దక్షిణ కోస్తా, రాయలసీమల్లో వర్షాలు
23వ తేదీ నాటికి అల్పపీడనంగా..
సాక్షి, విశాఖపట్నం: ఓవైపు చలిగాలులు ప్రారంభమైన తరుణంలో... భారీ వర్షాలు మరోసారి విరుచుకుపడనున్నాయి. దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల మీదుగా గురువారం ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనించి ఆగ్నేయ బంగాళాఖాతంలో 23 నాటికి అల్పపీడనంగా మారనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
అనంతరం.. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ, 25 నాటికి మరింత బలపడి నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందని వెల్లడించారు. క్రమంగా.. ఇది దక్షిణకోస్తా మీదుగా తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు పయనిస్తుందనీ.. లేదంటే.. దక్షిణ కోస్తాంధ్రలోనే తీరం దాటే సూచనలు కూడా ఉన్నాయని వివరించారు.
దీని ప్రభావంతో 25 నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపారు. 23 నుంచి తీరం అల్లకల్లోలంగా ఉంటుందని, తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిమీ వేగంతో బలమైన గాలులు వీస్తాయన్నారు. మత్స్యకారులు 23 నుంచి 27 వరకూ వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment