తెలుగుదేశం పార్టీ అధికారిక పత్రికగా గుర్తింపు పొందిన, ఆ పార్టీ అనధికార ప్రతినిధిగా పేరొందిన ఆంధ్రజ్యోతి యజమాని వేమూరి రాధాకృష్ణకు ఏపీ శాసనసభ ఎన్నికల ఫలితాలపై గజిబిజి ఉందట. ఆంధ్ర ఓటర్లు ఏ తీర్పు ఇస్తారో అర్ధం కావడం లేదట. అంటే తెలుగు దేశం గెలవడం లేదన్న సంకేతం అందుతున్నట్లే కదా!అందుకు భిన్నంగా ఉంటే ఈయన ఎగిరి గంతేసి రచ్చ,రచ్చ చేసేవారు కదా! అంతేకాదు. ఆయన జర్నలిస్టులకు సుద్దులు, పత్తిత్తు కబుర్లు కూడా చెప్పారు.
కొత్త పలుకు పేరుతో వ్యాసాలు రాసే ఆయన పచ్చి అబద్దాలను ఇంతకాలం ప్రచారం చేస్తూ వచ్చారు. తెలుగుదేశం గెలుపు తన గెలుపు అని భావించి , ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంట్లో మనిషి మాదిరిగా వ్యవహరించే ఈయన తాజాగా చెప్పిన నీతులు వింటే ఆశ్చర్యం చెందాల్సిందే. అదే టైమ్ లో ఆయన యధాప్రకారం వైఎస్సార్‌సీపీపైన, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపైన విషం కక్కారు. అయినా జర్నలిజం గురించి మాట్లాడగలరు. తను తప్ప మిగిలినవారంతా ఎర్నలిస్టులు అని రాయగలరు.
అసలు తానేమిటో, తన మూలాలేమిటో మర్చిపోయి, ఒక ఆగర్భ శ్రీమంతుడు మాదిరి, సత్య సంధుడు మాదిరి. హరిశ్చంద్రుని తమ్ముడి మాదిరి ,అత్యంత నీతిమంతుడు మాదిరి ఆయన రాసే పలుకులు చూస్తే ఔరా అనుకోవల్సిందే. ఏపీ ప్రజలలో ఈ శాసనసభ ఎన్నికలలో ఎవరు గెలుస్తారన్నదానిపై ఎవరి అభిప్రాయం వారికి ఉండవచ్చు. కొందరు వైఎస్సార్‌సీపీకి, మరి కొందరు టీడీపీకి అనుకూలంగా ఆలోచించవచ్చు. కాని చంద్రబాబుకు నమ్మిన బంటు తరహాలో ఉండే ఆంధ్రజ్యోతి యజమానికి టీడీపీ గెలుపుపై ఎందుకు సందేహం వచ్చిందో తెలియదు. అందుకే గెలుపు అంచనాలలో గజిబిజి అని హెడింగ్ పెట్టుకున్నట్లు ఉన్నారు.
ఎన్నికల వరకు ఉన్నవి, లేనివి పచ్చి అబద్దాలు రాసి ప్రజలను మోసం చేసే యత్నం చేసిన రాధాకృష్ణ ఇప్పుడు జర్నలిజం ఎలా ఉండాలో నీతులు వల్లెవేస్తున్నారు. దీనిని బట్టే అర్దం అవుతోంది. ఆయనకు టీడీపీ అధికారంలోకి రావడం లేదన్న సమాచారం వచ్చి ఉండాలి. పైకి ఏవో కబుర్లు చెప్పినా, అంతర్లీనంగా చదివితే రాధాకృష్ణ ఎంత భయపడుతున్నది తెలుస్తుంది. వైఎస్సార్‌సీపీ గెలుస్తుందని అనేవారికి శాపనార్ధాలు పెడుతున్న తీరే ఆయన బలహీనతను తెలియపరుస్తుంది. ప్రతి పత్రికకు సొంత నెట్ వర్క్ ఉంటుంది. ఆంధ్రజ్యోతి కి కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో నెట్ వర్క్ ఉంది కదా!. ఆ నెట్ వర్క్ లో పనిచేసే ప్రతినిధులుఉంటారు కదా!వారితో పోలింగ్ కు ముందు, పోలింగ్ జరిగే రోజున, అవసరమైతే పోలింగ్ తర్వాత కూడా అభిప్రాయ సేకరణ అనండి, ఎగ్జిట్ పోల్ అనండి..పేరేదైనా పెట్టండి ..ప్రజల నాడి ఎలా ఉందో పసికట్టడానికి ప్రయత్నించి ఉంటారు కదా!. ఒక వేళ అది టీడీపీకి పూర్తి అనుకూలంగా ఉంటే ఆంధ్రజ్యోతిలో పతాక శీర్షికలలో కదనాలు ఇచ్చే వారే కదా?. అలా చేయలేకపోగా, గజిబిజి గా పరిస్తితి ఉందని రాసుకున్నారంటే తెలుగుదేశంలో ఉన్న గందరగోళం ఏమిటో తెలుసుకోవచ్చు.
ఆంధ్రజ్యోతి రాసిందంటే టీడీపీ రాసినట్లే కదా!. రాధాకృష్ణ రాసిన కొన్ని అంశాలు చూద్దాం. అనుభవం ఉన్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు సైతం అనేక సందర్భాలలో లెక్క తప్పాయని ఆయన అన్నారు. అందులో కొన్నిసార్లు నిజం ఉండవచ్చు. కాని ఎక్కువసార్లు వాస్తవమే అయ్యాయనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.
తెలంగాణ శాసనసభ ఎన్నికలలో ఎగ్జిట్ పోల్స్ తో సంబంధం లేకుండా కాంగ్రెస్ కు పట్టం కట్టారట. ఇది కూడా అసత్యమే. తెలంగాణలో అత్యధిక ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్‌కు విజయావకాశాలు ఉన్నాయని పేర్కొన్నాయి. కనీస అవగాహన లేనివారు, జనం నాడి తెలియని వారు అంచనాలు రూపొందించడం రాధాకృష్ణకు ఆశ్చర్యం కలిగించిందట. చంద్రబాబుకు, జగన్ కు లేని టెన్షన్ ను ఈ తరహా ఎర్నలిస్టులు ప్రదర్శిస్తుండడం విశేషం అని రాశారు.
తాను ఎలా సంపాదించి పైకి వచ్చింది. తను రిపోర్టర్‌గా పనిచేసిన పత్రికకే తాను ఎలా యజమాని అయింది రాధాకృష్ణకు తెలియదా! మళ్లీ ప్రత్యేకంగా ఎర్నలిస్టులు అంటూ ఎవరినో అనడం దేనికి? ప్రభుత్వ పని తీరుతో సంబంధం లేకుండా సోషల్ మీడియా సైన్యం మాత్రమే ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయజాలదని రాధాకృష్ణ రాసుకొచ్చారు. సోషల్ మీడియా వరకు దేనికి!. మిమ్మల్ని మీరు మెయిన్ మీడియా అనుకుంటారుగా? ఇంతకీ మీరు రాసిన పచ్చి అబద్దాలను జనం నమ్మారనుకుంటున్నారా? నమ్మ లేదని అనుకుంటున్నారా?
ఉదాహరణకు లాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి, స్టాంప్ రిజిస్ట్రేషన్ గురించి ఆంధ్రజ్యోతితో పాటు ఈనాడు రాసిన దారుణమైన అబద్దాలను ప్రజలు నమ్మలేదన్న సంగతి మీకు తెలిసిందా? అనే అనుమానం వస్తుంది. పనిలో పనిగా యూట్యూబ్ చానల్స్ గురించి కూడా తెగ వాపోయారు. ముందు మీరు మీ యూట్యూబ్ చానల్ లో నిజాలు చెప్పడం అలవాటు చేసుకుని అప్పుడు ఎదుటివారి గురించి మాట్లాడండి.
తెలుగుదేశం పార్టీ ఐటిడిపి పేరుతో ఎంత నీచమైన ఆరోపణలతో వైఎస్సార్‌సీపీపైన, జగన్ పైన ప్రచారం చేస్తే సమర్దించిన రాధాకృష్ణ నంగనాచి కబుర్లు చెబుతున్నారు. యూట్యూబ్ ఛానెల్స్‌ను రాజకీయ పార్టీలు స్పాన్సర్ చేస్తున్నాయట. ఈనాడు, ఆంద్రజ్యోతివంటి ఎల్లో మీడియాను తెలుగుదేశం పార్టీ స్పాన్సర్ చేసిన విషయాన్ని తొలుత రాసి ఆ తర్వాత మిగిలినవారి గురించి మాట్లాడితే బాగుండేది. సోషల్ మీడియాలో వ్యూస్ ను బట్టి కూడా ఎవరికి మద్దతు ఉందో చెప్పవచ్చని మళ్లీ ఇదే కొత్త పలుకు లో ఈయన చెబుతున్నారు. ఐదేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన జగన్ కు అనుకూలంగా ఉండే వార్తలు, కధనాలకు రెండే క్రితం వరకు అధికంగా వ్యూస్ ఉండేవని, రాను..రాను అవి తగ్గిపోయాయని మరో అబద్దం రాసుకొచ్చారు.
ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగన్ ఇంటర్వ్యూని టీవీ9లోను, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటర్వ్యూని ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలోనూ ఒకే రోజు, ఒకే సమయంలో ప్రసారం చేశారు. చంద్రబాబును ఇదే రాధాకృష్ణ ఇంటర్వ్యూ చేశారు. జగన్ చేసిన ఇంటర్వ్యూకు టీవీ9 యూట్యూబ్ ఛానల్‌లో 11లక్షల వ్యూస్ వస్తే, చంద్రబాబు ఇంటర్వ్యూకు నాలుగైదు లక్షల వ్యూసే వచ్చాయి. ఇది ఎవరయినా గమనించవచ్చు. లైవ్ జరుగుతున్నప్పుడు కూడా ఎబిఎన్ కంటే టీవీ9 కంటెంట్‌ను ఎన్నోరెట్ల మంది యుట్యూబ్‌లో చూసినట్లు లెక్కలు చెబుతున్నాయి కదా! ఈయన థియరీ ప్రకారం చూసుకున్నా జగన్ గెలుస్తున్నట్లే కదా!.
తెలంగాణను మించిన నిర్భంధం ఏపీలో ఉందట. నిజంగా ఆ పరిస్థితి ఉంటే ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఇంత అరాచకంగా, జర్నలిజానికి తలవంపులు తెచ్చేరీతిలో వార్తలు,కధనాలు ఇచ్చి ఉండేవారా?. ఎందుకు వీరు ఆత్మవంచన చేసుకుంటున్నారు!. ఉద్యోగ సంఘాల నేతలు జగన్‌కు అనుకూలమైనా ఉద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారని అంటున్నారు. పాపం ఉద్యోగులపై అంత ప్రేమ ఉంటే,వారిని పనిపాట లేనివారని, వారికి ఊరికే వందల కోట్ల జీతాలు కూర్చోబెట్టి ఇస్తున్నారన్నట్లుగా చంద్రబాబుతో మాట్లాడింది రాధాకృష్ణే కదా!
2019 లో ఎన్నికలలో తాను మళ్లీ అధికారంలోకి వస్తానని ప్రకటించి బోల్తా కొట్టిన చంద్రబాబు ఈ పర్యాయం మాత్రం ఎన్నికల ఫలితాల జోస్యం చెప్పలేదని ఈయన అంటున్నారు. నిజానికి అప్పుడు చంద్రబాబే కాదు. ఆంధ్రజ్యోతి, ఈనాడు తదతితర ఎల్లో మీడియా అంతా ఇదే మాట ఊదరగొట్టాయి. చంద్రబాబు ఇచ్చిన పసుపు-కుంకుమ తో మహిళలంతా టీడీపీ కి ఓటు వేశారని ఈయన పత్రికలోరాశారో లేదో ఒక్కసారి వెనక్కి వెళ్లి చూసుకోమనండి కానీ, 2019లో జగన్ చెప్పినట్లు వైసిపి భారీ మెజార్టీతో గెలుపొందిందన్న ఒక్క సత్యాన్ని ఒప్పుకున్న ఈయన అక్కడ కూడా వక్రీకరించారు. జగన్ అండ్ కో అప్పుడు అసత్య ప్రచారం మీద నమ్మకం పెట్టుకుందని ఈ సత్యసంధుడు రాస్తున్నాడు. చంద్రబాబు అండ్ కో లో భాగస్వామి అయిన రాధాకృష్ణ అబద్దాల సృష్టికర్తలలో ఒకడన్న సంగతి ప్రజలందరికి తెలుసు.
2024 ఎన్నికల ప్రచారంలో జగన్ అసత్యాలు చెప్పారో, చంద్రబాబు అబద్దాలు చె్ప్పారో, ప్రజలు ఏమి అనుకుంటున్నారో ఒక సర్వే చేయించుకుంటే తెలుస్తుంది. రాధాకృష్ణ ఎంతసేపు ఆత్మ వంచన చేసుకుంటూ ప్రజలను కూడా అలాగే మోసం చేయాలని చూస్తున్నారు. 2019 ఎన్నికలలో జగన్ ఆశ్రిత పక్షపాతం, భావోద్వేగాలు ప్రేరేపించడం, విమర్శనాత్మక ఆలోచనా ధోరణి నశింప చేయడం.. వంటివాటివల్ల గెలిచారట.ఎంత అక్కసో చూడండి. జగన్ గెలిస్తే ఆలోచన సరిగా లేనట్లట. చంద్రబాబు గెలిస్తే మేధావితనం అట. ఈయనకు వందల కోట్ల ప్రయోజనం చేకూర్చుతారు కాబట్టి చంద్రబాబు పాలన గొప్పదిగా కనిపించవచ్చు. కాని జగన్ ప్రజలకు లక్షల కోట్ల మేర మేలు చేశారు. కాబట్టి ఆయన తనవల్ల మేలు జరిగితేనే ఓటు వేయండని ధైర్యంగా చెప్పారు. ఆ మాట చంద్రబాబుతో ఎందుకు చెప్పించలేకపోయారు.?
మళ్లీ జన్మభూమి కమిటీల పాలన తెస్తానని, వలంటీర్లను రద్దు చేస్తానని, గ్రామ, వార్డు సచివాలయాలను ఎత్తివేస్తానని చంద్రబాబు ఎందుకు చెప్పలేకపోయారు. రాధాకృష్ణ ఎందుకు చెప్పించలేకపోయారు? అమ్మ ఒడి ఇస్తుంటే బటన్ నొక్కడం తప్ప జగన్ ఏమి చేస్తున్నారని ఆ రోజుల్లో రాధాకృష్ణ తెగ బాధపడ్డారు. అదే చంద్రబాబు ఎన్నికలకు ముందు ఏమన్నాడు? ఇంటిలో ఒకరికి కాదు.. ఎంత మంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం పేరుతో పదిహేను వేల రూపాయలు చొప్పున ఇస్తానని చంద్రబాబు చెబితే రాధాకృష్ణ మాత్రం వైఎస్సార్‌సీపీపైన రోధిస్తున్నారు. జగన్ స్కీములతో రాష్ట్రం నాశనం అయితే, వాటన్నిటిని కొనసాగిస్తామని చంద్రబాబు, పవన్ లతో ఎందుకు చెప్పించారు.? ప్రొఫెసర్ నాగేశ్వర్, తెలకపల్లి రవి వంటి వారి పేర్లు రాయకుండా సిపిఎం సంబంధాలు కలిగిన వారు జగన్‌కు అనుకూలంగా విశ్లేషణలు వదలుతున్నారట. జగన్ కు అనుకూలంగా విశ్లేషణలు ఇస్తున్నవారు వ్యతిరేక ఫలితాలు వస్తే మొహం ఎక్కడ పెట్టుకుంటారు అని అమాయకంగా ప్రశ్నించారు.
2019 లో రాధాకృష్ణ ఎక్కడ మొహం పెట్టుకున్నారు? 2024లో జగన్ కు అనుకూల ఫలితం వస్తే ఈయన ఎక్కడ మొహం పెట్టుకుంటారు! ప్రశాంత కిషోర్ లో రాధాకృష్ణకు ఇప్పుడు విశ్వసనీయత కనిపిస్తోంది. అంత గొప్ప ప్రశాంత కిషోర్ తెలంగాణలో బిఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుందని ఎలా చెప్పారో, హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలోకి రాదని ఎలా చెప్పారో కూడా ఈయన వివరించాలి.
చంద్రబాబు ఎన్నికల ముందు మహిళలకు పదివేల రూపాయలు చొప్పున ఇచ్చినా ఓడిపోయారని, జగన్ పధకాల పేరుతోడబ్బు పంచితే ఓట్లు వేస్తారా అని రెంటిని సమం చేసే దిక్కుమాలిన ఆలోచన చేశారు. చంద్రబాబు ఎన్నికల కోసం పదివేల రూపాయలు ఇచ్చారు. జగన్ తను ఇచ్చిన హామీ ప్రకారం ఐదేళ్లపాటు స్కీముల ద్వారా లబ్ది చేకూర్చారు. ఆ మాత్రం జ్ఞానం లేకుండా రాధాకృష్ణ వ్యాసాలు రాసిపడేసి, చేతిలో పత్రిక ఉందని అచ్చేసి, టీవీ ఛానెల్ ఉంది కదా అని ఊదరగొట్టేస్తే జనం నమ్ముతారా? ఎన్నికలకు ముందు ఆ సర్వే అని,ఈ సర్వే అని తెలుగుదేశంకు డప్పు వాయించిన రాధాకృష్ణ తినబోతూ రుచులు అడగకూడదని అంటున్నారు.
ఆయన రాసిన చివరిమాటలోని అంగుళీమాలుడు అనే దొంగ పాత్ర అమరావతి పేరుతో మూడు పంటలు పండే వేలాది ఎకరాలను ధ్వంసం చేసిన చంద్రబాబు అవుతారు లేదా ఆయన సేవలో తరించే రాధాకృష్ణ అవుతారు తప్ప ఇంకొకరు కారు. జగన్ ను దూషించడం తప్ప, ఈయన చెత్తపలుకులో చేసిన విశ్లేషణ ఏముంది? ఏపీ ఫలితాలపై ఈయనకు గజిబిజి ఉందేమో కాని, ప్రజలకు మాత్రం కాదని చెప్పవచ్చు.
:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment