ఎన్నికల అధికారి ద్వివేదిని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి బాలశౌరి. చిత్రంలో వైఎస్సార్‌సీపీ నాయకులు
సాక్షి, అమరావతి: అధికార దుర్వినియోగానికి పాల్పడడంతో పాటు ఎన్నికల కోడ్ నిబంధనలను ఉల్లంఘించి ఎన్నికల సంఘాన్ని బెదిరించేలా ధర్నాకు దిగడంపై సీఎం చంద్రబాబు మీద కేసు నమోదు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. సీఎంగా ఒక బాధ్యతాయుత స్థానంలో ఉన్న చంద్రబాబు.. ఎన్నికల సంఘం చేసిన బదిలీలు, ఇతర నిర్ణయాలపై మరికొన్ని గంటల్లో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో నిరసన చేపట్టడం ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టే ప్రయత్నమేనని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్న టీడీపీపైన, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపైన తగిన చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలోని ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసే వాతావరణాన్ని కల్పించాలని ఎన్నికల సంఘానికి ఆ పార్టీ విజ్ఞప్తి చేసింది.
ఎన్నికల నేపథ్యంలో టీడీపీ చేస్తున్న అక్రమాలను, ఎన్నికల నిబంధనలకు తూట్లు పొడుస్తున్న వైనంపై ఒక ఫిర్యాదును పార్టీ తరఫున లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వల్లభనేని బాలశౌరి, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్ నాగిరెడ్డి, ఎన్నికల నిఘా కమిటీ సభ్యుడు పి.గౌతంరెడ్డి, అదనపు కార్యదర్శి పద్మారావులతో కూడిన ప్రతినిధి బృందం బుధవారం సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదిని కలసి అందజేసింది. ఇందులో పలు అంశాలను ఈసీ దృష్టికి బృందం సభ్యులు తీసుకుపోయారు. అనంతరం బాలశౌరి విలేకరులతో మాట్లాడుతూ.. దేశ రాజకీయ వ్యవస్థలో చంద్రబాబును మించి వ్యవస్థలను మేనేజ్ చేయగల వ్యక్తి మరొకరు ఉండరని, అలాంటి పోలింగ్‌కు ముందు ప్రజల దృష్టిని మరల్చడంకోసం తనకేదో అన్యాయం జరిగిపోతున్నట్టు, తనను అందరూ మోసం చేస్తున్నట్టు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ పెద్ద డ్రామా ఆడారని ధ్వజమెత్తారు.
చంద్రబాబు వైఖరి దొంగే దొంగా.. దొంగా.. అన్నట్టు ఉందన్నారు. 2009 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉండగా.. చంద్రబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈసీ నాటి రాష్ట్ర డీజీపీ యాదవ్‌ను మారిస్తే వైఎస్ ఏమీ చంద్రబాబులాగా ధర్నా చేయలేదని గుర్తు చేశారు. ఈసీ అన్నది స్వతంత్ర సంస్థ అని, ఇక్కడి అధికారులిచ్చే నివేదికల ఆధారంగానే ఈసీ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కానీ కొంతమంది ఎస్పీలను మార్చితే చంద్రబాబు గగ్గోలు పెట్టడమేంటని మండిపడ్డారు. ఈసీ ఆదేశాల మేరకు ఐటీ దాడులు జరగవని 40 ఏళ్ల అనుభవమున్న ఈయనకు తెలియదా? అని ప్రశ్నించారు. తాను దోపిడీ చేస్తున్నా, అక్రమాలు చేస్తున్నా ఈడీ, ఐటీ, సీబీఐ, ఎన్నికల సంఘం ఎవరూ ప్రశ్నించకూడదన్నట్టుగా చంద్రబాబు వైఖరి ఉందని ధ్వజమెత్తారు. చంద్రబాబుపై తక్షణమే కేసు నమోదు చేసి.. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్టు ఆయన చెప్పారు. వైఎస్సార్‌సీపీ నేతలు ఈసీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న వాటిలో ముఖ్యాంశాలివీ..
సీఎం అధికారిక లెటర్ హెడ్ ఉపయోగించడం తప్పు..
ఈ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి ఓటువేసి తనను గెలిపించాలని కోరుతూ చంద్రబాబునా సీఎం లెటర్‌హెడ్‌తో కూడిన లెటర్‌లో ప్రజలకు సందేశం పంపారు. ఇది ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమే. ఈనెల 9వ తేదీన చంద్రబాబు ప్రజలకు విడుదల చేసిన సందేశం ఓటర్లను ఆకర్షించేందుకే. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలి.
అనుకూల జిల్లాల్లో రిగ్గింగ్‌నకు కృత్రిమ వేళ్ల ఉపయోగానికి కుట్ర..
ఎన్నికల్లో తమకు బలమైన జిల్లాలుగా ఉన్న ప్రాంతాల్లో రిగ్గింగ్‌కు పాల్పడేందుకు టీడీపీ కుట్రలు పన్నింది. ఇందుకోసం కృత్రిమ వేళ్లను కూడా వినియోగించేందుకు సిద్ధమైంది. వీటిని ఉపయోగించడం ద్వారా ఒకే వ్యక్తి పలుమార్లు వేరే ఓట్లను వేసే అవకాశం ఉంది.. రిగ్గింగ్ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమే. దీనిపై ఈసీ తగిన విధంగా చర్యలు తీసుకోవాలి.
అనంతపురం జిల్లాలో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులపై టీడీపీ దాడి
అనంతపురం జిల్లా రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి చెర్లోపల్లిలో డబ్బు పంపిణీ చేస్తుండగా వైఎస్సార్‌సీపీ సానుభూతి పరులు అడ్డుకోగా.. వారిపై పరిటాల శ్రీరామ్ అనుచరులు దాడి చేశారు. దాడికి పాల్పడిన వారి మీద తగిన చర్యలు తీసుకోవాలి. అలాగే కృష్ణాజిల్లా కైకలూరు టీడీపీ అభ్యర్థి జయమంగళ వెంకటరమణ, అతని సానుభూతిపరులు, అనుచరులు ఓటర్లకు డబ్బు పంపిణి చేస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలి.
కుట్రలను అడ్డుకోండి..
వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నేతలపై పోలీసులు వేధింపులకు పాల్పడుతున్నారు. చట్టవిరుద్ధంగా బైండోవర్ కేసులు పెడుతున్నారు. బెదిరింపులకు దిగుతున్నారు. దీనిపై హైకోర్టును ఆశ్రయించగా.. అలా చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ కొందరు పోలీసు అధికారులు వాటిని పాటించడం లేదు. కోర్టు ఆదేశాలు అమలయ్యేలా ఈసీ ఆయా జిల్లా›ల్లోని పోలీసు అ«ధికారులకు ఆదేశాలు ఇవ్వాలి.
అదనపు భద్రతా సిబ్బందిని నియమించాలి
అత్యంత సమస్యాత్మక పోలింగ్ బూత్‌ల వద్ద అదనపు పోలీసు సిబ్బంది నియమించాలని హైకోర్టు ఈ నెల 8వ తేదీన ఎన్నికల సంఘానికి ఆదేశాలిచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు ఆయా పోలింగ్ బూత్‌ల వద్ద అదనపు సిబ్బందిని ఈసీ నియమించాలి. అలాగే ఎన్నికల విధులకోసం సీఐడీ, ఏసీబీ, ఆర్టీసీ విజిలెన్స్, పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో పనిచేస్తున్న పోలీసు అధికారులను ఈసీ ఉపయోగించుకోవాలి. ఆయా విభాగాల్లో పనిచేస్తున్న వారిని కావాలనే ప్రభుత్వం ఎన్నికల విధుల్లో నియమించలేదు. సాధారణంగా ఇలాంటి విభాగాలలో పనిచేసేవారందరూ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయకుండా ఉంటారనే భావనలో ఉంటారు. అందువల్ల ఇలాంటి వారి సర్వీసులను కూడా ఎన్నికల విధులకు ఈసీ వినియోగించుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment