సాక్షి, అమరావతి: నేను ట్రెండ్ ఫాలో అవ్వను .. ట్రెండ్ క్రియేట్ చేస్తాను’ అన్నది ఒక సినిమాలో పవన్ కల్యాణ్ డైలాగ్. ప్యాకేజీల పవన్‌గా సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న జనసేన అధినేత.. తాజాగా ఎన్నికల పొత్తుల్లో ఇంతకుముందెన్నడూ లేని కొత్త ప్యాకేజీ ట్రెండ్‌ను క్రియేట్ చేశారు. సాధారణంగా రాజకీయంగా బలోపేతం కావడా నికి కొందరు ఎన్నికల పొత్తులు పెట్టుకుంటారు.. కానీ ప్యాకేజీ పెంచుకునేందుకు పొత్తు పెట్టుకోవడమన్నది పవన్ కల్యాణ్‌తోనే మొదలైంది. తమతో పొత్తు పెట్టుకుని పవన్ కళ్యాణ్ రాజకీయంగా చంద్రబాబుతో బేరమాడే శక్తిని పెంచు కున్నారని వామ పక్షాలు గగ్గోలు పెడుతుండటం రాజకీయవర్గాల్లో చర్చనీ యాంశమయ్యింది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పవన్, చంద్రబాబు కుమ్మక్కు రాజకీయాల ముసుగు పూర్తిగా తొలగిపోతోంది.
రాష్ట్రంలో తృతీయ శక్తి కోసమం టూ జనసేనతో జట్టుకట్టిన వామపక్షాలకు అసలు విషయం బోధపడుతోంది. పొత్తులు, అవగాహన అని తమ పార్టీ కార్యాలయాల చుట్టూ తిరిగి ఇప్పుడు తమకే పంగనామాలు పెడుతున్నారని ఆ పార్టీల నేతలు వాపోతున్నారు. పలుచోట్ల టీడీపీకి అనుకూలంగా పవన్ టిక్కెట్లు కేటాయించడం, నామినేషన్ల గడువు ముంచు కొస్తున్నా సరే ఇంకా రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాలకు జనసేన అభ్యర్థులను ప్రకటించకపోవడం, వామపక్షాలకు కేటా యించిన కొన్ని స్థానాల్లో జనసేన అభ్యర్థులను ప్రకటిం చడం, అధికారంలో ఉన్న చంద్రబాబును కాకుండా కేవలం ప్రధాన ప్రతిపక్షమే లక్ష్యంగా విమర్శలు చేస్తుం డటం.. బాబు, పవన్‌ల కుమ్మక్కు కుట్రను సుస్పష్టం చేస్తుం డగా.. అందుకు తగ్గట్లుగానే జనసేన వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతో వామపక్షాలు మండిపడుతు న్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం నాటి పవన్, వామపక్షాల మధ్య సమావేశం వాడివేడిగా సాగినట్లు తెలిసింది.
మీ ప్రయోజనాలకు మమ్మల్ని బలిచేస్తారా?
పొత్తు ధర్మానికి పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ పవన్ వద్ద వామపక్ష పార్టీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. మాతో పొత్తు పెట్టుకుని మీ ‘ప్రయోజనాల’ కోసం తాపత్రయ పడుతున్నారు తప్ప ఎన్నికల్లో విజయం కోసం కాదని పరోక్షంగా నిలదీశాయి. ‘పొత్తు అనేది భాగస్వామ్య పార్టీలకు రాజకీయంగా ఉపయోగపడాలి. అంతేకానీ పొత్తును ఉపయోగించుకుని వ్యక్తిగత ‘ప్రయోజనాలు’ పొందాలని చూడటం, మమ్మల్ని బలిచేయటం సరికాదు..’ అని సూటిగా చెప్పినట్లు సమాచారం. జరుగుతున్న పరిణా మాలు సందేహాలను నిజం చేస్తున్నట్టుగా ఉందని, తమను అడ్డం పెట్టుకుని చంద్రబాబుతో బేరాలు కుదుర్చుకోవడం సమంజసం కాదన్న రీతిలో తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది.
టీడీపీ సీనియర్ల స్థానాల్లో జనసేన అభ్యర్థులేరీ?
నామినేషన్ల గడువు ముంచుకొస్తున్నప్పటికీ జనసేన ఇంకా పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించకపోవడాన్ని వామపక్ష నేతలు ప్రస్తావించారు. సీపీఎం, సీపీఐలకు చెరో 7 నియోజకవర్గాలు, బీఎస్పీకి 21 స్థానాలు కేటాయించిన జనసేన ఇతర నియోజకవర్గాల్లో తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించాలి. కానీ వాటిలో పలు నియోజకవర్గాలకు జనసేన ఇంతవరకు అభ్యర్థులను ప్రకటించకపోవడాన్ని లెఫ్ట్ నేతలు నిలదీశారు. ముఖ్యంగా టీడీపీలో ముఖ్యనేతలు పోటీ చేస్తున్న నియోజకవర్గాలకు జనసేన అభ్యర్థులను ప్రకటించకపోవడం అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలో ఏకంగా 8 నియోజకవర్గాల్లో జనసేన తమ అభ్యర్థులను ప్రకటించ లేదు. వాటిలో చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణ, మంత్రి కాల్వ శ్రీనివాసులు, టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, వరదాపురం సూరి, జేసీ ప్రభాకర్‌రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి పోటీ చేస్తున్న హిందూపూర్, రాయదుర్గం, ఉరవకొండ, తాడిపత్రిలతోపాటు ధర్మవరం, పెనుగొండ నియోజకవర్గాలు ఉండటం గమనార్హం.
చంద్రబాబు సూచనల మేరకు ఆ నియోజకవర్గాల్లో టీడీపీకి అనుకూలంగా వ్యవహరించేందుకే జనసేన అభ్యర్థులను ప్రకటించకుండా వ్యూహాత్మకంగా జాప్యం చేస్తోంది. అదే విధంగా విశాఖపట్నంలో మంత్రి అయ్యన్నపాత్రుడుకు పరోక్షంగా సహకరించేందుకు నర్నీపట్నం అభ్యర్థిని ప్రకటించలేదు. నెల్లూరులో జిల్లాలో టీడీపీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్న వెంకటగిరి నియోజకవర్గంలో కూడా జనసేన తమ అభ్యర్థిని నిర్ణయించలేదు. ఇక విజయనగరం జిల్లాలో మంత్రి సుజయకృష్ణ రంగారావు పోటీ చేస్తున్న బొబ్బిలి, మాజీ మంత్రి కిమిడి మృణాళిని కుమారుడు పోటీచేస్తున్న చీపురుపల్లి నియోజకవర్గాల్లో ఆ జిల్లాతో సంబంధంలేని వారిని జనసేన అభ్యర్థులుగా ప్రకటించింది. ఈ అంశాలపై వామపక్షాలు ప్రశ్నించినా పవన్ సూటిగా సమాధానం చెప్పలేకపోయారని సమాచారం.
చంద్రబాబుపై మెతకవైఖరి, జగన్‌పై విమర్శలు ఎందుకు?
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో అధికార టీడీపీని గానీ సీఎం చంద్రబాబును గానీ సూటిగా విమర్శించకపోవడాన్ని వామపక్షాలు ప్రశ్నించాయి. మరోవైపు ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పైనే రాజకీయంగానూ వ్యక్తిగతంగానూ తీవ్రస్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేయడం వెనుక ఆయన ఉద్దేశాన్ని శంకించాయి. ఐదేళ్లు అధికారంలో ఉండి తీవ్రమైన ప్రజావ్యతిరేకత మూటకట్టుకున్న పార్టీని కాకుండా ప్రతిపక్ష పార్టీని విమర్శిస్తే ప్రజలకు ఎలాంటి సంకేతాలు వెళతాయని నిలదీశాయి. మీతో పొత్తు పెట్టుకున్నందున తమ విశ్వసీనయత కూడా దెబ్బతింటోందని ఆ పార్టీల నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. తాము గతంలో పలు ఎన్నికల్లో పలు పార్టీలతో పొత్తు పెట్టుకున్నామని, ఎన్నడూ తమ సిద్ధాంతాలు, విశ్వసనీయతకు భంగం వాటిల్లలేదని చెప్పారు. రాష్ట్రంలో తృతీయ రాజకీయ శక్తిగా అవతరించడమే తాము మీతో పొత్తు పెట్టుకోవడంలోని ఉద్దేశమని స్పష్టం చేశారు. దీనిపై పవన్ కల్యాణ్ సరైన సమాధానం చెప్పలేదని సమాచారం. ‘నేను ఒక విధానంలో ఒక వ్యూహంతో వెళ్తున్నాను. నా పంథా నాదే’ అని ఆయన వ్యాఖ్యానించినట్లు తెలిసింది.
ఆ ప్రసంగాలకు మేము వ్యతిరేకం
ఇక రాజకీయ ప్రయోజనాలు, ఎన్నికల్లో లబ్ధి కోసం ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడానికి తాము వ్యతిరేకమని కూడా వామపక్షాలు పవన్ కల్యాణ్‌కు స్పష్టం చేసినట్లు సమాచారం. తెలంగాణాలో ఆంధ్రులను కొడుతున్నారని ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందని నేతలు నిలదీశారు. మీ సోదరుడు చిరంజీవి కుటుంబంతో పాటు ఏపీకి చెందిన లక్షలాదిమంది హైదరాబాద్, తెలంగాణల్లో ప్రశాంతంగా జీవిస్తున్న సమయంలో ఇలాంటి అసంబద్ధమైన ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మీ వ్యాఖ్యలపై అక్కడి ఆంధ్రులే మండిపడుతున్నారని చెప్పారు. తెలంగాణ సాధించినందుకు కేసీఆర్‌పై పవన్ కల్యాణ్ పొగడ్తల వర్శం కురింపించిన విషయాన్ని గుర్తుచేశారు. ‘ఒక్క రక్తపు చుక్క చిందించకుండా తెలంగాణ సాధించిన గొప్పనేత కేసీఆర్ అని మీరే కీర్తించారు కదా’ అని కూడా అడిగారు.
అంతేకాదు కేసీఆర్‌కే ఓటేయాలని పవన్ సోదరుడు నాగబాబు తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చిన విషయాన్నీ వామపక్ష నేతలు ప్రస్తావించారు. రాష్ట్ర ఎన్నికలతో సంబంధం లేని కేసీఆర్‌ను విమర్శించడం ద్వారా భావోద్వేగాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు చంద్రబాబు ప్రయత్ని స్తున్నారని, మీరు కూడా అదేరీతిలో విమర్శలు చేయడం టీడీపీతో కుమ్మక్కును స్పష్టం చేస్తున్నట్టుగా ఉందని అన్నారు. దీనిపై కూడా పవన్ కల్యాణ్ పెద్దగా స్పందించలేదని తెలిసింది. సీపీఐకి సీటు విషయమై నెలకొన్న వివాదంపై మాట్లాడుతూ.. నూజివీడు, విజయవాడ లోక్‌సభ రెండూ కుదరవని, కృష్ణా జిల్లాలోనే మరొక చోట ఇస్తానని చెప్పారు. వామపక్షాల తరఫున మధు, జల్లి విల్సన్‌లు పవన్‌కల్యాణ్‌తో చర్చల్లో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment