జనసేన సినిమా రైట్స్‌ టీడీపీకి.. | Janasena Political Rights To TDP | Sakshi
Sakshi News home page

జనసేన సినిమా రైట్స్‌ టీడీపీకి..

Published Tue, Mar 19 2019 4:24 AM | Last Updated on Sat, Mar 23 2019 8:59 PM

Janasena Political Rights To TDP - Sakshi

ఆనాడు ప్రజారాజ్యం పార్టీ సినిమా రైట్స్‌ను ఎన్నికల షూటింగ్‌ తరువాత కాంగ్రెస్‌కు అమ్మేశారు. కానీ, పవన్‌కల్యాణ్‌ తన అన్నయ్య కంటే నాలుగు ఆకులు ఎక్కువే చదివారు. తన జనసేన సినిమా స్టేట్‌వైడ్‌ రైట్స్‌ను ఎన్నికల షూటింగ్‌కు ముందే చంద్రబాబుకు హోల్‌సేల్‌గా అమ్మేశారు. చంద్రబాబు డైరెక్షన్‌లో తన జనసేన సినిమాలో వామపక్షాలకు, బీఎస్పీకి పాత్ర కల్పించారు..గ్రేటర్‌ రాయలసీమలో మిత్రపక్షాలకు సీట్లు ఇచ్చి, జనసేన పోటీ చేయకుండా.. అక్కడ సామాజిక సమీకరణాలను ప్రభావితం చేసి, జనసేన ఓట్లు టీడీపీకి పడేలా చూడటం..! మంగళగిరిలో మంత్రి నారా లోకేశ్‌పై జనసేన అభ్యర్థిని పోటీకి పెట్టకుండా.. నామమాత్రంగా కూడా బలంలేని సీపీఐకి పొత్తులో భాగంగా ఆ సీటు కేటాయించడం.. కోస్తాలో తన పార్టీ అభ్యర్థులను పెట్టి.. టీడీపీ వ్యతిరేక ఓటు ప్రధాన ప్రతిపక్షానికి వెళ్లకుండా అడ్డుకోవడం..బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సంప్రదాయ ఓటు బ్యాంకును చీల్చి చంద్రబాబుకు ప్రయోజనం చేకూర్చడం.. అందుకు ప్రతిగా జనసేనలో పవన్‌ కల్యాణ్‌తోపాటు మరో ముగ్గురు ముఖ్యనేతలు పోటీచేసే నియోజకవర్గాల్లో టీడీపీ తరఫున బలహీనమైన అభ్యర్థులను బరిలో ఉంచడం.. తమకు రాష్ట్రవ్యాప్తంగా లోపాయికారీగా సహకరిస్తున్న జనసేనకు మూడు నాలుగుచోట్ల సహకరించడం..!!
.. ఇదీ ప్రశ్నిస్తానంటూ వచ్చిన జనసేనాని పవన్‌కల్యాణ్‌ తీరు 

మంత్రి లోకేశ్‌పై అడపాదడపా విమర్శలు చేసే పవన్‌కల్యాణ్‌.. ఆయన పోటీచేస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో మాత్రం జనసేన అభ్యర్థిని నిలబెట్టకుండా టీడీపీకి లోపాయికారీగా సహకరించాలని నిర్ణయించడం గమనార్హం. 

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా జనసేన ఎన్నికల వింత పొత్తులు, పోకడలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ‘ప్రశ్నించడానికే జనసేన’ అంటూ.. సినీనటుడు పవన్‌కళ్యాణ్‌ పెట్టిన పార్టీ.. ఆవిర్భావం నుంచి టీడీపీకి నీడగా సాగుతూ.. ప్రస్తుతం ఎన్నికల ముందు పూర్తిగా చంద్రబాబుకు ‘బీ’ టీమ్‌గా మారిపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీడీపీ అధినేత పన్నాగాలకు అనుగుణంగా వింత పొత్తులు పెట్టుకోవడం, చీకటి ఒప్పందాలు చేసుకోవడంపై ఆయన అభిమానులు మండిపడుతున్నారు. తమ అభిమానాన్ని హోల్‌సేల్‌గా చంద్రబాబుకు అమ్మేశారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

టీడీపీ పొలిటికల్‌ షెల్‌ కంపెనీగా జనసేన 
సింగపూర్‌ కంపెనీల పేరిట రాజధాని భూములు, కాంట్రాక్టులు సృష్టించి లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డ చంద్రబాబు రాజకీయాల్లోనూ అదే దుర్నీతికి తెరతీశారు. తాజా ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చేలా ప్రజల్ని మోసగించేందుకు తమ రాజకీయ షెల్‌ కంపెనీగా జనసేన పార్టీని తెరపైకి తెచ్చారు. ఆ పన్నాగంలో భాగంగానే నాలుగేళ్లుగా చంద్రబాబుతో అంటకాగిన పవన్‌కల్యాణ్‌ను ఏడాది క్రితం వ్యూహాత్మకంగా టీడీపీతో విభేదించినట్లు డ్రామాకు తెరతీశారు. ఏడాదిపాటు అడపాదడపా హడావుడి చేస్తూ గడిపిన ఆయన సరిగ్గా ఎన్నికల ముందు తన అసలు రంగు బయటపెట్టారు. చంద్రబాబు డైరెక్షన్‌లో ఓ వైపు వామపక్షాలు.. మరోవైపు బీఎస్పీతో పొత్తు కుదుర్చుకున్నారు. పూర్తిగా టీడీపీకి అనుకూలించాలన్న ఏకైక అజెండాతోనే ఆ మూడు పార్టీలతో జనసేన సీట్ల సర్దుబాటు చేసుకోవడం గమనార్హం. వైఎస్సార్‌సీపీ అత్యంత పటిష్టంగా ఉన్న గ్రేటర్‌ రాయలసీమ, ఉత్తరాంధ్రలో అత్యధిక సీట్లను ఆ మూడు పార్టీలకు జనసేన కేటాయించడం ఆ విషయాన్ని తేటతెల్లం చేస్తోంది. అదేలాగో చూద్దాం..
రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో 9 ఎంపీ నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిలో ఏకంగా 6 స్థానాలను జనసేన తన మిత్రపక్షాలకు కేటాయించడం విస్మయపరుస్తోంది.

రాష్ట్రంలో తృతీయ శక్తిగా ఎదుగుతామని గొప్పలు చెప్పుకుంటున్న పార్టీ ఏకంగా రాష్ట్రంలో ఓ ప్రధాన ప్రాంతంలో దాదాపుగా పోటీ నుంచి తప్పుకోవడం టీడీపీతో ఆ పార్టీ లోపాయికారీ పొత్తుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఎందుకంటే రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో రాజకీయ, సామాజికవర్గ సమీకరణలు ఒకే విధంగా ఉంటాయి. ఆ జిల్లాల్లో తిరుగులేని ప్రజాదారణ ఉన్న వైఎస్సార్‌సీపీ అక్కడ సంస్థాగతంగానూ పటిష్టంగా ఉంది. సామాజికవర్గ సమీకరణలు కూడా అనుకూలంగా ఉన్నాయి. దాంతో టీడీపీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో  జనసేన ఎక్కువ ఎంపీ స్థానాల్లో పోటీచేస్తే టీడీపీకి ఇంకా గడ్డు పరిస్థితి ఎదురై తీవ్రంగా నష్టపోతుంది. ఎందుకంటే ఆ ఐదు జిల్లాల్లో జనసేనకు అనుకూలంగా ఉండే  సామాజికవర్గం ఓట్లు కొంతవరకు ఆ పార్టీకే పడతాయి.ఆ సామాజికవర్గం ఓట్లను జనసేన చీలిస్తే టీడీపీ పూర్తిగా తుడుచు పెట్టుకుపోతుందని చంద్రబాబు ఆందోళన చెందారు. దాంతో ఆయన డైరెక్షన్‌లోనే రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో జనసేన ఎక్కువ ఎంపీ స్థానాల్లో పోటీచేయకూడదని పవన్‌ కల్యాణ్‌ నిర్ణయించారు.

రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లోని 9 లోక్‌సభ నియోజకవర్గాల్లో 6 స్థానాలను జనసేన తన మిత్రపక్షాలకు కేటాయించింది. తిరుపతి, చిత్తూరు ఎంపీ నియోజకవర్గాలను బీఎస్పీకి ఇచ్చారు. కడప, అనంతపురం ఎంపీ నియోజకవర్గాలను సీపీఐకు కేటాయించారు. కర్నూలు, నెల్లూరు ఎంపీ నియోజకవర్గాలను సీపీఎంకు కేటాయించారు. తద్వారా ఆ 6 ఎంపీ నియోజకవర్గాల్లో జనసేన పోటీచేయకుండా ఆ పార్టీకి ఉన్న కార్యకర్తలు, పవన్‌ కల్యాణ్‌ అభిమానులు టీడీపీకి అనుకూలంగా పనిచేసి ఓటు వేసేలా చూడాలన్నది చంద్రబాబు రాజకీయ ఎత్తుగడ. దానికి జీ హుజూర్‌ అంటూ పవన్‌ కల్యాణ్‌ వత్తాసు పలికి ఆయన చెప్పినట్లే తమ మిత్రపక్షాలతో సీట్ల పంపకం ఒప్పందం కుదుర్చుకున్నారు. అదేవిధంగా.. గుంటూరు జిల్లా బాపట్ల లోక్‌సభ నియోజకవర్గాన్ని కూడా బీఎస్పీకి కేటాయించి టీడీపీకి తాము పరోక్షంగా సహకరించాలని పవన్‌ కల్యాణ్‌ నిర్ణయించారు. మొత్తం మీద వామపక్షాలు, బీఎస్పీలకు జనసేన 7 ఎంపీ నియోజకవర్గాలను కేటా యించడం పవన్‌కల్యాణ్, చంద్రబాబు తెరచాటు రాజకీయ బంధాన్ని బట్టబయలు చేసింది. 

ఇక వైఎస్సార్‌సీపీ 2014 ఎన్నికల్లో గెలిచిన అత్యధిక నియోజకవర్గాలను పొత్తుల్లో భాగంగా పవన్‌ కల్యాణ్‌ తమ మిత్రపక్షాలకు కేటాయించడం గమనార్హం. గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలిచిన స్థానాల కోసం చంద్రబాబు పలు రాజకీయ తంత్రాలు పన్నుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ నియోజకవర్గాల్లో జనసేన పోటీచేస్తే టీడీపీ అవకాశాలను దెబ్బతీస్తుందని చంద్రబాబు ఆందోళన చెందారు. ఎందుకంటే ఆ నియోజకవర్గాల్లో జనసేన పోటీచేస్తే ఆ పార్టీకి అనుకూలంగా  ఉన్న సామాజికవర్గం ఓట్లు ఆ పార్టీకే పడతాయి. దాంతో టీడీపీ నష్టపోతుంది. అందుకే 2014లో వైఎస్సార్‌సీపీ గెలిచిన నియోజకవర్గాల్లో అత్యధికం వామపక్షాలకు కేటాయించింది.  

బీఎస్పీతో పొత్తులోనూ అదే కుతంత్రం..
చంద్రబాబు డైరెక్షన్‌లో పవన్‌ కల్యాణ్‌ మరో పొత్తుల డ్రామాకు తెరతీశారు. బీఎస్పీతో ఎన్నికల పొత్తు పెట్టుకున్నారు. రాష్ట్రంలో కనీసస్థాయిలో కూడా ఉనికిలో లేని బీఎస్పీకి ఏకంగా 21 ఎమ్మెల్యే, మూడు ఎంపీ స్థానాలను కేటాయించడం రాష్ట్రంలో రాజకీయ పరిశీలకులను నివ్వెరపరిచింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు బలమైన మద్దతుదారులుగా ఉన్న దళితులను రాజకీయంగా విభజించడానికే చంద్రబాబు డైరెక్షన్‌లో పవన్‌కల్యాణ్‌  బీఎస్పీతో పొత్తుపెట్టుకున్నారన్నది స్పష్టమవుతోంది. ఎందుకంటే తమను మొదటి నుంచీ మోసం చేస్తున్న టీడీపీని ఆవిర్భావం నుంచి కూడా దళితులు తీవ్రంగా వ్యతిరేకిస్తునే ఉన్నారు. దాంతో తమకు రాని దళితుల ఓట్లు వైఎస్సార్‌సీపీకి కూడా పూర్తిగా వెళ్లకుండా చీల్చాలని చంద్రబాబు రాజకీయ కుతంత్రానికి తెరతీశారు. అందుకోసం బీఎస్పీతో పొత్తుపెట్టుకోవాలని మాయావతి వద్దకు పవన్‌కల్యాణ్‌ను ఆయనే పంపించారు. బీఎస్పీకి ఏకంగా 21 ఎమ్మెల్యే, మూడు ఎంపీ స్థానాలను కేటాయించేలా కథ నడిపించారు. జనసేన పొత్తులో భాగంగా బీఎస్పీకి కేటాయించిన  21 ఎమ్మెల్యే స్థానాలను వైఎస్సార్‌సీపీ పటిష్టంగా ప్రాంతాల్లోనివే ఎంపిక చేయాలన్నది చంద్రబాబు ఉద్దేశ్యం. దీనిపై ఒకట్రెండు రోజుల్లో నిర్ణయిస్తారు. 

వైఎస్సార్‌సీపీని దొంగ దెబ్బతీసే కుట్ర
రాయలసీమ, నెల్లూరు,  ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే అత్యధిక నియోజకవర్గాలను జనసేన పొత్తుల కింద తన మిత్రపక్షాలకు కేటాయించింది. తద్వారా సామాజికవర్గ సమీకరణలను టీడీపీకి అనుకూలంగా మలచాలన్నది చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ కుతంత్రం. గ్రేటర్‌ రాయలసీమ జిల్లాలైన కడప, అనంతపురం, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాల్లో సామాజిక సమీకరణలు టీడీపీకి ప్రతికూలంగా ఉన్నాయి. అక్కడ వైఎస్సార్‌సీపీకి ఉన్న బలమైన ఓటు బ్యాంకును దెబ్బతీయడం సాధ్యం కాదన్నది సుస్పష్టం. కాబట్టి ఆ నియోజకవర్గాల్లో జనసేన పోటీచేస్తే.. టీడీపీ ఓట్లే చీలుతాయి. దాంతో టీడీపీ ఇంకా బలహీనపడి వైఎస్సార్‌సీపీ మరింత భారీ మెజార్టీతో గెలుస్తుంది. అందుకే జనసేన ఆ నియోజకవర్గాల్లో పోటీచేయకుండా.. ఆ పార్టీ  కార్యకర్తలు టీడీపీకి లోపాయికారీగా పనిచేసేలా పన్నాగం పన్నారు. 

లోకేశ్‌కు లోపాయికారీ సహకారం
టీడీపీ, జనసేన లోపాయికారీ బంధం మంగళగిరి నియోజకవర్గ వేదికగా బట్టబయలైంది. మంత్రి లోకేశ్‌పై అప్పుడప్పుడు సుతిమెత్తగా విమర్శలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే పవన్‌ కల్యాణ్‌ తీరా ఎన్నికలు వచ్చేసరికి తన అసలు నైజం చూపించారు. లోకేశ్‌ పోటీచేస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో చంద్రబాబు స్కెచ్‌ మేరకు జనసేన తన అభ్యర్థిని నిలబెట్టకుండా టీడీపీకి లోపాయికారీగా సహకరించాలని నిర్ణయించారు. వాస్తవానికి మంగళగిరి నియోజకవర్గంలో సీపీఐకు ఏమాత్రం పట్టులేదు. కానీ, సీపీఎంకు కార్యకర్తలు ఉన్నారు. గతంలో ఇక్కడ ఒకసారి గెలిచింది కూడా. రాజధాని పేరిట చంద్రబాబు ప్రభుత్వ కుంభకోణాలకు వ్యతిరేకంగా సీపీఎం కూడా ప్రజాందోళనలు కూడా నిర్వహించింది. దాంతో ఆ సీటు తమకు కేటాయించాలని సీపీఎం పవన్‌ కల్యాణ్‌ను కోరింది. కానీ, కొంత పట్టున్న సీపీఎంకు మంగళగిరి నియోజకవర్గాన్ని కేటాయిస్తే.. అక్కడ నుంచి పోటీచేసే మంత్రి లోకేశ్‌కు ఇబ్బంది కలుగుతుందని చంద్రబాబు భావించారు. అలాగే, జనసేన పోటీచేసినా కొద్దోగొప్పో ఓట్లు ప్రభావితమయ్యే పరిస్థితి ఉంటుందని అది తమకే నష్టమని భావించి చంద్రబాబు ఆ పార్టీని పోటీకి దిగనివ్వలేదు. అలాగే, సీపీఎంకు కేటాయించవద్దని కూడా పవన్‌కు చెప్పారు.

చంద్రబాబు చెప్పినట్టుగా పవన్‌ మంగళగరి సీటును సీపీఎంకు కేటాయించకుండా సీపీఐకి కేటాయించారు. జనసేన అభ్యర్థిని పెడతామంటే తాము ఆ స్థానాన్ని వదిలేశామని కానీ పవన్‌ ఆ సీటును సీపీఐకివ్వడమేంటని సీపీఎం మథనపడుతున్నట్లు సమాచారం. మరోవైపు.. మంగళగిరి నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసేందుకు అక్కడ బలమైన సామాజికవర్గంగా ఉన్న చేనేతల నుంచి బలమైన నేతలు ముందుకు వచ్చినప్పటికీ వారికీ పవన్‌ టికెట్‌ ఇవ్వలేదు. దీంతో పవన్‌కల్యాణ్‌పై చేనేత సామాజికవర్గం నేతలు తీవ్రస్థాయిలో రగిలిపోతున్నారు. ఒకప్పుడు చేనేతలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా తాను ప్రకటించుకున్న పవన్‌కల్యాణ్‌ ఎన్నికల సమయంలో అవకాశం ఉన్నప్పటికీ కేవలం లోకేష్‌ కోసం తమకు అన్యాయం చేశారని వారు మండిపడుతున్నారు. అదే విధంగా విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గాన్ని కూడా పవన్‌కల్యాణ్‌ పొత్తుల్లో భాగంగా సీపీఎంకు కేటాయించడం గమనార్హం. ఆ నియోజకవర్గంలో టీడీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పవన్‌కల్యాణ్‌కు సన్నిహితుడు. ఆయనకు 2014 ఎన్నికల్లో పవన్‌ కల్యాణే టీడీపీ టికెట్‌ ఇప్పించారు. అందుకే ఈ ఎన్నికల్లో బొండా ఉమాకు సహకరించాలని పవన్‌ నిర్ణయించారు.

జనసేన కోసం బాబు సర్దు‘పాట్లు’
పవన్‌ కల్యాణ్, నాదెండ్ల మనోహర్, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణలతోపాటు తాజాగా నాగబాబు పోటీచేయాలని భావిస్తున్న నియోజకవర్గాల్లో వారికి అనుకూలంగా టీడీపీ వ్యవహరించేలా పావులు కదుపుతున్నారు.  పవన్‌ కల్యాణ్‌ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్నది ఇంకా ప్రకటించలేదు. కానీ, ఆయన పరిశీలనలో విశాఖ జిల్లా గాజువాక, భీమిలి నియోజకవర్గాలను పరిశీలిస్తున్నారు. ఆ రెండింటిలో ఓ నియోజకవర్గాన్ని పవన్‌ కల్యాణ్‌ ఎంపిక చేసుకుంటే మరో స్థానం నుంచి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పోటీచేయాలని భావిస్తున్నారు. ఆ నియోజకవర్గాల్లో టీడీపీకి సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. కానీ, పవన్‌కల్యాణ్, లక్ష్మీనారాయణల కోసమే భీమిలి నియోజకవర్గ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి గంటా శ్రీనివాసరావును విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గానికి మార్చారు. మరోవైపు.. భీమిలి నియోజకవర్గ అభ్యర్థిని ఎంపిక చేయకుండా ఉద్దేశ్యపూర్వకంగా తాత్సారం చేస్తున్నారు. అదే విధంగా విశాఖపట్నంలోని గాజువాక నియోజకవర్గంలో టీడీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌ ఉన్నారు. ఆయనకు కూడా టీడీపీ ఇంతవరకు టికెట్‌ ఖరారు చేయకుండా పెండింగ్‌లో పెట్టారు. ఆయన్ను విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా పోటీచేయాలని చంద్రబాబు గట్టిగా చెబుతుండటం గమనార్హం. ఇందుకు పల్లా శ్రీనివాస్‌ ససేమిరా అంటున్నా బాబు వినిపించుకోవడంలేదు. 

ఇక పశ్చిమ గోదావరి జిల్లాలోనూ జనసేన కోసం టీడీపీ అదే రాజకీయ లోపాయికారీ తంత్రాన్ని అమలుచేస్తోంది. పవన్‌ కల్యాణ్‌ తన సోదరుడు నాగబాబును నరసాపురం లోక్‌సభ నియోజవకర్గం నుంచి పోటీచేయాలని తాజాగా భావిస్తున్నారు. దాంతో జనసేనకు అనుకూలంగా చంద్రబాబు ఆ జిల్లాలో కొన్ని స్థానాలను అప్పటికప్పుడు మార్చాలని నిర్ణయించారు. నరసాపురం ఎంపీ అభ్యర్థిగా మాజీమంత్రి, సీనియర్‌ నేత కొత్తపల్లి సుబ్బారాయుడును పోటీ చేయించాలని చంద్రబాబు మొదట భావించారు. కానీ, కాపు సామాజికవర్గానికి చెందిన కొత్తపల్లి సుబ్బారాయుడు ఎంపీగా పోటీచేస్తే నాగబాబుకు రాజకీయంగా సమస్య ఎదురవుతుందని పవన్‌ చెప్పారు. దాంతో కొత్తపల్లి సుబ్బారాయుడు అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు పక్కనపెట్టేశారు.

చైతన్యరాజును ఎంపీ అభ్యర్థిగా సూత్రప్రాయంగా నిర్ణయించారు. దాంతో ఆయన కొన్ని రోజులుగా నియోజకవర్గంలో పర్యటిస్తూ అందర్నీ కలుస్తున్నారు. కానీ, ఆయన టీడీపీ అభ్యర్థిగా ఉండటాన్ని కూడా పవన్‌కల్యాణ్‌ వ్యతిరేకించారు. దాంతో చంద్రబాబు చైతన్యరాజను పిలిపించి ఎంపీ అభ్యర్థిగా ఆయనకు అవకాశం ఇవ్వడంలేదని చెప్పినట్లు సమాచారం. దీనిపై చైతన్యరాజు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసినప్పటికీ ఫలితం లేకపోయింది. మరోవైపు.. ఇప్పటికే ఉండి ఎమ్మెల్యేగా ప్రకటించిన వేటుకూరి శివ రామారాజు (కలవపూడి శివ)ను నరసాపురం ఎంపీగా పోటీచేయించాలని యోచిస్తున్నారు. దీనిపై శివరామరాజు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఆయన్ని ఎంపీ అభ్యర్థిగా పోటీచేయాల్సిందేనని చెబుతున్నారు. ఆయన స్థానంలో వెటకూరి రాంబాబును ఉండి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిర్ణయించాలని భావిస్తున్నారు. ఈ పరిణామాలపై పశ్చిమ గోదావరి జిల్లా నేతలు గగ్గోలు పెడుతున్నా చంద్రబాబు వినిపించుకోవడం లేదు.

పవన్‌పై అభిమానుల ఆగ్రహం
పవన్‌కల్యాణ్‌ పొత్తుల వెనుక ఉన్న కుట్ర బట్టబయలు కావడంతో ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తలుæ మండిపడుతున్నారు. తమ అభిమానాన్ని హోల్‌సేల్‌గా చంద్రబాబుకు అమ్మేశారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పదేళ్ల క్రితం చిరంజీవి మీద అభిమానంతో పీఆర్పీకి అండగా నిలిస్తే.. తమ నమ్మకాన్ని వమ్ముచేశారని.. కాంగ్రెస్‌కు తాకట్టు పెట్టారని గతాన్ని గుర్తుచేస్తున్నారు. ప్రస్తుతం అదే అభిమానంతో పవన్‌కల్యాణ్‌ వెంట నిలిస్తే.. సినిమా రైట్స్‌ అమ్మేసినట్లు ఎన్నికలకు ముందే తమను పొత్తుల బజారులో విక్రయించేశారని దుయ్యబడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement