సాక్షి, అమరావతి: నగర పాలక సంస్థల్లో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులతో పాటు మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో చైర్ పర్సన్, వైస్ చైర్‌పర్సన్ పదవులకు ఈనెల 18న ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఆ రోజు ఉ.11గంటలకు ఎక్కడికక్కడ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ నిర్ణయించారు. ఏలూరు మినహా 11 నగర పాలక సంస్థలు, 75 మున్సిపాలిటీల్లో పరోక్ష పద్ధతిలో ఈ ఎన్నికలు జరుగుతాయి. 14న జరిగే మున్సి‘పోల్స్’ ఓట్ల లెక్కింపు సందర్భంగా నగర పాలక సంస్థల్లో కార్పొరేటర్లుగా ఎన్నికైన వారు మేయర్, డిప్యూటీ మేయర్లను ఎన్నుకుంటారు. అలాగే, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వార్డు సభ్యులుగా ఎన్నికైన వారు చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్‌లను ఎన్నుకుంటారు. ఈ ఎన్నికలను పురస్కరించుకుని ఎన్నికల కమిషన్ ప్రిసైడింగ్ అధికారులను నియమించింది. వీరు ముందుగా విజేతలతో ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్, చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్‌ల ఎన్నికలను చేపడతారు.
ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఓటు హక్కు
ఈ ఎన్నికల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఎక్స్ అఫిషియో హోదాలో ఓటు హక్కు ఉంటుంది. వీరు ముందుగా తమ పేర్లు నమోదు చేసుకోవాలి.
► లోక్‌సభ సభ్యుడు లేదా ఎమ్మెల్యే తాము గెలిచిన నియోజకవర్గ పరిధిలో ఒకటి కంటే ఎక్కువ పట్టణాలు ఉంటే ఏదో ఒకచోట మాత్రమే ఎక్స్ అఫిషియో సభ్యునిగా తమ పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వారి నియోజకవర్గ పరిధిలో ఒకటే పట్టణం ఉంటే అందులోనే అతను ఎక్స్ అఫిషియో సభ్యునిగా పరిగణిస్తారు.
► రాజ్యసభ సభ్యునికి మున్సిపాలిటీ ప్రాంతాల్లో ఎక్కడ ఓటు హక్కు కలిగి ఉంటుందో ఆ నగర పాలక సంస్థ లేదంటే మున్సిపాలిటీలో అతనిని ఎక్స్ అఫిషియో సభ్యునిగా గుర్తిస్తారు. ఇక ఎమ్మెల్సీలు కూడా తాము ఎన్నికయ్యే సమయంలో ఏ మున్సిపాలిటీ లేదా నగర పాలక సంస్థలో ఓటు హక్కు కలిగి ఉంటారో అక్కడే అతనిని ఎక్స్ అఫిషియో సభ్యునిగా గుర్తిస్తారు.
కోరం ఉంటేనే ఎన్నిక
నగర పాలక సంస్థలు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలోని ఓటు హక్కు ఉన్న మొత్తం సభ్యులలో కనీసం సగం మంది 18న జరిగే ప్రత్యేక సమావేశానికి హాజరైతేనే ఆయాచోట్ల మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్‌ల ఎన్నికను నిర్వహిస్తారు. గంట వ్యవధిలో కనీసం సగం మంది సభ్యులు హాజరుకాని పక్షంలో కోరం లేని కారణంగా ఎన్నికను ప్రిసైడింగ్ అధికారి వాయిదా వేస్తారని ఎన్నికల కమిషన్ అధికారులు వెల్లడించారు.
విప్ జారీచేసే అధికారం లేని జనసేన
ఇదిలా ఉంటే.. ఈ ఎన్నికల్లో గెలుపొందిన తమ అభ్యర్థులకు విప్ జారీచేసే అధికారం ఆయా పార్టీలు కలిగి ఉంటాయి. అధికార వైఎస్సార్‌సీపీ, తెలుగుదేశంతో సహా జాతీయ స్థాయిలో, వివిధ రాష్ట్రాలలో గుర్తింపు పొందిన మొత్తం 18 రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలో విప్ జారీ చెయ్యొచ్చు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆయా రాజకీయ పక్షాలకు లేఖలు రాసింది. కానీ, విప్ జారీచేసే అధికారం ఉన్న పార్టీల జాబితాలో జనసేన లేదు.
కేంద్ర ఎన్నికల సంఘం వద్ద గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీగా నమోదై ఉండి.. ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద కూడా నమోదు చేసుకుని ఉంటే అలాంటి పార్టీలకు మాత్రమే ఈ ఎన్నికల్లో విప్ జారీచేసే అధికారం ఉంటుందని ఎన్నికల కమిషన్ వర్గాలు తెలిపాయి. కానీ, రాష్ట్రంలో జనసేన గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీ కాదని.. కేవలం రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద ప్రత్యేక గుర్తు రిజర్వుడు చేయబడిన రిజిస్టర్డ్ పార్టీ మాత్రమే అయినందున ఆ పార్టీని విప్ జారీచేసే అధికారం ఉన్న పార్టీల జాబితాలో చేర్చలేదని ఆ వర్గాలు వివరించాయి.
18న మేయర్ల ఎన్నిక
Published Sat, Mar 13 2021 2:45 AM | Last Updated on Sat, Mar 13 2021 2:45 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment