సాక్షి, జగ్గయ్యపేట: ‘ బీజేపీతో నాలుగేళ్లు పొత్తు పెట్టుకుంది చంద్రబాబు. హరికృష్ణ మృతదేహాన్ని పక్కన పెట్టుకుని టీఆర్‌ఎస్‌తో పొత్తుకు వెంపర్లాడింది చంద్రబాబు. అలాంటి చంద్రబాబు వైఎస్సార్‌సీపీ మీద దుష్ప్రాచారం చేస్తున్నారు. మాకు ఏ పార్టీతో పొత్తు లేదు... ఆ అవసరం కూడా లేదు. సింహం సింగిల్‌గానే వస్తుంది. జగనమోహన్‌రెడ్డిగారు సింగిల్‌గానే బంపర్ మెజారిటీతో గెలుస్తారని సర్వేలన్నీ చెప్తున్నాయి. నక్కలే గుంపులుగా వస్తాయి. అందుకే చంద్రబాబు కాంగ్రెస్‌ను, జనసేనను, మమతా బెనర్జీని , కేజ్రీవాల్‌ను, దేవేగౌడ్‌ను, ఫరూక్ అబ్దుల్లాను తోడు తెచ్చుకున్నారు. చంద్రబాబు ఆయన కొడుకు లోకేశ్ కలిసి రాష్ట్రాన్ని లూఠీ చేశారు. కొడుకేమో పప్పు, తండ్రేమో గన్నేరు పప్పు అని అందరు అనుకుంటున్నారు. జగనన్నే కాబోయే ముఖ్యమంత్రి’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో జరిగిన వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార సభలో షర్మిల ప్రసంగించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ ఎంపీ అభ్యర్థి పొట్లూరి ప్రసాద్‌ను, జగ్గయ్యపేట ఎమ్మెల్యే అభ్యర్థి సామినేని ఉదయభానును భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. వాగ్ధానాలు చేయడమే కాదు.. ఇచ్చిన మాటను మీద నిలబడే నైజం రాజన్న వంశానిదని షర్మిల అన్నారు.
అవినీతి, అబద్దాలకు చంద్రబాబు మారుపేరు..
ఇంకా షర్మిల మాట్లాడుతూ.. ‘దివంగత మహానేత రాజశేఖరరెడ్డి గారు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ ఐదేళ్లలో ప్రతి రైతు కుటుంబం ధైర్యంగా ఉండేది. ప్రతి పేద కుటుంబానికి భరోసా ఉండేది. ప్రతి మహిళకు నాకు అండ ఉందనే ధైర్యం ఉండేది. ప్రతి విద్యార్థికి నా చదవుకు డోకా లేదు ఉద్యోగం వస్తుందనే ధైర్యం ఉండేది. ప్రతి పేదవాడు కార్పొరేటు ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకునే ఆరోగ్య శ్రీ ఉండేది. ఫోన్ చేస్తే 20 నిమిషాల్లో వచ్చే 108 ఉండేది. ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని శ్రమించాడు. ప్రతి పేదవాడికి ఇళ్లు ఇవ్వాలని ఆశపడ్డాడు. ఐదేళ్లలో ఒక్క రూపాయి ఏ చార్జీ పెంచకుండా.. ఏ పన్ను పెంచకుండా.. అన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేసి సీఎం ఎలా ఉండాలో వైఎస్సార్ చూపించారు. కులం, మతం, పార్టీలతో సంబంధం లేకుండా వైఎస్సార్ ప్రతి ఒక్కరికి మేలు చేశారు.ముఖ్యమంత్రి హోదాలో కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా మేలు చేసింది వైఎస్సార్ మాత్రమే.
ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు వెన్నుపోటుకు, అబద్ధాలకు, అవినీతికి, అరాచకానికి మారుపేరు. రైతులకు, మహిళలను చంద్రబాబు దగా చేశారు. డ్వాక్రా మహిళను రుణమాఫీ పేరుతో మోసం చేశారు. డ్వాక్రా మహిళలకు ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదు. పసుపు-కుంకుమ పేరుతో చంద్రబాబు మళ్లీ మహిళలను మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. పసుపు-కుంకుమ పేరిట చంద్రబాబు ఎంగిలి చేయి విదిలిస్తున్నారు. ఆ డబ్బులు వడ్డీకి కూడా సరిపోవు. విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తున్నారా?. ఫీజు రీయింబర్స్‌మెంట్ లేక తల్లిదండ్రులు ఫీజులు చెల్లించని స్థితిలో చాలామంది పిల్లలు చదువుకు దూరమవుతున్నారు. ఆరోగ్య శ్రీ జాబితా నుంచి కార్పొరేటు ఆస్పత్రులను తొలగించారు. కానీ చంద్రబాబు నాయుడు కుటుంబం ప్రభుత్వ ఆస్పత్రికి కెళ్లి వైద్యం చేయించుకుంటుందా?.
చంద్రబాబు మాట మీద నిలబడ్డారా?
16వేల కోట్ల రూపాయల అంచనా ఉన్న పోలవరాన్ని తన కమిషన్ల కోసం 60వేల కోట్లకు చంద్రబాబు పెంచారు. తన బినామీల కోసం కేంద్రం కట్టాల్సిన పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు తానే కడతానని తీసుకున్నారు. మూడేళ్లలో పోలవరం పూర్తి చేస్తానన్న చంద్రబాబు మాట మీద నిలబడ్డారా?. చంద్రబాబుకు మాట మీద నిలబడే నైజం లేదు. రాజధాని విషయంలో చాలా అనుభవం ఉంది.. హైదరాబాద్‌ను అంతా నేనే కట్టేశానని చంద్రబాబు చెప్పారు. రాజధాని గొప్పగా కబుర్లు చెప్పారు. కానీ ఒక్క శాశ్వత నిర్మాణం అయిన చేపట్టారా?. అబద్దపు ప్రచారం చేసుకోని చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. బీజేపీ ప్రభుత్వం 2500 కోట్లు ఇచ్చామని చెబుతుంటే చంద్రబాబు రాజధానిలో చేసిందేమీ లేదు. ఆ డబ్బులు అన్ని ఎక్కడ ఉన్నట్టు?. ఆ డబ్బు చంద్రబాబు బొజ్జలో ఉన్నట్టు. అమ్మకు అన్నం పెట్టడు కానీ పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానని అన్నట్టు ఉంది చంద్రబాబు తీరు. ఈ ఐదేళ్లలో అమరావతిలో ఒక శాశ్వత నిర్మాణం చేపట్టని చంద్రబాబు.. మళ్లీ అధికారం ఇస్తే అమెరికా చేస్తానని అంటున్నారు. శ్రీకాకుళంను హైదరాబాద్ చేస్తానని మన చెవుల్లో పూలు పెట్టారు. క్యాబేజీలు కూడా పెడతారట.
ఎన్నికలయ్యాక చంద్రబాబు ఏం చేస్తారో..
బాబు వస్తే జాబు వస్తుందన్నారు. కానీ చంద్రబాబు గారి కుమారుడు లోకేశ్‌కు మాత్రమే జాబు వచ్చింది. ఏకంగా లోకేశ్‌కు మూడు మంత్రి పదవులు ఇచ్చారు. ఆయన తెలివిమంతుడు అనుకుంటే.. ఈ లోకేశ్‌కు జయంతికి, వర్ధంతికి తేడా తెలియదు. అ,ఆలు కూడా రావు కానీ అగ్రతాంబులం నాకే అన్నట్టు ఉంది. ఒక్క ఎన్నిక కూడా గెలవకుండానే లోకేశ్‌కు మంత్రి పదవి కట్టబెట్టారు. చంద్రబాబుది పుత్ర వాత్సల్యం కాదా?. ఇప్పుడు చంద్రబాబు మీ భవిష్యత్తు నా భాద్యత అని అంటున్నారు. గత ఐదేళ్లుగా ప్రజల భవిష్యత్తు చంద్రబాబు బాధ్యత కాదా?. చంద్రబాబు కొడుక్కు మూడు ఉద్యోగాలు.. మాములు యువతకు ఉద్యోగాలు లేవు, నోటిఫికేషనులు లేవు. ఈ ఐదేళ్లు లోకేశ్ కోసమే చంద్రబాబు పనిచేశారు. ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి ఎంతో అవసరం. హోదా లేకుంటే ఉద్యోగాలు రావు, పరిశ్రమలు రావు. ప్రత్యేక హోదా ఏపీకి ఊపిరి. గత ఎన్నికలప్పుడు 15 ఏళ్లు ప్రత్యేక హోదా అడిగిన చంద్రబాబు సీఎం అయ్యాక బీజేపీతో కలిసి హోదాను తాకట్టు పెట్టారు. అప్పుడు కమిషన్ల కోసం ఆశపడ్డారు. మళ్లీ ఎన్నికలు వచ్చేసరికి ప్రత్యేక హోదా అని నమ్మబలుకుతున్నారు. మళ్లీ ఎన్నికలయ్యాక ఏం చేస్తారో?. చంద్రబాబు గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు.. ఇప్పుడు కాంగ్రెస్‌తో కలిసి వస్తున్నారు. చంద్రబాబుకు రెండు నాలుకలు ఉంటాయి కాబట్టే రెండు వేళ్లు చూపెడుతు ఉంటారు. ఎవరికైనా టీడీపీ వాళ్లు రెండు వేళ్లు చూపెడితే మీకు రెండు నాలుకలు ఉన్నాయి నిజమేనని చెప్పాలి.
అందుకే చంద్రబాబు నిజాలు మాట్లాడారు..
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశం బతికి ఉందంటే అది కేవలం వైఎస్ జగన వల్లనే. హోదా కోసం ఢిల్లీ వేదికగా వైఎస్ జగన్ ధర్నాలు, దీక్షలు చేశారు. రాష్ట్రంలో రోజుల తరబడి నిరహార దీక్షలు చేపట్టారు. బంద్‌లు చేశారు, యువభేరీలుపెట్టారు. అఖరికి వైఎస్సార్ సీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసి త్యాగం చేశారు.ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ ఊరురా తిరిగి హోదా కోసం పోరాడకపోతే.. ఈ రోజు చంద్రబాబు యూ టర్న్ తీసుకునేవారా?. చంద్రబాబు నోట హోదా మాట వచ్చేదా?. కానీ చంద్రబాబు గారు నిజం చెప్పరు. ఎందుకంటే నాన్నగారు చెప్పారు.. చంద్రబాబు నెత్తి మీద శాపం ఉందంటా. ఏ రోజైతే చంద్రబాబు గారు ఒక్క నిజం చెబితే, ఆ రోజు చంద్రబాబు గారి తలకాయ వెయ్యి ముక్కలు అవుతుందటా. అందుకే ఆయన ఎప్పుడు నిజాలు మాట్లాడారు.
చంద్రబాబు దగ్గర పనిచేసిన సీఎస్ అజేయ కల్లెం.. ఈ ఐదేళ్లలో గత 40 ఏళ్లలో చేయని అప్పు చేశారని చెబుతున్నారు. కొడుకు, తండ్రి కలిసి రాష్ట్రాన్ని నాశనం చేశారు. మన భవిష్యత్తును వీళ్ల చేతుల్లో పెడితే నాశనం చేస్తారు. నారారూప రాక్షసులు వీళ్లు. ప్రత్యేక హోదా విషయంలో, రాజధాని కట్టే విషయంలో, వ్యవసాయ ఉత్పత్తి పెంచే విషయంలో, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపే విషయంలో ఇలా అన్నిటా చంద్రబాబు విఫలమయ్యారు. జగనన్న ఈ తొమ్మిదేళ్లు నీతివంతమైన రాజకీయాలు చేశారు. పాదయాత్ర 3,648 కి.మీ చేశారు. ప్రజ సమస్యలను దగ్గరగా చూశారు. ప్రతి సమస్యల్లో ప్రజల పక్షాన నిలిచారు. ఇతర పార్టీ నుంచి గెలిచిన వారిని తమ పార్టీలో చేర్చుకుని చంద్రబాబులా జగనన్న రాజకీయ వ్యభిచారం చేయలేదు. అధికారం కోసం నిలబెట్టుకోలేని హామీలను జగనన్న ఎప్పుడు ఇవ్వలేదు. పిల్లనిచ్చిన మామ దగ్గరికే తీస్తే ఆయన పార్టీని చంద్రబాబు కబ్జా చేశారు. ఈ ఎన్నికలు మంచికి, చేడుకి మధ్య జరుగుతున్న ఎన్నికలు. ఓదార్పు యాత్ర పేరిట ఇచ్చిన మాట కోసం మంత్రి పదవిని సైతం జగనన్న వద్దన్నారు. దివంగత మహానేత చనిపోతే 700 మందికి పైగా బాధతో మరణించారు.
ఈ అవినీతి పాలన పోవాలంటే, రాజన్న రాజ్యం రావాలన్నా, వ్యవసాయం పండగ కావాలంటే, మాట తప్పనివాడు కావాలంటే, మడమతిప్పని వాడు కావాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలి. కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా సేవ చేయాలని వైఎస్ జగన్ ఆశపడుతున్నారు. ఒక్క అవకాశం ఇవ్వమని అడుగుతున్నాం. జగనన్న ముఖ్యమంత్రి అయితే రైతన్న తలెత్తుకునేలా చేస్తాం. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ప్రతి రైతన్నకు పెట్టుబడి సాయంగా మే నెలలోనే రూ. 12, 500 అందిస్తారు. గిట్టుబాటు ధర కోసం 3వేల కోట్ల రూపాయలతో నిధి ఏర్పాటు చేస్తారు. కరువులు, ప్రకృతి విపత్తులు వస్తే రైతులు ఎదర్కొవడానికి 4వేల కోట్ల రూపాయలతో మరో నిధిని ఏర్పాటు చేస్తారు.కరువులు వచ్చినప్పుడు రైతులు నష్టపోకుండా నాలుగు వేల కోట్లతో నిధి ఏర్పాటు చేస్తాం. అగ్రిగోల్డ్ బాధితులకు తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తామ’ని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment