పెచ్చెట్టి విజయలక్ష్మి దంగేటి విజయగౌరి
తూర్పుగోదావరి, అమలాపురం టౌన్: పట్టణ మున్సిపల్ చైర్మన్ పదవికి జరిగిన జెంటిల్మన్ ఒప్పందం అమలు పట్టణ టీడీపీకి తలకు మించిన భారమైంది. ఆ ఒప్పందం అమలుకు వెసులుబాటు కల్పిస్తూ అప్పటి దాకా పదవుల్లో ఉన్న చైర్మన్, వైస్ చైర్మన్లు రాజీనామాలు చేయడం.. ఈనెల 11న కొత్త చైర్మన్ అభ్యర్థి, నాలుగో వార్డు కౌన్సిలర్ యాళ్ల నాగ సతీష్ చైర్మన్ పీఠం ఎక్కేందుకు ఎన్నికల సంఘం తేదీ ప్రకటించడంతో అక్కడితో కథ సుఖాంతమైందని అందరూ అనుకున్నారు. అయితే వైస్ చైర్‌పర్సన్ ఎంపిక పట్టణ టీడీపీలోనే కాదు.. మున్సిపల్ కౌన్సిల్‌లో కూడా తలనొప్పి వ్యవహారంగా తయారైంది. జెంటిల్మన్ ఒప్పందం అమలు నేపథ్యంలో ఇప్పటికే పట్టణ టీడీపీ, కౌన్సిల్‌లో రెండు వర్గాలు అనివార్యమయ్యాయి. తాజాగా ఆ రెండు వర్గాలు వైస్ చైర్‌పర్సన్ ఎంపికపై మల్లగుల్లాలు పడుతున్నాయి. ఈ ఎంపికలో తమ పట్టు నిలబెట్టు కోవాలని రెండు వర్గాలూ పావులు కదుపుతున్నాయి.
ఎవరి వాదన వారిది
కాబోయే చైర్మన్ అభ్యర్థి నాగ సతీష్ వర్గం వైస్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా జెంటిల్మన్ ఒప్పందం అమలు కోసం తొలుత రాజీనామా చేసిన వైస్ చైర్‌పర్సన్ పెచ్చెట్టి విజయలక్ష్మినే ప్రకటించాలని నిర్ణయించుకుంది. అలాగే మాజీ చైర్మన్ గణేష్ వర్గం 23వ వార్డు కౌన్సిలర్ దంగేటి విజయగౌరిని వైస్ చైర్‌పర్సన్ చేయాలని పట్టుబడుతోంది. వీరినే ఎందుకు వైస్ చైర్‌పర్సన్ చేయాలనే అంశంపై ఇరు వర్గాలకు చెందిన నాయకులు ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. అసలు జెంటిల్మన్ ఒప్పందం అమలుకు వెసులబాటు కల్పిస్తూ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకుండా స్వచ్ఛందంగా తన వైస్ చైర్‌పర్సన్ పదవికి రాజీనామా చేసిన పెచ్చెట్టి విజయలక్ష్మిని మళ్లీ అదే పదవిలో కూర్చోబెట్టడం సమంజసమని నాగ సతీష్ వర్గం స్పష్టం చేస్తోంది. పైపెచ్చు కౌన్సిల్ తొలి చైర్మన్ యాళ్ల మల్లేశ్వరరావు మరణం తర్వాత వైస్ చైర్‌పర్సన్‌గా ఉన్న ఆమె ఇన్‌ఛార్జి చైర్‌పర్సన్‌గా బాధ్యతలు కూడా కొన్ని నెలల పాటు చేపట్టారు. ఇదే కౌన్సిల్‌లో ఇన్‌చార్జి చైర్‌పర్సన్‌గా, వైస్ చైర్‌పర్సన్‌గా రెండు పదవులు చేపట్టిన ఆమెకు అంతే గౌరవం ఇస్తూ తిరిగి వైస్ చైర్‌పర్సన్ పదవి ఇవ్వడం సముచితమని నాగ సతీష్ వర్గం పేర్కొంటోంది. గణేష్ వర్గం మరో వాదన వినిపిస్తోంది. విజయలక్ష్మి ఇప్పటికే ఇదే కౌన్సిల్‌లో చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ పదవులు చేపట్టారు. ఇప్పుడు ఆమె సామాజిక వర్గానికి చెందిన 23వ వార్డు కౌన్సిలర్ విజయగౌరికి కొత్తగా అవకాశం ఇస్తే పార్టీలో మహిళా కౌన్సిలర్లకు తగిన ప్రాధాన్యం ఇచ్చినట్టు ఉంటుందని గణేష్ వర్గం అంటోంది. ఈ రెండు వర్గాలు వైస్ చైర్‌పర్సన్ ఎన్నికలో పైకి ఎవరి వాదన వారు వినిపిస్తున్నా ఆధిపత్య పోరు కోసం.. తమ మాటే చెల్లుబాటు కావాలన్న తాపత్రయంతో పావులు కదుపుతున్నాయన్నది వాస్తవం.
ప్యానల్ చైర్మన్ ఎంపికలా కాకూడదని ప్రతివ్యూహం
చైర్మన్ పదవికి గణేష్ రాజీనామా చేసిన తర్వాత ఆయన రాజీనామాను ఆమోదించేందుకు గత నెల 27న నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో ప్యానల్ చైర్మన్ కమిటీలో ఉన్న నలుగురులో ఒకరిని ప్యానల్ చైర్మన్‌గా చేయాల్సి వచ్చినప్పుడు గణేష్ వర్గం మాటే చెల్లుబాటైంది. ఆ ప్యానల్ కమిటీలో ప్రాధాన్య క్రమ సంఖ్యలో రెండో స్థానంలో ఉన్న 12వ వార్డు కౌన్సిలర్ వెలిగట్ల రామలక్ష్మణరావు పేరు ఉన్నా నాలుగో సంఖ్యలో ఉన్న 27వ వార్డు కౌన్సిలర్ గంపల నాగలక్ష్మికి ప్యానల్ చైర్‌పర్సన్‌గా ఆమెను చైర్మన్ పీఠంపై కూర్చోబెట్టడంలో గణేష్ వర్గం సఫలీకృతమైంది. అప్పుడు కూడా కౌన్సిల్, పట్టణ టీడీపీలో భిన్నాభిప్రాయాలు, అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈనెల 11న జరిగే వైస్ చైర్‌పర్సన్ ఎన్నిక ప్యానల్ చైర్మన్ ఎంపికలా కాకూడదని.. కానివ్వబోమని నాగ సతీష్ వర్గం బలమైన నిర్ణయానికి వచ్చింది. అందుకు ప్రతి వ్యూహ రచనలో ఉంది. ఈ విషయంలో మాజీ చైర్మన్ గణేష్ వర్గం మాటకు పట్టణ టీడీపీ మద్దతు పలుకుతుందా? నాగ సతీష్ వర్గం ప్రతిపాదనకు విలువ ఇస్తుందా? అనేది వేచి చూడాల్సిందే. అయితే ఆది నుంచి జెంటిల్మన్ ఒప్పందం అమలు బాధ్యతను ఉప ముఖ్యమంత్రి చిన రాజప్ప సూచనతో భుజాన వేసుకున్న రాష్ట్ర గిడ్డంగుల సంస్థ డైరెక్టర్ మెట్ల రమణబాబు మాటే వైస్ చైర్‌పర్సన్ ఎన్నికలో శిరోధార్యం కానుంది. ఆయన వర్గ పోరుకు ప్రాధాన్యం ఇచ్చి ఓ వర్గానికి కొమ్ము కాసినట్టు వ్యవహరిస్తారో, వాస్తవ పరిస్థితులకు విలువ ఇచ్చి తనకు అప్పగించిన బాధ్యతలను విజ్ఞతతో నిర్వర్తిస్తారో ఎదురు చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment