ముసుగు తీసేశారు | TDP And Janasena stripped their mask | Sakshi
Sakshi News home page

ముసుగు తీసేశారు

Published Thu, Apr 11 2019 3:20 AM | Last Updated on Thu, Apr 11 2019 3:20 AM

TDP And Janasena stripped their mask - Sakshi

సాక్షి, అమరావతి: చంద్రబాబు ఆయన పార్టనర్‌ పవన్‌ కల్యాణ్‌ల లోపాయికారీ ఒప్పందం ముసుగు తొలగిపోయింది. చివరి ప్రయత్నాల్లో భాగంగా బుధవారం ఉదయం నేరుగా తమ అభ్యర్థులకే ఫోన్లు చేసి కుమ్మక్కు గుట్టు విప్పుతున్నారు. జనసేన బలంగా ఉన్న ప్రాంతాల్లో ఆ పార్టీ అభ్యర్థులకు మద్దతివ్వాల్సిందిగా, టీడీపీ ఓట్లు జనసేనకు పడేలా చూడాల్సిందిగా.. చంద్రబాబు టీడీపీ అభ్యర్థులకు చెబుతుంటే.. టీడీపీ బలంగా ఉన్న ప్రాంతాల్లో ఆ పార్టీ అభ్యర్థులకు మద్దతివ్వాల్సిందిగా పవన్‌ కల్యాణ్‌ తన పార్టీ అభ్యర్థులకు చెబుతున్నారు. బాబు, పవన్‌ల కుమ్మక్కును చూసి ఆ రెండు పార్టీల అభ్యర్థులూ ఛీకొడుతున్నారు. చంద్రబాబు తన ప్యాకేజీ పార్టనర్‌ కోసం సొంత పార్టీ అభ్యర్థుల జీవితాలనే ఫణంగా పెడుతున్నారని తెలుగుదేశం సీనియర్లు మండిపడుతున్నారు. చివరి నిముషంలో లాలూచీ వ్యవహారాలు ఏమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

మండిపడుతున్న పల్లా, బుచ్చయ్య చౌదరి 
 గాజువాక టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాస్‌కు చంద్రబాబు స్వయంగా ఫోన్‌ చేసి పవన్‌ కళ్యాణ్‌కు మద్దతుగా నిలబడాలని, టీటీపీ ఓట్లు పవన్‌కు వేయించాలంటూ ఆదేశించారు. దీనిపై శ్రీనివాస్‌ అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ఇప్పటి వరకు తాను చాలా వ్యయం చేశానని, ఇప్పుడు సైలెంట్‌ అయితే పార్టీ కేడర్‌కు ఏమి చెప్పాలని, ఆ డబ్బులు ఎవరు ఇస్తారని ప్రశ్నించారు. దీంతో చంద్రబాబు ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానని, ఖర్చు పెట్టిన డబ్బులు కూడా ఇస్తానంటూ హామీ ఇచ్చారు. అయినప్పటికీ గాజువాకలో పవన్‌ కల్యాణ్‌కు మద్దతు ఇచ్చేది లేదంటూ పల్లా శ్రీనివాస్‌ తెగేసి చెప్పినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అభ్యర్థుల రాజకీయ జీవితాన్ని బలి చేస్తూ స్వయంగా పార్టీ అద్యక్షుడే ఇటువంటి చర్యలకు పాల్పడటంపై తెలుగుదేశం కేడర్‌ మండిపడుతోంది. సొంత పార్టీనే నాశనం చేసే ఇలాంటి రాజకీయాలు ఎప్పుడూ చూడలేదని వారంటున్నారు.

ఇక పార్టీ ఆవిర్భావం నుంచి సీనియర్‌ నేతగా కొనసాగుతున్న బుచ్చయ్య చౌదరికి కూడా చంద్రబాబు ఫోన్‌ చేసి.. రాజమండ్రి రూరల్‌లో జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్‌కు మద్దతు ఇవ్వాలని, టీడీపీ ఓట్లను జనసేన అభ్యర్ధికి వేయించాలంటూ ఆదేశించారు. దీనిపై బుచ్చయ్య చౌదరి మండిపోతున్నారు. సీనియర్‌గా ఉన్న నన్నే ఈ విధంగా చంద్రబాబు కోరడం చూస్తుంటే పార్టీని ఏమి చేద్దామనుకుంటున్నారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. మొత్తం మీద చంద్రబాబు ఆదేశాలతో రాజమండ్రి రూరల్‌లో బుచ్చయ్య చౌదిరి సైలెంట్‌ అయిపోయారు. పార్టీ ఎలా పోతే నాకు ఎందుకులే అన్న నిర్వేదంలో బుచ్చయ్య చౌదరి ఉన్నట్టు కార్యకర్తలు తెలిపారు. చంద్రబాబు చర్యతో చివరిరోజు కందుల దుర్గేష్‌ శిబిరంలో ఉత్సాహం నింపింది. 

పార్ట్‌నర్‌ పరువు కాపాడేందుకు.. 
ఇక భీమవరం అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి పవన్‌ కల్యాణ్‌ పరిస్థితి అధ్వానంగా తయారై, మూడో స్థానంలోకి పవన్‌ వెళ్లిపోయారనే సమాచారంతో పార్టనర్‌ పరువు కాపాడేందుకు చంద్రబాబు రంగంలోకి దిగారు. పార్టీ అభ్యర్ధి పి.రామాంజనేయులును బలిపశువును చేశారు. వెంటనే సైలెంట్‌ అయిపోయి పవన్‌ కల్యాణ్‌కు మద్దతు ఇవ్వాలని, టీడీపీ ఓట్లను పవన్‌కు వేయించాలంటూ చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. 

గంటాకు మద్దతుగా జనసేన సైలెంట్‌ 
మరోవైపు వైజాగ్‌ నార్త్‌ టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు కోసం జనసేన అభ్యర్థి పి.ఉషా కిరణ్‌ను సైలెంట్‌ చేసేందుకు పవన్‌ కళ్యాణ్‌ చర్యలు చేపట్టారు. జనసేన ఓట్లను గంటా శ్రీనివాసరావుకు వేయించాలంటూ పవన్‌ సూచించారు. అలాగే రాజమండ్రి సిటీలో కూడా టీడీపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాల్సిందిగా జనసేన తన అభ్యర్థిని ఆదేశించింది. రాజమండ్రి సిటీలో టీడీపీ అభ్యర్థిగా ఆదిరెడ్డి భవాని పోటీ చేస్తుండగా, జనసేన అభ్యర్ధిగా ఎ. సత్యనారాయణ పోటీ చేస్తున్నారు. కాగా జనసేన అభ్యర్థి సైలెంట్‌ అయినందుకు గాను డబ్బులు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.  

డబ్బుల మూటలిచ్చేందుకు బాబు హామీ 
తుని, అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా పవన్‌ జనసేన అభ్యర్థులను సైలెంట్‌ చేసేలా చంద్రబాబు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులకు జనసేన మద్దతు ప్రకటింపజేసినందుకు గాను భారీ ఎత్తున డబ్బులు ముట్టచెప్పేందుకు ఒప్పందం కుదిరింది. గుంటూరు వెస్ట్, గురజాలల్లో కూడా టీడీపీ, జనసేన మధ్య మ్యాచ్‌ ఫిక్సింగ్‌లు జరిగాయి. గుంటూరులో జనసేన అభ్యర్థికి, టీడీపీ అభ్యర్ధి మద్దతు ప్రకటించడం, గురజాలలో టీడీపీ అభ్యర్థికి జనసేన మద్దతు ఇచ్చేలా లాలూచీ పడ్డారు. భారీ ఎత్తున నగదు  ఆశ చూపడంతో కొంత మంది అభ్యర్థులు రాజీపడ్డారు. అలాగే కొత్తపేట నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థికి మద్దతుగా జనసేన అభ్యర్థి బి. శ్రీనివాసరావును సైలెంట్‌ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement