రాక్షస పాలన అంతం చేయండి | YS Sharmila Road Show At Ibrahimpatnam In Krishna | Sakshi
Sakshi News home page

రాక్షస పాలన అంతం చేయండి

Published Tue, Apr 9 2019 1:42 PM | Last Updated on Wed, Apr 10 2019 4:01 AM

YS Sharmila Road Show At Ibrahimpatnam In Krishna - Sakshi

పప్పు.. గన్నేరు పప్పు!
‘‘ఇవాళ ఉదయం ఓ అన్న నాతో చెప్పాడు... నారా లోకేష్‌ పప్పు అయితే ఆయన తండ్రి చంద్రబాబునాయుడు గన్నేరు పప్పు అట. ఈ ఇద్దరూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రమాదకరమే. రాష్ట్రాన్ని లూటీ చేశారు. నారారూప రాక్షసుల పాలనను అంతమొందించండి’’
– ఇబ్రహీంపట్నం సభలో...

పొరపాటున కూడా నమ్మొద్దు
‘‘2014 ఎన్నికలకు ముందు హోదా అన్నావ్‌.. తర్వాత బీజేపీతో కుమ్మౖక్కై ప్యాకేజీకి ఒప్పుకున్నావ్‌.. మళ్లీ హోదా అంటున్నావ్‌. రోజుకో మాట, పూటకో వేషం. ఆయన్ను నమ్మి మళ్లీ మోసపోతే రాష్ట్రం అంధకారమే’’ 

ఈ అన్న అప్పుడు ఏమయ్యాడు?
‘‘చంద్రబాబు కొత్తగా ఆడపడుచులకు అన్ననని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. ఎమ్మార్వో వనజాక్షిని టీడీపీ రౌడీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లినప్పుడు ఈ అన్న ఎక్కడకు వెళ్లాడు? అంగన్‌వాడీ కార్యకర్తలను లాఠీలతో చితకబాదితే ఎటు పోయాడు? రిషితేశ్వరి  ఆత్మహత్యకు పాల్పడితే ఏమయ్యాడు? విజయవాడలో కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌ కుంభకోణం నడిచింది ఈ అన్న కనుసన్నల్లో కాదా? భవానీనగర్‌లో పాఠశాల వద్ద మద్యం దుకాణం తొలగించాలని మహిళలు ధర్నా చేస్తే లాఠీలతో కొట్టించి జైలుకు పంపింది ఈ అన్న కాదా? ఇటువంటి వ్యక్తిని నమ్మి మోసపోవద్దని అక్కచెల్లెమ్మలను హెచ్చరిస్తున్నా’’
– విజయవాడ పంజాసెంటర్‌ 

సాక్షి, అమరావతి బ్యూరో: అవినీతి, అబద్ధాలు, అరాచకాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు మారుపేరని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల విమర్శించారు. చంద్రబాబు అవినీతిని ఆయన ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శులుగా పనిచేసిన ఐవైఆర్‌ కృష్ణారావు, అజేయ కల్లాం కూడా నిర్ధారించారని గుర్తు చేశారు. ‘ఐదేళ్ల బాబు పాలనలో గత 40 ఏళ్లలో చేయనన్ని అప్పులు చేశారని మాజీ సీఎస్‌లు చెబుతున్నారు. తండ్రీ కొడుకులు కలసి రాష్ట్రాన్ని లూటీ చేశారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చని చంద్రబాబు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు’ అని షర్మిల  మండిపడ్డారు. రోడ్‌షో, బస్సు యాత్ర నిర్వహిస్తున్న షర్మిల ఎన్నికల ప్రచారానికి చివరి రోజైన మంగళవారం విజయవాడ, ఇబ్రహీంపట్నం, జగ్గయ్యపేటలో జరిగిన సభల్లో మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..

కాపీ కొట్టి హామీలిస్తున్నారు..
‘‘వైఎస్సార్‌ ఐదేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలు భరోసాగా జీవించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రుణమాఫీ పేరుతో రైతులు, డ్వాక్రా మహిళలను దగా చేశారు. పసుపు–కుంకుమ పేరిట ఎంగిలి చెయ్యి విదిలిస్తున్నారు. ఆ డబ్బులు డ్వాక్రా రుణాల వడ్డీకి కూడా సరిపోవు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రాకపోవడంతో విద్యార్థుల చదువులు మధ్యలోనే ఆగిపోతున్నాయి. ఆరోగ్యశ్రీ నుంచి కార్పొరేట్‌ ఆస్పత్రులను తొలగించారు. చంద్రబాబు కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురైతే ప్రభుత్వ ఆస్పత్రికెళ్లి వైద్యం చేయించుకుంటారా? గత ఎన్నికల్లో 600కిపైగా హామీలిచ్చిన చంద్రబాబు ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోను కాపీ కొట్టి కొత్త హామీలిస్తున్నాడు. మీ భవిష్యత్తు నా బాధ్యత అంటూ తిరుగుతున్న దొంగబాబును ఇంటికి పంపండి. ఐదేళ్ల పాలన గురించి ప్రజలకు చెప్పి ఓట్లడిగే ధైర్యం చంద్రబాబుకు లేదు. హైదరాబాద్‌ అంతా నేనే కట్టానంటూ అబద్ధాలు ప్రచారం చేసుకుని సీఎం అయ్యాడు చంద్రబాబు. అమరావతి నిర్మాణానికి కేంద్రం రూ.2,500 కోట్లు ఇస్తే ఒక్క శాశ్వత భవనం కూడా నిర్మించలేదు. కనీసం ఓ ఫ్లైఓవర్‌ కూడా పూర్తి చేయలేదు. ఆ డబ్బంతా మింగేశారు. ఆయన కోసం మాత్రం హైదరాబాద్‌లో ఒక పర్మినెంట్‌ బిల్డింగ్‌ కట్టుకున్నాడు. 

ఓటు అడిగితే తక్షణమే బకాయిలివ్వమనండి
బాబొచ్చాక ఆయన కుమారుడికి తప్పితే జాబులు ఎవరికి వచ్చాయి? జయంతి, వర్థంతికి కూడా తేడా తెలియని పప్పుగారిని ఏకంగా మూడు శాఖలకు మంత్రిని చేశారు. యువతకు మాత్రం ఉద్యోగాలు లేవు, నోటిఫికేషన్లు లేవు. టీడీపీ నేతలు ఓట్ల కోసం వస్తే గత ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీల బకాయిలను వడ్డీతో సహా తక్షణమే చెల్లించమని నిలదీయండి. అది మీ హక్కు.
 



కేసీఆర్‌తో చంద్రబాబు కాళ్ల బేరం!
ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ భారీ మెజార్టీతో ఘన విజయం సాధిస్తుంది. టీడీపీకి ఓటమి తప్పదు. ఇదే విషయాన్ని పలు జాతీయ సర్వే సంస్థలు కూడా తేల్చి చెప్పాయి. చంద్రబాబు ఆరోపిస్తున్నట్లు మాకు ఎవరితోనూ పొత్తులు లేవు. వైఎస్సార్‌సీపీకి ఆ అవసరం కూడా లేదు. నక్కలే గుంపులుగా వస్తాయి. అందుకే చంద్రబాబు జనసేన, కాంగ్రెస్‌లతో కలసి తోడుగా వస్తున్నారు. హరికృష్ణ మృతదేహం సాక్షిగా కనీస ఇంగితం కూడా లేకుండా కేసీఆర్‌తో పొత్తుల కోసం వెంపర్లాడింది చంద్రబాబే. టీఆర్‌ఎస్‌తో పొత్తు కోసం కేసీఆర్‌ కాళ్లు పట్టుకున్నంత పని చేశాడు బాబు.

ధర్మాన్ని గెలిపించండి..
పౌరుషం, రోషం గురించి చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదం. తండ్రి లాంటి పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచి కుర్చీని, పార్టీని లాక్కున్నాడు. ఒకవైపు సొంత మామనే మోసగించిన చంద్రబాబు, మరోవైపు ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్‌ను వీడి ఒంటరిగా బయటకు వచ్చిన జగనన్న మన ముందు ఉన్నారు. మంచికి, చెడుకు మధ్య యుద్ధం జరుగుతోంది. ధర్మం, అధర్మానికి మధ్య పోరాటం జరుగుతోంది. విశ్వసనీయత, వెన్నుపోటుకు మధ్య జరుగుతున్న యుద్ధంలో న్యాయం వైపు నిలిచి జగనన్నను గెలిపించండి. జగనన్న తొమ్మిదేళ్లుగా నీతివంతమైన రాజకీయాలు చేశారు. ప్రతి కష్టంలోనూ ప్రజల పక్షాన నిలిచారు. 3,648 కి.మీ పాదయాత్ర చేసి సమస్యలను దగ్గరగా చూశారు. అధికారం కోసం నిలబెట్టుకోలేని హామీలను జగనన్న ఎప్పుడూ ఇవ్వలేదు. చంద్రబాబులా అబద్ధాలు చెప్పలేదు. ఈ అవినీతి పాలన అంతం చేయండి. అంతా బైబై బాబు.. అని ప్రజాతీర్పు చెప్పండి’’

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement