సాక్షి, అమరావతి : గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో ఈ నెల 29 నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్టు వైఎస్ షర్మిల తెలిపారు. సోమవారం అమరావతిలో విలేకరులతో మాట్లాడుతూ.. పప్పుగారున్నారని మంగళగిరి నుంచి ప్రచారం ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. పప్పు గారు ఓడిపోతే అంతకుమించిన సంతోషం ఉండదన్నారు. ఏప్రిల్ 9న ఓటు వేయాలని లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఈ కామెడీ షో లేకపోతే రాజకీయాల్లో ఎంటర్‌టైన్‌మెంట్ ఏముంటుందని సరదాగా అన్నారు. జయంతికి, వర్దంతికి తేడా తెలియని నారా లోకేశ్‌కు ఏకంగా మూడు మంత్రిత్వ శాఖలు అప్పగించారని ఎద్దేవా చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఈ సమయం చాలా కీలకమని, ఇప్పుడు పొరపాటు చేస్తే చరిత్ర మనల్ని క్షమించదని షర్మిల అన్నారు. ఇప్పుడు పొరపాటు చేస్తే ఏపీలో అభివృద్ధి అనేది సమాధి అవుతుందని, అందుకే ఇప్పుడు మాట్లాడడానికి సామాన్యురాలిగా మీడియా ముందుకు వచ్చినట్టు తెలిపారు. ప్రతి హామీని నెరవేర్చగలమనే నమ్మకంతోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హామీలు ఇస్తోందన్నారు. రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళతామో తెలుసుకోవాలంటే తమ పార్టీకి అధికారం ఇవ్వాలని కోరారు.
చంద్రబాబు డైరెక్షన్‌లో పవన్
జనసేన నాయకుడు పవన్ కల్యాణ్.. చంద్రబాబు చెప్పినట్టు ఆడుతున్నారని షర్మిల ఆరోపించారు. ‘రాజకీయ సినిమాలో పవన్ కల్యాణ్ యాక్టర్. ఆయన చంద్రబాబు అనే డైరక్టర్ చెప్పినట్లు చేస్తున్నారు. నాకు ఆ విషయం ఎందుకు అర్థమైందంటే కోట్ల మంది ప్రజలకు సంబంధించిన విషయం డేటాచోరి. పవన్ కల్యాణ్ దాని గురించి మాట్లాడలేదు. పవన్ కల్యాణ్ నామినేషన్ వేయడానికి వెళ్తే అక్కడ పచ్చపార్టీ పతాకాలు కనిపిస్తాయి. వివేకానంద రెడ్డిగారి హత్య జరిగితే మేం థర్డ్ పార్టీ విచారణ డిమాండ్ చేస్తున్నాం. పవన్ కల్యాణ్ ఎందుకు అడగటం లేదు. నిజంగా చంద్రబాబు నిర్దోషి అని పవన్ నమ్మితే అడగవచ్చు కదా. నాకు తెలిసి జనసేనకు ఓటేస్తే టీడీపీకి ఓటేసినట్లే’నని షర్మిల అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment