వైఎస్సార్ సీపీ ఎన్నికల గుర్తును, జెండా రంగులను పోలినట్లున్న ప్రజాశాంతి పార్టీ గుర్తు, జెండా రంగులు
సాక్షి, అమరావతి: కనీసం ఒక్క నియోజకవర్గంలోనైనా డిపాజిట్ దక్కించుకోగలిగే స్థాయి లేని ఒక పార్టీ.. 74 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తే.. అందులో 38 మంది పేర్లు అవే స్థానాలకు పోటీలో ఉన్న ప్రధాన పార్టీ అభ్యర్థుల పేర్లను పోలి ఉన్నాయంటే అది ఉద్దేశపూర్వకంగా చేసిందేనని ఎవరికైనా ఇట్టే అర్ధమవుతుంది. ఇక ఆ రెండు పార్టీల ఎన్నికల గుర్తులు కూడా ఒకదానితో మరొకటి పోలి ఉన్నప్పుడు, పేర్లు కూడా దాదాపుగా ఒకేలా ఉండేలా ఉన్న వారిని అభ్యర్థులుగా ఎంపికచేసి నామినేషన్లు వేయించారంటే అది ఖచ్చితంగా కుట్రేననే విషయం మరింత స్పష్టంగా తెలిసిపోతుంది.
ఇది ఓటర్లను, ముఖ్యంగా ఒక ప్రధాన పార్టీ సానుభూతిపరులను అయోమయానికి గురిచేసేందుకు వేసిన ఎత్తుగడగా అవగతమవుతుంది. అయితే ఇలా కుట్రకు పాల్పడాల్సిన అవసరం ఎవరికి ఉంది? రాష్ట్రంలో ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ప్రభంజనం నేపథ్యంలో, ఓటమి అంచుల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే ఎన్నో కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. కాగా ప్రజాశాంతి పార్టీ ఎన్నికల గుర్తు హెలికాప్టర్, వైఎస్సార్‌సీపీ ఎన్నికల గుర్తు ఫ్యాన్‌ను పోలి ఉండటాన్ని అవకాశంగా తీసుకుని చంద్రబాబే మరో కుట్రకు తెగబడ్డారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
వైఎస్సార్‌సీపీ ఓట్లలో చీలిక తెచ్చి విజయాన్ని అడ్డుకోవాలనే దింపుడు కళ్లెం ఆశలతో చంద్రబాబు దిగజారి వ్యవహరిస్తున్న తీరుపై రాజకీయ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఆదరణ ఉండే సామాజికవర్గాల ఓట్లను చీల్చే రాజకీయ పార్టీలను వెతికి ఆయా పార్టీలతో కుమ్మక్కై, ఆ పార్టీల అభ్యర్థులుగా తమ అనుకూల వ్యక్తులను పోటీ చేయించడం ద్వారా ఓట్లు చీల్చాలనే కుట్రకు చంద్రబాబు తెరలేపారు. ఇందులో భాగంగానే తన రహస్య మిత్రుడు పవన్‌కల్యాణ్–.. బీఎస్పీతో పొత్తు పెట్టుకుని 21 సీట్లు కేటాయించేలా చేశారు.
తాజాగా ప్రజాశాంతి పార్టీతో కుమ్మక్కయ్యారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల పేర్ల లాంటి పేర్లే కలిగి ఉన్న 38 మందిని వెతికి పట్టుకుని ప్రజాశాంతి పార్టీ తరఫున అసెంబ్లీ అభ్యర్థులుగా నామినేషన్లు వేయించారు. అలాగే నాలుగు లోక్‌సభ స్థానాల్లో కూడా వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల పేర్లను పోలి ఉండే వారితో ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీ చేయిస్తున్నారు. ఈ విధంగా పోటీచేసే వారిలో ఎక్కువ మంది స్థానిక నియోజకవర్గాల్లోని తెలుగుదేశం పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment