సాక్షి, విజయవాడ: అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.2500 కోట్లు ఇస్తే ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు ఒక్క భవనం కూడా నిర్మించలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ఏపీకి కీలకమైన పోలవరం ప్రాజెక్టు కూడా ఇప్పటి వరకు పూర్తి చేయలేకపోయారని అన్నారు. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో రైతులు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగులను ఇలా అన్ని రంగాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు. జాబు రావాలంటే బాబు రావలన్నారని.. కానీ ఒక్క నిరుద్యోగికి కూడా ఉద్యోగం రాలేదని విమర్శించారు. ఆయన కుమారుడు లోకేష్‌కు మాత్రం మంత్రి పదవి వచ్చిందని, ఒక్క ఎన్నిక కూడా గెలవకున్నా ఏకంగా మూడు శాఖలకు మంత్రిని చేశారని ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణా జిల్లాలోని విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ షర్మిల పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాసరావుని, ఎంపీ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్‌ని గెలిపించాలని విజ్ఙప్తి చేశారు.
సభలో వైఎస్ షర్మిల ప్రసంగిస్తూ.. ‘‘రాష్ట్రానికి ఊపిరి లాంటి ప్రత్యేక హోదాను చంద్రబాబు తాకట్టుపెట్టారు. ఎన్నికల సమీపిస్తున్న వేళ మోరోసారి హోదా పేరుతో మోసం చేస్తున్నారు. గతంలో నాలుగేళ్లు బీజేపీతో సంసారం చేసి.. ఇప్పుడు కాంగ్రెస్‌తో జట్టు కట్టారు. తమకు బీజేపీ, టీఆర్‌ఎస్‌తో పొత్తు ఉందంటూ అసత్య ప్రచారం చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీకి ఎవ్వరితోనూ పొత్తు అవసరం లేదు. వైఎస్ జగన్ సింగిల్‌గా వస్తారు. టీఆర్‌ఎస్‌తో పొత్తుకు వెంపర్లాడింది చంద్రబాబు కాదా?. వైఎస్ జగన్‌ను సింగిల్‌గా ఎదుర్కొనే ధైర్యంలేక.. మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, ఫరూక్ అబ్దుల్లా, దేవెగౌడ వంటి నేతలను తోడు తెచ్చుకుంటున్నారు. మీ భవిష్యత్తు నా బాధ్యత అంటూ చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. గడిచిన ఐదేళ్లు ఆయన బాధ్యత కాదా?. మరోసారి ఆయనకు అధికారం అప్పగిస్తే మన బతుకులను నాశనం చేస్తారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో జరిగిన అవినీతి గత 40 ఏళ్లలో జరగలేదని ఆయనతో పనిచేసిన మాజీ సీఎస్ అజయ్ కల్లం బహిరంగంగా చెప్పారు. ఇలాంటి వ్యక్తికి మరోసారి అధికారం ఇస్తామా?.
పౌరుషం గురించి చంద్రబాబు మాట్లాడం హాస్యాస్పదం. పిల్లనిచ్చిన సొంత మామనే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు. ఓట్ల కోసం టీడీపీ నేతలు మీ ఇళ్లకు వస్తున్నారు. వారు వచ్చినప్పుడు గతంలో ఇచ్చిన హామీల గురించి నిలదీయండి. ఒకపైపు ప్రజలను మోసం చేసిన చంద్రబాబు మరోవైపు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే వైఎస్ జగన్. న్యాయం వైపు నిలబడండి. రాజన్న రాజ్యం రావాలంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలి. ప్రతి పేదవాడిని ఆదుకుంటాం. యూనివర్సెల్ హెల్త్ స్కీం ద్వారా అందరికి ఉచిత వైద్యం కల్పిస్తాం. మహిళలకు, రైతులకు రుణాలు ఇస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తాం. 75శాతం ఉద్యోగాలు స్థానికులకే వచ్చే విధంగా చట్టం తీసుకువస్తారు. ప్రతి పేదవాడికి ఇళ్లు ఉండాలంటే వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావాలి’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment