సాక్షి ప్రతినిధి, ఒంగోలు/సాక్షి, నెల్లూరు/సత్యవేడు: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సవాల్ విసురుతున్న పవన్‌కళ్యాణ్‌ను అభినందిస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఆయన సోమవారం నెల్లూరు జిల్లా వెంకటగిరి, సూళ్లూరుపేట, గూడూరు, చిత్తూరు జిల్లా సత్యవేడు, ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలుల్లో ఎన్నికల ప్రచారం చేశారు. ఒంగోలులో ఆయన మాట్లాడుతూ పింఛన్ పదింతలు పెంచానని, భవిష్యత్‌లో మూడువేలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. జాబు రావాలంటే బాబు రావాలన్నారు. నాగార్జునసాగర్ నీళ్లు రాకుండా కేసీఆర్ అడ్డుకుంటున్నారని విమర్శించారు.
హైదరాబాద్‌ను అభివృద్ధి చేశా
గోదావరి జలాలను సోమశిల జలాశయానికి తరలించి నెల్లూరు జిల్లాను సస్యశ్యామలం చేస్తానని సీఎం నెల్లూరు జిల్లాలో చెప్పారు. హైదరాబాద్‌ను బాగా అభివృద్ధి చేశానన్నారు. తిరుపతి, చెన్నై, నెల్లూరు ట్రై సిటీ ఇండస్ట్రియల్ కారిడార్‌ను చేస్తానన్నారు.
నేనిచ్చిన శ్రీసిటీతోనే సత్యవేడుకు గుర్తింపు
తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో గుర్తింపులేకుండా ఉన్న సత్యవేడుకు తానిచ్చిన శ్రీసిటీతోనే గుర్తింపు లభించిందని చంద్రబాబు సత్యవేడులో జరిగిన ప్రచారసభలో చెప్పారు. సత్యవేడుకు 2014 ఎన్నికల ప్రచార సమయంలో వచ్చానని, మళ్లీ ఇప్పుడు వచ్చానని గుర్తుచేశారు. ఇంటింటికి ఉద్యోగం రావాలంటే చంద్రబాబే ఉండాలన్నారు. 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సత్యవేడులో శ్రీసిటీకి శ్రీకారం చుట్టిన విషయాన్ని గుర్తుచేసుకున్న ప్రజలు సీఎం అబద్ధాలు చెబుతున్నారంటూ చర్చించుకున్నారు సీఎం సభకు ప్రజలు పెద్దగా హాజరుకాకపోగా ప్రస్తుత ఎమ్మెల్యే తలారి ఆదిత్యను పక్కనపెట్టి రాజశేఖర్‌కు టికెట్ ఇవ్వడంతో ఆదిత్య, ఆయన వర్గీయులు కూడా సభకు హాజరుకాలేదు. ముఖ్యమంత్రి ప్రసంగం మోదీ, కేసీఆర్, జగన్‌మోహన్‌రెడ్డిపై విమర్శలతో షరా మామూలుగా సాగడంతో ప్రజలు విసుగ్గా కనిపించారు.
టీడీపీ మద్దతిస్తే అండగా ఉంటా: జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్
గుంటూరు ఎడ్యుకేషన్/ ప్రత్తిపాడు/వేమూరు: ‘జనసేనకు మద్దతు పలకండి మీకు నేను అండగా ఉంటా’ అంటూ తెలుగుదేశం నాయకులకు జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పిలుపునిచ్చారు. ‘అనుభవం పనిచేస్తుందని తెలుగుదేశం పార్టీకి గతంలో మద్దతు పలికాను. అనుభవం అభివృద్ధి చేయలేనపుడు, అనుభవం లంచగొండులుగా మారిన ఎమ్మెల్యేలను నిలువరించలేకపోయినపుడు దానిపై మాట్లాడాల్సి వచ్చింది. సీఎం పరిపాలనానుభవం రాష్ట్రానికి ఉపయోగపడనపుడు బయటకు రావాల్సి వచ్చిందని’ పవన్‌కల్యాణ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు నగరంతో పాటు ప్రత్తిపాడు, వేమూరు నియోజకవర్గాల్లో సోమవారం జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పర్యటించారు. ఆయన మాట్లాడుతూ ప్రత్తిపాడులో దళితుడైన మాజీ ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబుని టీడీపీ నాయకులు అవమానించడం బాధ కలిగించే విషయమన్నారు. గుంటూరు నగరంలో జరిగిన డయేరియా మరణాలపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ పార్లమెంటులో గళం విన్పించలేకపోయారని అన్నారు. కేసులంటూ కోర్టుల చుట్టూ తిరిగే జగన్ రాష్ట్రానికి సీఎం అయితే ప్రజల భవిష్యత్తు అలానే అవుతుందనే భయం కలుగుతోందని అన్నారు. పులివెందులలో తన కుటుంబ సభ్యుడిని హతమారిస్తే ఆ విషయంపైనే స్పష్టత లేని వ్యక్తికి రాష్ట్రంపై ఎలా స్పష్టత వస్తుందని విమర్శించారు. ప్రజాసమస్యలపై అసెంబ్లీలో పోరాడాల్సిన ప్రతిపక్ష నేత చట్ట సభల నుంచి బయటకు వచ్చి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారన్నారు.
ముఖ్యమంత్రి మోసం చేస్తున్నాడు
సీఎం చంద్రబాబు ప్రజలకు గాలిలో మాటలు చెప్పి మోసం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. చంద్రబాబు తమ కుమారుడు నారా లోకేష్‌ను ముఖ్యమంత్రి చేసేందుకు ప్రజలందరికీ గాలిలో మాటలు చెప్పి మోసం చేస్తున్నారని, చంద్రబాబు మాటలు విని మోసపోవద్దన్నారు.
పవన్‌కల్యాణ్‌ను అభినందిస్తున్నా: చంద్రబాబు
Published Tue, Mar 26 2019 5:01 AM | Last Updated on Tue, Mar 26 2019 5:04 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment