నేడే వైఎస్ జగన్ రాక
♦ కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారానికి ఆయన రాకతో మరింత జోష్
♦ ఇప్పటికే రాష్ట్రనేతలతో విస్తృత ప్రచారం
♦ నేటి రోడ్ షో, సభలకు వైఎస్సార్‌సీపీ పకడ్బందీ ఏర్పాట్లు
కాకినాడ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచార హోరుకు ఆదివారంతో తెర పడనున్న నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రచారానికి వస్తున్నందున ప్రతిపక్ష పార్టీ అభ్యర్థుల్లో మరింత ఊపు పెంచనుంది. 12 రోజులపాటు సాగిన ప్రచార పర్వంలో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులు హోరా హోరా హోరీగా తలపడ్డారు. అధికార దర్పం, అర్థ బలాన్ని ప్రధానంగా ప్రదర్శించడంతోపాటుగా అందుబాటులోఉన్న అధికార యంత్రాంగాన్ని భారీ ఎత్తున దుర్వినియోగం చేస్తూ టీడీపీ ప్రచారం చేస్తూ ఉంటే ప్రజాభిమానం, వారి ఆదరణతోనే వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులు ముందుకెళుతున్నారు.
ముఖ్యమంత్రిగా గద్దెనెక్కి మూడేళ్లు పూర్తయిన తరుణంలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో చంద్రబాబునాయుడు మళ్లీ పాత హామీలనే కాకినాడ వాసులపై గుప్పిస్తున్నాడు. ఏ ఊరెళితే ఆ ఊరును ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తానని ఈ మూడేళ్లలో కాలక్షేపం చేసిన చంద్రబాబు మళ్లీ కాకినాడ ప్రజలను హామీలతో నమ్మించే యత్నం చేస్తున్నారు. చంద్రబాబు మంత్రివర్గంలోని సీనియర్ మంత్రి యనమల రామకృష్ణుడు, కీలక మంత్రి నిమ్మకాయల చినరాజప్ప కొద్ది రోజులుగా ఇక్కడే తిష్ట వేసి అధికార పార్టీ వ్యూహాన్ని రచిస్తున్నారు. ప్రచారం ముగియడానికి రెండు రోజుల ముందు కాకినాడకు వచ్చిన చంద్రబాబు తొలి రోజున తన సుడిగాలి పర్యటనలో ఈ మూడేళ్లలో తానెందుకు చెప్పింది చేయలేక పోయారో అనే అంశంపై వివరణ ఇవ్వకపోగా పాతవాటినే వల్లెవేశారు.
ఇక ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ తరపున ఎన్నికల సంరంభం మొదలైన నాటి నుంచీ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి, ముఖ్య నేతలు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ ఇక్కడే ఉంటూ పకడ్బందీగా ప్రచారాన్ని నడిపిస్తున్నారు. చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి నినాదంలోని డొల్ల తనాన్ని వారు ఎండగడుతున్నారు.మూడేళ్లలో చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చలేదని సభల్లో నిలదీస్తున్నారు. విభజన తరువాత అన్ని విధాలా నష్ట పోయిన ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ఏ రకమైన అవినీతి, అసమర్థ పాలనను అందిస్తున్నారో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ విమర్శిస్తోంది. పార్టీ నేత ప్రచారానికి తోడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం ఉదయం నుంచీ నగరంలో సుడిగాలి పర్యటన చేయనున్నారు.
టీడీపీ పాలన ఎంత అప్రజాస్వామికమైందో ఆయన కాకినాడ ప్రజలకు తెలియ జేయనున్నారు. రాజధాని మొదలు పట్టిసీమ వరకూ ఏ విధంగా అవినీతికి పాల్పడుతున్నారో చెప్పడంతో పాటుగా ఎన్నికలపుడు ప్రజలకు చంద్రబాబు ఇచ్చిన హామీలను ఏ విధంగా తుంగలో తొక్కారో వివరించనున్నారు. వాస్తవానికి జగన్ పర్యటన రెండు రోజుల పాటు శని, ఆదివారాల్లో జరుగాల్సి ఉంది.అయితే నంద్యాల ఉప ఎన్నికల పర్యటనలో ఏకబిగిన 13 రోజుల పాటు విస్తృతంగా పర్యటించిన తరువాత ఆయన అనారోగ్యానికి గురయ్యారు.
పూర్తి స్వస్థత చేకూరక పోవడంతో శనివారం నాటి పర్యటన మాత్రం రద్దయింది. జగన్ ఇంకా కోలుకోనప్పటికి చివరి రోజున ప్రచారానికి వెళ్లాల్సిందేనన్న కృత నిశ్చయంతో ఆయన కాకినాడకు వస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. చివరి రోజున ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత ఇద్దరూ ప్రచార సమరంలో పాల్గొంటూ ఉండటంతో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం మరింత వాడిగా వేడిగా ఉండటంతో పాటుగా పతాకస్థాయికి చేరుకోనుంది.