దమ్మాయిగూడ చైర్‌పర్సన్‌పై కలెక్టరేట్‌లో అవిశ్వాసం నోటీసును అందజేస్తున్న కౌన్సిలర్లు
అధికార పార్టీ బీఆర్‌ఎస్‌లో తిరుగుబాటు జెండా ఎగురుతోంది. నగర పాలక సంస్థ, మున్సిపాలిటీల్లో సొంత పార్టీ మేయర్లు, చైర్మన్ల పైనే అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నోటీసులు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌కు అందజేయడం ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.
సాక్షి, మేడ్చల్ జిల్లా: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో 13 పురపాలక సంఘాలు ఉండగా, మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు ఆయన ఆదేశాలను బేఖాతరు చేస్తూ.. కలెక్టర్‌కు అవిశ్వాసం నోటీసులు సమర్పించడంపై బీఆర్‌ఎస్ కేడర్‌ను తీవ్ర అయోమయానికి గురిచేస్తోంది. సొంత బంధువులు ప్రాతినిధ్యం వహిస్తున్న పురపాలక సంఘాల్లో కూడా కౌన్సిలర్లు మంత్రి మల్లారెడ్డి గీత దాటడంతో పాటు విపక్షాలతో చేతులు కలపడం వంటి విషయాలు రాజకీయ వర్గాలను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
రాష్ట్రంలోనే అత్యధిక పురపాలక సంఘాలు కలిగిన శాసన సభా నియోజకవర్గంగా మేడ్చల్‌కు పేరుంది. ఇక్కడనే స్థానిక ఎమ్మెల్యే, మంత్రి మల్లారెడ్డి ఆదేశాలను బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు పాటించక పోవడంతో పట్టును కోల్పోతున్నారన్న చర్చ పార్టీ వర్గాల్లో వ్యక్త మవుతోంది. అలాగే మేడ్చల్ నియోజకవర్గంలోని పలు పురపాలక సంఘాలకు చెందిన డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కూడా అదే పార్టీకి చెందిన మేయర్లు, చైర్మన్లపై అవిశ్వాసం నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ విషయాన్ని పసిగట్టిన మంత్రి మల్లారెడ్డి వివిధ మార్గాల ద్వారా అసమ్మతి వాదులను బుజ్జగించే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం. బుధవారం ‘మన ఊరు–మన బడి’ కింద మరమ్మతులు పూర్తయిన ప్రభుత్వ పాఠశాలల భవనాల ప్రారం¿ోత్సవానికి హాజరైన మంత్రి మల్లారెడ్డి పోచారం, పీర్జాదిగూడ, బోడుప్పల్ పురపాలక సంఘాల్లోని అసమ్మతి వాదులతో సమావేశమై.. బుజ్జగింపుల పర్వానికి తెర లేపినట్లు తెలుస్తోంది.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కూడా...
మంత్రి మల్లారెడ్డిపై దాదాపు నెల రోజుల కిందట మల్కాజిగిరి ఎమ్మెల్యే, సీనియర్ బీఆర్‌ఎస్ నేత మైనంపల్లి హన్మంతరావు ఇంట్లో సమావేశమైన జిల్లాకు చెందిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు పలు ఆరోపణలతో తిరుగుబావుటా ఎగురవేసిన విషయం తెల్సిందే. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలను ఖాతరు చేయకుండా నామినేటెడ్ పదవులను మంత్రి మల్లారెడ్డి సొంత నియోజకవర్గం వారికి కట్టబెట్టారని ఎమ్మెల్యేలు ఆరోపించారు.
అలాగే తమ నియోజక వర్గాల్లో అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపు విషయంలో కలెక్టర్‌ను మంత్రి పక్కదారి పట్టిస్తున్నారని ఎమ్మెల్యేలు విమర్శిస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి వ్యవహార శైలిపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యేలు అప్పట్లోనే మీడియా సమావేశంలో ప్రకటించారు.
జవహర్‌నగర్ బాటలో మరికొన్ని..
మేడ్చల్ నియోజకవర్గంలోని జవహర్‌నగర్ కార్పొరేషన్ మేయర్ మేకల కావ్యపై 20 మంది కార్పొరేటర్లు ఇటీవల కలెక్టర్‌కు అవిశ్వాస నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. మేడ్చల్ మున్సిపల్ చైర్మన్ మర్రి దీపికపై 15 మంది కౌన్సిలర్లు అవిశ్వాసం తీర్మానానికి సంబంధించిన నోటీసు కలెక్టర్ కార్యాలయంలో అందజేశారు.
తెలంగాణ మున్సిపాలిటీ యాక్ట్ 2019 సె క్షన్ 37 అనుసరించి నో కాన్ఫిడెన్స్ మోషన్ పిటిషన్ చైర్మన్‌కు వ్యతిరేకంగా సమర్పిస్తున్నట్లు వారు నోటీసులో పేర్కొన్నారు. మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మరో 4 పురపాలక సంఘాలకు చెందిన అధికార బీఆర్‌ఎస్‌కు చెందిన అ మ్మతి కార్పొరేటర్లు, కౌన్సిలర్లు అవిశ్వాసం నోటీసులు కలెక్టర్ కు అందజేసేందుకు సిద్ధమవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment