సాక్షి, అమరావతి బ్యూరో: టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశిస్తే..జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పాటిస్తారని, టిక్కెట్ల కేటాయింపు తర్వాత మార్పులు, చేర్పులు జరుగుతున్న తీరు స్పష్టం చేస్తోంది. టీడీపీకి అనుకూలంగా సామాజిక సమీకరణలు చూసుకొని, అందుకు అనుగుణంగా వైఎస్సార్‌సీపీ ఓట్లు చీల్చడానికి ఉన్న అవకాశాలను విశ్లేషించుకున్న తర్వాత, చంద్రబాబు చేస్తున్న సూచనలకు అనుగుణంగా పవన్ కల్యాణ్ జనసేన అభ్యర్థులను మారుస్తున్నారు. కృష్ణా జిల్లా పామర్రు, నూజివీడు సీటు విషయంలో చోటు చేసుకున్న పరిణామాలే ఇందుకు తాజా నిదర్శనమని పరిశీలకులు పేర్కొంటున్నారు. పామర్రు జనసేన టిక్కెట్ తొలుత డీవై దాస్‌కు కేటాయించారు. అయితే అక్కణ్ణుంచి జనసేన అభ్యర్థిని కాకుండా బీఎస్పీ అభ్యర్థిని నిలబెట్టాలని, తద్వారా వైఎస్సార్‌సీపీ ఓట్లు చీల్చడానికి అవకాశం ఉంటుందని చంద్రబాబు ఆదేశించారు. ఆయన ఆదేశాలను పవన్ అక్షరాలా పాటించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 21 రిజర్వుడు స్థానాలకు జనసేన టిక్కెట్లు ఇస్తామని పవన్ తొలుత ప్రకటించారు. అయితే ఆయా స్థానాల్లో వైఎస్సార్‌సీపీ ఓట్లు చీల్చడం ద్వారా టీడీపీకి లబ్ది చేకూరేలా చూడాలని చంద్రబాబు ఎత్తుగడ వేశారు. ఆ మేరకు వెంటనే పవన్‌కల్యాణ్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఆయా స్థానాల్లో జనసేన అభ్యర్థులను కాకుండా బీఎస్పీ అభ్యర్థులను బరిలోకి దించాలంటూ చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలను పవన్ అమలు చేశారు. పామర్రు టిక్కెట్ విషయంలో మోసపోయిన డీవై దాస్‌తో పాటు, పవన్‌ను నమ్మి మోసపోయిన మిగతా నాయకులు కూడా ఇదే చెబుతున్నారు.
సీపీఐకి మొండిచెయ్యి
మొదట్లోనే తమకు తెలియకుండా పవన్ కల్యాణ్ సీట్లు ప్రకటించడంపై సీపీఐ నాయకత్వం అసంతృప్తి ప్రకటించింది. అంతటితో జనసేన దారికొస్తుందని సీపీఐ నాయకులు భావించారు. కానీ ఆ తర్వాత విజయవాడ వెస్ట్, నూజివీడు అసెంబ్లీ స్థానాలు, విజయవాడ పార్లమెంటు స్థానాలను కూడా తమకు ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తీసుకోవడంతో ఆ పార్టీ నాయకత్వం మండిపడుతోంది. చంద్రబాబు చెప్పినట్టే చేస్తున్న పవన్ ఎవరిని మోసం చేయడానికైనా వెనకాడటం లేదని ఆ పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ వెస్ట్‌లో సీపీఐ క్యాడర్ బలంగా ఉంది. గతంలో పలుమార్లు ఆ స్థానంలో గెలిచారు కూడా. దాంతో వెస్ట్ సీటును తమకు కేటాయించాలని సీపీఐ కోరింది. కానీ పవన్ అంగీకరించలేదు.
అందుకు బదులుగా నూజివీడు స్థానాన్ని సీపీఐకి కేటాయిస్తున్నట్లు చెప్పారు. దీంతో అక్కడ అక్కినేని వనజను నిలబెట్టడానికి ఆ పార్టీ ఏర్పాట్లు చేసుకుంది. ఇంతలో చంద్రబాబు అడ్డుతగిలారు. నూజివీడులో వైఎస్సార్‌సీపీ బలంగా ఉందని, టీడీపీ గెలవాలంటే వైఎస్సార్‌సీపీ ఓట్లు చీల్చే మంత్రాంగం అవసరమని చెప్పారు. వైఎస్సార్‌సీపీ నుంచి ఒక నాయకుడిని తీసుకొచ్చి జనసేన నుంచి నిలబెడితే ఓట్ల చీలిక సాధ్యమవుతుందని వివరించారు. చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించిన పవన్‌కల్యాణ్ సీపీఐ అభ్యర్థిని కాదని నూజివీడులో జనసేన అభ్యర్థిని నిలబెట్టారు.
విజయవాడ పార్లమెంటు స్థానమూ పోయింది
నూజివీడు శాపనసభ స్థానానికి బదులుగా విజయవాడ పార్లమెంటు స్థానాన్ని ఇస్తానని సీపీఐని పవన్ నమ్మించారు. దీంతో అక్కడ అభ్యర్థిగా చలసాని అజయ్‌కుమార్‌ను సీపీఐ ఎంపిక చేసింది. పోటీకి ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో... పార్లమెంటు స్థానాన్ని మళ్లీ పెండింగ్‌లో పెడుతూ పవన్ సీపీఐకి సమాచారం పంపించారు. అయితే శనివారం పొద్దుపోయాక విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా ముత్తంశెట్టి కృష్ణబాబును ప్రకటించారు. పవన్ తీరుపై మండిపడుతున్న సీపీఐ.. జనసేనతో తెగదెంపులు చేసుకునే యోచనలో ఉన్నట్లు ఆ పార్టీవర్గాలు వెల్లడించాయి.
చంద్రబాబు ఆదేశిస్తారు..పవన్ పాటిస్తారు
Published Sun, Mar 24 2019 4:31 AM | Last Updated on Sun, Mar 24 2019 11:42 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment