ఊరూరా జనసంద్రం  | YS Jagan Created History In Meeting With People | Sakshi
Sakshi News home page

ఊరూరా జనసంద్రం 

Published Tue, Apr 9 2019 5:15 PM | Last Updated on Wed, Apr 10 2019 5:01 AM

YS Jagan Created History In Meeting With People - Sakshi

ఎన్నికల రణరంగంలో మరో కీలక ఘట్టం ముగిసింది. రాష్ట్రంలోని 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల ప్రచార పర్వానికి మంగళవారం సాయంత్రం 6 గంటలతో తెరపడింది. ప్రధాన పార్టీల నాయకుల వ్యూహ, ప్రతివ్యూహాలతో ఎన్నికల ప్రచారం రక్తి కట్టింది. అయితే ఎన్నికల ప్రచారపర్వంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ముందంజలో నిలిచింది. ఆ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన తల్లి, పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ, జగన్‌ సోదరి షర్మిల సుడిగాలి ప్రచారం నిర్వహించారు. మిగతా రాజకీయ పార్టీల అధినేతలు, అభ్యర్థులు సాగించిన ప్రచారంతో పోలిస్తే ఈ ముగ్గురు నేతల ప్రచార సరళి రాష్ట్ర ప్రజలను విభిన్నంగా ఉండి.. ఆకట్టుకునేలా సాగింది. వీరి ప్రచార సభలకు భారీ ఎత్తున హాజరైన ప్రజానీకమే ఇందుకు ఉదాహరణ. ఎర్రటి ఎండల్లోనూ ఈ ముగ్గురు నేతల ప్రచార సభలకు జనం పోటెత్తడం, కదలకుండా ఆసాంతం వారి ప్రసంగాలను ఆలకించడం, హర్షాతిరేకాలతో వారికి జేజేలు పలకడం స్పష్టంగా కనిపించింది. ఒకవైపు సీఎం చంద్రబాబు ప్రచార సభలు పేలవంగా, ఎటువంటి స్పందన లేకుండా కొనసాగగా, మరోవైపు వైఎస్‌ జగన్‌తో పాటు విజయమ్మ, షర్మిల సభలకు జనం హోరెత్తడమేగాక వారి ప్రసంగాలకు భారీ స్పందన లభించడం చూస్తుంటే ప్రజలు ఎంత గట్టిగా మార్పు కోరుకుంటున్నారో అర్థమవుతోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలకు జనప్రవాహం వెల్లువెత్తింది. గత నెల 17వ తేదీన ఆయన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మొత్తం 13 జిల్లాలను చుడుతూ 68 ఎన్నికల ప్రచార సభల్లో ఆయన పాల్గొన్నారు. ఆయన సభలకు మహిళలు, యువత, అవ్వా, తాతలతోసహా అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఏ సభలో చూసినా భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలే. ఇసుక వేస్తే రాలనంతగా సభా ప్రాంగణాలు జనంతో కిటకిటలాడాయి. మండుటెండను సైతం లెక్క చేయకుండా వేల సంఖ్యలో జనం తమ అభిమాన నేతను చూసేందుకు తరలివచ్చారు. చుట్టుపక్కల మిద్దెలు, మేడలు, భారీ భవంతులు, బస్‌షెల్టర్లు ఎటు చూసినా జనమే జనం.

ఆయా ప్రచార సభలు ఏర్పాటైన చోట్ల జగన్‌ హెలిప్యాడ్‌ నుంచి సభ జరిగే ప్రాంతానికి చేరుకోవడానికి సుదీర్ఘ సమయం పట్టిందంటే ప్రజాసందోహం ఎంతగా ఉందో అర్థమవుతుంది. ఇక జగన్‌ ప్రసంగానికి ప్రజల నుంచి భారీ స్పందన వ్యక్తమైంది. ఆయన నోటి వెంట వచ్చిన ప్రతీ మాటకు ప్రజలు జేజేలు పలికారు.  చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావిస్తూ జగన్‌ చేసిన విమర్శలకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది. ఇక సభా ప్రాంగణాలన్నీ జై జగన్‌ అంటూ నినాదాలతో మారుమోగాయి. సీఎం.. సీఎం అంటూ యువతతోపాటు అన్ని వర్గాల ప్రజలూ నినాదాలతో హోరెత్తించారు. అనేక చోట్ల జగన్‌ అన్న ముఖ్యమంత్రి అంటూ ప్లకార్డులు సైతం ప్రదర్శించారు. జగన్‌ సభలకు కనీవినీ ఎరుగని రీతిలో తరలివచ్చిన జన ప్రవాహాన్ని చూసి బందోబస్తుకు వచ్చిన పోలీసులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. 

సూటిగా ప్రతిపక్ష నేత ప్రసంగం.. 
ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రసంగాల పట్ల ప్రజల్లో విశేష స్పందన లభించింది. ముఖ్యంగా తానిచ్చిన ఎన్నికల వాగ్దానాలను అమలు చేయలేకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగనని చెప్పడంపై విద్యావంతులు, ఉన్నతాధికారుల్లో హర్షం వ్యక్తమైంది. ప్రత్యేక హోదా దగ్గర నుంచి నవరత్నాల్లో ప్రతీ అంశాన్ని ఏ విధంగా అమలు చేస్తామనేది జగన్‌ చాలా స్పష్టంగా వివరించారు. ఒకవైపు సీఎం చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో ఏం చేసిందీ చెప్పకుండా ప్రతిపక్ష నేతను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించడమేగాక.. పూర్తిగా ఆయనపై వ్యక్తిగతంగా దూషణలకు పాల్పడ్డారు. అయినప్పటికీ జగన్‌ మాత్రం ఎక్కడా నిగ్రహం కోల్పోకుండా.. పూర్తి సంయమనంతో మాట్లాడారు. ఎవరిపైనా వ్యక్తిగత విమర్శల జోలికి పోలేదు. అధికారంలోకి వస్తే ప్రజలకు తానేమి చేస్తానో స్పష్టంగా చెప్పారు. చంద్రబాబు లేనిపోని పొత్తులను తనకు అంటకట్టడానికి ప్రయత్నిస్తే దాన్ని జగన్‌ సమర్థంగా తిప్పికొట్టారు. కాంగ్రెస్, బీజేపీతోపాటు యాక్టర్‌ పార్టనర్‌తో చంద్రబాబు లోపాయికారీ కుమ్మక్కులను, కుయుక్తులను ఎన్నికల ప్రచార సభల్లో ప్రతిపక్ష నేత ఎండగట్టారు. అంతేగాక కేవలం రెండుపేజీల్లోనే ప్రజలందరికీ అర్థమయ్యేలా ఎన్నికల ప్రణాళికను విడుదల చేయడాన్ని రాజకీయ విశ్లేషకులు ప్రశంసించారు. 

విజయమ్మ ప్రసంగం.. ఉద్వేగభరితం 
వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ ఈ ఎన్నికల్లో సుడిగాలి ప్రచారం చేశారు. ఎండల్ని లెక్కచేయకుండా ఆమె ప్రచార సభల్లో పాల్గొనడమేగాక తనదైన శైలిలో అనర్గళంగా చేసిన ప్రసంగాలు ప్రజల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఉద్వేగపూరితంగా ఆమె చేసిన ప్రసంగాలు ప్రజలను కదిలించాయి. ప్రజలకిచ్చిన మాటకోసమే జగన్‌.. సోనియాను ఎదిరించి మరీ ఓదార్పు యాత్ర చేశారని, ఈ నేపథ్యంలో ప్రజల్లో జగన్‌ పట్ల ఆదరణ పెరిగిపోవడంతో తట్టుకోలేని కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై అక్రమ కేసులు బనాయించాయని, సీబీఐ, ఈడీలతో దాడులు చేయించి.. ఆస్తులు అటాచ్‌ చేశారని, చివరకు విచారణ పేరుతో పిలిచి జైల్లో పెట్టారంటూ జరిగిన సంఘటనలను ఆమె తెలియజేస్తూ, తను ఎందుకు బయటకు రావాల్సి వచ్చిందీ వివరించడం ప్రతీ ఒక్కరినీ కదిలించింది. ఆనాడు తమ కుటుంబం వెంట నిలిచిన ప్రజలకోసం తాను, షర్మిల బయటకు వచ్చామని, ఈరోజు కూడా ప్రజలంతా తమ కుటుంబమనుకునే బయటకు వచ్చామన్న ఆమె మాటలు జనం గుండెలను తాకాయి. చంద్రబాబు అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేశాడంటూ.. ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రస్తావించడంతోపాటు జగన్‌ సీఎం అయితే చేయబోయే పనులను ఆమె అనర్గళంగా చెప్పడం సభికులను విశేషంగా ఆకట్టుకుంది. కేసులకు భయపడి కేసీఆర్, మోదీతో జగన్‌ కలిశాడంటూ చంద్రబాబు చేస్తున్న విషప్రచారాన్ని ఆమె తిప్పికొట్టారు.

దూసుకెళ్లిన షర్మిల.. 
ఇక జగన్‌ సోదరి షర్మిల ఎన్నికల ప్రచారం ప్రజలను ఉర్రూతలూగించారు. చంద్రబాబు ఏవిధంగా అబద్ధాలు చెబుతున్నారో, ప్రజల్ని ఏ విధంగా మోసగించారో ఆమె సూటిగా వివరించారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ విషయంలో రైతులు, డ్వాక్రా మహిళలను చంద్రబాబు వంచించిన తీరును ఆమె కళ్లకు కట్టారు. ఇక ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు చేసిన మోసాన్ని ఆమె ప్రజల ముందుంచారు. సీఎం చంద్రబాబుతోపాటు ఆయన కుమారుడు లోకేశ్‌ వ్యవహార శైలిని ఆమె తూర్పార పట్టిన తీరు బాగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా నిరుద్యోగ యువతలో ఒక్కరికైనా ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా అంటూ ప్రశ్నిస్తూ జనం నుంచే లేదంటూ చెప్పించారు. ఇక జగన్‌పై చంద్రబాబు చేస్తున్న అవాస్తవ పొత్తుల ఆరోపణలను షర్మిల తిప్పికొట్టారు. హరికృష్ణ శవాన్ని ముందు పెట్టుకుని తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పొత్తుల కోసం బేరాలాడిన నువ్వా పౌరుషం గురించి మాట్లాడేది అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలకు జనం నుంచి భారీ స్పందన వచ్చింది. చివరగా ప్రజా తీర్పు బై బై బాబు కావాలంటూ షర్మిల చెప్పగా ఆయా సభలకు హాజరైన ప్రజానీకం ఆమెతో గొంతు కలపడం విశేషం. 

విజయమ్మ.. 27 సభలు, షర్మిల.. 39 సభలు 
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తల్లి, పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ, జగన్‌ సోదరి షర్మిల కూడా ఈ ఎన్నికల్లో పార్టీ తరఫున విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మొత్తంగా వారిద్దరూ కలసి 66 సభల్లో పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. మొత్తం 20 రోజుల పర్యటనలో వైఎస్‌ విజయమ్మ 27, షర్మిల 39 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన సభల్లో పాల్గొని ప్రసంగించారు. విజయమ్మ 9 జిల్లాల పరిధిలోనూ, షర్మిల 6 జిల్లాల పరిధిలోనూ పర్యటించారు. 

ఆలోచింపజేసిన విజయమ్మ మాటలు
- రాజశేఖరరెడ్డి గారిలా జగన్‌ మాట ఇస్తే తప్పడు. వాళ్ల నాన్న మాదిరి పరిపాలన అందిస్తాడు. 
జగన్‌కు ఒక్కసారి అవకాశం ఇవ్వండి.  
ఈరోజు ధర్మానికి, అధర్మానికి మధ్య యుద్ధం జరుగుతోంది.. విలువలకు, విశ్వసనీయతకు పట్టం కట్టండి. 
జగన్‌ సోనియా గాంధీనే ఎదిరించి నిలిచినవాడు.. ఈరోజు కేసులకు భయపడతాడా? ఓటమి భయంతో చంద్రబాబు ఇష్టానురీతిన దుష్ప్రచారం చేస్తున్నారు. 

షర్మిల.. జగనన్న ‘బాణం’ 
మాకు ఎవ్వరితోనూ పొత్తుల్లేవు. సింహం సింగిల్‌గానే వస్తుంది.. నక్కలే గుంపులుగా వస్తాయి.  
ఎన్నికల ముంగిట పసుపు–కుంకుమ పేరిట ఇస్తున్న డబ్బులు డ్వాక్రా రుణాల వడ్డీలకు కూడా సరిపోవు. 
బాబు వస్తే జాబు రాలేదు కానీ కరువు వచ్చింది. 
రాష్ట్రంలోని యువతకు ఉద్యోగాలు లేవు కానీ ఎటువంటి అనుభవం లేని సీఎం తనయుడు లోకేశ్‌కు మాత్రం ఉద్యోగం వచ్చింది. ఏకంగా మూడు ఉద్యోగాలు (మంత్రి పదవులు) దక్కాయి. 
ప్రజా తీర్పు.. బై బై బాబు   

13 జిల్లాలు.. 68 సభలు జగన్‌ ఎన్నికల ప్రచారం 
ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సుడిగాలి ప్రచారం నిర్వహించారు. ఆయన 13 జిల్లాల్లో 68 నియోజక వర్గాల్లో పర్యటించి పార్టీ లోక్‌సభ, శాసనసభ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. మార్చి 17వ తేదీన తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సమాధి, ఇడుపులపాయ వద్ద సంచలన రీతిలో ఒకేసారి 175 మంది అసెంబ్లీ, 25 మంది లోక్‌సభ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన జగన్‌ అదే రోజు నుంచే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. 20 రోజులపాటు ఆయన 25 పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలో అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. ప్రచార గడువు చివరి రోజైన మంగళవారం ఆయన పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో ముగించారు. మంగళవారం వరకూ ఆయన మొత్తం 68 సభల్లో ప్రచారం చేశారు. అనంతపురం జిల్లాలో 6 నియోజకవర్గాల్లో, కర్నూలు–6, వైఎస్సార్‌–5, చిత్తూరు–5, నెల్లూరు–3, ప్రకాశం–5, గుంటూరు–8, కృష్ణా–6, పశ్చిమగోదావరి–6, తూ.గోదావరి–7, విశాఖపట్నం–6, విజయనగరం–3, శ్రీకాకుళం జిల్లాలో 2 నియోజక వర్గాల్లో జగన్‌ పర్యటించారని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్‌ తెలిపారు.  

జ‘గన్‌’ తూటాలు.. 
ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసిన తర్వాతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడుగుతా.. అమలు చేయలేకపోతే ఓట్లు అడగను. 
మాకు ఎవరితోనూ పొత్తు లేదు. ఒంటరిగానే పోటీ చేస్తున్నాం. 
ప్రజలు 25 పార్లమెంట్‌ స్థానాలు వైఎస్సార్‌సీపీకి ఇస్తే కేంద్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రత్యేక హోదాపై సంతకం చేసిన తర్వాతనే మద్దతు ఇస్తాం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement