేలు ఇస్తామన్నారు. ఈ ఏడాది రైతుభరోసా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు.
సాగునీటి ప్రాజెక్ట్‌లపై అడుగడుగునా నిర్లక్ష్యం:
చంద్రబాబు ఏనాడూ తన హయాంలో సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వలేదు. ఉమ్మడి రాష్ట్రంలో 9 ఏళ్లు సీఎంగా ఉన్నా, ఆయన ఏ ప్రాజెక్టూ చేపట్టలేదు. హంద్రీనీవా, గాలేరు–నగరి ప్రాజెక్టులకు ఎన్టీఆర్ శంకుస్థాపన చేస్తే, తరువాత దానికి ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా ఆ ప్రాజెక్టులు వృథా అని మాట్లాడారు. హంద్రీనీవా నుంచి 40 టీఎంసీలు రావు. కేవలం 5 టీఎంసీల నీరే వస్తాయని ఏకంగా జీఓ ఇచ్చారు. అలాగే గండికోటను 20 టీఎంసీల నుంచి 3 టీఎంసీలకు కుదించి జీఓ ఇచ్చారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయిన తరువాత జలయజ్ఞంలో హంద్రీనీవా ప్రాజెక్ట్‌ను ఐదేళ్లలో అడివిపల్లి వరకు 90 శాతం కాలువ పనులు పూర్తి చేశారు. 27 టీఎంసీల సామర్థ్యంతో కూడిన గండికోట ప్రాజెక్ట్, దానిలో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేసిన ఘనత వైఎస్ జగన్‌ది. చంద్రబాబు పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా కృష్ణా బ్యారేజీ వద్ద టీడీపీ వారితో ధర్నాలు చేయించారు.
ఆనాడు వైఎస్ రాజశేఖరరెడ్డి పుణ్యం వల్లే పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమకు నీరు అందుతోంది. ఏడు నెలలు ఇన్ ఫ్లో ఉన్న కష్ణానదిలో ఈ రోజు డెడ్ స్టోరేజీ స్థాయికి నీటిని తోడేశారు. రాయలసమీకు ఎలా నీరు ఇస్తారో చంద్రబాబు చెప్పాలి. గతంలో పట్టిసీమ నుంచి రాయలసీమకు నీరు ఇస్తానంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. ఎలా ఇస్తారో చెప్పండి అంటే దానిపై మాట్లాడరు.
ఇదీ చదవండి: నిందితుడిది పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటా.. పవన్ నోరు మెదపరేం?
ఇప్పుడు కొత్తగా బనకచర్ల అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. బనకచర్ల క్రాస్ నుంచి సరైన అవగాహన చంద్రబాబుకు లేదు. దీనిని ఎలా పూర్తి చేస్తారో చంద్రబాబు చెప్పగలరా? రాష్ట్ర ప్రజలకు కీలకమైన పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు కుదిస్తున్నా చంద్రబాబు మాట్లడటం లేదు. పోలవరం నుంచి కష్ణా బ్యారేజీకి, అక్కడి నుంచి ప్రకాశం జిల్లాకు, అక్కడి నుంచి వెలుగొండ ద్వారా బనకచర్ల క్రాస్ కు నీటిని తరలిస్తారో సరైన ప్రణాళిక ఉందా?
ఫీజు పోరు పోస్టర్ ఆవిష్కరణ:
మీడియా సమావేశం అనంతరం ఈనెల 5న పార్టీ తలపెట్టిన ఫీజు పోరు పోస్టర్‌ను పార్టీ సీనియర్ నేత ఆకెపాటి అమర్నాథ్‌రెడ్డితో కలిసి గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆకెపాటి అమర్నాధ్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ ఎనిమిది నెలల పాలనలో ప్రజలకు ఉపయోగపడే ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు. ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించారు. రైతుసమస్యలు, పెంచిన విద్యుత్ చార్జీలపై వైఎస్సార్‌సీపీ ఇప్పటికే ఆందోళనలు చేసింది.
తాజాగా విద్యార్ధులకు సకాలంలో చెల్లించాల్సిన ఫీజు, స్కాలర్ షిప్ బకాయిలను కూడా చెల్లించకుండా విద్యార్ధుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. ప్రతి పేద విద్యార్ధి చదువుకోవాలని ఆనాడు స్వర్గీయ వైయస్ రాజశేఖరరెడ్డి గారు ఫీజు రీయింబర్స్ మెంట్ ను ప్రవేశపెట్టారు. దీనితో ఎందరో ఐటీ నిపుణులుగా, ప్రోఫెషనల్ కోర్స్ లతో తమ జీవితాలను మెరుగుపరుచుకున్నారు. నేడు చంద్రబాబు పేద, మధ్యతరగతి విద్యార్ధుల ఆశలపై నీళ్ళు చల్లుతున్నారు. విద్యార్ధులకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్ బకాయిలు చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీనిని వ్యతిరేకిస్తూ విద్యార్ధులు, వారి తల్లిదండ్రుల పక్షాన ఈ నెల అయిదో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళలను చేపడుతున్నాం.
Comments
Please login to add a commentAdd a comment