సోమవారం తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభకు హాజరైన జనసందోహంలో ఓ భాగం...ప్రసంగిస్తున్న షర్మిల
‘‘విశాఖకు చంద్రబాబు మెట్రో రైలు, మెగా ఐటీ పార్కు తెస్తానన్నారు. బొటానికల్ గార్డెన్, సైన్స్ సిటీ అన్నారు. ఫుడ్ పార్కు, ఓషన్ రివర్... అంటూ ఎన్ని కథలు చెప్పలేదు? మన చెవుల్లో ఎన్ని పువ్వులు పెట్టలేదు? భీమిలీ – కాకినాడ తీర ప్రాంత రహదారి నిర్మిస్తానన్నాడు. విశాఖలో భాగస్వామ్య సదస్సులు నిర్వహించి రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు తెస్తానన్నాడు. 40 లక్షల ఉద్యోగాలు తెస్తానన్నాడు. మరి వచ్చాయా? రాలేదు.. ఐటీ రంగం విశాఖలో రివర్స్ గేర్‌లో ఉంది. కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్నవే మూతపడుతూ ఉద్యోగాలు పోతున్నాయి. ఇదీ చంద్రబాబు ఘనత. ఆయన నిర్లక్ష్యం కారణంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ నష్టాల్లో ఉంది. పర్మినెంట్ ఉద్యోగుల సంఖ్య 24 వేల నుంచి నాలుగు వేలకు పడిపోయింది. నగరంలో ఎక్కడ చూసినా మద్యం ఏరులై పారుతోంది. మహిళలు ఒంటరిగా తిరగలేరు. పెందుర్తిలో ఓ దళిత మహిళను వివస్త్రను చేసి రోడ్డుపై కొడితే చంద్రబాబు ప్రభుత్వం ఒక్కరినైనా శిక్షించిందా? విశాఖ నడిరోడ్డుపై ఓ మహిళపై మానభంగం జరిగితే టీడీపీ ప్రభుత్వం కళ్లు మూసుకుంది. ఇదీ చంద్రబాబు పాలనలో మహిళలకు ఇచ్చే గౌరవం’’
– విశాఖ కంచరపాలెం సభలో షర్మిల
సాక్షి ప్రతినిధి, కాకినాడ, విశాఖపట్నం: సీఎం చంద్రబాబు పాలనలో గూండాలు, రౌడీల రాజ్యం సాగుతోందని, రాష్ట్రంలో మహిళలకు ఎలాంటి రక్షణ లేదని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక దందాను అడ్డుకున్న మహిళా ఎమ్మార్వో వనజాక్షిని టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నడిరోడ్డులో జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్తే ఆయనపై చర్యలు తీసుకోకపోగా చంద్రబాబు మళ్లీ పార్టీ టికెట్ కూడా ఇచ్చారని మండిపడ్డారు. జీతాల కోసం అంగన్‌వాడీ కార్యకర్తలు, పొట్ట కూటి కోసం మధ్యాహ్న భోజన పథకం మహిళలు ఆందోళన చేస్తే చంద్రబాబు చితక బాదించారని గుర్తు చేశారు. విశాఖ ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేసి వంచించిన చంద్రబాబు రూ.వేల కోట్ల విలువైన భూములను సైతం కాజేశారని దుయ్యబట్టారు. బస్సు యాత్ర నిర్వహిస్తున్న షర్మిల సోమవారం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం, ధవళేశ్వరం బస్టాండ్ సెంటర్, విశాఖపట్నంలోని కంచరపాలెం, దుర్గాలమ్మ టెంపుల్ జంక్షన్ వద్ద జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..
అప్పుడా అన్న చచ్చిపోయాడా?
‘వైఎస్సార్ హయాంలో అన్ని వర్గాలు భరోసాగా జీవించాయి. అవినీతి, అక్రమాలు, వెన్నుపోటు, అరాచకాలకు మారుపేరు చంద్రబాబు. విశాఖలో రూ.900 కోట్ల విలువైన భూములను లూలూ అనే కంపెనీకి కారుచౌకగా కట్టబెట్టి రూ. వేల కోట్ల రాయితీలు కల్పించారు. దీనిపై ప్రశ్నిస్తే చంద్రబాబు సమాధానం చెప్పరు. రుణమాఫీ చేస్తానని చెప్పి రైతులు, డ్వాక్రా మహిళలను దగా చేశారు. తనను అన్నగా భావించి ఓటేయాలని అడుగుతున్నాడు ఈ దొంగబాబు. మహిళా ఎమ్మార్వో వనజాక్షిని అధికార పార్టీ ఎమ్మెల్యే జుట్టు పట్టుకుని రోడ్డుమీద ఈడ్చుకెళ్లినప్పుడు చంద్రబాబులో అన్న చచ్చిపోయాడా? గుంటూరులో కాలేజీ విద్యార్థిని రిషితేశ్వరి టీడీపీ నాయకుడి హింస భరించలేక ఆత్మహత్య చేసుకున్నప్పుడు చంద్రబాబులో అన్న ఏమయ్యాడు? చంద్రబాబులాంటి అన్న ఉండటానికి మించిన దురదృష్టం మరొకటి ఉండదు. బాబు పాలనలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ రాకపోవడంతో చదువులు మధ్యలోనే మానేస్తున్నారు. ఆరోగ్యశ్రీని కార్పొరేట్ ఆస్పత్రుల నుంచి తొలగించారు.
చెవిలో పువ్వులు..
అనుభవజ్ఞుడినంటూ అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు ఐదేళ్లుగా అమరావతిలో ఒక్కటైనా శాశ్వత భవనం కట్టలేదు. కనీసం ఒక్క ఫ్లైఓవర్ కూడా నిర్మించలేకపోయారు. రాజధాని నిర్మాణం కోసం కేంద్రం ఇచ్చిన రూ.2,500 కోట్లు ఏమయ్యాయి? టీడీపీ పాలనలో జరిగినంత అవినీతి గత 40 ఏళ్లలో ఎప్పుడూ జరగలేదని మాజీ సీఎస్ అజేయ కల్లాం స్వయంగా చెప్పారు. బాబొస్తే జాబొస్తుందన్నారు కానీ కరువొచ్చింది, చంద్రబాబు కుమారుడు లోకేష్‌కు మాత్రమే ఉద్యోగం వచ్చింది. కనీసం జయంతి, వర్థంతికి కూడా తేడా తెలియని ఈ పప్పుగారిని మూడు శాఖలకు మంత్రిగా చేసి మన నెత్తిన కూర్చోబెట్టారు చంద్రబాబు. రాష్ట్రంలో యువతకు మాత్రం ఉద్యోగాలు లేవు, నోటిఫికేషన్లు లేవు.
ఇలాంటి సీఎం అవసరమా?
ఏపీకి ఊపిరి లాంటి ప్రత్యేక హోదాను చంద్రబాబు నీరుగార్చారు. ఆయనది రెండు నాలుకల ధోరణి. ఇలాంటి అసమర్థ సీఎం మనకు అవసరమా?గత ఎన్నికలకు ముందు 600కిపైగా హామీలిచ్చిన చంద్రబాబు ఒక్కటీ నెరవేర్చకుండా ఇప్పుడు మీ భవిష్యత్తు నా బాధ్యత అంటూ తిరుగుతున్నాడు. ఈ ఐదేళ్లలో ఆయన మీకు బకాయి పడ్డ హామీల డబ్బులను వెంటనే చెల్లించమని నిలదీయండి. అది మీ హక్కు. ఇంటికో ఉద్యోగం లేదంటే నిరుద్యోగ భృతి చెల్లిస్తానని హామీ ఇచ్చారు. ఆ లెక్కన రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ఆయన రూ.1.20 లక్షల చొప్పున బాకీ పడ్డారు. ఆ బాకీలన్నీ వెంటనే చెల్లించమని నిలదీయండి.
పవన్ జనసేనను టీడీపీకి అమ్మేస్తారు...
పవన్ కల్యాణ్ రాజకీయ సినిమాలో చంద్రబాబు దర్శకుడు. ఒక యాక్టర్ డైరెక్టర్ చెప్పింది చెయ్యాలి. పవన్ అందుకే చంద్రబాబు చెప్పినట్లు చేస్తున్నారు. ఇద్దరూ ఒకటే. కలిసే పోటీ చేస్తున్నారు. పవన్ నామినేషన్ కార్యక్రమానికి టీడీపీ కార్యకర్తలు హాజరయ్యారు. చంద్రబాబుకు సన్నిహితుడైన జేడీ లక్ష్మీనారాయణ జనసేన నుంచి పోటీ చేస్తున్నారు. పవన్ అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా స్థాపించి చివరకు అదే పార్టీకి హోల్‌సేల్‌గా అమ్మేశారు. అన్నకు, తమ్ముడికి పోలికలు ఉంటాయి కదా? పవన్ కూడా ఇప్పుడో ఎప్పుడో జనసేనను కూడా అమ్మేస్తారు.. కాకపోతే ఆయన టీడీపీకి అమ్మేస్తారు.. అంతే తేడా.
మాకు బీజేపీతో, కేసీఆర్‌తో పొత్తులున్నాయంటూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడు చంద్రబాబు. హరికృష్ణ మృతదేహం సాక్షిగా కనీసం ఇంగితం లేకుండా కేసీఆర్‌తో పొత్తు కోసం వెంపర్లాడింది చంద్రబాబే. మాకు ఎవరితోనూ పొత్తులు అవసరం లేదు. జగనన్న తొమ్మిదేళ్లుగా ప్రజల్లోనే ఉంటూ విలువలతో కూడిన రాజకీయాలు చేశారు. ఆయనకు ఒక్క అవకాశం ఇవ్వండి. బైబై బాబు.. అంటూ అంతా ప్రజాతీర్పు చెప్పండి’’
Comments
Please login to add a commentAdd a comment