సాక్షి, అమరావతి: అధికారాంతంలో సీఎం చంద్రబాబు మహాకుట్రకు బరితెగిస్తున్నారు. నేరుగా ఎన్నికలను ఎదుర్కోలేక వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబమే లక్ష్యంగా రాజకీయ కుతంత్రానికి తెరతీశారు. అధికారం కోసం అడ్డదారులు తొక్కుతూ అలజడులు సృష్టించే దుర్నీతికి పక్కాగా పన్నాగం పన్నుతున్నారు. చంద్రబాబు డైరెక్షన్‌లో.. ఆయన గుప్పిట్లో ఉండే పోలీస్ బాస్‌లు సూత్రధారులుగా.. బాబు పార్టనర్ పవన్ కల్యాణ్, టీడీపీ అనుకూల మీడియా పాత్రధారులుగా మహాకుట్రకు రంగం సిద్ధమయ్యింది. ఇందుకు ముందస్తు ప్రణాళికతోనే వైఎస్సార్ జిల్లాలో తమ ఎన్నికల అక్రమాలకు అడ్డురాకుండా ఉండేందుకు వైఎస్ వివేకానందరెడ్డిని ఇటీవలే ప్రభుత్వ పెద్దలు పక్కా పన్నాగంతో హత్య చేయించారు. ఆ హత్య కేసులో దోషులకు ఓ వైపు రక్షా కవచంగా నిలుస్తున్న చంద్రబాబు ప్రభుత్వం.. మరోవైపు ఆ హత్యకేసు దర్యాప్తును తప్పుదారి పట్టిస్తూ వైఎస్ కుటుంబసభ్యులు, వైఎస్సార్‌సీపీ నేతలను ఆ జిల్లాలో ఎన్నికల క్షేత్రం నుంచి తప్పించాలని పన్నాగం పన్నుతోంది. అనంతరం వైఎస్సార్ జిల్లాతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అలజడులు సృష్టించి ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేయడం ద్వారా అడ్డూ అదుపు లేకుండా ఎన్నికల అక్రమాలకు పాల్పడేలా గూడుపుఠాణీ చేస్తోంది.
వైఎస్సార్ జిల్లా కేంద్రంగా...
ఐదేళ్లలో విచ్చలవిడి అవినీతితో కూడిన అరాచక పాలన సాగించిన చంద్రబాబు ప్రభుత్వంపై రాష్ట్రవ్యాప్తంగా వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం వీయనుందని పలు జాతీయ చానళ్ల సర్వేలు స్పష్టం చేశాయి. దాంతో అడ్డదారులు తొక్కైనా సరే అధికారాన్ని నిలుపుకునేందుకు సీఎం చంద్రబాబు మహాకుట్రకు తెరతీశారు. వైఎస్సార్ జిల్లాను కేంద్రంగా చేసుకుని రాష్ట్రవ్యాప్తంగా అలజడులు సృష్టించేందుకు సంసిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే ప్రభుత్వ ముఖ్యనేతలు, వైఎస్సార్ జిల్లా టీడీపీ పెద్దలు పక్కా పన్నాగంతో వైఎస్ వివేకానందరెడ్డిని ఈ నెల 15న హత్య చేయించారు. వైఎస్సార్ జిల్లాలో తమ ఎన్నికల అక్రమాలను అడ్డుకుంటారనే ఉద్ధేశంతోనే ఆయన్ని దారుణంగా హత్య చేయించారు. ఇక ఈ కేసు విచారణను పక్కదారి పట్టిస్తూ... వైఎస్ కుటుంబపై అసత్య ఆరోపణలతో బురద జల్లుతూ రాష్ట్రవ్యాప్తంగా అలజడులు సృష్టించేందుకు చంద్రబాబు వ్యూహరచన చేస్తున్నారు.
వైఎస్ కుటుంబమే లక్ష్యంగా...
ఇంటిపెద్ద వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురై ఆ కుటుంబం ఆవేదనలో ఉంటే చంద్రబాబు మాత్రం అమానవీయంగా ప్రవరిస్తున్నారు. ఆ కేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు, మరోవైపు వైఎస్ కుటుంబంపై నిరాధార ఆరోపణలతో విషం కక్కేందుకు సీఎం చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టకముందే చంద్రబాబు మీడియా ముందుకు వచ్చి కేసును పక్కదారి పట్టించేందుకు యత్నించారు. వివేకానందరెడ్డి గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబసభ్యులు ఎవరూ చెప్పకపోయినా... అలా ఎందుకు చెప్పారంటూ ఎదురుదాడికి దిగారు. పోలీసులు వచ్చి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలిస్తే... వైఎస్ కుటుంబసభ్యులు ఎందుకు ఆసుపత్రికి తరలించారంటూ తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు యత్నించారు. ‘ఇంట్లో వాళ్లే హత్య చేశారు’ అని చంద్రబాబు ఏకపక్షంగా ప్రకటించేసి ప్రజలను మోసగించాలని చూశారు. అప్పటికి కనీసం పోస్టుమార్టం నివేదిక కూడా అధికారికంగా అందలేదు.
పోలీసులు అనుమానితులను కనీసం విచారించలేదు. ఫోరెన్సిక్ నివేదికలూ రాలేదు. ఇలా ఈ కేసుకు సంబంధించిన కనీస ప్రాథమిక దర్యాప్తు ప్రక్రియ ఏదీ పూర్తి కాలేదు. కానీ బాధ్యతాయుతమైన సీఎం పదవిలో ఉన్న చంద్రబాబు మాత్రం వైఎస్ వివేకానందరెడ్డిని ఇంట్లో వాళ్లే హత్య చేశారని... సాక్ష్యాలను నాశనం చేసేందుకు ప్రయత్నించారని నిస్సిగ్గుగా అబద్ధాలు వల్లించారు. ఇలా సీఎం నిరాధారంగా ఓ కేసు విషయంలో తీర్పులిచ్చేస్తే ఇక ఆయన నియంత్రణలో ఉండే పోలీసులు ఏం దర్యాప్తు చేస్తారు? సీఎం చెప్పింది సరికాదు ఇదిగో ఇదీ అసలు నిజం అని పోలీసులు చెప్పగలరా? అందుకే చంద్రబాబు చెబుతున్న ప్రకారమే సిట్ విచారణ తంతును సాగదీస్తోంది. ఓ వైపు పోలీసులు పోలింగ్ తేదీ వరకు ఈ కేసును సాగదీయటం, మరోవైపు చంద్రబాబు.. వైఎస్సార్ కుటుంబంపై నిరాధార ఆరోపణలు చేయడమనే పక్కా రాజకీయ కుతంత్రానికి తెరతీశారు. ఇక ఎన్నికల ప్రచారంలో కూడా చంద్రబాబు వైఎస్సార్ కుటుంబంపై విషం కక్కుతున్నారు.
ఐదేళ్లలో తాను ఇది చేశానని చెప్పుకోడానికి ఏమీ లేకపోవడంతో, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును ప్రస్తావిస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య అనంతరం ఆయన తలకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీప బంధువు డాక్టర్ గంగిరెడ్డి కట్టుకట్టారని చంద్రబాబు నిర్లజ్జగా అబద్ధాలు చెబుతున్నారు. వైఎస్ వివేకానందరెడ్డిని మార్చి 15 తెల్లవారుజామున హత్యకు గురైతే ఆ విషయం తెలిసిన తర్వాత ఆ రోజు మధ్యాహ్నం డాక్టర్ గంగిరెడ్డి పులివెందులకు చేరుకున్నారు. కానీ చంద్రబాబు నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రజల్ని మోసగిస్తున్నారు. ‘జగన్ వస్తే రాష్ట్రమంతా పులివెందుల అవుతుంది... కడప అవుతుంది’ అని ఒక ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని విషం కక్కుతున్నారు. ప్రజల్ని దృష్టి మళ్లించి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు శవ రాజకీయాలకు పాల్పడుతున్నారు.
కుట్రదారులకు సహకరిస్తున్న పోలీస్ బాస్‌లు
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో రాష్ట్ర పోలీస్ బాస్‌లు టీడీపీ కార్యకర్తల మాదిరిగా వ్యవహరిస్తుండటం విస్మయపరుస్తోంది. ఆయన్ని హత్య చేసిన అసలు దోషులను గుర్తించడంపై ఏమాత్రం శ్రద్ధ చూపని పోలీస్ ఉన్నతాధికారులు వైఎస్ కుటుంబ సభ్యులను విచారణ పేరుతో వేధిస్తున్నారు. చంద్రబాబు చేస్తున్న ఆరోపణలకు అనుగుణంగానే పోలీసుల విచారణ సాగుతోంది. హత్యకు గురైన వివేకానందరెడ్డి రాసినట్లుగా ఓ లేఖ సృష్టించడం వంటి చర్యలతో కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. వైఎస్ కుటుంబసభ్యులే లక్ష్యంగా ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు అమరావతి నుంచే కేసు విచారణను ప్రభావితం చేస్తున్నారు. డీజీపీ ఆర్పీ ఠాకూర్, ఇంటెలిజెన్స్ విభాగం ఓఎస్డీ యోగానంద్, శాంతిభద్రతల విభాగం కోఆర్డినేషన్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాసరావుతో పాటు పలువురు.. వైఎస్ కుటుంబసభ్యులను వేధించడమే లక్ష్యంగా ఈ కేసు దర్యాప్తులో తలో చేయి వేస్తున్నారు.
చంద్రబాబుకు పార్టనర్ పవన్ కల్యాణ్ వత్తాసు
చంద్రబాబు పార్టనర్ పవన్ కల్యాణ్ తాజాగా ఈ శవ రాజకీయాల కుట్రలో భాగస్వాములయ్యారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగితే ఖండించేందుకు ఆయనకు నోరురాలేదు. కానీ వివేకాను వైఎస్ కుటుంబసభ్యులే హత్య చేశారంటూ చంద్రబాబుకు వంత పాడుతున్నారు. పవన్ కలాŠయ్‌ణ్ రెండు రోజులుగా వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అసత్య ఆరోపణలు చేస్తూ చంద్రబాబుకు వత్తాసు పలుకుతున్నారు. తద్వారా ఒకే అబద్ధాన్ని చంద్రబాబు, పవన్‌కల్యాణ్ ఇద్దరూ ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా ఆరోపిస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ కుట్రలో టీడీపీ అనుకూల మీడియా కూడా ప్రధాన పాత్ర పోషిస్తోంది. వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తు ప్రక్రియ పేరిట టీడీపీ చెబుతున్న అవాస్తవాలను బాధ్యతరహితంగా ప్రచారంలోకి తీసుకువస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే టీడీపీ అనుకూల పత్రికలు, టీవీ చానళ్లు ఆ పార్టీ అధికార ప్రతినిధుల మాదిరిగా వ్యవహరిస్తున్నాయనే విమర్శలు పెద్దయెత్తున వస్తున్నాయి.
సీబీఐ విచారణకు ఎందుకు ఇవ్వరు...!?
టీడీపీ పెద్దలు సూత్రధారులుగా చేసిన వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసును రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు నిష్పాక్షికంగా విచారించరని వైఎస్సార్ కాంగ్రెస్‌తో పాటు రాష్ట్ర ప్రజానీకం కోడైకూస్తోంది. అందుకే ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగించాలని వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం అందుకు సమ్మతించ లేదు. 2005లో పరిటాల రవి హత్యకు గురైతే అప్పట్లో తెలుగుదేశం సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తే అప్పటి సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వెనువెంటనే అంగీకరించారు. ఆ హత్యలో వైఎస్ ప్రభుత్వ ప్రమేయంగానీ, ఆయన కుటుంబసభ్యుల ప్రమేయంగానీ ఏమీ లేదని సీబీఐ నిగ్గుతేల్చింది. ప్రస్తుతం వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐకి ఎందుకు అప్పగించడం లేదని రాజకీయ పరిశీలకులు నిలదీస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం స్పందించడమే లేదు.
తన తండ్రి హత్య కేసును రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకునేలా చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. తమ అన్నయ్య వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై నిరాధారణ ఆరోపణలు చేస్తున్నారని ఆమె తమ ఫిర్యాదులో స్పష్టంగా పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచనతో ఆమె కేంద్ర హోంశాఖ కార్యదర్శితో శుక్రవారం భేటీ అయ్యి తన తండ్రి హత్య ఆ కేసును సీబీఐకి అప్పగించాలని కోరారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఈ కేసును సీబీఐ విచారణకు ఇచ్చేందుకు ససేమిరా అంటోంది. సీబీఐ విచారిస్తే టీడీపీ పెద్దల కుట్ర బట్టబయలవుతుందన్న భయంతోనే చంద్రబాబు అప్పగించడం లేదు. మరోవైపు ఈ కేసు విచారణ పేరుతో రాజకీయకక్ష సాధింపు చర్యలకు పాల్పడవచ్చనేది ఆయన కుతంత్రం.
రాష్ట్రవ్యాప్తంగా అలజడులు, హత్యలకు కుట్ర
ఎన్నికలు సమీపిస్తుండటంతో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా బరితెగించేందుకు సిద్ధపడుతోంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అసలు దోషులను రక్షిస్తూ... వైఎస్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని దుర్నీతికి సిద్ధపడుతున్నారని విశ్వసనీయ సమాచారం. వైఎస్సార్ జిల్లాలో వైఎస్సార్‌సీపీ ముఖ్యనేతలను ఎన్నికల ప్రక్రియ నుంచి తప్పించే పన్నాగం పన్నారు. ఎన్నికల్లో క్రియాశీలకంగా వ్యవహరించే వైఎస్సార్‌సీపీ నేతల పేర్లతో ఓ జాబితాను టీడీపీ నేతలు పోలీసులకు ఇప్పటికే ఇచ్చారు.
ఆ జాబితాలోని నేతలను అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడం ద్వారా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసి మానసికంగా దెబ్బతీయాలన్నది ప్రభుత్వ కుట్ర. ఇప్పటికే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ పేరుతో కొందరు పార్టీ నేతలను పిలిపించి వేధిస్తున్నారు. ఇక రెండో అంకంగా వారిలో కొందరి అరెస్టులు, అక్రమ నిర్బంధాలకు ప్రభుత్వం సిద్ధపడుతున్నట్లు సమాచారం. మరోవైపు ఇదే అవకాశంగా చేసుకుని వైఎస్సార్ జిల్లాలో అలజడులు, హత్యలతో దమనకాండకు తెలుగుదేశం రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు సిద్ధంగా ఉండాల్సిందిగా ఆ పార్టీ అగ్రనాయకత్వం తమ రౌడీ మూకలకు ఆదేశాలిచ్చింది. వారితో దాడులు చేయించి వైఎస్సార్‌సీపీ నేతలపై అభాండాలు మోపాలన్నది వారి పన్నాగం. కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమ సమయంలో అమలు చేసిన దుష్ట వ్యూహాన్నే ప్రస్తుతం కూడా తెరపైకి తెస్తున్నారు.
తూర్పు గోదావరి జిల్లా తునిలో 2016, జనవరి 31న కాపు రిజర్వేషన్ సాధన బహిరంగ సభ జరుగుతుండగా టీడీపీ గూండాలు ముందస్తు వ్యూహంతో ఓ రైలు దహనానికి బరితెగించారు. అది వైఎస్సార్‌సీపీ పనేనని దుష్ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందాలని భావించారు. ప్రస్తుతం అదే తరహాలో వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతలను అక్రమంగా అరెస్టు చేసి టీడీపీ గూండాలతోనే అలజడులు సృష్టించాలన్నది చంద్రబాబు ప్రభుత్వ కుతంత్రంగా తెలుస్తోంది. ఆ అలజడుల సాకుతో జిల్లావ్యాప్తంగా ఉన్న వైఎస్సార్‌సీపీ ముఖ్యనేతలు, అభ్యర్థులను అరెస్టులు చేసి పోలింగ్ నాటికి ఎన్నికల ప్రక్రియలో వారు ప్రత్యక్షంగా పాల్గొనకుండా అడ్డుకునేందుకు వ్యూహం రచించారు.
ఈ పన్నాగం ద్వారా జిల్లాలో తాము యథేచ్ఛగా ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడవచ్చనేది టీడీపీ ఎత్తుగడ. అదే సమయంలో వైఎస్సార్ జిల్లాలో అల్లర్లు వైఎస్సార్‌సీపీ చేయించినవేనని రాష్ట్రవ్యాప్తంగా దుష్ప్రచారం చేయడానికి కూడా టీడీపీ రంగం సిద్ధం చేస్తోంది. ఇతర ప్రాంతాల్లో భయాందోళలను సృష్టించి వైఎస్సార్‌సీపీకి వ్యతిరేకంగా మలచాలని భావిస్తోంది. అందుకు ఇతర జిల్లాల్లో కూడా కొందరు వైఎసాŠస్‌ర్‌సీపీ నేతల అక్రమ అరెస్టులు, నిర్బంధాలకు కూడా సిద్ధపడుతోంది. ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా దాడులు, హత్యలు, అలజడులతో ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేయడానికి చంద్రబాబు ప్రభుత్వం పక్కాగా పన్నాగం పన్నుతోంది. ఎన్నికల అక్రమాలకు పాల్పడటం ద్వారా అప్రజాస్వామిక రీతిలో పార్టీ మళ్లీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా చెలరేగిపోవాలని టీడీపీ ఇప్పటికే తమపార్టీ శ్రేణులకు స్పష్టమైన సూచనలు ఇచ్చింది.
ప్రభుత్వ కుట్రలపట్ల అప్రమత్తంగా ఉండండి: వైఎస్ జగన్
చంద్రబాబు ప్రభుత్వ కుట్ర బట్టబయలు కావడంతో వైఎస్సార్‌సీపీ బాధ్యతాయుతంగా స్పందించింది. రాష్ట్రంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఎక్కడా సంయమనం కోల్పోవద్దని పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందులలో గురువారం నిర్వహించిన ఎన్నికల సభలో కోరారు. కీలకమైన ఎన్నికలకు సమయం దగ్గరపడినందున జాగరూకతతో వ్యవహరించాలని సూచించారు. పార్టీ నేతలను అక్రమ అరెస్టులతో వేధించినా సరే గ్రామాల్లో కార్యకర్తలే ఎన్నికల బాధ్యతను భుజానికెత్తుకుని సజావుగా, శాంతియుతంగా పోలింగ్ జరిగేలా చూడాలని మార్గనిర్దేశం చేశారు. ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్‌సీపీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని పోలింగ్‌ను సజావుగా చేయించుకోవడమే తమ బాధ్యతని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment