సాక్షి, అమరావతి: ఏపీలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ హయాంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్.. స్టీల్ ప్లాంట్ నడపటం చాలా కష్టం, దానికి మైన్స్ కావాలి.. లాభాల్లోకి రావాలంటూ కామెంట్స్ చేశారు. తాము ప్రైవేటీకరణకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పకనే చెప్పేశారు.
ఏపీలో అసెంబ్లీ సమావేశాలు తొమ్మిదో రోజు కొనసాగుతున్నాయి. సమావేశాల సందర్బంగా నేడు శాసన మండలిలో విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు.
ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మాట్లాడుతూ..‘విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేసేందుకు అడుగులు పడుతున్నాయి మూడు బ్లాస్ట్ ఫర్నేష్‌లలో రెండు మూత పడ్డాయి. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు జీతాలు చెల్లించడం లేదు. పెట్టుబడుల ఉప సంహరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటామని ప్రకటన చేస్తారా లేదా?. ఎన్నికల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగనివ్వం అని చంద్రబాబు, పవన్ హామీ ఇచ్చారు. కానీ ఈరోజు ప్రైవేటీకరణ వేగంగా జరుగుతుంటే ఆపే ప్రయత్నం చేశారా?. ఇద్దరు ఎంపీలు ఉన్న కర్ణాటకలో ఉక్కు మంత్రి ఆ రాష్ట్రంలో భద్రావతి స్టీల్ ప్లాంట్‌కు 30వేల కోట్లు ఆర్థిక సహాయం తెచ్చుకున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడానికి ప్రధాన మంత్రిని ఆడిగారా? అని ప్రశ్నించారు.
ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ..‘మాకు ప్రైవేటీకరణ ఆపే శక్తి ఉంది కాబట్టే అఖిలపక్ష సమావేశం మేము వేయలేదు. వైఎస్సార్‌సీపీ హయాంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగనివ్వలేదు. స్టీల్ ప్లాంట్ చాలా సెంటిమెంట్‌తో కూడిన అంశం. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు. మంత్రులు గత ప్రభుత్వంపై విమర్శలు చేయడం సమంజసం కాదు. ఈ ఆరు నెలల్లో స్టీల్ ప్లాంట్ భూములను రెండు దఫాలుగా వేలానికి నోటిఫికేషన్ ఇచ్చారు. మా నాయకుడు ప్రధానమంత్రి దగ్గరే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేకమని చెప్పారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం మేము పోరాడుతాం. పవన్ కళ్యాణ్, అచ్చెన్నాయుడు ఆ మాటకి కట్టుబడి ఉండాలి అని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్సీల ప్రశ్నలకు డిప్యూటీ సీఎం పవన్ సమాధానం ఇస్తూ.. విశాఖ స్టీల్ ప్లాంట్ చాలా భావోద్వేగమైన అంశం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకమే కానీ.. దానిని నడపడానికి చాలా సమస్యలు ఉన్నాయి. దానికి మైన్స్ కావాలి, లాభాల్లోకి రావాలి అంటూ చెప్పుకొచ్చారు. ఇక, చివరగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్‌పై తీర్మానం అవసరం లేదంటూ వ్యాఖ్యానించారు.
అనంతరం, కూటమి సర్కార్ తీరుపై స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు ఆందోళన చేపట్టారు. ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ విషయంలో మంత్రుల వ్యాఖ్యలపై నిరసన చేపట్టారు. అలాగే, తీర్మానం చేయాలని కోరారు. దీంతో, చెర్మన్ మండలిని వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment