పచ్చ ‘టీమ్‌’ పక్కా మాఫియా | Most of the criminals is TDP MPs and MLAs itself | Sakshi
Sakshi News home page

పచ్చ ‘టీమ్‌’ పక్కా మాఫియా

Published Wed, Apr 3 2019 3:41 AM | Last Updated on Wed, Apr 3 2019 7:56 AM

Most of the criminals is TDP MPs and MLAs itself - Sakshi

సాక్షి, అమరావతి: 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకే విజయవాడలో కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌ చెలరేగిపోయింది. సామాన్యుల ఆస్తులను గుంజుకోవడమే కాకుండా మహిళలను లైంగికంగా వేధించిన గూండాలకు టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌తోపాటు పలువురు పార్టీ ముఖ్యులు అండగా నిలిచారు. ఇసుక దందాను అడ్డుకోవడంతో తహశీల్దార్‌ వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఆయన అనేక సందర్భాల్లో దళితులపై దాడులకు తెగబడి బెంబేలెత్తించారు. 

ఈ ఐదేళ్లల్లో ఇలాంటి అరాచకాలు రాష్ట్రంలో కోకొల్లలు. వాస్తవం ఇలాగుంటే.. సీఎం చంద్రబాబునాయుడు మాత్రం ప్రత్యర్థి వైఎస్సార్‌సీపీపై రివర్స్‌గేర్‌లో కుట్రలు, కుతంత్రాలకు పదును పెడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆ పార్టీని ఢీకొనలేమని గుర్తించిన ఆయన వైఎస్సార్‌సీపీపై భారీస్థాయిలో దుష్ప్రచారం చేస్తూ ప్రజల మనోగతాన్ని ఏమార్చేందుకు అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. అందులో భాగంగా.. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే రౌడీయిజం పేట్రేగిపోతుందన్న అసత్య ప్రచారాన్ని పతాకస్థాయికి తీసుకెళ్తున్నారు. వాస్తవానికి గడచిన ఐదేళ్లు రాష్ట్రంలో టీడీపీ ప్రజాప్రతినిధులే విచ్చలవిడిగా దాడులకు తెగబడి భయోత్పాతం సృష్టించారు. మహిళలు, అధికారులు, రాజకీయ ప్రత్యర్థులు అన్న తేడా లేకుండా దాడులకు తెగబడి బీభత్సం సృష్టించారు. ఏకంగా ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయానికి పాల్పడటం చంద్రబాబు కుట్రలకు పరాకాష్ట. అలాగే, మాజీమంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డిని ఏకంగా అంతమొందించి ఎన్నికలో అక్రమాలకు తెరలేపారు. కానీ, అందుకు విరుద్ధంగా ‘దొంగే.. దొంగా దొంగా’ అన్నట్లు ఆ ఘటనను చంద్రబాబు వైఎసార్‌సీపీకి ఆపాదిస్తూ దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ అంశాన్ని విస్తృతం చేయాలని పార్టీ శ్రేణులకూ దిశానిర్దేశం చేశారు. అలాగే, ఎల్లో మీడియా సైతం బాబుకు కోరస్‌ పలుకుతోంది.

అభివృద్ధి లేకే అడ్డదారులు
గడచిన ఐదేళ్లలో చెప్పుకునేందుకు రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి లేకపోవడంతో చంద్రబాబు అడ్డదారులు తొక్కుతున్నారు. ప్రజల్లో టీడీపీపట్ల ఎక్కడా సానుకూలత లేదని గుర్తించిన ఆయన.. వైఎస్సార్‌సీపీపై దుష్ప్రచారం చేయడం ద్వారా ఆ పార్టీపై ఓటర్లలో ప్రతికూలత సృష్టించాలని కుట్ర పన్నుతున్నారు. ఇందులో భాగంగా రోజుకో రీతిలో అసత్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కుట్రకు తెరతీశారు. ముందుగా చంద్రబాబు ప్రతిరోజు ఉదయం నిర్వహిస్తున్న టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడి ఆ రోజు దుష్ప్రచారం ఎలా చేయాలని వివరిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే ప్రజలకు రక్షణ ఉండదని మీడియాకు లీకులు ఇస్తున్నారు. అనంతరం ఎన్నికల ప్రచార సభల్లో చంద్రబాబే స్వయంగా ఆ అసత్య ఆరోపణలను గుప్పిస్తున్నారు. ‘వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే ప్రజలు రోడ్ల మీద తిరగలేరు.. ఆస్తులు లాక్కుపోతారు.. జగన్‌ పెద్ద రౌడీ.. వైఎస్సార్‌సీపీ నేతలు చిన్న రౌడీలు’.. ఇలా చంద్రబాబు విషం కక్కుతున్నారు.

అందుకోసం ఆయన ఎంతగా దిగజారుతున్నారంటే.. ‘జగన్‌ పేరులోనే గన్‌ ఉంది’ అని అనైతికమైన, నీతిబాహ్యమైన ఆరోపణలు చేస్తున్నారు. సాక్షాత్తూ పార్టీ అధినేతే చేస్తున్న ఈ ఆరోపణలను టీడీపీ అభ్యర్థులు, నేతలూ అందిపుచ్చుకుని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. టీడీపీ ఎల్లో మీడియా అయితే ఈ ఆరోపణలను పతాక శీర్షికలకెక్కిస్తోంది. టీడీపీ అనుకూల వెబ్‌సైట్ల తీరు అత్యంత జుగుప్సాకరంగా ఉంది. వైఎస్‌ జగన్‌తోపాటు ఆ పార్టీ అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత అసత్య ఆరోపణలు చేస్తున్నారు. బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్, తోపుదుర్తి ప్రకాశ్‌.. ఇలా పలువురు ముఖ్య నేతలను టార్గెట్‌ చేస్తున్నారు. వారివారి నియోజకవర్గాల్లో కరపత్రాలు కూడా ప్రచురించి పంపిణీ చేస్తున్న టీడీపీ.. అత్యంత దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోంది. పోలింగ్‌ రోజు వరకు ఈ దుష్ప్రచారాన్ని రోజురోజుకూ మరింతగా విస్తృతం చేయాలన్నది చంద్రబాబు కుతంత్రంగా ఉంది. 

ఐదేళ్లలో దాడులు, హత్యాయత్నాలు, హత్యలు
గడచిన ఐదేళ్లలో రాష్ట్రంలో టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు  హత్యలు, హత్యాయత్నాలు, దాడులకు పాల్పడి ప్రజల్ని భయకంపితుల్ని చేశారు. వీరికి సీఎం స్థాయిలో చంద్రబాబు పుష్కలంగా తన అండదండలు అందించారు. ఎవరిపైనా కనీస చర్యలు కూడా తీసుకోకపోవడం గమనార్హం. ఉదాహరణకు..

  •  కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త నారాయణరెడ్డిని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కుటుంబం హత్య చేయించింది. 
  •  అనంతపురం జిల్లా రాప్తాడులో మంత్రి పరిటాల సునీత వర్గీయులు వైఎస్సార్‌సీపీ నేత ప్రసాదరెడ్డిని తహశీల్దార్‌ కార్యాలయంలోనే హత్య చేశారు.
  •  శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే గౌతు శివాజీ అల్లుడు వెంకన్నచౌదరి అరాచకాలకు పాల్పడి వ్యాపార వర్గాలను వేధించారు. 
  • విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌ వర్గీయులు ఓ యువతిని దారుణంగా హత్యచేశారు. 
  • ఇక విజయవాడ ఎంపీ కేశినేని నాని అయితే.. తమ ట్రావెల్స్‌ దందాకు అడ్డువస్తున్నారనే ఆగ్రహంతో ఎమ్మెల్యే బొండా ఉమా, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నతో కలిసి ఆయన ఎంతో నిజాయితీపరుడైన ఐపీఎస్‌ అధికారి బాలసుబ్రహ్యమణ్యంను విజయవాడలో నడిరోడ్డుపై నిలబెట్టి దూషించి మరీ దాడికి పాల్పడటం సంచలనం సృష్టించింది. 
  • సామాన్య బస్సు కండక్టర్‌పై చింతమనేని స్వయంగా దాడిచేసి హడలెత్తించారు. వనజాక్షి ఎపిసోడ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబే స్వయంగా పంచాయితీ చేశారు.
  • విజయవాడలో ఓ మహిళ తన కుమార్తెకు వైద్యం చేయించేందుకు తన ఇంటిని అమ్ముకోవాలని చూస్తే ఎమ్మెల్యే బొండా ఉమా అడ్డుకున్నారు. దాంతో సకాలంలో వైద్యం అందక ఆ బాలిక మృతి చెందింది. 
  • గుంటూరు జిల్లాలో స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ తనయుడు శివరాం ఆగడాలకైతే అంతేలేదు. ‘కే ట్యాక్స్‌’ పేరుతో చెలరేగిపోయారు. రైల్వే కాంట్రాక్టర్లు, వ్యాపారులపై దాడులకు పాల్పడి బీభత్సం సృష్టించారు. ఈయన  ఆగడాలపై రైల్వే శాఖకే నేరుగా ఫిర్యాదులు వెళ్లాయంటే ఎంతగా బరితెగించారో స్పష్టమవుతుంది.
  • అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తన వర్గీయులను వెంటబెట్టుకుని వెళ్లి మరీ ప్రభోదానంద ఆశ్రమంపై దాడికి పాల్పడి భక్తులను తీవ్రంగా గాయపరిచి బీభత్సం సృష్టించారు. 
  •  నెల్లూరు జిల్లా వెంకటగిరి టీడీపీ ఎమ్మెల్యే కే రామకృష్ణ తనకు రూ.5 కోట్లు కమీషన్‌ ఇవ్వాలని ఓ రైల్వే కాంట్రాక్టర్‌ను పిలిపించి బెదిరించారు. 
  •  ఇక కాపు ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ముఖ్యనేతే టీడీపీ రౌడీమూకలను పంపించి తునిలో రైలు దహనానికి తెగించారు.

.. ఈ విధంగా టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాష్ట్రవ్యాప్తంగా హత్యలు, దాడులతో రాష్ట్రంలో భయోత్పాతం సృష్టించారు. కానీ, వారి ఆగడాలకు చంద్రబాబు పూర్తిగా వత్తాసు పలికారు. ఒక్కరి మీదా కనీస స్థాయిలో కూడా చర్యలు తీసుకోలేదు. దీంతో ఇదే ఊపుతో ప్రస్తుత ఎన్నికల్లోనూ వారు అరాచకాలకు తెగిస్తున్నారు. 

ముఖ్యనేతే హత్యా రాజకీయాలకు పన్నాగం
ఇక ఎన్నికలు సమీపించడంతో ప్రభుత్వ ముఖ్యనేతే స్వయంగా హత్యా రాజకీయాలకు పన్నాగం పన్నారు. టీడీపీ ప్రభుత్వంపట్ల తీవ్రస్థాయిలో ప్రజావ్యతిరేకత వ్యక్తమవుతోందని స్పష్టం కావడంతో హత్యలతో ప్రతిపక్షాన్ని అడ్డుతొలగించుకునేలా కుట్రలకు తెరతీశారు. అశేష జనాభిమానంతో పాదయాత్ర నిర్వహిస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలోహత్యాయత్నానికి తెగబడ్డారు. కడప జిల్లాలో ఎన్నికల అక్రమాలకు మార్గం సుగమం చేసుకునేందుకు వైఎస్‌ వివేకానందరెడ్డిని దారుణంగా హత్య చేయించారు. ముఖ్యనేతే ఈ స్థాయిలో హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తుండటంతో ఇక టీడీపీ అభ్యర్థులు మరింతగా చెలరేగిపోతున్నారు. అదెలాగంటే..

  • అనంతపురం జిల్లా ధర్మవరం టీడీపీ అభ్యర్థి వరదాపురం సూరి టీడీపీ నేతలతో మాట్లాడుతూ.. ఎన్నికల కౌంటింగ్‌ తరువాత ప్రత్యర్థులను అంతం చేసుకోండని అప్పుడే లైసెన్స్‌ ఇచ్చేశారు. అంటే టీడీపీ గెలిస్తే ఎవర్నీ బతకనివ్వమని ఆయన స్పష్టంచేశారు. 
  •  ఇదే జిల్లా రాప్తాడులో పరిటాల శ్రీరామ్‌కు ఓటేయకపోతే అంతుచూస్తామని మంత్రి పరిటాల సునీత బంధువు బహిరంగంగానే హెచ్చరించారు. 
  • శ్రీకాకుళం జిల్లా అముదాలవలస టీడీపీ అభ్యర్థి కూన రవికుమార్‌ ఒకరికి ఫోన్‌చేసి అంతుచూస్తానని బెదిరించారు. 

.. సీఎం చంద్రబాబు సహా టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు ఇంతగా బరితెగించి రాష్ట్రంలో భీతావహ పరిస్థితులు సృష్టిస్తుండగా.. అందుకు విరుద్ధంగా వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే రౌడీయిజం పేట్రేగిపోతుందని దుష్ప్రచారం చేస్తూ రాజకీయ కుతంత్రానికి పాల్పడుతున్నారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేయడానికి పోలింగ్‌ రోజు వరకు రోజుకో రీతిలో దుష్ప్రచారం చేస్తూ పచ్చ కుట్రను పతాక స్థాయికి తీసుకువెళ్లాలన్నది చంద్రబాబు ప్రధాన వ్యూహం.

పొత్తుల్లేకపోయిన వైఎస్సార్‌సీపీపై విష ప్రచారం
ఇదిలా ఉంటే.. టీఆర్‌ఎస్, బీజేపీలతో వైఎస్సార్‌సీపీ కుమ్మక్కైందని కూడా చంద్రబాబు పదేపదే అసత్య ఆరోపణలు చేస్తున్నారు. తమకు ఎవరితోనూ బహిరంగంగానీ లోపాయికారీగాగానీ పొత్తులేదు.. ఉండదని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మొదటి నుంచీ స్పష్టంచేస్తున్నప్పటికీ చంద్రబాబు మాత్రం తన విష ప్రచారాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. దానిని అంతకంతకూ తీవ్రతరం చేస్తూ ప్రజల్ని ప్రభావితం చేయాలని చూస్తున్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, విజయమ్మ 2011లో కడప ఎంపీ, పులివెందుల ఎమ్మెల్యేలుగా పోటీ చేసినప్పుడు కూడా చంద్రబాబు ఇదే రీతిలో దుష్ప్రచారం చేశారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బీజేపీతో లోపాయికారీ పొత్తుపెట్టుకున్నారని ఇష్టారాజ్యంగా మాట్లాడారు. తద్వారా కడప ఎంపీ నియోజకవర్గంలో అధికంగా ఉన్న మైనార్టీ ఓటర్లను తప్పుదోవ పట్టించేందుకు విఫలయత్నం చేశారు. ఇక 2014 ఎన్నికల్లో అయితే.. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కాంగ్రెస్‌తో కుమ్మక్కు అయ్యారని ఆరోపణలు గుప్పించారు. ‘తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్‌’ అంటూ పెద్దఎత్తున అసత్యాలు వల్లించారు. నంద్యాల ఉప ఎన్నికల సమయంలోనూ కేంద్రంలో బీజేపీతో చంద్రబాబు భాగస్వామిగా ఉంటూ కూడా వైఎస్సార్‌సీపీ బీజేపీతో కుమ్మక్కైందని అడ్డగోలుగా ఆరోపించారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆయన మళ్లీ ప్లేటు మార్చి.. బీజేపీ, టీఆర్‌ఎస్‌లతో వైఎస్‌ జగన్‌ జట్టుకట్టారని ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement