ఆగిన మైకులు.. ముగిసిన ప్రచార భేరి! | Election Campaign Ends In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఆగిన మైకులు.. ముగిసిన ప్రచార భేరి!

Published Tue, Apr 9 2019 6:00 PM | Last Updated on Tue, Apr 9 2019 9:45 PM

Election Campaign Ends In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వేసవి ఎండలను మించి వాడీవేడిగా సాగిన ఎన్నికల ప్రచార హోరుకు తెరపడింది. 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికల ప్రచార గడువు మంగళవారం సాయంత్రం 6 గంటలతో ముగిసింది. ఇప్పటివరకు హోరెత్తిన మైకులు మూగబోయాయి. ప్రచార కోలాహలం సద్దుమణిగడంతో.. ఇక, పార్టీలన్నీ 11వ తేదీన జరగనున్న పోలింగ్‌ ప్రక్రియపై దృష్టి సారించాయి. అందుకు తగిన ఏర్పాట్లలో తలమునకలయ్యాయి.

ప్రచారపర్వంలో ముందున్న వైఎస్సార్‌సీపీ
ఎన్నికల ప్రచారపర్వంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆసాంతం ముందంజలో నిలిచింది. గత ఐదేళ్ల నుంచి జననేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిత్యం ప్రజల మధ్యే ఉన్నారు. 3,648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర ద్వారా రాష్ట్రంలోని మూలమూలకు, మారుమూల గ్రామాలకు వెళ్లి.. ప్రజలతో మమేకమై.. వారి కష్టనష్టాలు తెలుసుకున్న వైఎస్‌ జగన్‌.. పాదయాత్ర సాగని నియోజకవర్గాల్లో తాజగా విస్తారంగా ప్రచారం నిర్వహించారు. సుడిగాలి పర్యటనలతో మొత్త 13 జిల్లాల్లో కలిపి 68 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార సభలు నిర్వహించారు. మంగళవారం మూడు జిల్లాల్లో పర్యటించిన వైఎస్‌ జగన్‌.. మంగళవారం ఉదయం మంగళగిరిలో, మధ్యాహ్నం కర్నూలులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చివరగా  శ్రీ వేంకటేశ్వరస్వామి పుణ్యక్షేత్రమైన తిరుపతిలో ఎన్నికల సభ నిర్వహించి.. ప్రచార పర్వాన్ని  జననేత దిగ్విజయంగా ముగించారు. మరోవైపు వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ, ఇంకోవైపు జగన్‌ సోదరి షర్మిల కూడా విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైఎస్‌ విజయమ్మ మొత్తం 27 ఎన్నికల సభల్లో ప్రచారం నిర్వహించగా.. షర్మిల 36 ఎన్నికల సభల్లో ప్రచారం చేశారు. మంగళవారం విజయమ్మ డోన్‌, ఆళ్లగడ్డలో ఎన్నికల సభలు నిర్వహించి ప్రచారాన్ని ముగించగా.. షర్మిల కృష్ణాజిల్లా విజయవాడ పశ్చిమ, మైలవరం, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు. ​

ఉధృతంగా, హోరాహోరీగా ప్రచారం సాగించిన ప్రతిపక్ష నేత జగన్, విజయమ్మ, షర్మిల తమ ప్రసంగాల్లో.. తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తామో స్పష్టంగా చెబుతూనే, మరోవైపు చంద్రబాబు గత ఎన్నికల హామీలను అమలుచేయకుండా ఎలా మోసం చేశారో వివరిస్తూ ప్రజల్ని ఆలోచింపజేశారు. ముగ్గురు నేతలు ఎన్నికల ప్రచార సభల్లో చేసిన ప్రసంగాలపై అన్ని వర్గాల ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. మరోవైపు చంద్రబాబు మాత్రం ఐదేళ్ల తన పాలనాకాలంలో తాను చేసిన పనులను చెప్పకుండా కేవలం ప్రతిపక్ష నేతపై వ్యక్తిగత దూషణలకు దిగారు. అంతేకాక.. లేని పొత్తులు ఉన్నట్లుగా చూపి వైఎస్సార్‌సీపీపై అసత్య ఆరోపణలకు ప్రాధాన్యమిస్తున్నారు. ఇదే సమయంలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన వాగ్దానాలను అమలుచేశాకే వచ్చే ఎన్నికల్లో ఓట్లడుగుతానని చెప్పడంపై అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభిస్తోంది. మరోవైపు.. చంద్రబాబు చెబుతున్న అసత్యాలను ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ తల్లి విజయమ్మ సూటిగా ప్రశ్నించడాన్ని రాజకీయ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. చంద్రబాబు ఎలా అబద్ధాలు చెబుతున్నారో ప్రజల్ని ఆలోచింపచేసేలా మాట్లాడుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నిరుద్యోగులను ఆకట్టుకునేలా షర్మిల ప్రసంగాలు సాగాయి.

సీఎం సభలు పేలవం.. జగన్‌ సభలకు పోటెత్తిన జనం
ఎన్నికల ప్రచారం సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రచార సభలు పేలవంగా.. ఎటువంటి స్పందన లేకుండా కొనసాగాయి. మరోవైపు ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డితోపాటు ఆయన తల్లి విజయమ్మ, సోదరి షర్మిల సభలకు జనం పోటెత్తడమేగాక వారి ప్రసంగాలకు విశేష స్పందన లభించింది. గతంలో పార్టీ ప్లీనరీలో ప్రకటించిన నవరత్నాలతోపాటు పాదయాత్ర ద్వారా ప్రజల నుంచి వచ్చిన సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుని ఆచరణ సాధ్యమైన హామీలతో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రణాళికలో సూటిగా, చాలా స్పష్టంగా చెప్పడాన్ని విద్యావంతులతోపాటు అధికార వర్గాలు మెచ్చుకుంటున్నాయి. ప్రభుత్వ రంగాన్ని ప్రోత్సహించేలా జగన్‌ ఎన్నికల ప్రణాళికను రూపొందించారని, ముఖ్యంగా విద్య, వైద్యానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం పట్ల వారి నుంచి హర్షం వ్యక్తమవుతోంది. అంతేగాక జగన్‌ ఎవరినీ వ్యక్తిగతంగా నిందించకుండా.. తాను చేసేది ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం, అదే సమయంలో గత ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజల్ని ఎలా మోసం చేశారో సవివరంగా, ఆలోచింపచేసేలా ఎన్నికల ప్రచార సభలు నిర్వహించడం పట్ల విద్యావంతులు మెచ్చుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement