
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల కమిషన్ అధికారుల పైనా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంపైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ బెదిరింపులకు దిగిన చంద్రబాబుపై కేసులు పెట్టాల్సిందిగా కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కోరాలని గవర్నర్ నరసింహన్‌కు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. శనివారం ఈ మేరకు గవర్నర్‌కు విజయసాయిరెడ్డి లేఖ రాశారు. తమ ఆదేశాలను ధిక్కరించినందుకు అనిల్ చంద్ర పునేఠా స్థానంలో ఎల్వీ సుబ్రమణ్యంను ఎన్నికల కమిషన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించిందని గుర్తు చేశారు.
పునేఠా ఎన్నికల కమిషన్ ఆదేశాలకు వ్యతిరేకంగా కోర్టులో కేసు వేస్తే అది వీగిపోయిందని వివరించారు. ఈ నేపథ్యంలో ఎల్వీ సుబ్రహ్మణ్యంను ‘సహ నిందితుడు, కోవర్ట్ ఏజెంట్’ అంటూ చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారని లేఖలో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యల ద్వారా ఎల్వీ సుబ్రహ్మణ్యం పరువు ప్రతిష్టలకు చంద్రబాబు భంగం కలిగించారని విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమావళి పరిధిలో పని చేస్తున్న ఉద్యోగులను భయపెట్టేలా చంద్రబాబు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.
రాజ్యాంగంలో 324 ఆర్టికల్ ప్రకారం పని చేస్తున్న ఎన్నికల కమిషన్ సాధికారికతను చంద్రబాబు కించపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ అధికారాలకు లోబడి పనిచేసే అధికారులపై చంద్రబాబు కక్ష సాధింపు చర్యలకు దిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబుపై ప్రజాప్రాతినిధ్య చట్టం ఉల్లంఘన కింద కేసులు పెట్టాలంటూ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సూచించాలని గవర్నర్‌ను కోరారు.
అలాగే గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రూ.32,000 కోట్ల విలువైన బిల్లులను చంద్రబాబు తమ పార్టీ కార్యకర్తలు, నేతలకు చెల్లించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసిందని విజయసాయిరెడ్డి గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ బిల్లుల చెల్లింపుల్లో ‘మొదట వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యం’ అనే విధానాన్ని పాటిస్తారని.. దీన్ని కూడా చంద్రబాబు ఉల్లంఘిస్తున్నారని పేర్కొన్నారు. రాబోయే కొత్త ప్రభుత్వానికి ఈ నిర్ణయాలు భారమవుతాయన్నారు. ఈ కీలక తరుణంలో కొత్త ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించే వరకు.. నిధుల విడుదలను నిలిపివేసేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలివ్వాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment