Nellore Mayor
-
పార్టీ మారితే.. ఫోర్జరీ కేసు కంచికేనా!
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రమాణ స్వీకారానికి ముందే కక్ష సాధింపు రాజకీయ క్రీడకు తెర తీశారు. నెల్లూరు మేయర్ దంపతులు వైఎస్సార్సీపీ వీడి టీడీపీలో చేరే విధంగా తెర వెనుక కుట్రలకు వ్యూహ రచన చేశారు. నెల్లూరు నగరపాలక సంస్థలో మార్ట్గేజ్ ఆస్తులను కమిషనర్ సంతకాలు ఫోర్జరీతో రిలీజ్ చేసిన వ్యవహారంలో మేయర్ పోట్లూరి స్రవంతి భర్త జయవర్ధన్ పాత్రను తెరపైకి తెచ్చారు. మేయర్ దంపతులు పార్టీ మారకపోతే కేసులు నమోదు చేయించి జైలుకు పంపిస్తామని ఎమ్మెల్యే కోటంరెడ్డి బెదిరింపులతో కేసుల భయంతో జయవర్ధన్ నాలుగు రోజులుగా పరారీలో ఉన్నాడు. ఈ క్రమంలో సోమవారం మేయర్ స్రవంతి దంపతులు మీడియా ముందుకు వచ్చి వైఎస్సార్సీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తప్పు చేశాం.. క్షమించి అక్కున చేర్చుకోండంటూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని కోరారు. దీన్ని బట్టి కోటంరెడ్డి బెదిరింపులతో కేసుల నుంచి తప్పించుకునేందుకు యూటర్న్ తీసుకున్నట్లు వైఎస్సార్సీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. నెల్లూరు (బారకాసు): వైఎస్సార్సీపీకి రాజీనామా చేసిన మేయర్ దంపతులు టీడీపీ కండువా కప్పు కోవడం ఖాయంగా కనిపిస్తోంది. నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ పదవి గిరిజన మహిళకు రిజర్వేషన్ అయింది. నెల్లూరులోని 54 డివిజన్లలో రెండు డివిజన్లు గిరిజనులకు కేటాయించారు. దీంతో అప్పటి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా ఉన్న కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అనుచరుడిగా ఉన్న పోట్లూరి జయవర్ధన్ భార్య స్రవంతి గిరిజనులకు రిజర్వ్ అయిన 12వ డివిజన్ నుంచి బరిలోకి దింపారు. అప్పటి మంత్రి పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్ సహకారంతో ఏకగ్రీవంగా ఎంపిక చేసి, మేయర్ పదవిని సైతం కట్టబెట్టించారు. అయితే శ్రీధర్‌రెడ్డి వైఎస్సార్సీపీని వీడి టీడీపీలో చేరిన క్రమంలో మేయర్ స్రవంతి దంపతులు సైతం ఆయన వెంట వెళ్లిపోయారు. అప్పట్లో శ్రీధర్‌రెడ్డితో ఉంటామని బహిరంగంగానే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో నెల్లూరు నగర పాలక సంస్థలో జరిగిన సమావేశంలో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లుకు. మేయర్‌కు వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా నెల్లూరు దర్గామిట్ట పోలీస్‌స్టేషన్‌లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఇలా కొన్ని నెలలుపాటు శ్రీధర్‌రెడ్డి వర్గంలోనే ఉన్నారు. ఆ తర్వాత అప్పటి ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డిని నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి వైఎస్సార్సీపీ సమన్వయకర్తగా నియమించింది. దీంతో ఆదాల బాధ్యతలు చేపట్టిన తర్వాత మేయర్ దంపతులు తిరిగి వైఎస్సార్సీపీ గూటికి చేరారు. తాజాగా మరోసారి మేయర్ దంపతులు వైఎస్సార్సీపీ వీడారు. గతంలో ఒకసారి టీడీపీ కండువా కప్పుకున్న వీరు మరోమారు ఆ పార్టీ కండువా కప్పుకోవడం ఖాయంగా స్పష్టమవుతోంది.మేయర్ భర్తపై ఫోర్జరీ ఆరోపణలుతాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి గెలుపొందారు. ఈ నేపథ్యంలో నగర పాలక సంస్థలో ఫోర్జరీ వ్యవహారం సంచలనం రేపింది. ఈ ఫోర్జరీ వ్యవహారంలో మేయర్ స్రవంతి భర్త ప్రమేయం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో అప్పటి నుంచి మేయర్ భర్త జయవర్ధన్ పరారీలో ఉన్నాడు. నెల్లూరు నగరంలో భవన నిర్మాణాలకు సంబంధించి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేకుండానే దాదాపు 70 భవనాలకు సంబంధించిన మార్టిగేజ్ చేసిన ఆస్తులను మాన్యువల్‌గా కమిషనర్ ఇచ్చినట్లుగా ఫోర్జరీ సంతకాలు చేసిన లేఖలతో విడుదల చేయడం జరిగింది. దీంతో ప్రభుత్వానికి రూ.కోట్లు నష్టం చేకూరింది. ఈ విషయంపై ఓ న్యాయవాది నగర పాలక సంస్థ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును పరిశీలించిన కమిషనర్ టౌన్‌ప్లానింగ్ విభాగంలోని బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు ప్రవీణ్, దేవేందర్‌లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 72 గంటల్లో ఇందుకు సంబంధించి వివరణ ఇవ్వాలని పేర్కొన్నా రు. వీరిచ్చే వివరణతో తదుపరి చర్యలు ఉంటాయని కమిషనర్ స్పష్టం చేశారు. ఆ గడువు సోమవారం సాయంత్రంతో పూర్తి కానున్న నేపథ్యంలో ఈ విషయంపై విచారణ మొదలు కానుంది. విచారణలో వాస్తవాలు బయటకు వస్తే జరిగిన ఫోర్జరీ వ్యవహారంతో తమకెక్కడ ఇబ్బందులు తలెత్తుతాయన్న భయంతోనే మేయర్ దంపతులు యూటర్న్ తీసుకున్నారని వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. సోమవారం మేయర్ దంపతులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి తమకు పార్టీలు ముఖ్యం కాదని తమకు రాజకీయ భిక్ష పెట్టి ఇంతటి గౌరవప్రదమైన పదవిలో ఉండేలా చేసిన వ్యక్తి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ముఖ్యమన్నారు. తాము తప్పు చేసి వైఎస్సార్సీపీలో చేరామని తమని క్షమించి అక్కున చేర్చుకోవాలని ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డిని మీడియా ద్వారా కోరుతున్నామన్నారు. ఫోర్జరీ వ్యవహారంపై విలేకర్లు ప్రశ్నించిన దానికి మేయర్ జవాబిస్తూ ఫోర్జరీ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని అధికారులను తాను కోరుతున్నాని, అందు లో తన భర్తపై వచ్చిన ఆరోపణలు రుజువైతే తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తామన్నారు. ఈ క్రమంలోనే మేయర్ భర్త జయవర్ధన్ కూడా స్పందిస్తూ ఫోర్జరీ విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆ విషయంలో తన ప్రమేయం ఉన్నట్లుగా విచారణలో రుజువైతే ఏశిక్షకై నా తాను సిద్ధంగా ఉంటానని తెలియజేశారు.రాజీనామాతో ఫోర్జరీ కేసు నీరుగారేనా...మేయర్ దంపతులు వైఎస్సార్సీపీకి రాజీనామా చేశారు. వీరు టీడీపీలో చేరితో ఫోర్జరీ వ్యవహారం నుంచి తప్పించే అవకాశం ఉంటుందా?. ఈ కేసును కంచికే చేరుతుందా? అనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఫోర్జరీ వ్యవహారాన్ని అధికారులు నీరు గార్చినట్లే భావించాల్సి ఉంటుంది. లేకుంటే నిజంగా ఫోర్జరీ జరిగితే అందుకు బాధ్యులపై చర్యలు తీసుకుంటారా? మేయర్ భర్తకు సంబంధం ఉందని రుజువైతే అందుకు బాధ్యులైన ఆయనతో పాటు అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే. ఏదీ ఏమైనా మేయర్ దంపతులు వైఎస్సార్పీకి రాజీనామా చేసేందుకు నిర్ణయం తీసుకున్నామనే విషయం నేడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రమాణ స్వీకారానికి ముందే కక్ష సాధింపు రాజకీయ క్రీడకు తెర తీశారు. నెల్లూరు మేయర్ దంపతులు వైఎస్సార్సీపీ వీడి టీడీపీలో చేరే విధంగా తెర వెనుక కుట్రలకు వ్యూహ రచన చేశారు. నెల్లూరు నగరపాలక సంస్థలో మార్ట్గేజ్ ఆస్తులను కమిషనర్ సంతకాలు ఫోర్జరీతో రిలీజ్ చేసిన వ్యవహారంలో మేయర్ పోట్లూరి స్రవంతి భర్త జయవర్ధన్ పాత్రను తెరపైకి తెచ్చారు. మేయర్ దంపతులు పార్టీ మారకపోతే కేసులు నమోదు చేయించి జైలుకు పంపిస్తామని ఎమ్మెల్యే కోటంరెడ్డి బెదిరింపులతో కేసుల భయంతో జయవర్ధన్ నాలుగు రోజులుగా పరారీలో ఉన్నాడు. ఈ క్రమంలో సోమవారం మేయర్ స్రవంతి దంపతులు మీడియా ముందుకు వచ్చి వైఎస్సార్సీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తప్పు చేశాం.. క్షమించి అక్కున చేర్చుకోండంటూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని కోరారు. దీన్ని బట్టి కోటంరెడ్డి బెదిరింపులతో కేసుల నుంచి తప్పించుకునేందుకు యూటర్న్ తీసుకున్నట్లు వైఎస్సార్సీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.వైఎస్సార్సీపీకి రాజీనామా చేస్తున్నాం నెల్లూరు మేయర్ దంపతులునెల్లూరు (బారకాసు): తాను తన భర్త వైఎస్సార్సీపీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు నెల్లూరు నగర పాలక సంస్థ మేయర్ పోట్లూరి స్రవంతి చెప్పారు. సోమవారం స్థానిక నగర పాలక సంస్థ కార్యాలయంలోని మేయర్ తన చాంబర్లో భర్తతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకున్నా తనకు కార్పొరేటర్ టికెట్ ఇప్పించడంతో పాటు ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా చేయడం అనంతరం మేయర్ పదవి కట్టబెట్టిన వ్యక్తి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అని చెప్పారు. తన భర్త జయవర్థన్ 15 ఏళ్లుగా స్టూడెంట్ నాయకుడిగా ఉన్నప్పటి నుంచి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అనుచరుడిగా ఆయన అడుగు జాడల్లో కొనసాగుతూ వచ్చారన్నారు. తన భర్త మంచితనం, ఆయన చేసిన సేవలు గుర్తింపు కారణంగానే ఈ రోజు తాను మేయర్ పదవిలో ఉన్నానన్నారు. ఇదంతా కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చలువేనని తెలియజేశారు. శ్రీధర్‌రెడ్డి తమ దంపతులను ఆయన కుటుంబ సభ్యులుగా చూసుకున్నారన్నారు. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వైఎస్సార్సీపీని వీడినప్పుడు కూడా తాము మాత్రం శ్రీధర్‌రెడ్డిని వీడేది లేదని ఆ నాడు మీడియా సమావేశంలో చెప్పడం జరిగిందని గుర్తు చేశారు. అయితే అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు తమను బలవంతం చేయడం వల్లనే తప్పని పరిస్థితుల్లో తాము శ్రీధర్‌రెడ్డిని వీడి వైఎస్సార్సీపీలో చేరడం జరిగిందని తెలియజేశారు. తాము రాజకీయంగా శ్రీధర్‌రెడ్డిని వీడామే తప్ప మానసికంగా ఆయనతోనే ఉన్నామని స్పష్టం చేశారు. కాగా, మేయర్ దంపతులను పార్టీలో చేర్చుకునేది లేదని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రకటించడం కొసమెరుపు. -
కోటంరెడ్డికి భారీ షాక్..
-
సీఎం జగన్ ఫోటోను పెట్టడాన్ని ప్రశ్నించిన మేయర్ పై ఆగ్రహం
-
22న నెల్లూరు మేయర్ ఎన్నిక
సాక్షి, అమరావతి: నెల్లూరు నగర మేయర్‌తో పాటు ఇద్దరు డిప్యూటీ మేయర్ల ఎన్నిక ఈ నెల 22న నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఆదివారం నోటిఫికేషన్ జారీ చేశారు. సోమవారం ఎన్నికలు జరుగుతున్న ఆకివీడు (ప.గో), జగ్గయ్యపేట, కొండపల్లి (కృష్ణా), దాచేపల్లి, గురజాల (గుంటూరు), దర్శి (ప్రకాశం), బుచ్చిరెడ్డిపాలెం (నెల్లూరు), బేతంచెర్ల (కర్నూలు), కమలాపురం, రాజంపేట (వైఎస్సార్), పెనుకొండ (అనంతపురం), కుప్పం (చిత్తూరు) మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో చైర్మన్ల ఎన్నికను అదే రోజు నిర్వహిస్తారు. ఆయా మునిసిపాలిటీల్లో రెండేసి చొప్పున వైస్ చైర్మన్ పదవులకు ఆ రోజే ఎన్నికలు జరుపుతారు. ఆయా నగర, పట్టణ, నగర పంచాయతీల్లో డివిజన్, వార్డు స్థానాలకు సోమవారం ఉ.7 గంటల నుంచి సా.5 గంటల వరకు పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. బుధవారం ఓట్ల లెక్కింపు చేపడతారు. ఆయా చోట్ల పరోక్ష పద్ధతిలో మేయర్, డిప్యూటీ మేయర్, మునిసిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లను ఎన్నుకునేందుకు అక్కడ గెలిచిన అభ్యర్థులతో 22వ తేదీన ఉ.11 గంటలకు నగరపాలక సంస్థ, మునిసిపాలిటీ, నగర పంచాయతీల వారీగా ప్రత్యేక సమావేశాలు జరపాలని ఎస్ఈసీ ఆయా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఇందుకు ఆయా మునిసిపాలిటీల్లో గెలిచిన అభ్యర్థులకు మేయర్, చైర్మన్ల ఎన్నికకు సంబంధించిన సమాచారాన్ని 18వ తేదీలోగా వ్యక్తిగతంగా తెలియజేయాలని పేర్కొన్నారు. డిప్యూటీ, వైస్ చైర్మన్ల ఎన్నిక ఇలా.. మేయర్, చైర్మన్ ఎన్నిక పూర్తయిన తర్వాతనే డిప్యూటీ మేయర్, వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ ప్రారంభించాలని.. ఎక్కడైనా వివిధ కారణాలతో మేయర్, చైర్మన్ ఎన్నిక వాయిదా పడితే డిప్యూటీ మేయర్, వైస్ చైర్మన్ల ఎన్నికలు కూడా వాయిదా పడినట్టే అవుతుందని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. 22న జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడినచోట 23వ తేదీన తిరిగి ఎన్నిక జరిపేందుకు ఆయా జిల్లా కలెక్టర్లు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. జెడ్పీ వైస్ చైర్మన్, ఎంపీపీ ఎన్నికలు సైతం.. ► విజయనగరం జెడ్పీలో ఇద్దరు వైస్ చైర్మన్లకు గాను ఒకరు ఇటీవల మృతి చెందడంతో ఆ పదవికి కూడా ఈ నెల 22వ తేదీన ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని వేరొక నోటిఫికేషన్ జారీ చేశారు. ► గతంలో ఎంపీపీ ఎన్నిక వాయిదా పడిన వాల్మీకిపురం, గుడిపల్లి (చిత్తూరు)తోపాటు తాజాగా ఎంపీటీసీ ఎన్నికలు జరిగిన ఎటపాక (తూ.గో) మండలంలో మండలాధ్యక్ష పదవులకు ఈ నెల 22వ తేదీన ఎన్నిక నిర్వహిస్తారు. ఆయా మండలాల్లో ఒక్కొక్క ఉపాధ్యక్ష , ఒక్కో కో–ఆప్టెడ్ సభ్యుని స్థానాలకు అదే రోజు ఎన్నికలు నిర్వహిస్తారు. గతంలో ప్రత్యేకంగా ఒక్క మండల ఉపాధ్యక్ష పదవి ఎన్నిక వాయిదా పడిన నరసరావుపేట (గుంటూరు), గాలివీడు, సిద్ధవటం (వైఎస్సార్)లలో 22నే ఉపాధ్యక్ష ఎన్నికలు నిర్వహిస్తారు. ► ఈ ఏడాది జనవరి–ఫిబ్రవరి నెలలో పంచాయతీ ఎన్నికలు జరిగినప్పుడు వార్డు సభ్యుల ఆధ్వర్యంలో పరోక్ష పద్ధతిన జరగాల్సిన ఉప సర్పంచ్ ఎన్నిక వాయిదా పడింది. అలా మిగిలిపోయిన 130 గ్రామ పంచాయతీల్లోనూ 22వ తేదీనే ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించాలని ఎస్ఈసీ జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులిచ్చారు. -
దూరం.. దుమారం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అధికార పార్టీలో నేతల మధ్య వర్గ పోరు తారస్థాయికి చేరింది. మంత్రి నారాయణ నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ముఖ్యులతో చెప్పిన రోజు నుంచి మొదలైన వర్గ విభేదాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తనకు ఎవరూ పోటీ రాకూడదని అందరినీ దూరంగా పెడుతున్న పరిస్థితి రాజకీయ దుమారం రేపుతోంది. మంత్రి రాక ముందు వరకు నగర టికెట్‌పై మేయర్ అబ్దుల్ అజీజ్‌తో సహా అనేక మంది నేతలు ఆశలు పెంచుకున్నారు. పరిస్థితి రివర్స్ కావడంతో నేతల అంతర్గత సమావేశాల్లోనూ మంత్రి తీరుపై అసహనం వ్యక్తమవుతోంది. తాజాగా నగర ప్రథమ పౌరుడు మేయర్ అబ్దుల్ అజీజ్ ఫొటో లేకుండా రూరల్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం తీవ్ర దూమారం రేగింది. నగరంలో ఉన్న ఏకైక మైనార్టీ నేతను నన్నే అవమానిస్తారా? అంటూ అక్కడే మేయర్ అసంతృప్తి వ్యక్తం చేయడం, వెంటనే ముస్లిం మతపెద్దలతో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. నగరంలో మంత్రి నారాయణ అధికార పార్టీ సిటీ అభ్యర్థిగా బరిలో వస్తాడనే ప్రచారం మొదలైనప్పటి నుంచి నేతల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. అంతకు ముందు వరకు టికెట్ ఆశిస్తున్న నేతలు తమ గాడ్‌ఫాదర్‌గా భావిస్తున్న నారాయణ ద్వారా తమకు టికెట్ వస్తుందని ప్రచారం చేసుకుంటూ నగరంలో అధికార పార్టీ నేతలుగా చలామణి అయ్యారు. నగర మేయర్‌గా అబ్దుల్ అజీజ్ వైఎస్సార్సీపీ నుంచి గెలిచిన వ్యక్తి. కొద్ది రోజులకే మంత్రి నారాయణ, సీఎం తనయుడు లోకేష్ సిటీ టికెట్ ఇస్తామని హామీ ఇవ్వడంతో అధికార పార్టీలోకి జంప్ చేశారు. అజీజ్‌తో పాటు టీడీపీ నగరఇన్చార్జి ముంగమూరు శ్రీధర కృష్ణారెడ్డి, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు తాళ్లపాక అనురాధతో పాటు మరి కొందరు నేతలు ఆశలు పెంచుకున్నారు. గతేడాది అక్టోబర్ నుంచి మంత్రి నారాయణ నగరంలో హడావుడి మొదలు పెట్టారు. పార్టీ ముఖ్యల సమావేశంలో నెట్లూరు సిటీ నుంచి పోటీ చేస్తానని ప్రకటించడంతో పరిస్థితి మారిపోయింది. అప్పటి వరకు నగరంలో ఏ అభివృద్ధి పని జరిగినా నగర మేయర్ హడావుడి అక్కడ ఎక్కువగా ఉండేది. ఆ తర్వాత నుంచి మేయర్ ప్రాధాన్యత తగ్గిపోయి మంత్రి హవా పెరిగిపోయింది. శంకుస్థాపనలు మొదలుకొని అన్ని పనుల వరకు నారాయణ అధికారుల ద్వారా చేయించడంతో నగర మేయర్ పాత్ర పూర్తిగా కనుమరుగైంది. ఈ పరిణామాలను మేయర్ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా పెద్దగా ఫలితం లేకపోవడంతో పాటు నీకే టికెట్ ఇస్తామని మళ్లీ హామీ ఇచ్చారు. దీంతో నగరంలో మంత్రి వర్సెస్ మేయర్‌గా అధికార పార్టీ రాజకీయం కొనసాగుతోంది. రొట్టెల పండగ మొదలుకొని.. నగరంలో నగరపాలక సంస్థ ప్రత్యేక నిధులు, జనరల్ ఫండ్‌తో నిర్వహించుకునే ప్రతి కార్యక్రమం కూడా మంత్రి తనవల్లే జరిగిందంటూ హడావుడి ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా బారాషహీద్ రొట్టెల పండగకు ప్రభుత్వం ఒక్క రూపాయి నిధులు మంజూరు చేయలేదు. పండగకు రాష్ట్ర ప్రభుత్వ హోదా ఉన్నప్పటికీ, మంత్రులు నిధులు ఇస్తామని ప్రకటించనప్పటికీ రూపాయి కూడా నిధులు రాని పరిస్థితి. ఈ క్రమంలో నగరపాలకసంస్థ జనరల్ ఫండ్‌లో నుంచి ఖర్చు పెట్టి ఉత్సవాలకు అవసరమైన ఏర్పాట్లు, అభివృద్ధి పనులు నిర్వహించారు. ఉత్సవాల ముగింపు రోజున అన్ని మంత్రి నారాయణ చేశాడంటూ విస్తృతంగా ప్రచారం హోరెత్తించడంతో మేయర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత నుంచి ఇదే పరంపర కొనసాగుతూ వచ్చింది. ఇటీవల మటన్ మార్కెట్ పనులకు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం మధ్యాహ్నం అని ఆహ్వానాలు ముద్రించి ఉదయం మంత్రి ఒక్కరే వచ్చి చేసి వెళ్లిపోయారు. షాదీమంజిల్ వ్యవహారం, జూనియర్ కళాశాలకు జనరల్ ఫండ్ నుంచి రూ.1.5 కోట్లు కేటాయింపులు, నవాబుపేట ఘాట్ అభివృద్ధి ఇలా అన్ని నగరపాలక సంస్థ చేసినా మంత్రి మాత్రం నేనే చేశాను అని చెప్పడం, ఆయన అనుచరగణం మంత్రికి రానున్న ఎన్నికల్లో ఓట్లు వేయండని ప్రచారం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గురువారం నగరంలో నెల్లూరు అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ప్రారంభోత్సవం వద్ద పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున్న ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అందులో ఒక్కదాంట్లో కూడా మేయర్ ఫొటో లేకపోవడం, అది కూడా దర్గా సమీపంలో ఉండడంతో మేయర్ అక్కడ అసంతృప్తి వ్యక్తం చేసి ఇదేమీ పద్ధతి అంటూ అక్కడ ఉన్న నేతలను ప్రశ్నించారు. ఇది నగరంలో చర్చనీయాంశంగా మారడంతో ముస్లిం పెద్దలు మైనార్టీ నేతగా ఉన్న మేయర్‌కు అవమానం జరగడంపై మేయర్ చాంబర్లో భేటీ కావడం అధికార పార్టీలో చర్చకు దారి తీసింది. మొత్తం మీద నగరంలో అధికార పార్టీలో వార్ యథావిధిగా కొనసాగుతూనే ఉంది. -
నెల్లూరు మేయర్‌పై చీటింగ్ కేసు
సాక్షి, నెల్లూరు : నెల్లూరు మేయర్ అబ్దుల్ అజీజ్‌కు షాక్ తగిలింది. స్టార్ ఆగ్రో పేరుతో మోసాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో మేయర్ తో పాటు అతని సోదరుడు జలీల్, డైరెక్టర్ అనిల్ పై మద్రాస్ పోలీస్ కమిషనరేట్‌లో చీటింగ్ కేసు నమోదు అయింది. ప్రసాద్ జెంపెక్స్ అనే కంపెనీ.. స్టార్ ఆగ్రోలో వాటా కోసం ఇచ్చిన రూ.42కోట్లు తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నారంటూ...గతేడాది డిసెంబర్లో ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును పరిశీలించిన అనంతరం మద్రాస్ సీసీబీ (సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ) అండర్ సెక్షన్ 406,420, 506, రెడ్ విత్ 120-బి కేసులు నమోదు చేసింది. మరోవైపు మేయర్ అజీజ్ సోదరులు ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. కాగా అబ్దుల్ అజీజ్‌పై చీటింగ్ కేసు వ్యవహారంలో అధికార టీడీపీలో కలకలం రేపుతోంది. -
'మా నాయకుడి ముందు నువ్వు బచ్చా'
అజీజ్.. నువ్వు ముస్లింల పరువు తీస్తున్నావు ఆనం వర్గం మైనార్టీ నాయకుడు మునాఫ్ నెల్లూరు : ‘ఆనం వివేకానందరెడ్డి ముందు నువ్వు బచ్చా’ అని మాజీ కార్పొరేటర్ మునాఫ్ మేయర్ అబ్దుల్ అజీజ్ పై మండిపడ్డారు. ఏసీ సెంటర్లో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. మైనార్టీలను అడ్డంపెట్టుకుని రూ.కోట్లు దండుకున్న అజీజ్ తమ నాయకుడు వివేకానందరెడ్డిని విమర్శించడం సరికాదన్నారు. ఎంతో మంది మైనార్టీలు నెల్లూరులో నాయకులుగా ఎదిగారన్నారు. అయితే రాజకీయాల్లోకి వచ్చిన రెండేళ్లకే అజీజ్‌కు అవినీతిపరుడుగా ముద్రపడిందన్నారు. ఆయన వల్ల మైనార్టీలందరికీ చెడ్డపేరు వస్తోందన్నారు. రొయ్యలు వ్యాపారం చేసుకో కానీ ఆనం వివేకాందరెడ్డిని విమర్శిస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. అజీజ్ నెల్లూరు కార్పొరేషన్లో దందాలు చేస్తున్నారని ఆరోపించారు. మంత్రి నారాయణ అజీజ్‌ను తిక్క పనులు చేస్తున్నావని చెప్పిన విషయం గుర్తుచేశారు. అజీజ్ పోటీ చేసిన, ఆయన తమ్ముడు పోటీ చేసిన స్థానంలో గెలుపొందేందుకు రూ.4 కోట్లు ఖర్చు చేశారన్నారు. నెల్లూరులో ఆనం బలం తెలుసు కాబట్టే చంద్రబాబునాయుడు స్వయంగా కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారని తెలిపారు. కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తన కార్పొరేటర్లను అజీజ్‌కు హోల్‌సేల్‌గా అమ్మేశారని ఆరోపించారు. ఇప్పటికైనా శ్రీని వాసులురెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆనం వర్గీయులు ముజీర్, అలియాజ్, షమీమ్, ఏజాస్, నిస్సార్ పాల్గొన్నారు. -
నెల్లూరు మేయర్ కు చెక్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మేయర్ అజీజ్‌కు టీడీపీ లక్ష్మణ రేఖను గీ సింది. కార్పొరేషన్లో మేయర్‌కు విస్తృత అధికారాలు లేకుండా అజీజ్‌ను రబ్బర్‌స్టాంప్‌లా వాడుకోవాలని భావిస్తునట్లు విశ్వసనీ య సమాచారం. అందులో భాగంగానే నెల్లూరుకు చెందిన తమ్ముళ్ల సూచన మేరకు సీఎం చంద్రబాబు ఐఏఎస్ అధికారిని కమిషనర్‌గా నియమించి కట్టడి చేసినట్లు ప్రచారం జరుగుతోం ది. మేయర్‌గా ఎన్నికైన తొలినాళ్లలో అజీజ్ నగరంలో తాగునీటి సమస్య పరిష్కారం, అండర్ డ్రైనేజీ నిర్మాణానికి ప్రభుత్వం నుంచి రూ.1,500 కోట్లు తెస్తానని పదేపదే చెప్పారు. ఈ విషయంలో ఆయనకు ప్రభుత్వం నుంచి చేదు అనుభవం ఎదురైంది. నిధుల కోసం ఆయన పంపిన నివేదికను సాంకేతిక కారణాలతో సున్నితంగా తోసిపుచ్చినట్లు సమాచారం. తాజాగా కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల షెడ్యూల్ విడుదల విషయంలోనూ మేయర్‌కు అవమానం జరిగినట్లు తెలిసింది. ఆయనకు ఎలాంటి సమాచారం లేకుండానే కమిషనర్ షెడ్యూల్ విడుదల చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు కొద్దిరోజుల క్రితం టీడీపీ కార్పొరేటర్ ఒకరు ఏకంగా తానే మేయర్‌నని బ్యానర్లు కట్టించుకున్న ఘటన మేయర్ అజీజ్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. రాజకీయంగా నష్టపోతున్నానని లోలోన మదనపడుతున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. అయితే టీడీపీ శ్రేణులు మాత్రం అటువంటిదేం లేదని అంటున్నాయి. అసహనంతో తప్పుల మీద తప్పులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి టీడీపీలో చేరిన మేయర్ అజీజ్ ఇటుపార్టీలో, అటు కార్పొరేషన్‌పై పట్టు సాధించలేక కొందరు కార్పొరేటర్లను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. పోలీసులను ఉపయోగించుకుని వారిపై దౌర్జన్యాలకు దిగుతున్నట్లు సమాచారం. అందులో భాగంగా బుధవారం 54వ వార్డులో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్, ఆయన అనుచరులపై టీడీపీ నేతలతో దౌర్జన్యానికి దిగారు. రంగనాయకులపేటలో గురువారం నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో ఏకంగా పోలీసులతోనే కార్పొరేటర్లపై అధికార జులుం చూపించారు. ఎటువంటి గొడవలు లేకపోయినా.. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను టార్గెట్ చేసుకుని దౌర్జన్యంగా గెంటివేయించారు. పొలీసులు కొందరు కార్పొరేటర్ల చొక్కాలు పట్టుకుని లాగి బయటకు వెళ్లగొట్టారు. దుర్భాషలాడుతూ బయటకు గెంటివేశారు. నాలుగురోజుల క్రితం నగరంలోని ఓ జిమ్ నిర్వాహకుడితో గొడవపడి, తన అధికార బలంతో ఏకంగా ఆ జిమ్‌ను మూయించిన ఘనత నగర ప్రథమ పౌరుడైన మేయర్‌కే దక్కిందని పలువురు చర్చింకుంటున్నారు. తాము అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే వాటినేవీ పట్టించుకోకుండా... మేయర్‌గా తన బాధ్యతలను మరచి గిల్లికజ్జాలకు సమయం కేటాయిస్తున్నట్లు నగరవాసులు విమర్శిస్తున్నారు. ఇకనైనా గిల్లికజ్జాలు మాని సహచర సభ్యులపై దూకుడు ప్రదర్శించటం కంటే.. వారి సహకారంతో నగర అభివృద్ధిపై దృష్టి సారించాలని హితవు పలుకుతున్నారు. -
'నెల్లూరు మేయర్ అజీజ్ పై అనర్హత వేటు వేయండి'
నెల్లూరు: నెల్లూరు మేయర్ అబ్దుల్ అజీజ్‌తోపాటు 12 మంది కార్పొరేటర్లపై అనర్హత వేటు వేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలు డిమాండ్ చేశారు. ఈ మేరకు అబ్దుల్ అజీజ్ పై చర్య తీసుకోవాలంటూ జిల్లా కలెక్టర్‌కు వైస్ఆర్సీపీ నేతలు వినతిపత్రం సమర్పించారు. ఎన్నికల నియమావళి, నిబంధనలకు వ్యతిరేకంగా పార్టీ ఫిరాయింపుకు పాల్పడిన అజీజ్ కు మేయర్ గా కొనసాగే హక్కులేదని కోటంరెడ్డి విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై గెలిచి నెల్లూరు మేయర్ గా ఎంపికైన అబ్దుల్ అజీజ్ ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. -
పార్టీ మారే విషయమై పునరాలోచించుకోవాలి
నెల్లూరు : పార్టీ మారే విషయమై మేయర్ అబ్దుల్ అజీజ్ పునరాలోచించుకోవాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ ఒకవేళ అజీజ్ పార్టీ మారాలనుకుంటే మేయర్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాట కోసం రేయింబవళ్లు నిద్దుర మానుకుని పనిచేశామని, టీడీపీ ఆగడాలను అడ్డుకుని మేయర్‌ను చేస్తే ఇప్పుడు అజీజ్ అందరిని వంచించి టీడీపీలో చేరుతున్నానంటూ చెప్పడం దారుణమని ఎమ్మెల్యే డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. అభివృద్ధి కోసమే తాను టీడీపీలో చేరుతున్నట్లు అజీజ్ బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. -
వైఎస్సార్ ఆశయాలు ప్రజల్లోకి తీసుకెళ్లండి
జగన్మోహన్రెడ్డి పిలుపు నెల్లూరు(అర్బన్) : దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆశయాలు ప్రజల్లోకి తీసుకెళ్లి నెరవేర్చేందుకు కృషి చేయాలని వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి నెల్లూరు మేయర్ అబ్దుల్ అజీజ్‌కు సూచించారు. సోమవారం మేయర్ అబ్దుల్ అజీజ్, ఆయన సోదరుడు 42వ డివిజన్ కార్పొరేటర్ జలీల్ హైదరాబాద్‌లో జగన్మోహన్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. 52 ఏళ్ల తర్వాత నెల్లూరు పట్టణాన్ని పాలించే అవకాశం మైనార్టీలకు దక్కిందని, ఇది జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమైందని అజీజ్ పేర్కొన్నారు. రాజకీయంగా తమకు వైఎస్సార్సీపీ జన్మనిచ్చిందని పార్టీ అధినేతకు అజీజ్, జలీల్ తెలిపారు. పార్టీ తమమీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుని ప్రజలకు సేవ చేస్తామన్నారు. పార్టీ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేందుకు కృషి చేయాలని అజీజ్, జలీల్‌కు జగన్ సూచించారు. ప్రజల మధ్య ఉండి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం మేయర్ అజీజ్ తాము ప్రజలకు ఏవిధంగా సేవ చేయాలనుకున్నామో జగన్‌కు వివరించారు. ఇందుకోసం ఇప్పటికే కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకున్నామని చెప్పారు ఒక ప్రణాళిక ప్రకారం సమస్యలు పరిష్కరిస్తామన్నారు. కుల,మతాలకు అతీతంగా ప్రజలందరికి అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తామని, నగరాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. నగరాభివృద్ధికి తమ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని జగన్ వారికి హామీ ఇచ్చారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా మంగళవారం కూడా తాము హైదరాబాద్‌లోనే ఉండి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు మేయర్ అజీజ్ వెల్లడించారు. జగన్‌ను నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ కూడా కలిశారు.