
ఢిల్లీ: ఢిల్లీ: కెనడాపై భారత ప్రభుత్వం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఖలీస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు ప్లాన్ చేసిన విషయం ప్రధాని మోదీకి ముందే తెలుసు అంటూ కెనడాకు చెందిన ‘ది గ్లోబ్ అండ్ మెయిల్’ వార్తా పత్రిక ఓ కథనం రాసుకొచ్చింది. ఈ కథనాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. అలాంటి అర్థం లేని కథనాలను కొట్టిపారేస్తున్నామని ఖండించింది.
కెనడా కథనంపై భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ.. మేము సాధారణంగా మీడియాలో వచ్చే కథనాలపై స్పందించం. కానీ, కెనడా ప్రభుత్వ వర్గాలను ఉద్దేశిస్తూ వెలువడిన ఈ హాస్యాస్పద వార్తలను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. నిరాధారమైన ఇలాంటి వార్తలు హాస్యాస్పదం. ఇలాంటి వార్తలపై అధికారులు కచ్చితంగా జవాబు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి తప్పుడు ప్రకటనలు, ప్రచారాలు రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత దెబ్బతిస్తాయి. ఇప్పటికైనా తప్పుడు నివేదికలు ప్రచురించకపోవడం మంచిది అంటూ కామెంట్స్ చేశారు.
సదరు వార్తా పత్రిక.. ఈ హత్యకు కుట్రలో భారత జాతీయ భద్రతా సలహాదారు, విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ కూడా భాగమైనట్లు తమకు తెలిసిందని కెనడా సీనియర్ జాతీయ భద్రతా అధికారి ఒకరు చెప్పినట్లు ఆ కథనం పేర్కొనడం గమనార్హం.
ఇదిలా ఉండగా.. గత సంవత్సరం, నిజ్జర్ హత్యతో భారత ప్రభుత్వ ఏజెంట్లకు సంబంధం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించిన తర్వాత రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ట్రూడో ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. కెనడా వాదనలు నిరాధారమైనవి అని తెలిపింది. నిజ్జర్ హత్య జరిగినప్పటి నుంచి కెనడా.. భారత ప్రభుత్వం, మోదీపై తప్పుడు ప్రచారం చేస్తూనే ఉంది. అంతకుముందు.. కెనడాకు చెందిన పలు నేతలు అమిత్ షాను కూడా టార్గెట్ చేసి సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
Our response to queries regarding a report in Canadian media: https://t.co/1IAURpKlfT pic.twitter.com/jIPlg05JM6
— Randhir Jaiswal (@MEAIndia) November 20, 2024