మాట్లాడుతున్న శశిధర్‌రెడ్డి
సాక్షి, కోదాడ : కోదాడ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఉంటానని నియోజకవర్గ ఇన్‌చార్జి కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్ టికెట్ మల్లయ్యకు ఇస్తున్నారనే సమాచారం మేరకు ఆదివారం ఆయన అనుచరులతో కలిసి సూర్యాపేటలోని మంత్రి ఇంటి ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ మెరకు మంత్రి తనకు ఎటువంటి సంబంధం లేదని, పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుందని చెప్పడంతో వారు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. అనంతరం కోదాడ వచ్చి ఆయన పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి పార్టీ తనకే టికెట్ ఇస్తుందని, సోమవారం నామినేషన్ వేస్తానని ప్రకటించారు. కానీ సాయంత్రానికి పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కోదాడ టికెట్‌ను బొల్లం మల్లయ్యకు ఇస్తున్నట్లు ప్రకటించడంతో టీఆర్‌ఎస్ కార్యాలయంలో విషాదం నెలకొంది.
చందర్‌రావు నివాసంలో సంబరాలు..
టికెట్ బొల్లం మల్లయ్య యాదవ్‌కు ప్రకటించడంతో ఆయన చందర్‌రావు ఇంటికి వెళ్లి అక్కడ మిఠాయిలు పంచుకున్నారు. కోదాడ మున్సిపల్ చైర్‌పర్సన్ వంటిపులి అనిత తదితరులు స్వీట్లు పంచారు. అనంతరం మల్లయ్య పార్టీ కార్యాలయంలో ఉన్న శశిధర్‌రెడ్డి వద్దకు రావడంతో పలువురు కార్యకర్తలు టికెట్ వద్దని చెప్పాలని మల్లయ్యను పట్టుబట్టారు.
ఆస్తులు ఆమ్ముకొని పార్టీని బతికించాను.
కోదాడ నియోజకవర్గంలో 2010 నుంచి పార్టీ కోసం ఆస్తులను ఆమ్మి కష్టపడ్డానని చెప్పారు. రెండు రోజుల క్రితం బొల్లం మల్లయ్యను పార్టీలో చేర్చుకోవాలని పార్టీ చెపితే నాలుగు లక్షల రూపాయల ఖర్చు పెట్టి హైదరాబాద్‌కు తీసుకెళ్లానన్నారు. తనకు సమాచారం ఇవ్వకుండా ఇతరులకు టికెట్ ఇస్తామనడం అన్యాయమన్నారు. తాను సోమవారం నామినేషన్ దాఖలు చేస్తానని, జరిగిన అన్యాయం ఇంటింటికి తిరిగి చెపుతానని నియోజకర్గ ప్రజలు తనను ఆదరిస్తారనే నమ్మకం తనకు ఉందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment