
సాక్షి,తాడేపల్లి : వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గుంటూరు మిర్చియార్డులో మిర్చి రైతుల కన్నీళ్లు తుడవగానే సీఎం చంద్రబాబు,లోకేష్, ఎల్లో మీడియా కంట్లో కారం పడినట్లైంది. అందుకే వైఎస్ జగన్ రైతులను పరామర్శించడం ఇల్లీగల్ అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఉద్దేశపూర్వకంగానే వైఎస్ జగన్ భద్రత తొలగించినట్టు అంగీకరించారు.
వైఎస్ జగన్ పర్యటనలో ఏం జరిగిందంటే?
అన్నదాతలను పరామర్శించి భరోసా కల్పించేందుకు గుంటూరు మిర్చి యార్డు వద్దకు వచ్చిన మాజీ సీఎం జగన్ భద్రత విషయంలో టీడీపీ కూటమి సర్కారు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఆయన పర్యటనకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించింది. జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న మాజీ సీఎం పర్యటన విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు ప్రశ్నార్థకంగా మారింది.
వైఎస్ జగన్ భద్రత విషయంలో టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ వైఎస్సార్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ పార్టీ లోక్‌సభ పక్షనేత మిథున్ రెడ్డి ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ కూడా రాశారు.
చంద్రబాబు సన్నాయి నొక్కులు
ఈ క్రమంలో వైఎస్ జగన్ భద్రత విషయంలో టీడీపీ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మీడియా చంద్రబాబును ప్రశ్నించింది. వైఎస్ జగన్ భద్రతపై చంద్రబాబు వింత వ్యాఖ్యలు చేశారు. రైతులను పరామర్శించడం ఇల్లీగల్. ఎన్నికల కోడ్ అమల్లో ఉందంటూ ఉద్దేశ్యపూర్వకంగానే వైఎస్ జగన్‌కు భద్రత తొలగించినట్టు అంగీకరించారు. అది ఎన్నికల కమిషన్ నిర్ణయమంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు.
థమన్‌తో చంద్రబాబు కుటుంబం మ్యూజికల్ నైట్స్
ఇటీవల విజయవాడలో చంద్రబాబు కుటుంబం థమన్ మ్యూజికల్ నైట్స్ నిర్వహించింది. దీన్ని ప్రస్తావిస్తూ మ్యూజికల్ నైట్స్ ఉన్న విలువ..రైతులకు లేదా..? అని ఏపీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా.. చంద్రబాబు కుటుంబం గత, శనివారం సాయంత్రం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ‘యూఫోరియా మ్యూజికల్ నైట్’ (Euphoria Musical Night)నిర్వహించింది. ఇందులో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్,హోమంత్రి అనిత, ఎమ్మెల్యే బాలకృష్ణతో పాటు ఇతర కుటమి నేతలు సైతం హాజరయ్యారు. దీని రాష్ట్ర పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. మ్యూజికల్ నైట్స్ నిర్వహించేందుకు ఎన్నికల కోడ్ అడ్డంకి రాలేదా అని ప్రశ్నిస్తున్నారు.
వైఎస్ జగన్‌పై కేసు నమోదు
వైఎస్ జగన్ గుంటూరు పర్యటనను అడ్డుకోలేకపోయిన కూటమి ప్రభుత్వం.. మరో కుట్రకు తెరతీసింది. మిర్చి యార్డులో పర్యటించి రైతుల గోడు విన్నందుకుగానూ ఆయనపై కేసు(Case Against YS Jagan) పెట్టింది. ఎలాంటి సభ, మైక్ ప్రచారం నిర్వహించకపోయినా పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం.
మిర్చి రైతుల కష్టాలు తెలుసుకునేందుకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ బుధవారం గుంటూరుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనకుగానూ మాజీ సీఎం హోదాలో కూడా ఆయనకు ప్రభుత్వం ఎలాంటి భద్రత ఇవ్వలేదు. రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో పాటు భద్రతా వ్యవహారంపై ఆయన సీఎం చంద్రబాబును నిలదీశారు కూడా. అయితే వైఎస్ జగన్ ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ టీడీపీ నేతలు కొందరు నల్లపాడు పీఎస్(Nallapadu Police Station)లో ఫిర్యాదు చేశారు. దీంతో వాళ్ల ఒత్తిడి మేరకు పోలీసులు జగన్‌పై కేసు నమోదు చేశారు.