
సాక్షి, గుంటూరు: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు పర్యటనలో అడుగడుగునా భద్రతా వైఫల్యం కనిపించిందని, మాజీ సీఎం పర్యటనలో భద్రత కల్పనపై ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించిందని వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడ్డారు. గుంటూరులోని ఆ పార్టీ కార్యాలయంలో పలువురు నాయకులు మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ పర్యటనపై ముందుగానే సమాచారం ఇచ్చినా, ఆయనకు భద్రత కల్పనను అస్సలు పట్టించుకోలేదని, ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం ఆ విధంగా వ్యవహరించిందని వారు ఆక్షేపించారు.
మంత్రి నారా లోకేష్ ఆదేశాలతోనే గుంటూరు పోలీసులు బందోబస్త్‌ను గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ ఉందంటూ కుంటిసాకులు చెబుతున్నారని వారు ధ్వజమెత్తారు. అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు వైఎస్ జగన్ రోడ్డు మీదకు వస్తే ప్రజల నుంచి ఎటువంటి స్పందన ఉంటుందో తెలిసి కూడా.. ఆయన మిర్చి రైతులను పరామర్శించే కార్యక్రమాన్ని విఫలం చేసేందుకే కూటమి ప్రభుత్వం కుట్ర పన్నిందని వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపించారు.
గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్న వైఎస్సార్‌సీపీ
వైఎస్ జగన్‌కు భద్రతపై ప్రభుత్వం నిర్లక్ష్యంపై గవర్నర్‌కు వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేయనుంది. రేపు ఉదయం 11 గంటకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌కు పార్టీ నేతలు ఫిర్యాదు చేయనున్నారు. మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, వెలంపల్లి శ్రీనివాసరావు, మేరుగ నాగార్జున, అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి తదితరులు గవర్నర్‌ను కలవనున్నారు.
వ్యవసాయ మంత్రి పచ్చి అబద్ధాలు: అంబటి రాంబాబు
మిర్చి రైతుల కష్టాలు స్వయంగా తెలుసుకునేందుకు, వారికి భరోసా కల్పిచేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ గుంటూరు మిర్చి యార్డ్‌కు వచ్చి రైతులతో మాట్లాడారు. ధర లేక కునారిల్లుతున్న మార్కెట్ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. జగన్ రైతులతో మాట్లాడి వెళ్లగానే, వ్యవసాయ మంత్రితో పాటు పలువురు టీడీపీ నేతలు స్పందించారు. ఒకటి, రెండుసార్లు తప్ప ఎప్పుడూ క్వింటా మిర్చి రూ.13 వేలకే విక్రయిస్తున్నారంటూ వ్యవసాయ మంత్రి పచ్చి అబద్దాలు మాట్లాడారు.
మరో వైపు హడావిడిగా సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు, కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్‌కు లేఖ రాశారు. మిర్చిపంటకు రేటు పడిపోయింది, కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. ఇంత సీనియారిటీ ఉన్న సీఎం ఇలాగేనా సమస్యపై స్పందించేది? వైయస్ జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు అయిదేళ్లలో పంటలకు ఎప్పుడు మద్దతు ధర రాకపోయినా, రైతు నష్టపోతున్నారని గ్రహించినా వారిని ఆదుకునేందుకు రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశారు. పత్తి, ధాన్యం, పొగాకు ఇలా అనేక పంటలను వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నారు.
కళ్లు మూసుకున్న ప్రభుత్వం:
కానీ, నేడు కూటమి ప్రభుత్వం ఏం చేస్తోంది? మిర్చి పంటకు పెట్టుబడులు పెరిగిపోయి, పండిన మిర్చికి కనీస మద్దతు ధర లభించక రైతులు నష్టాల పాలైతే, కూటమి ప్రభుత్వ స్పందన అత్యంత దారుణం. మిర్చి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత సీఎంకు లేదా? నాడు మాది రైతు పక్షపాత ప్రభుత్వం. ఆనాడు రూ.65 వేల కోట్లు వెచ్చించి ధాన్యం కొనుగోలు చేశాం. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి పత్తి, కంది, ధాన్యం, మిర్చికి మద్దతు ధర లేదు. ధాన్యాన్ని అతి తక్కవ రేటుకు దళారీలకు, మిల్లర్లకు అమ్ముకుంటున్నారు. రైతు నట్టేట మునుగుతున్నా, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
జగన్ మిర్చి మార్కెట్‌కు రాకుండా కుట్ర:
జగన్ మిర్చి మార్కెట్‌కు రాకుండా చూసేందుకు కుట్ర చేశారు. ఒక మాజీ ముఖ్యమంత్రి కష్టాల్లో ఉన్న రైతులను పరామర్శించాలని అనుకోవడం తప్పా? కనీస పోలీస్ బందోబస్త్ కల్పించకుండా ఎన్నికల కోడ్ ఉందంటూ కుంటిసాకులు చెప్పించారు. అది కూడా పోలీసులు వాట్సాప్‌లో మెసేజ్ పెట్టి చేతులు దులుపుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉంది. వైఎస్సార్‌సీపీ ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఎన్నికల కోడ్ ఉన్నప్పడు ఓట్ల కోసం ప్రచారం చేసుకునే వారు. ఊరేగింపులు, బహిరంగ సభలు పెట్టే వారు అనుమతులు తీసుకోవాలి. వైఎస్ జగన్ మిర్చి యార్డ్‌కు ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల కోసం ప్రచారం కోసం వెళ్ళారా? రైతులను పరామర్శించడం ఎన్నికల ప్రచారం కిందకు వస్తుందా? కోడ్ ఉంటే దానిపైన పోలీసులు ఎందుకు నోటీస్ ఇవ్వలేదు?
అయినా కోడ్ ఉల్లంఘించే ఉద్దేశం మాకు లేదు. ఎన్నికలు జరుగుతున్నా పరామర్శించేందుకు అవకాశం ఉంటుంది. నిన్ననే జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించేందుకు వెళ్ళినప్పుడు ఈ ఎన్నికల కోడ్ ఉన్నట్లు పోలీసులకు గుర్తు రాలేదా? అక్కడ పెద్ద ఎత్తున పోలీసులను మోహరింప చేశారు. అంటే విజయవాడలో ఒక నిబంధన, గుంటూరులో మరో నిబంధన ఉంటుందా? గుంటూరు మిర్చి మార్కెట్‌లో రైతులతో జగన్ మాట్లాడితే, వారి కష్టాలు ప్రజలకు తెలుస్తాయని, అందుకే ఆ పర్యటన అడ్డుకోవాలనే కుట్రతో కూటమి ప్రభుత్వం వ్యవహరించింది.
మఫ్టీలో పోలీసులు డ్రోన్లు ఎగరేశారు:
జగన్‌కు మాజీ సీఎంగా జెడ్ ప్లస్ కేటగిరి సెక్యూరిటీ ఉంది. కానీ ఈ రోజు కనిపించలేదు. ఎందుకని ప్రశ్నిస్తే అనుమతి తీసుకోలేదని సమాధానం చెబుతున్నారు. మఫ్టీలో వచ్చిన పోలీసులు డ్రోన్‌లు ఎగరేసి, ఈ కార్యక్రమానికి ఎవరెవరు వచ్చారో చిత్రీకరించి వారిపై కేసులు పెట్టాలని కుట్ర పన్నారు. నారా లోకేష్ వికృతానందం కోసం, ఆయన ఆదేశాల మేరకు పోలీసులు ఇటువంటి పనులు చేశారు. కోడ్ పేరుతో పోలీసులు ఎవరూ జగన్ గారి కార్యక్రమం వైపు వెళ్ళవద్దని చెప్పారు. జగన్ రోడ్డు మీదికి వస్తే పెద్ద ఎత్తున జనం వస్తారు. అటువంటి ప్రజాదరణ జగన్ సొంతం. మిర్చియార్డ్ వద్ద పోలీసులు లేక తోపులాటలు జరిగాయి. దీంతో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులే జనాన్ని నియంత్రించారు. చివరికి జగన్ మీడియాతో మాట్లాడేందుకు కూడా వీలు లేకుండా చేయాలని కుట్రపన్నారు.
జగన్‌ను చూసేందుకు, కలిసేందుకు తరలి వస్తున్న జనాన్ని నియంత్రించేందుకు ఒక్క పోలీస్‌ను కూడా నియమించకుండా చేయడం నారా లోకేష్‌కు సమంజసమా? అధికారం శాశ్వతమని వారు భావిస్తున్నారు. జగన్‌కి భద్రత లేకుండా కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోంది. ఈ కుట్రలో పోలీస్ యంత్రాంగం భాగస్వామి అవుతోంది. ఏదైనా జరిగితే దానికి ఎవరు భాధ్యత వహిస్తారు? జెడ్ ప్లస్ సెక్యూరిటీని కూడా ఇవ్వకుండా చేశారంటే దీని వెనుక పెద్ద కుట్ర జరుగుతోంది. ప్రజలు కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను గమనిస్తున్నారు. ఈ ప్రభుత్వం జగన్ పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. దీనికి మూల్యం చెల్లించక తప్పదు.
ఇప్పుడు కళ్లు తెరుస్తున్నారు: మేరుగు నాగార్జున
గుంటూరు మిర్చి యార్డులో జగన్ పర్యటించిన తర్వాతే ప్రభుత్వం కళ్లు తెరిచింది. కూటమి ప్రభుత్వానికి వ్యవసాయంపై దృష్టి లేదు. జగన్ వచ్చి రైతు కష్టాలను, వారి వెతలను బయటపెడితే ఆగమేఘాల మీద ముఖ్యమంత్రి కేంద్రానికి మిర్చి రైతుల గురించి లేఖ రాశారు. ప్రతిపక్ష నాయకుడు వస్తుంటే ఒక్క పోలీస్ కూడా మిర్చియార్డ్ వద్ద లేరు. అంటే వైఎస్ జగన్‌పై ఎలాంటి కక్ష సాధింపు, కుట్రలకు పాల్పడుతున్నారో అర్థమవుతోంది. ఈ ప్రభుత్వం భద్రత కల్పించకపోయినా మా నాయకుడిని కాపాడుకునేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు సైనికుల్లా పని చేస్తారు. పోలీసులు లేకపోతే జగన్ కార్యక్రమం జరగదని కుట్ర పన్నారు. అయినా కూడా పార్టీ కార్యకర్తలే వాలంటీర్లుగా పని చేశారు.
చిల్లర రాజకీయాలు మానుకోవాలి: నందిగం సురేష్
గుంటూరు మిర్చియార్డ్‌కు వచ్చిన జగన్‌కు ప్రజల నుంచి వచ్చిన మద్దతు చూసి తెలుగుదేశం పార్టీ ఓర్వలేకపోతోంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్సార్‌సీపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురి చేయడానికే మొత్తం సమయాన్ని వినియోగిస్తున్నారు. ఈ రోజు ధర లేక మిర్చి రైతులు పెడుతున్న ఆక్రందనలు కూటమి ప్రభుత్వం చెవులకు సోకడం లేదు. జగన్ మిర్చి రైతుల కోసం గుంటూరుకు వస్తే కనీసం ఒక్క పోలీస్‌ను కూడా బందోబస్తు కోసం నియమించకుండా చిల్లర రాజకీయాలకు పాల్పడ్డారు. వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే చేసి ఉంటే చంద్రబాబు, లోకేష్, పవన్‌కళ్యాణ్.. సమావేశాలు, కార్యక్రమాలు నిర్వహించే వారేనా?. రైతుల ఇబ్బందులను గాలికి వదిలేశారు. ఇచ్చిన హామీలను పక్కన పెట్టి వైఎస్సార్‌సీపీపై పగ తీర్చుకునేందుకే పని చేస్తున్నారు. ప్రజలు ఇందుకేనా మీకు అధికారంను కట్టబెట్టింది? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కూటమి పార్టీలకు కనీసం సింగిల్ డిజిట్ కూడా రాదు.
ప్రభుత్వ విధానాలు చూస్తూ ఊరుకోం: మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి
మాజీ సీఎం గుంటూరు మిర్చియార్డ్‌కు వస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు?. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మాజీ సీఎంగా చంద్రబాబు కార్యక్రమాలకు పూర్తిస్థాయిలో భద్రత కల్పించాము. ఈ రోజు మిర్చియార్డ్ వద్ద కనీస పోలీస్ బందోబస్త్ కూడా లేకుండా గుంటూరు ఎస్పీ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. రేపు మళ్ళీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు ఇలాంటి పరిస్థితే ఎదురైతే ఏం చేస్తారు? మీరు చేసిందే మమ్మల్ని కూడా చేయమని పరోక్షంగా చెబుతున్నారా? కక్ష సాధింపులకు చూపుతున్న శ్రద్ద రైతు సమస్యలపై చూపించలేరా? వల్లభనేని వంశీ అరెస్ట్ విషయంలో చూపించిన ప్రాధాన్యత మిర్చి రైతులపై ఎందుకు చూపించలేదు? జగన్ కార్యక్రమంపై ఈ రోజు ప్రభుత్వం ప్రదర్శించిన ఉదాసీనత పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఇలాంటి విధానాన్నే ఈ ప్రభుత్వం కొనసాగిస్తామంటే వైఎస్సార్‌సీపీ శ్రేణులు చూస్తూ ఊర్కోవు.
డీజీపీ సమాధానం చెప్పాలి: విడదల రజిని
కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. అండగా నిలబడాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉండటంతో రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుస్థితికి వెళ్ళిపోతున్నారు. జగన్ ప్రభుత్వంలో క్వింటా మిర్చికి కనీసం రూ.25 వేలు వస్తే, నేడు క్వింటా రూ.12 వేలకు కూడా కొనుగోలు చేయడం లేదు. రైతుల పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళేందుకు గుంటూరు మిర్చి మార్కెట్‌కు జగన్ వచ్చారు. రైతులతో మాట్లాడారు. రైతులు తమ గోడును జగన్‌తో వెళ్లబోసుకున్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనం నుంచి విక్రయం వరకు రైతులకు ఆనాడు మా ప్రభుత్వం అండగా నిలిచిందని రైతులే గుర్తు చేశారు.
జగన్ మిర్చిమార్కెట్‌కు వస్తే పోలీసులు చూపిన నిర్లక్ష్యం చూస్తుంటే, వారు చట్టప్రకారం కాకుండా తెలుగుదేశం పార్టీ కోసమే పని చేస్తున్నట్లు అర్థమయ్యింది. కనీస భద్రత కూడా కల్పించలేదు. పెద్ద సంఖ్యలో జనం వస్తుంటే నియంత్రించే పోలీసులు ఎక్కడా కనిపించలేదు. ఏదైనా తొక్కిసలాట జరిగితే దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? వేల సంఖ్యలో తరలి వచ్చిన రైతులకు ఏదైనా ఇబ్బంది కలిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారు? దీనిపై డీజీపీ నుంచి జిల్లా ఎస్సీ వరకు సమాధానం చెప్పాలి. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ను సాకుగా చూపి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ పోటీ చేయడం లేదు. కేవలం రైతుల గురించి కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటే, దానికి కుంటిసాకులు చెప్పడం దారుణం.
Comments
Please login to add a commentAdd a comment