ప్రతి పేదవాడికి ఇళ్లు.. ప్రతి ఎకరాకు నీరు.. | YS Sharmila Speech At Tenali Public Meeting | Sakshi
Sakshi News home page

ప్రతి పేదవాడికి ఇళ్లు.. ప్రతి ఎకరాకు నీరు..

Published Mon, Apr 1 2019 6:55 PM | Last Updated on Mon, Apr 1 2019 8:00 PM

YS Sharmila Speech At Tenali Public Meeting - Sakshi

సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవారికి ఇళ్లు.. ప్రతి ఎకరాకు నీరు అందిస్తామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల తెలిపారు. అవినీతి పోవాలంటే, ఉద్యోగాలు రావాలంటే వైఎస్‌ జగన్‌ అధికారంలోకి రావాలని షర్మిల పిలుపునిచ్చారు. వైఎస్సార్‌ సీపీ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుందంటూ చేస్తున్న దుష్ప్రచారంపై మండిపడ్డారు. తమకు ఏ పార్టీతోను పొత్తు లేదని స్పష్టం చేశారు. సోమవారం గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన బహిరంగ సభలో వైఎస్‌ షర్మిల ప్రసంగించారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రతి ఒక్కరినీ మోసం చేసిందన్నారు. లోకేశ్‌కు ఏ అర్హత ఉందని మూడు మంత్రిత్వ శాఖలు అప్పచెప్పారని ప్రశ్నించారు. 

ఇంకా షర్మిల మాట్లాడుతూ..‘ జగనన్న ఈసారి తప్పకుండా సీఎం అవుతారు. మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాలన గురించి నేను మీకు చెప్పక్కర్లేదు. ఫోన్‌ చేస్తే 20 నిమిషాల్లో వచ్చే 108 ఉండేంది. ఏ వ్యాధి అయినా, ఏ ఆస్పత్రి అయినా ఉచితంగా వైద్యం చేయించుకునే అవకాశం ఉండేంది. ప్రతి పేదవాడికి పక్కా ఇళ్లు ఉండాలనేది వైఎస్సార్‌ కళ. నీది నాది అనే తేడా లేకుండా ప్రతి ఒక్క వర్గానికి మేలు చేసిన నాయకుడు వైఎస్సార్‌ మాత్రమే. రుణమాఫీ పేరిట చంద్రబాబు రైతులను, డ్వాక్రా మహిళలను మోసం చేశారు. 2014 ఎన్నికల్లో 600కు పైగా వాగ్ధానాలు చేసి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. అయితే అందులో ఏ ఒక్కటి నెరవేర్చలేదు. ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలో వైఎస్సార్‌ పాలన చూస్తే తెలుస్తోంది.
 

ఆ డబ్బులు వడ్డీకి కూడా సరిపోవు..
చంద్రబాబు పాలనలో ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు. యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి దగా చేశారు. బాబు వస్తే జాబు వస్తుందన్నారు.. కానీ కరువు వచ్చింది. నిరుద్యోగులకు జాబు రాలేదు కానీ.. చంద్రబాబు గారి కొడుకు లోకేశ్‌కు మూడు ఉద్యోగాలు వచ్చాయి. ఈ లోకేశ్‌కు కనీసం జయంతికి, వర్ధంతికి తేడా తెలియదు. ఒక్క ఎన్నిక కూడా గెలవని లోకేశ్‌ను మూడు శాఖలకు మంత్రిని చేసి మన నెత్తిన కూర్చొపెట్టారు. ఏం అర్హత ఉందని లోకేశ్‌ను మంత్రిని చేశారు?. లోకేశ్‌కేమో మూడు ఉద్యోగాలు.. యువతకేమో మొండిచేయి. డ్వాక్రా మహిళలుకు రుణమాఫీ చేస్తానన్న చంద్రబాబు.. ఇప్పుడు పసుపు కుంకుమ పేరిట మహిళలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. పసుపు కుంకుమ కింద ఇచ్చే డబ్బులు డ్వాక్రా మహిళల వడ్డీలకు కూడా సరిపోవు. 

చంద్రబాబు ఉసరవెల్లిలా రంగులు మారుస్తున్నారు..
ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబు కలిసి రాష్ట్రానికి అన్యాయం చేశారు. బీజేపీ రాష్ట్రానికి ఇంత ఘోరంగా మోసం చేసిందంటే అందుకు కారణం చంద్రబాబు. చంద్రబాబు హోదాపై రోజుకో మాట మాట్లాడుతున్నారు. చంద్రబాబు ఉసరవెల్లిలా రంగులు మారుస్తున్నారు. గతంలో బీజేపీతో కలిసి పోటీ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్‌తో కలుస్తున్నారు. పవన్‌ కల్యాణ్‌ ఒక యాక్టర్‌.. ఆయన రాజకీయ సినిమాలో చంద్రబాబు డైరక్టర్‌.  అందుకే పవన్‌ చంద్రబాబు చెప్పిందే చేస్తున్నారు. ఇద్దరు కలిసే ఉన్నారు. జనసేనకు ఒటేస్తే.. చంద్రబాబుకు ఒటేసినట్టే. చంద్రబాబు ఎల్లో మీడియాతో వైఎస్సార్‌సీపీపై దుష్ప్రచారం చేయిస్తారు. హరికృష్ణ భౌతికకాయాన్ని పక్కనే ఉంచుకుని కేసీఆర్‌తో పొత్తు కోసం చంద్రబాబు ప్రయత్నించారు. తమకు ఏ పార్టీతో పొత్తు లేదు... ఆ అవసరం కూడా లేదు. సింహం సింగిల్‌గానే వస్తుంది. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వస్తుందని అన్ని సర్వేలు చెబుతున్నాయి. 



నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పిన చంద్రబాబు ప్రతి ఇంటికి లక్షా 20వేల రూపాయలు బాకీ పడ్డారు అన్నమాట. చంద్రబాబు మోసపూరిత హామీలు నమ్మి మోసపోకండి. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ప్రతి రైతన్నకు పెట్టుబడి సాయంగా మే నెలలోనే రూ. 12, 500 అందిస్తారు. విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తారు. ఎంత చదువు చదివిన ఆ ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది. అక్కాచెల్లెమ్మలకు సున్నా వడ్డీ రుణాలు ఇవ్వడంతో పాటుగా ఎన్నికల నాటికి ఉన్న బకాయిలను నాలుగు దఫాలుగా మాఫీ చేస్తారు. మళ్లీ సున్నా వడ్డీలకే రుణాలు ఇస్తారు. ఎక్కడ వైద్యం చేయించుకున్నా ఆరోగ్య శ్రీ వర్తింపజేస్తారు. వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శివన్నను, ఎంపీ అభ్యర్థి వేణు గోపాలన్నను గెలిపించమ’ని కోరారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement