జగన్‌ మాటే ప్రమాణం | YS Sharmila interview With Sakshi | Sakshi
Sakshi News home page

జగన్‌ మాటే ప్రమాణం

Published Mon, Apr 8 2019 1:12 AM | Last Updated on Mon, Apr 8 2019 9:08 AM

YS Sharmila interview With Sakshi

ముప్పై ఐదేళ్ల వయసులో.. నల్లకాలువ దగ్గర జగన్‌ ఒక మాట ఇచ్చాడు. తన తండ్రి వైఎస్‌ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను ఓదారుస్తానని!ఆ మాట మీద నిలబడకపోయుంటే..జగన్‌పై ఇన్ని కక్ష సాధింపులు ఉండేవి కాదు. ఇన్ని కేసులు ఉండేవి కాదు. ఆ కుటుంబానికి ఇన్ని వేధింపులు ఉండేవి కాదు.అయినా మాట మీద నిలబడ్డాడు.
ఏ కష్టమొచ్చినా మాట నిలబెట్టుకున్నాడు. విలువలకు కట్టుబడి ఉన్నాడు. వై.ఎస్‌.రాజశేఖరరెడ్డికి గానీ, జగన్‌కి గానీమాటే ప్రమాణం. ‘‘నాన్న గానీ, అన్న గానీ మాట ఇవ్వడం అంటే ప్రమాణం చెయ్యడమే’’ ననిపశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలోప్రియదర్శిని రామ్‌కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలోవై.ఎస్‌. షర్మిల స్పష్టం చేశారు. 

రామ్‌: చాలా కాలం తర్వాత మళ్లీ జగన్‌ అన్న  బాణంలా దూసుకుంటూ వచ్చారు. ఈ ఫీలింగ్‌ ఎలా అనిపిస్తోంది?
షర్మిల: ఇట్స్‌ గుడ్‌. ఇన్ని రోజులు ఎందుకు రాలేదు అన్నది మీ ప్రశ్న అయితే.. బేసిక్‌గా అన్న నేను కష్టపడకూడదు అనుకుంటాడు. నాన్న ఉన్నప్పుడు కూడా నేను కష్టపడకూడదు అనుకునేవాడు. నా టెన్త్‌ అయిపోయిన తర్వాత నాన్నలా డాక్టర్‌ అవ్వాలని చాలా మంది ఒత్తిడి చేశారు. కానీ డాక్టర్‌ అయితే చాలా కష్టపడాలి అని నాన్న ఒప్పుకోలేదు. నేను కష్టపడకూడదని ఆలోచిస్తారు. కానీ ఇప్పుడు రావాల్సి వచ్చింది ఎందుకంటే.. ఒకప్పుడు నాన్న ఎంతగానో ప్రేమించిన రాష్ట్రమిది. ఒకప్పుడు కళకళలాడిన రాష్ట్రాన్ని ఇప్పుడు ఈ దుస్థితిలో చూస్తే నాన్న కూతురిగానే కాదు, సామాన్యురాలిగా కూడా గుండె బరువు ఎక్కుతుంది. కనుక ఇప్పుడు రాకపోతే, ఇప్పుడు చెప్పకపోతే, ఈ ఎన్నికల సందర్భంలో ప్రజల దృష్టికి తీసుకురాకపోతే అభివృద్ధిలో మళ్లీ 25 ఏళ్లు వెనక్కు వెళ్తాం అని నాకే అనిపించింది. 

రామ్‌: జగన్‌ అన్న బాణం అని సంబోధించినా కూడా నాన్నతోనే పోల్చుకుంటున్నారు? ఆ గాయం ఇంకా మానినట్లు లేదు!
షర్మిల: నాన్న పోయిన గాయం ఎప్పటికీ మానదు. నాకు, అమ్మకే కాదు ఈ రాష్ట్ర ప్రజలకూ ఎప్పటికీ మానదనే నేను అనుకుంటున్నాను. కానీ, సూర్యుడు అస్తమిస్తే మళ్లీ ఉదయిస్తాడు. అదే ఆశ అదే జీవితాన్ని నడిపిస్తుంది. మళ్లీ రాజన్న రాజ్యం రావాలి. మళ్లీ ప్రజలు సంతోషంగా ఉండాలి. ఉండగలిగితే అదే తృప్తి. 

రామ్‌: చాలా సుదీర్ఘమైన ప్రయాణం. నాన్నగారిని మీరు పోగొట్టుకుని ఈ సెప్టెంబర్‌కు పదేళ్లు కాబోతోంది. జగన్‌ గారి ప్రస్థానం అక్కడి నుంచి.. ఇట్స్‌ బీన్‌ ఏ లాంగ్‌ హార్డ్‌ జర్నీ! 
షర్మిల: ఈ పదేళ్లు నిజంగానే టెస్టింగ్‌ పీరియడ్‌. నాన్న ఉన్నప్పుడు ఏ రోజూ మాకు  కష్టం తెలియనివ్వలేదు. నాన్నే పెద్ద కొండలా అడ్డు నిలబడినట్టు.. మాకు ఏ కష్టమూ అనిపించలేదు. నాన్న చనిపోయినప్పుడు 700 మందికి పైగా నాన్న లేడన్న బాధ భరించలేక, నిజం జీర్ణించుకోలేక చనిపోయారు. ఒకవేళ మాకంటే నాన్నను వాళ్లే ఎక్కువగా ప్రేమించారా అనిపించేది. మేం ఒక కుటుంబంగా కూర్చున్నప్పుడు ప్రతి కుటుంబానికి వెళ్లాలి, పరామర్శించాలి, నాన్నను అంతగా ప్రేమించారు కదా, మన కృతజ్ఞత తెలుపుకోవాలి అనుకున్నాం. ఆ తర్వాత అన్న నల్లమలకు వెళ్లడం జరిగింది. లక్షల మంది ముందర మాటివ్వడం జరిగింది. మాటిచ్చినప్పుడు మాకు తెలియలేదు.

మా నాన్న కోసం మేము చేయాలనుకున్న పరామర్శకు ఇంకొకరి సమ్మతి.. సోనియా గాంధీ గారి పర్మిషన్‌ అవసరం అని మాకు అనిపించలేదు. కాంగ్రెస్‌ వాళ్లు ‘వీలులేదు మేం పర్మిషన్‌ ఇవ్వం’ అన్నారు. ఆ తర్వాత మేం అపాయింట్‌మెంట్స్‌ అడిగాం. లెటర్స్‌ రాశాం. ఫోన్లు చేశాం. ఆ తర్వాత ఎప్పుడో అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. అమ్మ, నేను, అన్నా వెళ్లి కలిశాం. కలసినప్పుడు సోనియాగాంధీ గారేమో అందర్నీ ఒకచోటుకి పిలిచి ఒకటేసారి అవ్వజేయండీ అన్నారు. ‘‘అలా కాదమ్మా, నాన్న చనిపోయినప్పుడు మీరు మా ఇంటికి వచ్చి పరామర్శించారు. అదే పద్ధతి. అదే సంప్రదాయం. మేమే వాళ్ల ఇంటికి వెళ్లాలి. మేం మాట ఇచ్చాం’’ అని వాళ్లకు ఎంత చెప్పినా అర్థం కాలేదు. ఒప్పించలేక వచ్చేశాం. కాంగ్రెస్‌ వాళ్లు వచ్చి, వాళ్ల మాట వింటే సెంట్రల్‌ మినిస్ట్రీ ఇస్తాం అన్నారు. టెర్మ్‌ అయిపోయాక ముఖ్యమంత్రిని కూడా చేస్తాం అన్నారు.

వాళ్ల మాట వినకపోతే కేసులు కూడా పెడతాం అని బెదిరించారు. ఆ తర్వాత ప్రేయర్‌ రూమ్‌లో మేం అంతా కూర్చున్నప్పుడు అన్న అన్నాడు. ‘‘మనకు రెండే ఆప్షన్స్‌ ఉన్నాయి. ఒకటి మనం ఇచ్చిన మాట మర్చిపోయి వాళ్లు చెప్పినట్టు వింటే పదవులు ఇస్తామంటున్నారు. రెండు మనకు కష్టమైనా మనని ఇబ్బంది పెట్టినా కూడా మన మాట నిలబెట్టుకుంటే ఎన్నో కష్టాలు పడాల్సి ఉంటుంది. కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నవాళ్లం అవుతాం. నాకైతే నాన్న బాటలో, ఇచ్చిన మాట మీద నిలబడాలని ఉంది. పరామర్శకు పోవాలనే ఉంది’’ అని అన్నాడు. అమ్మేమో.. ‘‘లేదు నాన్నా.. చాలా కష్టపడతావు’’ అని చెప్పింది. ‘‘లేదమ్మా ఇదే కరెక్టు’’ అని అమ్మను ఒప్పించాడు. ‘‘మనం ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోతే తండ్రికి తగ్గ కొడుకుని అనిపించుకోలేను నేను’’ అన్నాడు. ఆ తర్వాత ఓదార్పు యాత్ర చేశాడు. రెండు రోజులకే కేసులు పెట్టారు.

బయటకు వచ్చాం. అన్నను జైల్లో కూడా పెట్టారు. ఆ పీరియడ్‌ కూడా చాలా కష్టంగా అనిపించింది. అసలు ఏం అర్థం కాలేదు. ఊపిరి ఆడనట్టు అయిపోయింది. ఇంటికి నాన్న తర్వాత అన్న పెద్ద. అలాంటిది అన్నను తీసుకెళ్లి జైల్లో పెట్టడం అంటే మమ్మల్ని అనాథను చేసినట్టు. సోనియా గాంధీగారు కూడా భర్తను పోగొట్టుకున్నారు. తనకూ ఓ కొడుకు ఉన్నాడు. తన కొడుకుని జైల్లో పెడితే ఎలా ఉండేదో, విజయమ్మగారి కొడుకుని జైల్లో పెడితే కూడా అలాగే ఉంటుందని కనీసం ఆలోచించలేకపోయారు. రెండుసార్లు అధికారంలోకి తీసుకువచ్చారు రాజశేఖరరెడ్డిగారు. ఆ కృతజ్ఞత కూడా ఉన్నట్టు అనిపించలేదు. మానవత్వం ఉన్నట్టు కూడా కనిపించలేదు. ఎన్ని చేసినా మేం ఓర్చుకున్నాం. ఆ తర్వాత నేను పాదయాత్ర చేయాల్సి వచ్చింది. దేవుడి దయ వల్ల అన్న బయటకు వచ్చాడు.

పదహారు నెలల తర్వాత! ఆ తర్వాత మీకు తెలుసు అన్న ఎంత కష్టపడ్డాడో. ఎలక్షన్‌ వచ్చింది. చాలా మైనర్‌ మార్జిన్‌తో తెలుగుదేశం పార్టీకి కోటీ 35 లక్షల ఓట్లు వస్తే వైఎస్‌ఆర్‌సీపీకి కోటీ 30 లక్షల ఓట్లు వచ్చాయి. మైనర్‌ మార్జిన్‌తో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోయింది. అప్పుడు కూడా అన్న బాధపడలేదు. అప్పుడు కూడా అన్న చెప్పింది ఒకటే. ‘‘నిలబెట్టుకోలేని వాగ్దానాలు ఇచ్చి అధికారంలో ఉండడం కన్నా ఇచ్చిన మాట మీద నిలబడి విశ్వసనీయత, విలువలు కలిగినవాడిగా అపోజిషన్‌లో ఉన్నా’’ అన్నాడు. ఈ ఐదు ఏళ్లు కష్టపడ్డాడు. రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా కోసం చేయని ప్రయత్నం లేదు. ఢిల్లీలో ధర్నాలు చేశాడు. ఆంధ్రప్రదేశ్‌లో రోజుల తరబడి నిరాహార దీక్ష చేశాడు. బంద్‌లు, రాస్తారోకోలు.. ఆఖరికి వైసీపీ ఎంపీలందరూ కూడా రాజీనామాలు చేసి పదవీ త్యాగం చేశారు. ఆ తర్వాత అన్న పాదయాత్ర చేశారు... 3,500 కిలోమీటర్లు. చాలా దూరం, చాలా కష్టం. ప్రజల కష్టం విన్నాడు. తెలుసుకున్నాడు, అర్థం చేసుకున్నాడు. 

రామ్‌: మీరు చేసిన పాదయాత్రకు, జగన్‌గారు చేసిన పాదయాత్రకు వ్యత్యాసం ఏంటి? 
షర్మిల: నేను చేసిన పాదయాత్ర.. వైఎస్‌ఆర్‌ కుటుంబం ప్రజలకు ఎప్పుడూ అండగానే ఉంటుంది. అందుబాటులోనే ఉంటుంది. ఎన్ని కష్టాలొచ్చినా కూడా అవైలబుల్‌గా ఉంటుంది అని ఒక ధైర్యం నింపడంకోసం చేసింది. జగన్‌ అన్న చేసిన పాదయాత్ర.. మార్పు కోసం పోరాటం చేయాలి, నేను మీకు అండగా నిలబడతాను అని ధైర్యం చెప్పడానికి, భరోసా నింపడానికి చేసింది. మనమందరం కలసి మార్పుని సాధించుకుందాం అని చెప్పడం కోసం చేసిన పాదయాత్ర. 

రామ్‌: అంత కొద్ది మార్జిన్‌తో టీడీపీ ప్రభుత్వం రావడం, చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. ఆ తర్వాత జగన్‌గారు.. ప్రజలు అబద్ధపు వాగ్దానాల కంటే కూడా విశ్వసనీయతను నమ్మడంతో ప్రజల తరఫున మళ్లీ పోరాటం మొదలుపెట్టారు. ఈ ఐదేళ్ల కాలంలో చంద్రబాబుగారి పాలన ఎలా ఉందని అనుకుంటున్నారు?
షర్మిల: ఈ ఐదేళ్ల కాలంలో చంద్రబాబుగారు ముఖ్యమంత్రిగా ప్రతి విషయంలోనూ విఫలం అయ్యారు. అన్నింటికంటే ముఖ్యం మనకు స్పెషల్‌ కేటగిరీ స్టేటస్‌. బీజేపీతో పొత్తు పెట్టుకొని నాలుగేళ్లు బీజేపీతో సంసారం చేస్తూ కూడా స్పెషల్‌  కేటగిరీ స్టేటస్‌ సాధించుకోకపోవడం చంద్రబాబుగారి గ్రేటెస్ట్‌ ఫెయిల్యూర్‌. హోదా వద్దూ, ప్యాకేజీలతోనే తనకు కమీషన్లు వస్తాయి అనుకుని కేవలం డబ్బుల కోసం ప్రజలను ముంచేశాడు. ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టేశాడు. కేవలం తన స్వార్థం కోసం. నాకు చాలా అనుభవం ఉంది. రాజధానిని కట్టేస్తాను అని చెప్పారు. కానీ ఒక్క ఫ్లై ఓవర్‌ కట్టలేదు. ఒక్క పర్మనెంట్‌ బిల్డింగ్‌ కట్టలేదు.

కేంద్ర ప్రభుత్వమేమో రూ. 2,500 కోట్లు ఇచ్చాం కొత్త రాష్ట్రం కోసం అంటుంది. ఆ డబ్బంతా ఏమైనట్టు? రాజధాని విషయంలో ఘోరంగా విఫలమయ్యారు. పోలవరంలో కూడా అంతే. కేంద్ర ప్రభుత్వం కట్టాల్సిన ప్రాజెక్ట్‌ అది. ఆయనను ఎవరు తీసుకోమన్నారు. ఆ తర్వాత పర్మిషన్లు ఇవ్వడం లేదని సాకులు చెబితే అసలు ముందు మిమ్మల్ని ఎవరు తీసుకోమన్నారు. 15 వేల కోట్ల ప్రాజెక్ట్‌ను కమీషన్ల కోసం 60 వేల కోట్లకు పెంచారు. అంత భారీగా బడ్జెట్‌ పెంచాల్సిన అవసరం లేదు. ఆ పెద్ద విషయాలన్నీ పక్కన పెడితే రైతులకు రుణమాఫీ అని వాగ్దానం చేశారు. మొత్తం రైతుల రుణం 85 వేల కోట్లు ఉంది ఆ రోజు. దాన్ని కాస్తా కమిటీ వేసి, సాకులు చూపించి 24 వేల కోట్లకు కుదించి, అది కూడా ఇంతవరకూ ఇవ్వలేదు.

డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అన్నారు. అది కూడా ఒక్క రూపాయి మాఫీ చేయలేదు. కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత విద్య అన్నారు. పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వడం లేదు. ఆరోగ్యశ్రీ ఆసుపత్రులను తొలగించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తాం అన్నారు. ఇలా ప్రతి విషయంలోనూ ఫెయిల్‌ అయ్యారు. చేశానని చెప్పుకోడానికి ఒక్కటీ లేకపోయినా, నేను ఇది చేశాను, అది చేశాను అంటున్నారు. ‘మాట నిలబెట్టుకున్నాను కనుక నాకు ఓట్లు వేయండి’ అని చెప్పే ధైర్యం మాత్రం లేదు చంద్రబాబు గారికి. ఎంతసేపు జగన్‌మోహన్‌రెడ్డి గారిని తిట్టడం, ఎంతసేపున్నా అబద్ధపు హామీలు ఇవ్వడం. అదే చెబుతుంది కదా. ప్రజలకు ఆయనేమీ చేయలేదని. 

షర్మిలను ఇంటర్వ్యూ చేస్తున్న ప్రియదర్శిని రామ్‌

రామ్‌: పొత్తుల విషయం.. బీజేపీతో పొత్తులోఉండి, గెలిచి నాలుగున్నరేళ్ల తర్వాత దీన్ని వదిలేసి అటు తెలంగాణాకు వెళ్లి కాంగ్రెస్‌తో కలసి పోటీ చేసి.. ఈ మధ్యలో టీఆర్‌ఎస్‌ను కూడా పొత్తుకు అడిగారని..! 
షర్మిల: ఏదైనా చేస్తాడు చంద్రబాబుగారు. ఎవ్వరితో అయినా పొత్తు పెట్టుకుంటాడు. ఫారుక్‌ అబ్దుల్లా ఎవరండీ? మమతా బెనర్జీ ఎవరు? ఏం అవసరం?

రామ్‌: చంద్రబాబు నాయుడు మాయమాటల వల్ల ఈ ఎన్నికల్లో కూడా ఏదైనా ఇంపాక్ట్‌ ఉంటుందని అనుకుంటున్నారా?  
షర్మిల: ఒకరు ఇంకొకర్ని ఒకసారి మోసం చేయొచ్చు. కానీ అందర్నీ అన్నిసార్లు మోసం చేయడం అసాధ్యం. ప్రజలు 5 ఏళ్లు చంద్రబాబుగారి పాలన చూశారు. ఏం డెలివర్‌ చేశారో వాళ్లకు తెలుసు. రైతులు మోసపోయారు. మహిళలు మోసపోయారు. విద్యార్థులు మోసపోయారు. యువకులు మోసపోయారు. బీసీలు, దళితులు, ఇలా అన్ని వర్గాల వారు మోసపోయారు. చంద్రబాబుగారు మోసం చేసేవాడని, మాట మీద నిలబడని వాడని ప్రజలకు అర్థం అయిందని నేను అనుకుంటున్నాను. ఎక్కడికి వెళ్లినా అదే చెబుతున్నాను. ఈసారి మోసపోయే చాన్స్‌ లేదని నేననుకుంటున్నాను.

రామ్‌: జగన్‌గారిని ఒక బలమైన ప్రతిపక్షనేతగా చూశారు. ముఖ్యమంత్రి అయితే అతని పాలన ఎలా ఉంటుందని అనుకుంటున్నారు?
 షర్మిల: జగన్‌ గారిని ప్రతిపక్షనేతగా కంటే కూడా ముందే చూశాం. ప్రజలు జగన్‌ గారిని దాదాపు పదేళ్లుగా చూస్తూనే ఉన్నారు. నాన్న చనిపోయినప్పుడు ఎంత ధైర్యంగా నిలబడ్డాడో చూశారు. ఓదార్పుకు  ఇచ్చిన మాట కోసం.. సోనియా గాంధీగారు ఆరోజుల్లో గ్రేట్‌ ఫోర్స్‌.. అంతటి ఫోర్స్‌నీ ఎదిరించారు. ఎదురు నిలబడ్డారు. ఇచ్చిన మాటే ముఖ్యం అని నిలబడ్డారు. ఓదార్పు యాత్ర చేశాడు. కేసులు పెట్టినా భయపడలేదు. జైలుకు వెళ్లినా భయపడలేదు. ఆ తర్వాత ప్రతిపక్ష నేతగా చూశాం. ఇక ప్రత్యేక హోదా కోసం జగన్‌ అన్న చేసిన ప్రయత్నం ఎవ్వరూ చేయలేదు.

జగన్‌గారు అంత పోరాటం చేసుండకపోతే చంద్రబాబుగారు ఈ పాటికి ఆ ఉద్యమాన్ని చంపేసుండేవారు. ఈ రోజు ప్రత్యేక హోదా బతికి ఉందంటే జగన్‌గారి వల్లనే. చంద్రబాబు నాయుడుగారు యుటర్న్‌ తీసుకొని మళ్లీ హోదా కావాలి అంటున్నారు. అంటే అది కేవలం జగన్‌గారి వల్ల. ప్రతిపక్షనేతగా ఎంత సమర్థవంతంగా చేశాడో చూశాం. ముఖ్యమంత్రిగా కూడా చాలా సమర్థవంతంగా, తపనతో మనసున్నవాడిగా నాన్నలా చేస్తాడు అనుకోవడంలో, అనడంలో నాకు ఏ మాత్రం అనుమానంలేదు. రాజశేఖరరెడ్డిగారికి తగిన కొడుకు అనిపించుకుంటాడు. 

రామ్‌: బీజేపీతో రహస్య ఒప్పందం ఉందని, కాసేపు టీఆర్‌ఎస్‌తోఉందని అంటున్నారు. 
షర్మిల: బీజేపీతో నాలుగేళ్లు సంసారం చేసింది చంద్రబాబుగారు. ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టింది ఆయన. ఇప్పుడు మాకు బీజేపీతో పొత్తు ఉందనడంలో అసలు అర్ధమే లేదు. మాకు బీజేపీతో పొత్తు ఉంటే జగన్‌గారి కేసులన్నీ మాఫీ చేయించుకునేవారు కాదా? దేర్‌ ఈజ్‌ నథింగ్‌ టు రీడ్‌ బిట్వీన్‌ ది లైన్స్‌. అసలు లాజిక్‌ లేదు. టీఆర్‌ఎస్‌తో పొత్తుకోసం వెంపర్లాడింది చంద్రబాబుగారు. హరికృష్ణగారి మృతదేహం పక్కన ఉందనే ఇంగితం కూడా లేకుండా టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోవాలనుకుంది చంద్రబాబుగారు. టీఆర్‌ఎస్‌తో పొత్తు అని ఆయన  అంటే అయిపోతుందా? ప్రజలు గమనిస్తున్నారు. పొత్తుల కోసం వెంపర్లాడింది ఎప్పుడూ చంద్రబాబే. జగన్‌గారు మొదటి రోజు నుండి సింగిల్‌గానే పోరాడారు.

కాంగ్రెస్‌ పార్టీ నుంచి సింగిల్‌గానే బయటకు వచ్చారు. సింగిల్‌గానే వైఎస్‌ఆర్‌ పార్టీ స్థాపించారు. ఆరోజు నుంచి ఈ రోజు వరకు మాకు ఎవ్వరితోనూ పొత్తులు లేవు.  మాకు అవసరం కూడా లేదు. మా దృష్టిలో కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో ద్రోహం చేసింది. రాష్ట్రాన్ని విభజించిన వాళ్లు అనుకుంటే ప్రత్యేక హోదా కూడా ఆ రోజే ఇచ్చి ఉండచ్చు. ఆ రోజే పోలవరం ఇచ్చేసి ఉండచ్చు. ఆ రోజే రాజధాని కట్టుకోవడానికి డబ్బులు ఇచ్చి ఉండచ్చు. అంత అన్యాయంగా విభజన చేసింది కాంగ్రెస్‌ పార్టీ. అంత అన్యాయం కాంగ్రెస్‌ పార్టీ చేస్తే బీజేపీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా ఇస్తాం అని చెప్పినా కూడా ఇవ్వకుండా వాళ్లూ మనకు అంతే అన్యాయం చేశారు. మాకు ఎవ్వరితోనూ పొత్తులు లేవు. ఆ అవసరం కూడా లేదు. 

రామ్‌: ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రత్యేకహోదా ఇస్తాను అంటోంది?
షర్మిల: ఇచ్చే మనసే ఉంటే ముందే ఇచ్చే ఉండొచ్చు కదా అన్నది నా పాయింట్‌. ఇచ్చేవాళ్లే అయితే విభజన చేసిందే వాళ్లు కదా. పేపర్లు రాసేదే వారు కదా. చట్టాలు చేసింది వాళ్లు కదా. ఆ రోజు ఎందుకు ఇవ్వలేదు అంటున్నాను నేను. ఆ రోజు ఏమైంది మీ తెలివి. మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు ఎందుకు  చేయలేదు. మీకు చిత్తశుద్ధి అప్పుడు లేనప్పుడు ఇప్పుడు ఉంది అని చెబుతుంటే ఎలా నమ్మడం.


రామ్‌: జగన్‌గారి ప్రయాణంలో చాలా ముఖ్యమైన ఘట్టం. వైజాగ్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఆయన మీద జరిగిన దాడి. దాన్ని చంద్రబాబునాయుడు ప్రభుత్వం నీరుగార్చి ఇంకోలా మాట్లాడటం, కించపరచడం..!
షర్మిల: జగన్‌మోహన్‌రెడ్డి గారిమీద హత్యాప్రయత్నం చాలా ప్లాన్డ్‌గా జరిగింది. ఎందుకంటే కత్తి ఉన్నది ఒకరి చేతిలో అయితే.. ఆ కుట్రను పన్నింది ఇంకొకరు. కుట్ర పన్నిన వారు నిజమైన నేరస్తులు. కత్తి పట్టినవాడికి డబ్బులు ఇచ్చారు. వాళ్ల ఊరిలో స్థలాలు, ఇళ్లు ఇచ్చారు. టీడీపీ వారి క్యాంటీన్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఉంటే అక్కడ ఉద్యోగం ఇచ్చారు. కత్తిని లోపలికి తెప్పించారు. సీసీ కెమెరాలను బంద్‌ చేశారు. ఆ వ్యక్తి నేను వైసీపీ అభిమానిని, మీ ఫ్యాన్‌ అని చెప్పి మెడమీద ఎటాక్‌  చేయబోయాడు. అప్పుడు జగన్‌ అన్న చేసిందల్లా... ఇలా భుజం ఎత్తి వెనక్కి వెళ్లడం. అది భుజంపై తగిలింది. ఎంత లోతుగా తెగిందంటే కత్తి అక్కడే ఉండిపోయింది.

రామ్‌: భుజం ఎత్తకపోయుంటే..!!
షర్మిల: భుజం ఎత్తకపోతే నరం తెగేది. నరం తెగితే రక్తం ఆగకుండా కారేది. ఆపాలని ప్రయత్నిస్తే ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది కలిగి ఉండేది. ప్రాణం పోయి ఉండేది. అంత సీరియస్‌గా ఉన్న
దాన్ని వీరు హేళన చేస్తున్నారంటే అది రాక్షస ఆనందం. ఒకవేళ లోకేశ్‌కే  మెడమీద తగిలి ఉంటే అప్పుడు చంద్రబాబునాయుడుకి తెలిసేది. ఈ చిన్న కోడి కత్తి ఏం చేస్తుంది అంటున్నారంటే.. ఏం అంటామండీ.. దిగజారుడు రాజకీయం కాకపోతే చంద్రబాబుగారిది!

రామ్‌: నవరత్నాలు మూడేళ్ల ముందే ప్రకటించారు మీ అన్నయ్యగారు. వాటిని పట్టుకుని రీ ప్యాకేజ్‌ చేసి కొంచెం ప్రజల్లోకి పంపించి ఇన్‌ఫ్లుయన్స్‌ చేయడానికి ప్రయత్నం జరుగుతోంది. దాని వల్ల మీకు నష్టమే కదా.
షర్మిల: కాపీ చేయడం చంద్రబాబుగారికి ముందునుంచి అలవాటు. ప్రజల కోసం ఏవైనా పథకాలు ఉన్నాయి అంటే అవి ఆయన నిజమైన ఆలోచనలై ఉండి ఉండవు. ప్రజలకు చూపించే పథకాలు అన్ని కాపీ కొట్టిన పథకాలే. రాజశేఖరరెడ్డిగారు ఉచిత విద్యుత్‌ ఇస్తానంటే... బట్టలు ఆరేసుకోవడానికి తప్ప దేనికీ పనికిరాదని చంద్రబాబుగారు హేళన చేశాడు. ఉచిత విద్యుత్తు అయినా, ఆరోగ్యశ్రీ అయినా, రుణమాఫీ అయినా, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అయినా, శాచురేషన్‌ పద్ధతిలో ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి అనే ఆలోచన అయినా.. అన్నీ రాజశేఖరరెడ్డిగారి పథకాలు. ఆయన అద్భుతంగా అమలు చేసి చూపించిన పథకాలు.

ఆయన బతికి ఉంటే... ఈ రోజు వరకూ ఈ పథకాలు అమలు అవుతుండేవి. అలాంటి పథకాలను కాపీ కొట్టాలని ఈ ఐదేళ్లలో చంద్రబాబు ప్రయత్నం చేసి విఫలమయ్యారు. రాజశేఖరరెడ్డిగారు క్లాసులో ముందు బెంచ్‌లో కూర్చొని పథకాలను రాస్తుంటే చంద్రబాబుగారు వెనకాల బెంచ్‌లో కూర్చొని కాపీ కొట్టాలని ప్రయత్నించారు. ఆఖరికి కాపీ కొట్టే విషయంలో కూడా ఫెయిల్‌ అయ్యారు. ఈయన అదే క్లాసులో కూర్చొంటే జగన్‌మోహన్‌రెడ్డిగారు ప్రమోట్‌ అయి ఆ క్లాసుకు వచ్చారు. ఇప్పుడు జగన్‌మోహన్‌రెడ్డిగారు ముందు బెంచ్‌లోకూర్చొని ఉన్నారు. మళ్లీ జగన్‌మోహన్‌రెడ్డిగారి వెనక బెంచ్‌లో కూర్చొని, జగన్‌మోహన్‌రెడ్డిగారి పథకాలను మళ్లీ కాపీ కొట్టాలని చూస్తున్నారు. మళ్లీ ఫెయిల్‌ అవుతాడు. ఎందుకంటే చంద్రబాబుగారికి పాస్‌ అయ్యే క్వాలిఫికేషన్‌ లేదు.

రామ్‌: అంత కచ్చితంగా ఎలా చెబుతున్నారు.. జగన్‌గారి పథకాలను చంద్రబాబు ప్రజల్లోకి తీసుకెళ్లలేరు అని?
షర్మిల: ఫెయిల్‌ అవుతాడని ఎందుకు చెప్పగలుగుతున్నాం అంటే పథకాలను కాపీ కొట్టవచ్చు కానీ క్యారెక్టర్‌ను ఎవరూ కాపీ కొట్టలేరు. చంద్రబాబుగారు మాయ చేసో, మసి పూసో మోసంతోనే మతలబులు పెట్టుకుని, పొత్తు పెట్టుకున్న పార్టీతోనే మళ్లీ ఛీ కొట్టించుకుని అధికారంలో కూర్చోవడానికి ఎన్నో అవకాశవాద రాజకీయాలు చేశారు. అది చంద్రబాబు క్యారెక్టర్‌. ఇంకోవైపు జగన్‌గారు.. ఇచ్చిన ఓదార్పు అనే మాట కోసం రాజ్యాభిలాషనే వదులుకుని సోనియాగాంధీలాంటి వారిని కూడా ఎదిరించి నిలబడ్డాడు. అదీ క్యారెక్టర్‌ అంటే. అదీ కరేజ్‌ అంటే. అదీ పౌరుషం అంటే. అదీ రోషం అంటే. చంద్రబాబుగారిలా అధికారం కోసం నిలబెట్టుకోలేని వాగ్దాలను ఇవ్వలేదు.

చంద్రబాబుగారిలా ఇంకొక పార్టీలో గెలిచిన వారిని తన పార్టీలో చేర్చుకోలేదు. ఆ రోజు మా వెనకాల 18 మంది ఎమ్మెల్యేలు వచ్చారంటే.. కాంగ్రెస్‌ పార్టీలో వారి చేత రాజీనామాలు చేయించి మళ్లీ ఎన్నికలు వస్తే మళ్లీ నిల్చోబెట్టి అన్న జైలులో ఉన్నా కూడా నేను, అమ్మ తిరిగి గెలిపించుకున్నాం. అదీ జగన్‌మోహన్‌రెడ్డిగారి లీడర్‌షిప్‌. అదీ జగన్‌మోహన్‌రెడ్డిగారి క్యారెక్టర్‌. అసలు.. జగన్‌మోహన్‌రెడ్డి గారికి, చంద్రబాబునాయుడుగారికి పోలికే లేదు. పురుషుల్లో పుణ్యపురుషులు వేరయా అన్నారు. చంద్రబాబుగారు విల్‌ నెవర్‌ క్యాచ్‌ అప్‌ ఇట్‌. నిప్పు నిప్పే. తుప్పు తుప్పే.

రామ్‌: మీ కుటుంబంలో చాలామందిని రాజకీయాల వల్ల పోగొట్టుకున్నారు. ఆ భయం, ఆ బాధను ఎలా మేనేజ్‌ చేస్తున్నారు?
షర్మిల: బాధ అనిపిస్తోంది. బంధువులను, బంధాలను పోగొట్టుకున్నాం. చంద్రబాబు గారు.. మా తాత రాజారెడ్డిగారు మా నాన్న రాజశేఖరరెడ్డిగారికి చాలా బలమని.. బాంబ్‌బ్లాస్ట్‌లో ఆయన్ను చంపించేశారు. తెలుగుదేశం పార్టీవాళ్లు చేశారని తెలుసు. వారికి ఆశ్రయం ఇచ్చింది చంద్రబాబుగారే. ఆ తర్వాతే రాజశేఖరరెడ్డిగారు సీఎం అయ్యారు. ఆయన మనసులో పగ కన్నా ప్రేమే ఎక్కువగా ఉంది. తర్వాత కూడా నాన్నను చంద్రబాబు మళ్లీ అసెంబ్లీకి ఎలా వస్తావో? చూస్తాను  అన్నారు. నాన్న చనిపోకముందు రోజు! అందులోనూ చంద్రబాబుగారి హస్తం ఉందేమో. ఆ తర్వాత మా చిన్నాన్నను కూడా దారుణంగా చంపేశారు. అన్నైనా.. నాన్నయినా నేర్పించింది పగకన్నా.. ప్రగతే ముఖ్యం అని. పగ కన్నా ప్రేమే ముఖ్యం అని. జీవితాన్ని పగలమీద వృథా చేయకూడదు. అదే జీవితాన్ని ప్రజాసేవకు ఉపయోగిస్తే మన జీవితం సార్థకం అవుతుంది. 



రామ్‌: దూషణలు జగన్‌గారి దగ్గర ఆగలేదు. మీ వ్యక్తిగత విషయాల గురించి కూడా రకరకాలుగా మాట్లాడారు. అవి మిమ్మల్ని డెస్ట్రాయ్‌ చేస్తున్నాయా?
షర్మిల: అవి డెస్ట్రాయ్‌ అని కాదు. బాధ కలిగించాయి. ఎప్పుడో 2014 ఎన్నికలకు ముందు నా పై దుష్ప్రచారం మొదలుపెట్టారు. అప్పట్లో చిల్లర పుకార్లు అని పెద్దగా పట్టించుకోలేదు. అప్పుడు కూడా దగ్గరి వాళ్లు సోషల్‌ మీడియాలో చాలా పోస్టింగ్‌లు ఉన్నాయని చెబుతూనే ఉన్నారు. ఈ ఎన్నికలు దగ్గరకి వచ్చేసరికి మళ్లీ మొదలుపెట్టారు. ఇది ఎన్నికలు దృష్టిలో పెట్టుకునే ఎవరో చేస్తున్నారని అర్థం అయ్యింది. ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ఎవరు చేయగలరు అంటే తెలుగుదేశం పార్టీ అని అర్థం అయ్యింది. తెలుగుదేశం పార్టీవాళ్లే చేస్తుంటే  వాళ్లు ఎన్నికలు దగ్గరికి వచ్చే సరికి ఇంకా నాపై ఈ దుష్ప్రచారం ఎక్కువే చేస్తారు తప్ప తక్కువ చేయరని అర్థం అయ్యింది.

కనుక వ్యక్తిగతంగా నాకు దీని గురించి మాట్లాడటం ఇబ్బందికరమైనప్పటికీ, బయటకు వచ్చి పోలీస్‌ కేసు పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు పోలీసు వారు చెబుతున్నదాన్ని బట్టి హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 36లో ఎన్‌బీకే అనే బిల్డింగ్‌ ఉంది. ఆ బిల్డింగ్‌  నందమూరి బాలకృష్ణ  గారిది అని, ఆ బిల్డింగ్‌ నుంచే నాపై దుష్ప్రచారం జరిగిందని,  ఆ ఐపీ అడ్రస్‌లను బట్టి పోలీసులు చెబుతున్నారు. బాలకృష్ణగారి బిల్డింగ్‌ నుంచి జరిగినవే కాకుండా...ఈ వెబ్‌సైట్‌లు.. యూట్యూబ్‌లు, ప్రో టీడీపీ అంటే... టీడీపీని ప్రమోట్‌ చేసేవి, ప్రత్యర్థులను కించపరిచేవి అవి కూడా నాపై కామెంట్స్‌ చేశాయి.  సో.. ఈ పోస్టింగ్‌లు అన్నీ బాలకృష్ణగారి బిల్డింగ్‌ నుంచి ప్రో–టీడీపీ సైట్స్‌ నుంచి జరిగాయి అంటే.. బాలకృష్ణగారికి దీంతో సంబంధం లేదు అని నేను ఎలా అనుకోను? సంబంధం ఉండటమే కాదు. స్వయంగా బాలకృష్ణగారే నాపై ఈ నీచమైన పుకార్లు పుట్టించారని, ప్రచారం చేశారని నేను విశ్వసిస్తున్నాను.

బాలకృష్ణగారు ఇంత దిగజారుడుతనానికి ఎందుకు పాల్పడ్డారో ఆయనే సమాధానం చెప్పాలి. నాన్న బతికి ఉన్నప్పుడు బాలకృష్ణగారికి వ్యక్తిగతంగా చాలా పెద్ద సమస్య వచ్చినప్పుడు నాన్న చాలా పెద్ద సాయం చేశారు. నాకు తెలుసు. బాలకృష్ణగారికి కూడా తెలుసు. అయినా.. వైఎస్సార్‌ కూతురికి... అంటే తనకు మేలు చేసినవారి కూతురికి ఇంత ద్రోహం చేశారు అంటే ఏమి అనుకోవాలి. కృతజ్ఞత లేదు అనుకోవాలి. బాలకృష్ణగారికి ఆడపిల్లలు ఉన్నారట. ఇతరుల పిల్లలపై ఇంత నీచమైన పుకార్లను ప్రచారం చేశారు అంటే ఏమి అంటాం. వ్యక్తిత్వం. విలువలు లేవు అంటాం. బాలకృష్ణగారి స్థాయిలో ఇది జరిగింది అంటే లోకేశ్‌కి చంద్రబాబుగారికి కూడా ఈ పాపంలో భాగం ఉందనే నమ్మాలి. తెలుగుదేశంపార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంత దిగజారిపోయారో అర్థమైపోతుంది.

నాకే కాదు ఏ మహిళకైన తన గౌరవం తనకు చాలా ముఖ్యం. అంతకుమించిన ఆభరణం లేదు. దాని మీద దెబ్బకొట్టడం అంటే.. అంత నీచం అంత దిగజారుడుతనం ఇంకొకటి ఉండదు. తొడ కొట్టినవాడు మగాడు అయిపోడు. మంచి మనసు ఉన్నవాడే అసలైన మగాడు. మహిళను గౌరవించనివాడు మనిషి కాదు. మృగం. ఈ మృగాలకు క్షమాపణ చెప్పే గుణం ఉంటుందని నేను అనుకోను. దేవుడు ఉన్నాడు. ఏదో ఒకరోజు వీరి పాపం పండుతుంది. ఏదో ఒక రూపంలో శిక్ష పడుతుంది. ఒక మహిళ గౌరవాన్ని పణంగా పెటై్టనా సరే అధికారం దక్కించుకోవాలనుకోవడం హేయం. అలాంటివారు చంద్రబాబుగారు, బాలకృష్ణగారు. అంటే ఒక మహిళ గౌరవం మీద తొక్కి నడుచుకుంటూ వెళ్లి సింహాసనం మీద కూర్చోవాలి అనుకోవడం దుర్మార్గం. ఇది చాలా దిగజారుడుతనం.

రామ్‌: అమ్మకు ఎన్నో పరీక్షలు....నాన్న చనిపోయినప్పుడు ఓ ఇంటర్వ్యూలో నాతో అన్నారు. ‘రాజశేఖరరెడ్డిని అంతగా ప్రేమించి, ఆయన చనిపోతే గుండె ఆగి చనిపోయారు. నేను ఇంకా బతికే ఉన్నాను’ అని కుమిలి కుమిలి ఏడ్చారు. ఇవాళ మళ్లీ మొత్తం జర్నీలో...ప్రతిసారి మీ కోసం కానీ, జగన్‌ కోసం కానీ ఆవిడ కష్టపడుతూనే ఉన్నారు. పోరాడుతూనే ఉన్నారు. ఎండల్లో తిరుగుతూనే ఉన్నారు. 
షర్మిల: నేను, అన్న చిన్నవాళ్లం. తిరిగాం. తిరుగుతున్నాం అంటే అర్థం ఉంది. కానీ అమ్మ ఈ వయసులో ఇంత ఎండలో తిరుగుతున్నారు అంటే మాకు బాధగానే ఉంది. కానీ అమ్మా.. నాన్న ఉన్నప్పుడు కూడా నాన్న అంతగా ప్రేమించే ఆంధ్రరాష్ట్ర ప్రజలకోసం రోజూ ప్రార్థన చేసేది.  నాన్న పోయిన తర్వాత అమ్మ ప్రార్థన మానలేదు.. ఈరోజుæ వరకు.  మన రాష్ట్రం మళ్లీ అభివృద్ధి చెందాలని, ఒకప్పుడు రాజశేఖరరెడ్డిగారి హయాంలో అంత సుభిక్షంగా ఉన్న రాష్ట్రానికి ఇంత దుస్థితి వచ్చిందని మళ్లీ ఆంధ్రరాష్ట్రానికి ఆ గ్లోరీ రావాలని నేటికీ ప్రే చేస్తూనే ఉన్నారు. తన కొడుకు ముఖ్యమంత్రి అయితే.. ప్రజలకు తండ్రి చేసిన మంచి పనులన్నీ తనూ చేస్తాడనీ, అందుకే ప్రజల్ని ఒక అవకాశం ఇమ్మని కోరడానికి తనే స్వయంగా ప్రజల్లోకి వచ్చింది. తన కొడుక్కి అవకాశం ఇవ్వమని కోరుతోంది.                   

►ఒక మహిళ గౌరవాన్ని పణంగా పెటై్టనా సరే అధికారం దక్కించుకోవాలనుకోవడం హేయం. ఒక మహిళ గౌరవం మీద తొక్కి నడుచుకుంటూ వెళ్లి సింహాసనం మీద కూర్చోవాలి అనుకోవడం దుర్మార్గం. ఇది చాలా దిగజారుడుతనం.

►చంద్రబాబుగారు ముఖ్యమంత్రిగా ప్రతి విషయంలోనూ విఫలం అయ్యారు. అన్నింటికంటే ముఖ్యం స్పెషల్‌ కేటగిరీ స్టేటస్‌. బీజేపీతో పొత్తు పెట్టుకొని, నాలుగేళ్లు బీజేపీతో సంసారం చేస్తూ కూడా స్పెషల్‌  కేటగిరీ స్టేటస్‌ సాధించుకోలేక పోవడం చంద్రబాబుగారి గ్రేటెస్ట్‌ ఫెయిల్యూర్‌.

 ►రైతులు మోసపోయారు. విద్యార్థులు మోసపోయారు. బీసీలు, దళితులు.. ఇలా అన్ని వర్గాల వారు మోసపోయారు. చంద్రబాబుగారు మోసం చేసేవాడని, మాట మీద నిలబడని వాడని ప్రజలకు అర్థమైపోయింది.

►‘మాట నిలబెట్టుకున్నాను కనుక నాకు ఓట్లు వేయండి’ అని అడిగే ధైర్యం లేదు చంద్రబాబు గారికి. ఎంతసేపూ జగన్‌మోహన్‌ రెడ్డి గారిని తిట్టడం, నిరంతరం అబద్ధపు హామీలు ఇవ్వడం... ఇదే చెబుతోంది కదా.. ఈ ఐదేళ్లలో ప్రజలకు ఆయనేమీ చేయలేదని!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement