సాక్షి ,గుంటూరు: అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు అబద్ధాలు చెప్పారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. గురువారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్ర అప్పులపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారన్నారు. 30 వేల మంది మహిళలను అక్రమ రవాణా చేశారని పవన్ కల్యాణ్ తప్పుడు ప్రచారం చేశారని.. మహిళల అక్రమ రవాణా పచ్చి అబద్ధమని అసెంబ్లీ సాక్షిగా కూటమి నేతలే ఒప్పుకున్నారన్నారు.
‘‘పచ్చిఅబద్ధాలు ప్రచారం చేసి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. రుషికొండ భవనాలపై రాష్ట్ర ప్రజలకు పచ్చి అబద్ధాలు చెప్పారు. తప్పుడు హామీలతో వాలంటీర్లను మభ్యపెట్టారు. రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ లేదని అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు చెప్పారు. చంద్రబాబు మాటలు నమ్మి వాలంటీర్లు మోసపోయారు. వాలంటీర్లను మోసం చేశామని అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబే ఒప్పుకున్నారు. అన్ని వర్గాల ప్రజలను కూటమి ప్రభుత్వం మోసం చేసింది.’’ అని కన్నబాబు నిలదీశారు.
‘‘టీడీపీ అబద్దాల పునాదుల మీద బతుకుతోంది. రాష్ట్రానికి రూ.14 లక్షల కోట్ల అప్పులు అని, రాష్ట్రం శ్రీలంకగా మారుతోందని ప్రచారం చేశారు. చివరికి రూ.6 లక్షల కోట్లేనని తేలింది. 30 వేల మంది మహిళలు అక్రమ రవాణా జరిగిందని పవన్ కళ్యాణ్ విషప్రచారం చేశారు. 46 మంది మాత్రమే అని అసెంబ్లీ సాక్షిగా నిగ్గు తేలింది. రూ.3 వేల కోట్లు రంగుల కోసం ఖర్చు చేశారని పవన్, చంద్రబాబు ఆరోపణలు చేశారు. కానీ అదే పవన్ కల్యాణ్ అసెంబ్లీలో రంగులు వేయటానికి, తొలగించటానికి రూ.101 కోట్లేనని చెప్పారు
..రిషికొండ మీద ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ భవనాలు కట్టారని నిసిగ్గుగా ఆరోపణలు చేశారు. కానీ ఇవాళ అన్ని అనుమతులు ఉన్నాయని అసెంబ్లీలో చెప్పారు. వాలంటీర్లకు రూ.10 వేల జీతం ఇస్తానని చెప్పి, ఇప్పుడు అసలు వాలంటీర్ల వ్యవస్థ లేదని అబద్దాలు చెప్తున్నారు. ఇంత మాట్లాడటానికి ఏమాత్రం సిగ్గు అనిపించటం లేదా?. గత అసెంబ్లీ సమావేశాల్లో వాలంటీర్లను కొనసాగిస్తామన్నారు. ఈ సమావేశాల్లో వాలంటీర్ల వ్యవస్థేలేదన్నారు. 2023 ఆగస్టు నుంచి ఆ వ్యవస్థే లేదని చెప్తూ మరి మే నెల వరకు ఎలా జీతాలు ఇచ్చారు?’’ అంటూ కన్నబాబు ప్రశ్నించారు.
‘‘వాలంటీర్లు న్యూస్ పేపర్ కొనేందుకు ఇస్తున్న రూ.200 లను కట్ చేస్తూ జీవో కూడా ఇచ్చారు. మరి వాలంటీర్లు లేకపోతే ఆ జీవో ఎలా ఇచ్చారు?. ఉచిత ఇసుక పేరుతో ట్రక్కు రూ.26 వేల చొప్పున అమ్ముతున్నారు. రాష్ట్రమంతటా నిర్మాణాలు ఆగిపోయాయి. గ్రామాల్లో బహిరంగంగా మద్యం బెల్టుషాపులు కనిపిస్తున్నాయి. టీడీపీ నేతలే బెల్టుషాపులు తెరిచారు. మద్యం ధరలను తగ్గించకుండా మోసం చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు 30 నుండి 50 శాతం వరకు పెంచారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లకు పన్నులు వేయటమే సంపదను సృష్టించటం అంటారా?’’ అని కన్నబాబు ప్రశ్నించారు.
బాబు ష్యూరిటీ.. బాదుడు గ్యారెంటీ అన్నట్టుగా పరిస్థితి మారింది. చంద్రబాబు సీఎం అయ్యాక తొలిసంతకం పెట్టిన మెగా డీఎస్సీకి ఇప్పటికీ దిక్కూమొక్కులేదు. ఉచిత గ్యాస్ సిలెండర్లకు నిధుల కేటాయింపే చేయకుండా ప్రజల్ని మోసం చేశారు. అధికారంలోకి వచ్చాక హత్యలు, దోపిడీలు, అరాచకాలు జరుగుతున్నాయి. పోలీసు అధికారులు టీడీపీ నేతలు చెప్పిందే చేస్తూ కాలం గడుపుతున్నారు. సామాన్యుడు న్యాయం కోసం పోలీసు స్టేషన్ గడప ఎక్కే పరిస్థితే లేదు. మా ఎమ్మెల్యే చంద్రశేఖర్ మీద 8 అక్రమ కేసులు నమోదు చేశారు
..స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగులకొట్టమని లోకేష్ చెప్పాడు. మరి ఇప్పుడు స్మార్ట్ మీటర్లను ఎలా పెడుతున్నారు?. అప్పుడు ఉరితాడులు అన్న స్మార్ట్ మీటర్లు ఇప్పుడు పసుపు తాడులుగా మారాయా?. గీత కార్మికులకు ఒక్క మద్యం షాపు కూడా ఇవ్వకుండా ఇచ్చినట్టు అసెంబ్లీలో పచ్చి అబద్దాలు చెప్పారు. గతంలో కుల కార్పొరేషన్లను తప్పుపట్టున చంద్రబాబు ఇప్పుడు అవే కార్పొరేషన్లను ఎలా కొనసాగిస్తున్నారు?. అప్పుల గురించి చంద్రబాబు, పయ్యావుల కేశవ్, యనమల రామకృష్ణుడు వేర్వేరుగా లెక్కలు చెప్పారు. కాగ్ చెప్పిన లెక్కలు నిజమా? లేక ఈనాడు పత్రిక, టీడీపీ నేతలు చెప్పిన లెక్కలు నిజమా?
..రాష్ట్ర పరపతిని దెబ్బతీసే కథనాలు పత్రికలో వస్తే ఆర్థిక శాఖ ఎందుకు ఖండించటం లేదు?. అసలు కాగ్ లెక్కలు కరెక్టా? మీ కాకి లెక్కలు కరెక్టా?. ఈ ఐదు నెలల్లోనే రూ.50 వేల కోట్ల అప్పులు చేసిన ఘనత చంద్రబాబుది. గతంలో మాపై చేసినవి పచ్చి అబద్దాలని అసెంబ్లీ సాక్షిగా తేలిపోయింది. పబ్లిసిటీ స్టంటు, మీడియా మేనేజ్‌మెంట్‌తో ఎక్కువ కాలం ఏ ప్రభుత్వమూ నిలపడలేదు’’ అని కురసాల కన్నబాబు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment