సాక్షి, అమరావతి: నెల్లూరు నగర మేయర్‌తో పాటు ఇద్దరు డిప్యూటీ మేయర్ల ఎన్నిక ఈ నెల 22న నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఆదివారం నోటిఫికేషన్ జారీ చేశారు. సోమవారం ఎన్నికలు జరుగుతున్న ఆకివీడు (ప.గో), జగ్గయ్యపేట, కొండపల్లి (కృష్ణా), దాచేపల్లి, గురజాల (గుంటూరు), దర్శి (ప్రకాశం), బుచ్చిరెడ్డిపాలెం (నెల్లూరు), బేతంచెర్ల (కర్నూలు), కమలాపురం, రాజంపేట (వైఎస్సార్), పెనుకొండ (అనంతపురం), కుప్పం (చిత్తూరు) మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో చైర్మన్ల ఎన్నికను అదే రోజు నిర్వహిస్తారు.
ఆయా మునిసిపాలిటీల్లో రెండేసి చొప్పున వైస్ చైర్మన్ పదవులకు ఆ రోజే ఎన్నికలు జరుపుతారు. ఆయా నగర, పట్టణ, నగర పంచాయతీల్లో డివిజన్, వార్డు స్థానాలకు సోమవారం ఉ.7 గంటల నుంచి సా.5 గంటల వరకు పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. బుధవారం ఓట్ల లెక్కింపు చేపడతారు. ఆయా చోట్ల పరోక్ష పద్ధతిలో మేయర్, డిప్యూటీ మేయర్, మునిసిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లను ఎన్నుకునేందుకు అక్కడ గెలిచిన అభ్యర్థులతో 22వ తేదీన ఉ.11 గంటలకు నగరపాలక సంస్థ, మునిసిపాలిటీ, నగర పంచాయతీల వారీగా ప్రత్యేక సమావేశాలు జరపాలని ఎస్‌ఈసీ ఆయా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఇందుకు ఆయా మునిసిపాలిటీల్లో గెలిచిన అభ్యర్థులకు మేయర్, చైర్మన్ల ఎన్నికకు సంబంధించిన సమాచారాన్ని 18వ తేదీలోగా వ్యక్తిగతంగా తెలియజేయాలని పేర్కొన్నారు.
డిప్యూటీ, వైస్ చైర్మన్ల ఎన్నిక ఇలా..
మేయర్, చైర్మన్ ఎన్నిక పూర్తయిన తర్వాతనే డిప్యూటీ మేయర్, వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ ప్రారంభించాలని.. ఎక్కడైనా వివిధ కారణాలతో మేయర్, చైర్మన్ ఎన్నిక వాయిదా పడితే డిప్యూటీ మేయర్, వైస్ చైర్మన్ల ఎన్నికలు కూడా వాయిదా పడినట్టే అవుతుందని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. 22న జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడినచోట 23వ తేదీన తిరిగి ఎన్నిక జరిపేందుకు ఆయా జిల్లా కలెక్టర్లు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.
జెడ్పీ వైస్ చైర్మన్, ఎంపీపీ ఎన్నికలు సైతం..
► విజయనగరం జెడ్పీలో ఇద్దరు వైస్ చైర్మన్లకు గాను ఒకరు ఇటీవల మృతి చెందడంతో ఆ పదవికి కూడా ఈ నెల 22వ తేదీన ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని వేరొక నోటిఫికేషన్ జారీ చేశారు.
► గతంలో ఎంపీపీ ఎన్నిక వాయిదా పడిన వాల్మీకిపురం, గుడిపల్లి (చిత్తూరు)తోపాటు తాజాగా ఎంపీటీసీ ఎన్నికలు జరిగిన ఎటపాక (తూ.గో) మండలంలో మండలాధ్యక్ష పదవులకు ఈ నెల 22వ తేదీన ఎన్నిక నిర్వహిస్తారు. ఆయా మండలాల్లో ఒక్కొక్క ఉపాధ్యక్ష , ఒక్కో కో–ఆప్టెడ్ సభ్యుని స్థానాలకు అదే రోజు ఎన్నికలు నిర్వహిస్తారు. గతంలో ప్రత్యేకంగా ఒక్క మండల ఉపాధ్యక్ష పదవి ఎన్నిక వాయిదా పడిన నరసరావుపేట (గుంటూరు), గాలివీడు, సిద్ధవటం (వైఎస్సార్)లలో 22నే ఉపాధ్యక్ష ఎన్నికలు నిర్వహిస్తారు.
► ఈ ఏడాది జనవరి–ఫిబ్రవరి నెలలో పంచాయతీ ఎన్నికలు జరిగినప్పుడు వార్డు సభ్యుల ఆధ్వర్యంలో పరోక్ష పద్ధతిన జరగాల్సిన ఉప సర్పంచ్ ఎన్నిక వాయిదా పడింది. అలా మిగిలిపోయిన 130 గ్రామ పంచాయతీల్లోనూ 22వ తేదీనే ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించాలని ఎస్‌ఈసీ జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులిచ్చారు.
22న నెల్లూరు మేయర్ ఎన్నిక
Published Mon, Nov 15 2021 3:09 AM | Last Updated on Mon, Nov 15 2021 3:10 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment