సాక్షి, హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిపక్షాలు దిగజారుడు రాజకీయాలు చేశాయని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్, మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌నే గెలిపించారని మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ చాలా చోట్ల కుమ్మక్కయ్యారని ఆరోపించారు. మక్తల్, మణికొండ, తుర్క యంజాల్‌లో బీజేపీ-కాంగ్రెస్ అపవిత్ర పొత్తు పెట్టుకున్నాయని విమర్శించారు. పేరుకు మాత్రం ఢిల్లీ పార్టీలని, చేసేవి గల్లీ పనులు అని ఎద్దేవా చేశారు. ఒక్క మున్సిపాలిటీ కోసం రెండు జాతీయ పార్టీలు పొత్తు పెట్టుకోవడం సిగ్గు చేటన్నారు.
(చదవండి : తెలంగాణ: మున్సిపల్ చైర్మన్లు వీరే)
120 స్థానాల్లో 112 స్థానాలను టీఆర్‌ఎస్ సాధించిందని, పదికి పది కార్పొరేషన్లు గెలవడం అనితరసాధ్యమని మంత్రి అన్నారు. కరీనగర్‌లో కూడా టీఆర్‌ఎస్ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మేడ్చల్, నేరేడుచర్లలోనూ తమకు సంపూర్ణ మెజార్టీ ఉందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు టీఆర్‌ఎస్‌నే గెలిపించారని, దేశానికే ఆదర్శవంతమైన పట్టణాలను తయారు చేస్తామని కేటీఆర్ స్పష్టం చాశారు.
కొత్తగా ఎన్నికైన 130 మంది చైర్మన్లకు కొత్తగా తీసుకువచ్చిన మున్సిపల్ చట్టంపై శిక్షణ అందిస్తామన్నారు. పల్లె ప్రగతి మాదిరే త్వరలోనే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపడతామని మంత్రి వెల్లడించారు. మున్సిపాలిటీలకు కేంద్రం నుంచి రూ.1037 కోట్లు వస్తే అంతే మొత్తంలో నిధులను రాష్ట్రం నుంచి కేటాయిస్తామన్నారు. కేంద్రం, రాష్ట్ర నిధులు కలిపి మొత్తంగా రూ.2074 కోట్లు వస్తాయని, దానిని ప్రతి నెల రూ.173 కోట్ల చొప్పున మున్సిపాలిటీలకు అందిస్తామన్నారు.
మున్సిపాలిటీల్లో జవాబుదారీ తనాన్ని తీసుకొస్తామన్నారు. సక్రమంగా పనిచేయని వారిని పదవి నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. అన్ని మున్సిపాలిటీల్లో డిజిటల్ డోర్ నెంబర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment